అడవులు తగ్గుతున్న కొద్దీ పెరుగుతున్న దోమలు!
హెల్త్ ల్యాబ్
అడవుల్లో కనిపించాల్సిన జంతువులు ఇటీవల నగరాల్లో కనిపించడం అందరికీ తెలిసిందే. దీనికి కారణాలూ తెలుసు. తాము స్వేచ్ఛగా సంచరించాల్సిన అడవులు తగ్గుతున్న కొద్దీ అక్కడ నడయాడాల్సిన జంతువులు పట్టణాల్లోకి, నగరాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ‘సన్ బేర్’గా వ్యవహించే కొన్ని ఎలుగుబంట్లను చూసి వాటిని ఏలియన్స్‌గా అనుమానించిన ఉదంతమూ తెలిసిందే. అయితే ఇది కేవలం అడవి జంతువులకు మాత్రమే వర్తించే విషయం కాదు. అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు.
దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి. కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బందానికి నేతత్వం వహించిన మార్మ్ కిల్‌పాట్రిక్స్ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు.