ఆదివారం పూట టీవీలో పాత తెలుగు సినిమాలు చూడడం అప్పారావుకు ఇష్టం. ఆ ఆదివారం అప్పారావు చూసిన సినిమా అక్కినేని–అంజలిదేవి జంటగా నటించిన ‘అల్లావుద్దీన్ అద్భుతదీపం’. ఈ సినిమా అప్పారావుకు తెగనచ్చేసింది. ‘ఈ సినిమాలో నాగేశ్వర్రావుకు దొరికినట్లు నాక్కూడ అద్భుతదీపం దొరికితే బాగుణ్ణు’ తనలో తాను అనుకున్నాడు అప్పారావు. ఆరోజు ఉదయం ఇంటి పెరట్లో తీరిగ్గా బ్రష్ చేసుకుంటూ డీప్‌గా ఆలోచిస్తున్న అప్పారావు దృష్టి వేపచెట్టు వెనుక ఉన్న పొదలపై పడింది. ఆ పొదల్లో ఏదో మెరిసినట్లుఅనిపించింది. ‘ఏమిటది?’ అనుకుంటూ ఆసక్తిగా అక్కడికి వెళ్లాడు.‘ఏదో దీపంలా ఉందే’ అనుకుంటూ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అంతే...ఆకాశం అదిరేలా నవ్వు వినిపించింది. దీపంలో నుంచి జిన్నీ భూతం బయటికి వచ్చింది.‘మిస్టర్ అప్పారావు...ఈ క్షణం నుంచి నువ్వు నా యజమానివి. నువ్వు ఏది అడిగినా క్షణాల్లో అరేంజ్ చేస్తాను...’’ అంది భూతం.జిన్నీ భూతాన్ని చూడగానే చిలిపిగా ఒక ఆట ఆడుకోవాలనిపించింది అప్పారావుకు.‘‘చూడు జిన్నీ...నాకు మూడు సమస్యలు ఉన్నాయి. అవి తీర్చితే ఓకే. లేకపోతే వెయ్యి గుంజీలు నాన్‌స్టాప్‌గా తీయాలి’’ అన్నాడు అప్పారావు.‘ఓకే’ అంది జిన్నీ.
‘‘నా మొదటి సమస్య... నేను వాసన పసిగట్టే శక్తిని కోల్పోయాను. ఈ సమస్య తీర్చు’ అంటూ లేని సమస్యను చెప్పాడు అప్పారావు. ఒక చేత్తో వేడి వేడి చికెన్ బిర్యాని, మరో చేత్తో వేడివేడి చేపల పులుసుతో అప్పారావు ముందు నిలుచుంది జిన్నీ. వంటకాల ఘుమఘుమలు అదిరిపోతున్నాయి. అప్పారావు నోరు ఊరిపోతుంది.‘‘ఈ వంటకాల వేడి వేడి పొగలు కనిపిస్తున్నాయే తప్ప...వాసన ఏమాత్రం పసిగట్టలేకపోతున్నాను’ అలవోకగా అబద్ధం ఆడాడు అప్పారావు. ‘హాంఫట్’ అనగానే జిన్నీ చేతిలో కోతిబొమ్మతో ఉన్న చిన్న సీసా ఒకటి ప్రత్యక్షమైంది.‘‘బాస్...ఇందులో నుంచి రెండు చుక్కలు నోట్లో వేసుకోండి చాలు... మీరు కోల్పోయిన సెన్స్ ఆఫ్ టేస్ట్ తిరిగొస్తుంది’’ అంది జిన్నీ భూతం.‘‘అలాగే’’ అంటూ ఆ సీసాను చేతిలోకి తీసుకొని, నోట్లో వేసుకోబోయి నాలుక కర్చుకొని కోపంగా ఆరిచాడు.‘‘ఛీ...ఇది పెట్రోల్’’‘‘కాదని ఎవరన్నారు? ఇది పెట్రోలే!’’ అంది జిన్నీ.‘‘మందు ఇవ్వమంటే పెట్రోల్ ఇస్తావా? తమాషాగా ఉందా?’’ ఆగ్రహంతో అరిచాడు అప్పారావు.
‘‘అది తరువాత విషయం. నువ్వు వాసన పసిగట్టావా లేదా అనేదే ముఖ్యం!’’ అంది జిన్నీ. అప్పారావు ఒకటో సారి ఓడిపోయాడు.‘‘ఇప్పుడు నా రెండో సమస్య చెబుతాను. నా జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయాను. నిన్ను తప్ప ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాను’’ అన్నాడు అప్పారావు.అప్పుడు జిన్నీ చేతిలో ఆ కొత్తిబొమ్మ సీసా మళ్లీ ప్రత్యక్షమైంది.‘‘బాస్...ఈ సీసాలో నుంచి రెండు చుక్కలు నోట్లో వేసుకో చాలు. కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగి వస్తుంది’’ అని ఆ సీసాను అప్పారావుకు అందించబోయింది జిన్నీ.‘‘అబ్బ ఆశ...దోశ...అప్పడం వడ.... ఆ సీసాలో ఏముందో నాకు గుర్తు లేదనుకున్నావా? ఈ పెట్రోల్ చుక్కలు నాకెందుకు?’’ విసుక్కున్నాడు అప్పారావు.‘‘చూశారా...నీ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది’’ అంది భూతం.నాలుక కరుచుకున్నాడు అప్పారావు.‘‘నీ చివరి సమస్య ఏమిటో చెప్పు. అది కూడా తీరుస్తా’’ అంది జిన్నీ.‘‘నాకు ఈమధ్య కంటి సమస్య ఏర్పడింది.జస్ట్...పది అడుగుల దూరంలో ఉన్న దృశ్యాన్ని కూడా చూడలేకపోతున్నాను’’ అన్నాడు అప్పారావు.‘‘అయ్యా అప్పారావుగారు! ఈ సమస్యకు మాత్రం నా దగ్గర పరిష్కారం లేదు’’ అంది జిన్నీ. విజయగర్వంతో అప్పారావు ముఖం రాత్రిపూట క్రికెట్ స్టేడియంలా వెలిగిపోయింది.
‘‘నువ్వు ఓడిపోయావు కాబట్టి....ఒప్పందం ప్రకారం వెయ్యి గుంజీలు నాన్‌స్టాప్‌గా తీయాలి’’ అంటూ ఆదేశించాడు అప్పారావు. ‘‘అలాగే’’ అనుకుంటూ పది అడుగులు వెనక్కి వెళ్లింది జిన్నీ.రెండు నిమిషాల తరువాత: ‘‘అదేంటి...గుంజీలు తీయమంటే...గంగ్నామ్ డ్యాన్స్ చేస్తున్నావు?’’ కోపంగా జిన్నీపై అరిచాడు అప్పారావు.‘‘చూశావా...నీ కంటి సమస్య కూడా తీరిపోయింది. పది అడుగుల దూరంలోని దృశ్యాన్ని కూడా ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నావు’’ అంది జిన్నీ. అప్పారావు మరోసారి నాలుక కరుచుకున్నాడు.‘‘ ఇప్పటి వరకు నా సమస్యల గురించి మాత్రమే చెప్పాను. నాకో కోరిక ఉంది. అది తీర్చాలి’’ అడిగాడు అప్పారావు. ‘‘అలాగే’’ అంటూ ‘‘ఈసారి వీడిని నేను ఆడుకోవాలి’’ అనుకుంది జిన్నీ.‘‘నాకో గర్ల్‌ఫ్రెండ్ ఉంది. నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఆమె దగ్గరే ఉండాలి. ఆమె ఎప్పుడూ నాతో మాట్లాడుతూనే ఉండాలి. ఎప్పుడూ నా ముఖంలో ముఖం పెట్టి చూస్తూనే ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేవడం లేవడంతోనే నా ముఖం చూడాలి. నేను లేకుంటే ఏదో కోల్పోయినట్లు ఉండాలి’’ చెప్పుకుంటూ పోయాడు అప్పారావు.‘‘ ఓకే’’ అంది జిన్నీ భూతం. వెంటనే స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయాడు అప్పారావు.‘‘కోరిక తీర్చమంటే స్మార్ట్‌ఫోన్‌గా మార్చావేంటయ్యా మగడా...’’ ఆవేదనగా అరిచాడు సెల్‌రూప అప్పారావు.‘‘నువ్వు అడిగిన కోరికలు స్మార్ట్‌ఫోన్ అయితే తప్ప సాధ్యపడవు. మరో విషయం ఏమిటంటే..స్మార్ట్‌ఫోన్‌లో రకరకాల వెర్షన్‌లు ఉన్నట్లే అల్లావుద్దీన్ అద్భుతదీపంలోనూ ఉన్నాయి. నేను వరాల వెర్షన్ కాదు...శాపం వెర్షన్. నాకు అల్లావుద్దీన్ అద్భుతశాపం అని పేరు. అంటే నన్ను కోరికలు కోరినవాడు ఏదో ఒక శాపానికి గురవుతాడన్నమాట. ప్రసుత్తం నీకు అదే జరిగింది’’ గంభీరంగా పలికింది జిన్నీభూతం.
– యాకుబ్ పాషా
అల్లావుద్దీన్ అద్భుత శాపం
Published Sun, Jan 28 2018 12:25 AM | Last Updated on Sun, Jan 28 2018 12:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment