అలంకరణ అనేది కేవలం అందాన్నే కాదు.. ఆత్మవిశ్వాన్ని కూడా పెంచుతుంది..! అందుకే చాలామంది మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖానికి ఏదో ఒక వైటెనింగ్ క్రీమ్ రాసుకోవడం, పెదవులకి లిప్‌స్టిక్ పూసుకోవడం, కళ్లకు మస్కారా అప్లై చేసుకోవడం, గోళ్లకి నెయిల్ ఆర్ట్ వేసుకోవడం.. ఇవన్నీ మగువల డైలీ మేకప్‌లో భాగమైపోయాయి. లిప్‌స్టిక్, మస్కారాలతో పాటూ రంగురంగుల నెయిల్ పాలిష్‌లు కూడా మేకప్ కిట్‌లో భాగం చేసుకుంటున్నారు మగువలు.
ట్రెండీ లుక్‌ని ఫాలో అవుతూ.. రోజుకో నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్‌కు తగ్గట్టుగా కష్టపడి మరీ.. నెయిల్ ఆర్ట్‌ను వేసుకుంటున్నారు. పొడవుగా గోళ్లని పెంచుకుని, నాజూగ్గా షేప్ చేసుకుని వాటిపై వెరైటీ డిజైన్స్ వేసుకుంటూ మురిసిపోతుంటారు. అలాంటివారి కోసమే ఈ నెయిల్ ప్రింటర్.నాజూకైన గోళ్లను మెషిన్‌లో ఉంచితే.. కేవలం 30 నుంచి 35 సెకన్స్‌లో అదిరిపోయే నెయిల్ ఆర్ట్ వేస్తుంది ఈ మెషిన్.
కొమ్మలు, రెమ్మలు, పక్షులు, పదాలు, ప్రకృతి అందాలు ఇలా ఏదైనా సరే.. సెలెక్ట్ చేసుకుని నెయిల్స్ మీద డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి నెయిల్ ప్రింటర్స్‌లో చాలా మోడల్స్ ఉన్నాయి. మోడల్‌ని బట్టి.. బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. దాంతో ఫోన్‌లో ఓ సెల్ఫీ తీసుకుని.. దాన్ని ఈ మెషిన్‌కి పంపించి.. గోళ్ల మీద ప్రింట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.
చూశారా ఎంత అడ్వాన్స్ టెక్నాలజీనో! నచ్చిన వాళ్ల ముఖాలను, నచ్చిన చిత్రాలను గోళ్లపైన అప్లై చేసుకుంటూ రోజుకో నెయిల్ ఆర్ట్ మార్చుకోవచ్చు. కావాలంటే ఆ డిజైన్ మీద నచ్చిన స్టోన్స్ అతికించుకోవచ్చు. ఇలాంటి నెయిల్ ప్రింటర్స్ పెళ్లిళ్లు, ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. పైన చిత్రంలోని ప్రింటర్ 899 డాలర్లు (రూ. 63,947) కాగా.. చౌక ధరల్లో కూడా ఇలాంటి నెయిల్ ప్రింటర్స్ మార్కెట్‌లో లభిస్తాయి. అయితే అవి కాస్త చిన్నగా.. కొన్ని ప్రత్యేకతలను మాత్రమే కలిగి ఉంటాయి. కొన్నింటికి ‘మ్యానుఫ్యాక్చర్ ఇమేజ్ ప్లేట్స్’ మెషిన్‌తో పాటు లభిస్తాయి. వాటిని మెషిన్‌కి అమర్చుకుని.. రంగురంగుల నెయిల్ పాలిష్‌లు అందులో నింపుకుంటే ఆ ఇమేజ్‌లను గోళ్లపై ప్రింట్ చేస్తాయి. ఈ మేకర్స్‌లో కొన్ని చార్జర్‌తో, మరికొన్ని బ్యాటరీతో నడుస్తాయి. భలే ఉంది కదూ!
Comments
Please login to add a commentAdd a comment