అనంత విశ్వంలో మన ఆవాసం భూమి. భూమి మీద దాదాపు డెబ్బయిశాతం నీరు. మిగిలిన ముప్పయి శాతం నేల. నీరూ నేలా నిండిన ఈ భూమండలమే సమస్త జీవరాశులకు ఆవాసం. మనిషి కంటే ముందే భూమి మీద చాలా జీవరాశులు ఆవిర్భవించాయి. మనిషి పుట్టక ముందే వాటిలో కొన్ని అంతరించాయి. మనిషి పుట్టిన తర్వాత, ఆధునిక నాగరికత వ్యాపించిన తర్వాత ఇంకొన్ని జీవరాశులు అంతరించాయి. ఇప్పుడు చూసుకుంటే మరిన్ని జీవరాశులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. కన్నూ మిన్నూ కానని మనిషి దూకుడుకు భూమి సహజ స్వభావంలోను, వాతావరణంలోను చాలా మార్పులే వచ్చాయి. భూతాపం గణనీయంగా పెరిగింది. భూమికి రక్షణ కవచంగా ఉన్న ఓజోన్ పొరకు చిల్లు పడింది. ఇప్పటికైనా కళ్లు తెరవకుంటే, చివరకు మనిషి మనుగడకే ముప్పు వాటిల్లగలదు. ఇకనైనా భూమిని కాపాడుకోవడానికి చర్యలు ప్రారంభించడం మంచిది. ఎర్త్‌కు ఎర్త్ పెట్టకుండా ఉంటేనే మంచిది.
మితిమీరిన జనాభా, ఇష్టానుసారం సాగుతున్న అడవుల నరికివేత, పట్టణీకరణ, వీటి పర్యవసానంగా తలెత్తిన వాతావరణ కాలుష్యం, పెరిగిన భూతాపం, మంచుఖండాల కరుగుదల, ఎడారుల పెరుగుదల, భూగర్భ జలాల తరుగుదల వంటి నానా సమస్యలు ఇప్పుడు భూమండలాన్ని పట్టి పీడిస్తున్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి భూమి చాలా మార్పులనే చవిచూసింది. సుదీర్ఘ గతం సంగతి వదిలేస్తే, గడచిన యాభయ్యేళ్ల కాలంలోనే భూమిపై అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జనాభా రెట్టింపైంది. జనాభాతో పాటే భూమిని చుట్టుముడుతున్న సమస్యలూ రెట్టింపయ్యాయి. భూతాపం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సగటు వర్షపాతాలు తగ్గుతున్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు కరువు కోరల్లో చిక్కుకుంటున్నాయి. గడచిన యాభయ్యేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కరువు ప్రాంతాల విస్తీర్ణంలో దాదాపు 20 శాతం పెరుగుదల నమోదైంది. భూతాపం ఇదే తీరులో పెరుగుతూ పోతే, 2090 నాటికి కరువు ప్రాంతాల విస్తీర్ణం దాదాపు 40 శాతానికి చేరుకోగలదని బ్రిటన్‌లోని హ్యాడ్లీ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇదివరకే హెచ్చరిక చేశారు. అధిక జనాభా గల దేశాలు మాత్రమే కాదు, అగ్రరాజ్యాలు, యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశాలు మితిమీరిన కాలుష్యాన్ని విడుదల చేస్తూ భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి. భూతాపం పెరుగుదల వల్ల 1880 నాటితో పోలిస్తే ప్రస్తుతం ఆర్కిటిక్ ధ్రువప్రాంతంలో మంచు విస్తీర్ణం 13 శాతం మేరకు తగ్గింది. మంచు ఖండాలు కరుగుతుండటంతో సముద్ర మట్టాలు దాదాపు ఏడు అంగుళాల మేరకు పెరిగాయి. ఈ పరిస్థితుల వల్ల రకరకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు వంటివి విజృంభిస్తున్నాయి. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం ఎడాపెడా వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు భూసారాన్ని దెబ్బతీయడమే కాకుండా, మనుషుల ఆరోగ్యానికి కూడా ఎసరు పెడుతున్నాయి. భూసార క్షీణత వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత వృత్తులపై ఆధారపడుతున్న దాదాపు 150 కోట్ల మంది జీవనాధారానికే ఇక్కట్లు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా.
తరిగిపోతున్న అడవులు
నాగరికతలు అభివృద్ధి చెంది జనావాసాలు ఏర్పడినప్పటి నుంచి మనుషులు ఇంధన అవసరాల కోసం, భవన నిర్మాణ అవసరాల కోసం అడవులను నరకడం మొదలైంది. పారిశ్రామికీకరణ మొదలయ్యాక అడవుల నరికివేత మరింత ఎక్కువైంది. ప్రత్యామ్నాయంగా తగినన్ని మొక్కలు నాటకుండా అడవులు నరికేస్తూ పోవడం వల్ల వాటి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల అడవుల్లోని అరుదైన వృక్ష జాతులు, అడవులనే ఆవాసంగా చేసుకుని జీవించే జంతుజాతుల మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే కొన్ని అరుదైన జీవజాతులు కనుమరుగయ్యాయి. మరికొన్ని అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అడవుల నరికివేత వల్ల ప్రపంచంలో చాలా చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, ప్రపంచవ్యాప్తంగా వంటచెరకు కోసం ఇప్పటికీ అడవులపై ఆధారపడుతున్న జనాభా 240 కోట్లకు పైగానే ఉన్నారని, దాదాపు 70 కోట్ల మంది వంట చెరకు సేకరణతోనే మనుగడ సాగిస్తున్నారని అమెరికాకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వెల్లడించింది. ఇంధన అవసరాల కోసం కలపను సేకరించడంపై ఆధారపడే వారి సంఖ్య 2030 నాటికి 90 కోట్లకు చేరుకోగలదని అంచనా వేసింది. నానాటికీ పెరుగుతున్న జనాభా ఆకలి తీర్చడానికి తగినంతగా ఆహార ఉత్పత్తి కోసం వ్యవసాయ క్షేత్రాల విస్తీర్ణం పెంచుకోవాల్సి వస్తోంది. ఏటా వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరుగుతూ వస్తుంటే, అడవుల విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటా 60 లక్షల హెక్టార్ల మేరకు అడవులు కనుమరుగైపోతున్నాయి. కనుమరుగవుతున్న అడవుల స్థానంలో మొక్కలు నాటి కొత్తగా అడవులను సృష్టించుకోవాలని అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలన్నీ దశాబ్దాల కిందటే తీర్మానాలు చేశాయి. ఆ తీర్మానాల మేరకు కేవలం పన్నెండు దేశాలు మాత్రమే 1990 సంవత్సరం తర్వాత తమ తమ పరిధిలో అడవుల విస్తీర్ణాన్ని పది శాతానికి పైగా పెంచుకోగలిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల లక్ష్యాలను సాధిస్తూనే అడవుల విస్తీర్ణం పెంచుకున్న ఆ పన్నెండు దేశాలు: అల్జీరియా, చిలీ, చైనా, డోమినికన్ రిపబ్లిక్, గాంబియా, ఇరాన్, మొరాకో, థాయ్‌లాండ్, తునీసియా, టర్కీ, ఉరుగ్వే, వియత్నాం. మిగిలిన దేశాల్లో మాత్రం అడవుల నరికివేత యథావిధిగా కొనసాగుతూనే ఉంది.
అడవుల నరికివేత వల్ల ఇవీ అనర్థాలు
అడవుల నరికివేత వల్ల అక్కడక్కడా కార్చిచ్చు ప్రమాదాలు జరుగుతున్నాయి. భూమ్మీద ఉండే జంతు, వృక్ష జాతుల్లో దాదాపు 80 శాతం జీవజాతులు అడవుల్లోనే ఉంటాయి. అడవుల నరికివేత వల్ల వీటి మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పచ్చదనం లేకపోవడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి, భూతాపం పెరుగుతోంది. గడచిన శతాబ్ద కాలంలో జరిగిన అడవుల నరికివేత వల్ల కర్బన ఉద్గారాల పరిమాణం 15 శాతం మేరకు పెరిగింది. ఇంతేకాదు, ఏటా దాదాపు యాభైవేల వరకు జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచంలో ప్రతి నిమిషానికి 36 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలోని అడవులు కనుమరుగవుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో వందేళ్లలో ప్రపంచంలో వర్షారణ్యాలే అంతరించే పరిస్థితి వాటిల్లుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సూర్యరశ్మిని అడ్డుకునే భారీ వృక్షాలను నరికేస్తూ పోతే, అటవీ భూముల్లో తేమ నశించి, కొంత కాలానికి అవి ఎడారులుగా మారే ప్రమాదం ఉందని కూడా వారు చెబుతున్నారు.
వ్యవసాయ కాలుష్యం
భూమ్మీద కాలుష్యానికి దారితీసే అతిపెద్ద కారణం అడవుల నరికివేత అయితే, వ్యవసాయం వల్ల కూడా ఎక్కువ స్థాయిలోనే కాలుష్యం ఏర్పడుతోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల యురేనియం, కాడ్మియం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్, క్రోమియం, నికెల్, పాదరసం వంటి ప్రమాదకరమైన పదార్థాలు నేలలోకి చేరుతున్నాయి. వీటిలో కొన్ని పదార్థాలు తిండిగింజల్లోకి చేరుతున్నాయి. అనివార్యంగా వీటిని తింటున్న జనం రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. సాగు కోసం నేలను అతిగా దున్నడం, తవ్వడం వంటి పనుల వల్ల మట్టి కోతకు గురవుతోంది. ఇలాంటి చర్యల వల్ల భూసారం క్షీణిస్తోంది. రసాయనాలతో కలుషితమైన మట్టి వర్షాలు కురిసినప్పుడు నీటిలోకి చేరి, జల కాలుష్యానికి కారణమవుతోంది. సేంద్రియ వ్యవసాయంపై ఇటీవలి కాలంలో కొంత అవగాహన పెరుగుతున్నా, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం మాత్రం తగ్గాల్సినంతగా తగ్గలేదు. వ్యవసాయ రసాయనాల వల్ల మనుషులకు స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు కరువయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. చీడ పీడలను తట్టుకుంటాయని చెబుతూ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న జన్యు మార్పిడి విత్తనాల వల్ల సహజ సిద్ధమైన వృక్ష జాతులకు ముప్పు వాటిల్లుతోందని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నారు. ఎరువులుగా వాడే రసాయనాలలో పోషకాలు ఉంటాయేమో గాని, పురుగు మందులైతే నేరుగా విష పదార్థాలే. పర్యావరణ కాలుష్యంపై ప్రపంచానికి నీతులు చెప్పే అగ్రరాజ్యాలే పురుగు మందుల వాడకంలో ముందంజలో ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే పురుగు మందుల్లో 45 శాతం యూరోప్ దేశాలే వాడుతున్నాయి. అమెరికా 25 శాతం పురుగు మందులు వాడుతుండగా, మిగిలిన దేశాలన్నీ కలిపి మరో 25 శాతం మేరకు పురుగు మందులు వాడుతున్నాయి. భారత్ 7.5 శాతం మేరకు మాత్రమే పురుగు మందులు వాడుతోంది. ఇదిలా ఉంటే, పశువుల పెంపకం, కోళ్ల పరిశ్రమల కారణంగా కూడా గణనీయమైన కాలుష్యం ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెలువడే కర్బన ఉద్గారాల్లో 18 శాతం కేవలం వీటివల్లనే వెలువడుతున్నట్లు ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) గణాంకాలు చెబుతున్నాయి.
పారిశ్రామిక కాలుష్యం
ఆధునిక పరిశ్రమలు అభివృద్ధిని వేగవంతం చేసినా, భూమిని కాలుష్యంతో నింపడంలో ఇవి ముందంజలో ఉంటున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్లాస్టిక్ వాడకం, పాలిథిన్ వాడకం మొదలయ్యాయి. మట్టిలో కలవని ఈ పదార్థాల వాడకం ఏమాత్రం తగ్గకపోగా, నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద ఉన్న నేలనే కాదు, మహాసముద్రాలకు సైతం బెడదగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగం ఇదే తీరులో కొనసాగితే, 2026 నాటికి సముద్రాల్లో 1.80 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి కారణంగా సముద్రంలో జీవించే జలచరాలకు ముప్పు ఏర్పడుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగానే ఆస్ట్రేలియా సముద్ర ప్రాంతంలోని పగడపు దీవులు చాలావరకు నాశనమయ్యాయి. కొన్ని అరుదైన జాతుల తాబేళ్లు, చేపలు అంతరించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 830 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు వాడుకలో ఉన్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు అంచనా వేశారు. ఏటా పోగు పడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9 శాతం వ్యర్థాలను మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. మరో 12 శాతం వ్యర్థాలను పర్యావరణానికి తక్కువ హాని కలిగే పద్ధతుల్లో దహనం చేస్తున్నారు. మిగిలిన 79 శాతం వ్యర్థాలు మాత్రం నేలపైనా, సముద్రాల్లోను పోగుపడుతున్నాయి. నేలపై పోగుపడిన ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలను తినడం వల్ల పెద్దసంఖ్యలో మూగజీవాలు మరణిస్తున్నాయి. ప్లాస్టిక్ సంగతి ఇలా ఉంచితే, ఇక పరిశ్రమలు విడుదల చేసే విషవాయువులు జనావాసాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనసమ్మర్దం గల నగరాల్లో నివసించే ప్రజలు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకునే అవకాశం లేకుండా చేస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు నేలలోకి చేరి భూసారాన్ని, భూగర్భ జలాలను, నీటిలోకి చేరి నదులను, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. ఇష్టానుసారం కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలు జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుండటమే కాకుండా, మనుషుల అకాల మరణాలకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు తయారు చేస్తున్న మోటారు వాహనాల వినియోగం ఏటేటా పెరుగుతుండటంతో వాయు కాలుష్యం మరింతగా పెరుగుతోంది.
వాయు కాలుష్యం కలిగించే వ్యాధులు
వాయు కాలుష్యం వల్ల చిన్నా చితకా శ్వాసకోశ వ్యాధులే కాదు, కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. వాయు కాలుష్యం ఉండే ప్రాంతాల్లోని జనం ఉబ్బసం, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), లుకీమియా, న్యుమోనియా, గుండెజబ్బులు వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. అంతేకాదు, వాయు కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పుట్టే పిల్లలు రోగనిరోధక శక్తి లోపాలు, ఆటిజం వంటి పుట్టుకతో వచ్చే లోపాలతో బాధపడుతున్నారు.
ఎలక్ట్రానిక్ వ్యర్థాలతోనూ చేటు
ప్లాస్టిక్ తర్వాత ఈ రోజుల్లో భూమ్మీద భారీగా పోగుపడుతున్నవి ఎలక్ట్రానిక్ వ్యర్థాలే. టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు వంటివే కాదు, విద్యుత్తుతో పనిచేసే గృçహోపకరణాలు సైతం పనికి రాకుండా పోతే చెత్తలో పడేస్తున్నారు. నిజానికి కొన్ని పూర్తిగా పనికి రాకుండా పోయినా, కొత్త కొత్త మోడల్స్ వస్తుండటంతో కొత్తవి కొనుగోలు చేసేవారు, పాత వస్తువులను వాడకుండా పడేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతే, వాటిని మరమ్మతులు చేయించడానికి పెట్టే ఖర్చు కంటే కొత్తవి కొనేయడమే మంచిదనే ఉద్దేశంతో చాలామంది ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను కొంటున్నారు. ఫలితంగా పాతబడిన ఎలక్ట్రానిక్ వస్తువులు వ్యర్థాలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్రధానంగా వాడేవి ప్లాస్టిక్, లోహాలు, గాజు వంటి పదార్థాలే. తేలికగా మట్టిలో కలిసిపోని ఈ పదార్థాలు భారీ స్థాయిలో కాలుష్యానికి దారితీస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధికంగా ఆసియా దేశాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పోగు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల గాలి, నీరు, నేల కలుషితంగా మారి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, ముఖ్యంగా పిల్లలు వీటి వల్ల ప్రాణాంతక పరిస్థితుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది.
ఎర్త్ డే ఎందుకంటే..?
ఆధునిక పర్యావరణ ఉద్యమం 1970 ఏప్రిల్ 22న అమెరికాలో మొదలైంది. పర్యావరణ ఉద్యమకారులు భూగోళానికి ఎదురవుతున్న సమస్యలపై గొంతెత్తారు. అంతకు ముందు రాచెల్ కార్సన్ 1962లో పర్యావరణ సమస్యలను ప్రస్తావిస్తూ రాసిన ‘సైలెంట్ స్ప్రింగ్’ పుస్తకం పర్యావరణ సమస్యలపై ప్రజలు ఆలోచించేలా చేసింది. భూగోళానికి ముప్పు తెచ్చిపెడుతున్న సమస్యలపై ఉద్యమానికి జనం నడుం బిగించే నాటికి ఆ పుస్తకం 24 దేశాల్లో 5 లక్షల కాపీలకు పైగా అమ్ముడైంది. అదే సమయంలో భూగోళానికి ఎదురవుతున్న సమస్యలపై జనం ఆలోచించేలా చేసేందుకు ఏటా ఒక రోజును ‘ఎర్త్ డే’గా పాటించాలని అప్పటి సెనేటర్ గేలార్డ్ నెల్సన్ అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రస్తావించారు. ఆయన ప్రస్తావన మేరకు పర్యావరణ ఉద్యమం మొదలైన ఏప్రిల్ 22వ తేదీనే ‘ఎర్త్ డే’గా నిర్ణయించారు.
– పన్యాల జగన్నాథదాసు
Comments
Please login to add a commentAdd a comment