సాహసాలు చేసేవాళ్లకి కష్టమేమో గానీ... చూసేవాళ్లకి మహా సరదాగా ఉంటుంది. ఈ విషయం తెలుసు కనుకనే టీవీ చానెళ్లు సాహసోపేత కార్యక్రమాలకు తెర తీశాయి. మన తెలుగు చానెళ్లలో ఇలాంటి కార్యక్రమాలు ఉండవు కానీ... ఆంగ్ల చానెళ్లు పెడితే మాత్రం బోలెడు కనిపిస్తాయి. డిస్కవరీ, యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రాఫిక్ చానెళ్లు చూసేవాళ్లందరికీ అడ్వెంచరస్ కార్యక్రమాల గురించి చెప్పాల్సిన పని లేదు. రకరకాల సాహసకృత్యాలు, విచిత్రమైన విన్యాసాలు, వింతలు, విశేషాలు... ఎంజాయ్ చేయాలే కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదువ ఉండదు.
అడవిలో తప్పిపోతే బయటకు రావడం ఎలా, బయటకు వచ్చేవరకూ బతకడం ఎలా, నదుల్ని దాటడం ఎలా, కొండల్ని ఎక్కడం ఎలా, నిప్పు రాజేయడం ఎలా... ఇలాంటి షోలు కొన్ని. పాముల్ని పట్టడం ఎలా, మొసళ్లను లొంగదీయడం ఎలా, క్రూరమృగాలను మచ్చిక చేసుకోవడం ఎలా... ఈ తరహా షోలు కొన్ని. ఇంకో రకం కూడా ఉంది. కంటికి కనిపించేవాటితో కాదు... కనిపించని దెయ్యాలతో షోలు చేస్తుంటారు. అంటే... ఎక్కడైనా దెయ్యం ఉందని తెలిస్తే అక్కడికెళ్లి జరిగే సంఘటనల్ని చిత్రీకరించడం, దెయ్యం ఉందా లేదా అని పరిశోధించడం వంటివి చేస్తుంటారు.
ప్రేక్షకులకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని చెబుతుంటారు నిర్వాహకులు. వారికి ప్రమాదమైనా మనకు వినోదాన్ని ఇవ్వడం ముఖ్యమనుకుంటామని కూడా చెబుతుంటారు. ఒక రకంగా అది నిజమే కావచ్చు. విష జంతువులను లొంగదీయడంలో సిద్ధహస్తుడైన స్టీవ్ వండర్స్... ఓ విషజీవి కారణంగానే ప్రాణాలు కోల్పోయాడు. భర్తతో పాటు ‘మ్యాన్ ఉమన్ వైల్డ్’ షోలో నిర్మానుష్య ప్రదేశాల్లో సంచరించే రూత్... అలాస్కాలో మంచు కొండల్లో మనలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
ఇలాంటి వాటన్నిటినీ వాళ్లు అధిగమించి కార్యక్రమాలను రక్తి కట్టిస్తుంటారు. అయితే... వాటిని ప్రేక్షకులు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా?! కచ్చితంగా చేస్తున్నారు. లేదంటే ఇన్ని రకాల కార్యక్రమాలు ఎలా పుట్టుకొస్తాయి? మ్యాన్ వర్సెస్ వైల్డ్, మ్యాన్ హంట్, ఘోస్ట్ అడ్వెంచరర్స్, ఎక్స్‌పీడిషన్ గ్రిజ్జీ, డ్యూయల్ సర్వైవల్, బియాండ్ ద డివైడ్... ఇలా ఎన్నో. విష ప్రాణుల్ని చూసి ముఖం తిప్పుకునేవాళ్లున్నా, క్రూరమృగాలను చూసి కంగారుపడేవాళ్లున్నా, దెయ్యాలంటే భయపడి ముసుగు తన్నేవాళ్లున్నా ఆ ప్రోగ్రాములు విజయవంతంగానే సాగిపోతున్నాయి. టీఆర్పీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాయి!
టీవీక్షణం: వాళ్లకు ప్రమాదం... మనకు వినోదం
Published Sun, Jun 29 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM
Advertisement
Advertisement