మకర రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వ్యయంలో శని కేతువుల సంచారం, షష్ఠమంలో రాహుగ్రహ సంచారం, వ్యయంలోనూ, జన్మరాశిలోను గురు గ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ప్రతి కార్యక్రమం అధిక శ్రమానంతరం అనుకూల ఫలితాలను ఇస్తుంది. జలసంబంధమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికీ ఒకటికి నాలుగుసార్లు కష్టపడాల్సి వస్తుంది. కళా సంబంధిత వ్యాపారాలలో కూడా రాణిస్తారు. బినామీ పేర్లమీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది. మీలో ఉన్న చిన్న లోపాలను పెద్దది చేసి మీ ప్రతిష్ఠను భంగపరచాలని అనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ, పట్టు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది. కుటుంబ పురోగతి బాగుండడం మీకు సంతోషం కలిగిస్తుంది. కొన్ని బాధ్యతలు విస్మరించినందుకు వృత్తి ఉద్యోగాలకు తాళికట్టినందుకు బాధపడతారు. మీవైపు దొర్లిన లోపాలను మీవాళ్ళు బయటపడకుండా సమర్థిస్తారు. మీ ఆశయ సాధనకు పరోక్షంగా సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పాదాలు, కీళ్ళనొప్పులు, ఎముకలకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడతాయి. టెండర్లు, ప్రింటెడ్ పనులు, చేతివృత్తులకు సంబంధించిన కాంట్రాక్టులు అధికంగా లాభిస్తాయి. ధనం స్థిరం చేసుకోవడం సమస్య అవుతుంది. ఆస్తుల సంరక్షణకు, వాటిని సంపాదించడానికి పడినంత శ్రమపడాల్సి వస్తుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహారాలలో వివాదాలు ఏర్పడతాయి. చివరకు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. సన్నిహితవర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వల్ల చివరకు వాళ్ళ వల్లనే అధిక పోటీ ఏర్పడుతుంది. బంధువులతో విభేదాలు చాలాకాలం కొనసాగుతాయి.
విదేశీయానం, విదేశీ విద్య, ఉద్యోగం, సాంకేతిక విద్య, వైద్యవిద్య మొదలైనవి లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు లేనివారిని చేరదీసి ఆశ్రయం ఇస్తారు. జీవితంలో ఇది మలుపుగా మారుతుంది. వివాహాది శుభకార్యాలు మీ ఇష్టం మీదనే జరుగుతాయి. మీరు ఆశించిన ప్రేమాభిమానాలు మటుమాయం అవుతాయి. మారుతున్న సమాజంతో పాటు ఏనాడో మీ ఆత్మీయ, కుటుంబవర్గం కూడా మారిపోయారని ఆలస్యంగా గ్రహిస్తారు. సన్నిహితుల సహకారం వల్ల రాజకీయపదవి ప్రాప్తి. కార్యాలయంలో, సంస్థలో ప్రతి విషయానికి విమర్శకుల వల్ల, చాడీలు చెప్పేవారి వల్ల ఆటంకాలు, వాగ్వివాదాలు సంభవం. మొండి వైఖరితో ఎవరినీ లెక్క చేయక దేవుడిమీద భారం వేసి మీ పనిని సక్రమంగా నిర్వహించి మంచి ఫలితాన్ని సాధించి, వృత్తి ఉద్యోగాలపరంగా రక్షణ ఏర్పరచుకుంటారు. రాజకీయ వ్యవహారాలలో, శుభకార్యాల విషయంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. కార్యాలను సానుకూలం చేస్తారు. ఇందుకు సంబంధించి మీరు పేరుప్రఖ్యాతులు ఆశిస్తారు. అందుకు విరుద్ధంగా విమర్శలు ఎదురవుతాయి. ఇతరుల అసమర్థతకు మీరు పరోక్షంగా బాధ్యత వహించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మీ నిజాయతీని నిరూపించుకోవలసిన పరిస్థితి రావచ్చు. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. గృహసంబంధిత ఖర్చులు అధికం అవుతాయి. దూరప్రాంతం నుండి వచ్చిన లేఖలు, టెలిఫోన్‌లు మానసిక ఆనందం, ఉత్సాహం, ఆర్థికాభివృద్ధికి కారణం అవుతాయి. కొన్ని ఆలోచనలు ఆలోచనలుగానే ఉంటాయి, అవి అమలు కావు. సంవత్సర ద్వితీయార్ధంలో పట్టుబట్టి కొన్ని ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించిన వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానధర్మాలు, సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసిన అనువంశిక ఆస్తి మూడువంతులు మీ చేతికి అందుతుంది. అధికమొత్తం ధనం సంతానం కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిక్నిక్‌లు, విందువినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలలో అపశ్రుతులు సంభవించవచ్చు. వీలైనంతవరకు ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. లోహ, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి, చిన్న వ్యాపారాలు చేసేవారికి, హోటల్, రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు సంభవం. స్థానిక రాజకీయ నాయకులతో విభేదాలు వస్తాయి.
గట్టిగా ప్రయత్నించి పెండింగ్ బిల్స్ మంజూరు అయ్యే విధంగా శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాలకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూశారన్న ప్రఖ్యాతి లభిస్తుంది. మీ సహచరవర్గంలో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది. ఈ విషయంలో అంతర్మథనం చెందుతారు. ఆలోచనలు పరిపరివిధాలుగా వెళతాయి. అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. అప్పులు ఇస్తారు, కానీ తిరిగి రావడం గగనం అవుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఆశించే వారికి నిరుత్సాహం కలుగుతుంది. తోటి ఉద్యోగులు మీపై అధికారులకు చెప్పిన చాడీల వలన ప్రమోషన్లు నిలిచిపోతాయి. ఇది మీ మనోవేదనకు కారణం అవుతుంది. సంతానం పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయ సహకారాలు అందుతాయి. సాంకేతిక వైద్య, న్యాయరంగాలలో రాణిస్తారు. స్కాలర్‌షిప్‌లు లభిస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటీ వంటి వాటికి ఎంపికవుతారు. దగ్గరి దాకా వచ్చి దూరంగా వెళుతున్న సంబంధాలు ఈ సంవత్సరం కుదురుతాయి. సామాజిక సేవాకార్యక్రమాలలో, యూనియన్ కార్యక్రమాలలో పేరుప్రఖ్యాతులు పెంచుకోగలుగుతారు. మీ అభిరుచికి తగిన విధంగా ఒక గార్డెన్‌హౌస్‌ని ఏర్పాటు చేసుకుంటారు. అందరితో చర్చించి నిర్ణయాలను అమలు చేస్తారు. మీ వ్యక్తిగత, వ్యాపార, ఆర్థిక సంబంధ విషయాలు ఎంత గుట్టుగా ఉంటే అంత మంచిది. వృత్తిపరంగా నక్క మనస్తత్వం కలిగిన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి, జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి బాగుంటుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. కార్యాలయంలో రాజకీయాలు అధికమవుతాయి. ఉద్యోగపరంగా ఇతరులపై వచ్చిన నిందలు, ఆరోపణలు ఎంతవరకు వాస్తవమో తేల్చి నివేదిక ఇవ్వవలసిన బాధ్యత మీపై పడుతుంది. సున్నితమైన ఈ అంశంలో వాస్తవాల కన్నా మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. మధ్యవర్తుల మాటలు నమ్మి వాస్తవాలు విస్మరించి ఒక పొరపాటు సమాచారాన్ని మీరు కూడా ధ్రువీకరిస్తారు. ఇందువల్ల మీ సన్నిహితవర్గం నష్టపోతారు. మీ ఎదుగుదల కొందరికి కంటకంగా మారుతుంది. అసూయగ్రస్తులైన వారితో మీ సన్నిహితులు కూడా చేరటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో కొంత అశాంతి ఏర్పడుతుంది. కుటుంబంలో సమీప బంధువుల జోక్యం ఈ అప్రశాంత వాతావరణానికి కారణం అవుతుంది.
యుక్తిగా వ్యవహరించి వాళ్ళని కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉంచుతారు. నూతన ఆదాయమార్గాలలో శ్రమించి మంచి ఫలితాలను పొందుతారు. మీ సంతానానికి బాధ్యత తెలుస్తుంది. బాగా చదువుకుని కుటుంబ ప్రతిష్ఠ నిలబెట్టడానికి çఉత్సాహంగా శ్రమిస్తారు. కొన్ని ముఖ్యమైన ఆర్థిక అవసరాల కోసం విలువైన స్థిరాస్తులు తాకట్టు పెడతారు. పునర్వివాహం చేసుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహంకాని వారికి వివాహప్రాప్తి. సంతానంలేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైరివర్గం గురించి రహస్య సమాచారం మీ చేతికి అందుతుంది. వాళ్ళు తప్పు చేశారనే సాక్ష్యాధారాలు కొన్ని మీ చేతికి లభిస్తాయి. తొందరపడకుండా సమయం, సందర్భం కోసం వేచిచూస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో ముఖ్యమైన వ్యక్తులకు మీరే ఆంతరంగికులు అవుతారు. మీ మంచితనానికి మీరు అందించే సహాయసహకారాలకు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధుమిత్రుల నుండి సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు సమసిపోతాయి. కార్యాలయ సంబంధమైన విషయాలు కొన్ని అభూతకల్పనలతో మీడియా ద్వారా వెల్లడవుతాయి. కార్యాలయ ప్రతిష్ఠకు తాత్కాలికంగా భంగం కలుగుతుంది. ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి మీ ప్రణాళికలకు తగినటువంటి విషయాలకు ఒక ఉన్నతవ్యక్తి సహకారం లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. వాటిని నిలబెట్టుకోవడానికి జీవితంలో మీరు ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. మోసపూరిత డాక్యుమెంట్ల వల్ల, దొంగ స్వామీజీల వల్ల, నకలీ వస్తువుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సహోదర సహోదరీవర్గంలోని ఒకరికి రహస్యంగా సహాయం చేస్తారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న వారికి మంచి పేరుప్రఖ్యాతులు లభిస్తాయి. లాటరీలు, జూదాలు, క్రికెట్, రాజకీయ ఫలితాల బెట్టింగ్‌లు పనికిరావు. మీ సన్నిహిత వర్గానికి చట్ట పరమైన చిక్కులు, ట్యాక్సులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు మీ శత్రువర్గం వల్ల ఏర్పడతాయి. రాజకీయ పరపతిని ఉపయోగించి వాటి నుండి మీ వారిని రక్షించుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. దీని ప్రభావం మీ వృత్తి ఉద్యోగాల మీద పడకుండా జాగ్రుత్త వహించండి. పిల్లల పురోగతికి ఖర్చు చేయవలసిన ధనం చేతికి అందుతుంది.
సమస్యలు పరిష్కారం కావాలి, కొంతమందికి దారి దొరకాలి. అప్పుడే అన్నివిధాలుగా మీకు ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు సంబంధించిన వస్తువులుగానీ, పత్రాలుగానీ, డాక్యుమెంట్లుగానీ మీ దగ్గర ఉండడం వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో చికాకులు పోయి మంచికాలం వచ్చినట్లుగా కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. కరస్పాండెన్స్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్య, విద్య, మందుల వ్యాపారం, ఎరువుల వ్యాపారం, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం అనుకూల దిశలో పయనిస్తాయి. మీ శక్తిసామర్థ్యాలు, మీ ప్రతిభ ఆకస్మాత్తుగా చాలామందికి గుర్తుకువస్తాయి. సాంకేతిక, విద్యారంగాలలో ఉన్నవారికి ప్రజాదరణ, ప్రభుత్వపరమైన అవార్డులు, రివార్డులు సూచిస్తున్నాయి. మీ నెలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది. మారిన సామాజిక, రాజకీయ పరిస్థితులు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి.
స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తమ స్వశక్తితో, తమ స్వంతకాళ్ళపై నిలబడే యత్నాలు చేసి నిలబడతారు. పొదుపు చేసిన ధనంతో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆభరణాల పట్ల గతంలో ఉన్న మోజు తగ్గుతుంది. మన ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా భగవంతుడే నిర్ణయాలు తీసుకుంటాడని తెలుసుకుంటారు. రాజకీయాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. పెళ్ళిచూపుల తతంగాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటారు. కుటుంబ ప్రతిçష్ఠ నిలబెట్టడానికి శ్రమిస్తారు. పిల్లలను తమ అభిరుచికి అనుగుణంగా పెంచాలని అనుకుంటారు. కానీ పిల్లలు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే చూసీ చూడనట్లుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జ్యేష్ఠ సంతానం విషయంలో కఠిన నిర్ణయాలు అమలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనితో భర్తతో విభేదాలు తలెత్తుతాయి. సాధారణ విద్యలోనూ, సాంకేతిక విద్యలోనూ బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న చోట చదువుకోవడానికి చక్కని అవకాశం లభిస్తుంది. చదువుకోసం దివారాత్రులు శ్రమిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. జుట్టు సంరక్షణకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలపరంగా నూతన అవకాశాలు కలిసివస్తాయి. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. బ్యూటీపార్లర్స్ నిర్వహణ, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. మీకు రావలసిన ధనం మెల్లిమెల్లిగా చేతికి వస్తుంది. సామాజిక జీవితంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యతనిస్తారు. ఎందరు ఎన్నివిధాలుగా చెప్పినా మీ అభిప్రాయంలో మార్పురాదు. సంస్థాపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు గోప్యంగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఆంతరంగిక వ్యక్తులను దూరంగా ఉంచుతారు. వైద్యవిద్యను అభ్యసించాలనే కోరిక నెరవేరుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చోరభయం పొంచివుంది. ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఐఐటీ, సీఏ, ఎంబీఏలలో కూడా రాణిస్తారు. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి.
వికారినామ సంవత్సర (మకర రాశి ) రాశిఫలాలు
Published Sun, Mar 31 2019 12:43 AM | Last Updated on Tue, Apr 2 2019 6:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment