వాయనం: బేరమాడటం తప్పు కాదు!
ఏ వస్తువైనా కొనేటప్పుడు బేరమాడటం మామూలే. అయితే కస్టమర్లలో బేరమాడే నైజం రానురాను తగ్గిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. బేరమాడటాన్ని చాలామంది నామోషీగా ఫీలవుతున్నారట. నిజానికంత ఫీలవ్వాల్సిన అవసరం లేదు. మనం బేరమాడతామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యాపారస్తులు తమ ఉత్పత్తులకు వెలను నిర్ధారిస్తారు. కాబట్టి ధైర్యంగా బేరమాడవచ్చు. కాకపోతే ఎప్పుడు, ఎక్కడ, ఎలా బేరమాడాలన్నది తెలుసుకోవాలి. కాస్త ట్రై చేస్తే బేరమాడే కళ అబ్బేస్తుందిలెండి!
రోడ్ల పక్కన అమ్మేవాళ్ల దగ్గర గీచి గీచి బేరమాడతాం. అదే మాల్స్‌లో అయితే అడిగినంత కిక్కురుమనకుండా ఇచ్చేసి వస్తాం. నిజానికి చిరు వ్యాపారస్తులు మనకి పెద్దగా టోకరా వేయరు. మాల్స్‌లోనే మన పర్సుకు చిల్లు పడుతుంది. కాబట్టి అక్కడే బేరమాడాలి. తగ్గించమంటే వాళ్లేమనుకుంటారో అన్న సంశయాన్ని మొదట వదిలేయండి.
ఒక్కచోట వెల చూసి నిర్ణయానికి వచ్చేయడం ఎప్పుడూ మంచిది కాదు. ఏదైనా కొనాలనుకున్నప్పుడు రెండు మూడు చోట్ల విచారించండి. దాన్నిబట్టి ఆ వస్తువు వెల ఎంత ఉండవచ్చో తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని ఎక్కడ కొన్నా మీరు ఆ వెలకే ఇవ్వమని ధైర్యంగా అడగవచ్చు.
కంపెనీ లేబుల్స్ ఉండేవాటిని బేరమాడటం సరికాదు. కాగితాల మీద రేట్లు వేసి అతికిస్తారే... అలాంటివి దుకాణదారుల సొంత రేట్లై ఉంటాయి. అక్కడ ఓ పట్టు పట్టవచ్చు.
బేరమాడాలి కదా అని నోటికొచ్చినంత చెప్పేయడం కరెక్ట్ కాదు. వస్తువు నాణ్యత, తయారీ ఖర్చు, ఆవశ్యకత, డిమాండ్ వంటి పలు అంశాలను బట్టి రేటును నిర్ధారిస్తారు. కాబట్టి మనం కూడా వాటన్నిటినీ అంచనా వేసుకునే అడగాలి.
సాధారణంగా ఏ చిన్న డ్యామేజ్ ఉన్నా వస్తువుని కొనం. ఒకవేళ బాగా నచ్చి కొనాలని అనుకుంటే... దాని డ్యామేజీకి రేటు తగ్గించమని అడిగే హక్కు కస్టమర్‌కి ఉంటుందన్న విషయం మనసులో ఉంచుకోండి.
ఒక్కోసారి ఎంత అడిగినా దుకాణదారుడు ఒప్పుకోడు. దాంతో అంత పెట్టడం అనవసరం అని తెలిసినా మనమే తగ్గిపోతుంటాం. అలా చేయనక్కర్లేదు. మనకి వస్తువు ఎంత అవసరమో, వ్యాపారస్తులకి మనమూ అంతే అవసరం. కాబట్టి మీ మాట నెగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
అన్నిటికంటే ముఖ్యమైనది... బేరమాడేటప్పుడు కంఠంలో కాన్ఫిడెన్స్ ఉండాలి. తెలిసీ తెలియనట్టుగా, అడిగీ అడగనట్టుగా నసిగితే... ఆ వస్తువు మీదగానీ, దాని వెల మీద గానీ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లా డుతున్నామని షాపువాడు కనిపెట్టే స్తాడు. ఇక మన మాట చచ్చినా వినడు!
మ్యాంగో స్ల్పిటర్
వేసవి అనగానే మామిడిపళ్ల ఘుమఘుమలు గుర్తొస్తాయి. వేసవి అయ్యేవరకూ ప్రతి ఇంటా మామిడి విందులే. ముఖ్యంగా దాహార్తిని తీర్చేందుకు చలచల్లని మ్యాంగో జ్యూస్‌ని సేవించాల్సిందే. జ్యూస్ అంటే చేస్తాం గానీ అందులోని టెంకను తీయడం మాత్రం భలే విసుగు తెప్పిస్తుంది. ముక్కలు ముక్కలుగా కోసి టెంకను వేరు చేయడం పెద్ద పని. అయితే అది ఒకప్పుడు... ఇప్పుడు మ్యాంగో స్ప్లిటర్ వచ్చేసింది. దీనిమీద మామిడిపండును పెట్టి ఒక్కసారి ప్రెస్‌చేస్తే చాలు... ఇదిగో, ఇలా టెంక వేరుపడిపోతుంది. దీని అసలు ధర 595 రూపాయలు. అయితే కొన్ని ఆన్‌లైన్ స్టోర్స్‌లో 380, 420, 480... ఇలా రకరకాల రేట్లలో దొరకుతోంది.