కృత్రిమ గర్భధారణతో పుట్టే మగపిల్లల్లో ఆ లోపం!
పిల్లలు కలగని చాలామంది తల్లిదండ్రులకు ఒక వరం కృత్రిమ గర్భధారణ. పురుషుల వీర్యంలో శుక్రకణాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఐసీఎస్‌ఐ అనే గర్భధారణ ప్రక్రియ ద్వారా మహిళలకు గర్భధారణ జరిగేలా చూడవచ్చు. ఇంట్రా సైటోప్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్‌ఐ) అనే ప్రక్రియ ద్వారా ఫెర్టిలిటీ నిపుణులు మహిళలకు గర్భధారణ కలిగేలా చూస్తారు. అయితే ఇలా పుట్టే మగసంతానానికి భవిష్యత్తులో వాళ్ల నాన్నలాగే వీర్యకణాల్లో కౌంట్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు పేర్కొంటున్నారు. బెల్జియంలోని ‘బ్రసెల్స్ వ్రిజె యూనివర్సిటీయేట్’కు చెందిన సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.
అప్పట్లో 1992 నుంచి 1996 వరకు పుట్టిన పిల్లలు ఇప్పుడు యుక్తవయస్కులయ్యారు. అప్పుడు నార్మల్‌గా పుట్టిన పిల్లలకూ, కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన పిల్లలకూ మధ్య తేడాలను నిశితంగా పరిశీలించిన నిపుణులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. సాధారణంగా పుట్టిన మగ సంతానంతో పోలిస్తే... ఇలా కృత్రిమ గర్భధారణ వల్ల కలిగే సంతానంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం సాధారణ పురుషుల కంటే మూడింతలు తక్కువని పరి శోధనలు వెల్లడిస్తున్నాయి. తండ్రి నుంచి జన్యుపరమైన లోపాలు ఆ పిల్లల జన్యువుల్లోకీ రావడం వల్ల వారిలో ఈ పరిస్థితి కలిగే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న నిపుణుల బృందంలో ఒకరైన యాండ్రీ వాన్ స్టియర్టేఘెమ్ పేర్కొన్నారు. ‘‘ఇది ఊహించని ఫలితం’’ అంటున్నారాయన.