
టీవీక్షణం: పాత సీసాలో కొత్త సారా!
సీరియల్ కథలన్నీ ఒకలానే అనిపిస్తుంటాయి. కుటుంబాలు, మనస్పర్థలు, మధ్యలో ప్రేమలు, వాటికి ఎదురైన అవాంతరాలు, పెళ్లిళ్లు, ఆ తర్వాత అలకలు, తగువులు... ఎలాగైనా తియ్యి, ఎన్ని మలుపులైనా తిప్పు... ఇదే కథ!
కొన్ని సీరియల్స్ చాలా కొత్తగా మొదలవుతాయి. అబ్బ... ఇలాంటి కథ ఎప్పుడూ రాలేదే అనుకుంటాం. కానీ కొన్ని వారాలు గడిచాక కచ్చితంగా పైన చెప్పుకున్న ఏదో ఒక మూసలో పడిపోతుంది. అందువల్లే కొన్ని సీరియళ్లకి మొదట్లో ఉన్న టీఆర్పీ తర్వాత ఉండదు. అందుకే కొన్ని సీరియళ్లు హడావుడిగా ముగిసిపోతుంటాయి. మరి సోనీలో ప్రసారమవుతోన్న ‘దేశ్‌కీ బేటీ నందినీ’ కూడా అలానే అవుతుందా అన్నదే ఇప్పుడు సందేహం!
ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి నందిని. అనుకోకుండా ఓ యువ రాజకీయవేత్తని పెళ్లాడుతుంది. అయితే ఆ పెళ్లి రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిందేనని, అదంతా అతడి తల్లి ప్లాన్ అని తెలుస్తుందామెకి. అమాయకుడైన భర్తని, అత్తగారి స్వార్థ రాజకీయాల నుంచి బయటకు లాగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె వేగానికి అడ్డుకట్ట వేసి, కొడుకుని తన గుప్పిట్లోనే ఉంచుకోవాలని తంటాలు పడుతుంటుంది అత్తగారు. ఇదే కథ నడుస్తోంది. కాకపోతే ఆసక్తికరంగా నడుస్తోంది. పాత సీసాలో కొత్త సారా అంటున్నది ఇందుకే!
అత్తాకోడళ్ల గొడవలు మామూలే. కాకపోతే ఈ గొడవలు కాస్త కొత్తగా ఉన్నాయి. పొలిటికల్ టచ్ ఉండటంతో కథ కొత్త ఒరవడిలో సాగుతోంది. కుటుంబ కలహాల మధ్య విలువలకు సంబంధించిన విషయాలను డిస్కస్ చేయడం వల్ల ప్రేక్షకులు వెరైటీ ఫీలవుతున్నారు. కాకపోతే ఈ వైవిధ్యం ఎప్పటివరకూ ఉంటుందన్నదే ప్రశ్న. ఎప్పుడూ అలాగే ఉంటే ఓకే. లేదంటే... ఇది కూడా అన్ని సీరియళ్లలాగే మూసలో పడిపోతుంది. తన ప్రత్యేకత తో పాటు టీఆర్పీని కూడా కోల్పోతుంది!