సైకిల్‌ వాలాలేరి | Bicycle | Sakshi
Sakshi News home page

సైకిల్‌ వాలాలేరి

Published Sun, Apr 23 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

సైకిల్‌ వాలాలేరి

సైకిల్‌ వాలాలేరి

‘‘ట్రింగ్‌.. ట్రింగ్, నేను... సైకిల్‌ని. నా కర్మకాలి.. ఈ ఎదవ కింద పడ్డాను.. నాలాంటి అందాల సైకిల్‌ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలా..? మరి ఏం చేస్తున్నాడు వీడు.... టైమ్‌కి సర్వీసింగ్‌ కూడా చేయించకుండా తొక్కేస్తున్నాడు...’’ ఈ డైలాగ్‌ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు.. ‘మర్యాదరామన్న’ సినిమాలో సైకిల్‌ డైలాగేగా... బాగా గుర్తుంది అంటారా..? ’ హీరో ఇంట్రడక్షన్‌లో ఓ సీను.. రైల్వే స్టేషన్‌లో ఓ సీను.. లాస్ట్‌లో ఓ సీను’.. అంటూ సినిమా అంతా గుర్తు తెచ్చుకుంటు న్నారా? ‘‘బెల్‌ లేకపోయినా, బ్రేక్‌లు పని చేయకపోయినా.. చైన్‌ లూజ్‌ అయిపోయినా... టైర్లు అరిగిపోయినా... చక్రాలకు రెండు, మూడు ఊసలు విరిగిపోయినా... ‘‘సీటు, హ్యాండిల్‌ బాగానే ఉన్నంతకాలం ఏ సైకిల్‌నైనా అలానే వాడేస్తాం’’. అందుకే కాబోలు రాజమౌళి సైకిల్‌ బాధను సినిమాలో చూపించి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు.

ముసలిదై మూలన పడి...
నిజానికి నిదానంగా నడిచే ప్రపంచానికి పరుగు నేర్పించింది సైకిల్‌. సమయాన్ని, శ్రమను తగ్గించి సౌఖ్యాన్ని కూర్చింది. సుదూర గమ్యాలను సునాయాసంగా కాణీ ఖర్చు లేకుండా చేర్చే సైకిల్‌... కాల క్రమేణా పేదలకు, పెద్దలకు పల్లకిగా మారి ఓ వెలుగు వెలిగింది. కానీ, ప్రస్తుతం జెట్‌ స్పీడ్‌లో పరుగుతీసే జనాల వేగాన్ని అందుకోలేక.. పల్లెల్లో పొలం పనులకు వెళ్లే వారు, చదువుకునే పిల్లలు, చిన్నా చితకా పనులు చేసుకునే కూలీలు, వర్క్‌ఔట్‌లు చేసేవాళ్లు చేతుల్లో మాత్రమే ప్రస్తుతం సైకిల్‌ ‘ట్రింగ్‌.. ట్రింగ్‌..’ అంటోంది.

కిల్‌ అయిన సైకిల్‌
సామాన్యుడికి కొండంత అండగా ఉన్న సైకిల్‌ టైర్‌కి పంక్చరయ్యింది. చైన్‌ తెగిపోయింది. హ్యాండిల్‌ వంగిపోయింది. బెల్‌ ఊడిపోయింది, బ్రేకులు పాడైపోయాయి. చివరాఖరికి మూలన పడిపోయిన... సైకిల్‌ ఒకప్పుడు చరిత్రను ఏలింది. ఒకప్పుడు దొరలను మోసింది. మంత్రులను పార్లమెంటులో దించింది. కట్నంలా మారి పెళ్లికొడుకుల డిమాండ్‌ను కూడా విపరీతంగా పెంచేసింది.

200 ఏళ్ల వయసు
సైకిల్‌ పుట్టి ఒకటì , రెండు సంవత్సరాలు కాదు. ఏకంగా 200 ఏళ్లు పూర్తయ్యింది. జర్మన్‌ బారన్‌ కార్ల్‌ వాన్‌ డ్రైస్‌ అనే శాస్త్రవేత్త 1817లో జర్మనీలో సైకిల్‌ను రూపొందించారు. మొదట్లో సైకిల్‌కి  కిందSచైన్‌ కనెక్షన్‌ ఉండేది కాదు. ఎక్కి కూర్చుని కాళ్లతోనే నెట్టుకుంటూ ప్రయాణాలు చేసేవారు. 1870 నాటికి సైకిల్‌ చరిత్రలో వింత మోడల్‌ సంతరించుకుంది. సీట్‌ కింద టైర్‌ చాలా పెద్దదిగా, వెనుక ఉండే సపోర్టింగ్‌ టైర్‌ చాలా చిన్నదిగా ఉండి.. అప్పటి యువతరాన్ని బాగా ఆకట్టుకుంది.

ప్రపంచవ్యాప్తంగా శతకోటి సైకిళ్లు
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల సైకిల్స్‌ పైనే ఉండగా.... అందులో సింహభాగం చైనావే కావడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ 10 కోట్ల సైకిళ్లు  తయారవుతున్నాయని ఓ అంచనా.

రికార్డుల్లో సైకిల్‌
డచ్‌ సైక్లింగ్‌ సంస్థ సభ్యులు ప్రపంచంలోనే అతి పొడవాటి సైకిల్‌ తయారు చేసి గిన్నిస్‌ రికార్డును సృష్టించారు. ఏకంగా 35.79 మీటర్ల పొడవు ఉన్న ఈ సైకిల్‌ చూడటానికి బైక్‌లా కనిపిస్తుంది. ఇక ప్రపంచంలో అతి చిన్న సైకిల్‌ కూడా ఉంది. ఆటబొమ్మలా కనిపించే దీని పొడవు 7 అంగుళాలు మాత్రమే. తన తండ్రి తయారు చేసిన అంత చిన్న సైకిల్‌ను తొక్కి బాబీ అనే వ్యక్తి గిన్నిస్‌ రికార్డ్‌ సృష్టించాడు.

సైకిల్‌ రూట్‌
ప్రపంచ వ్యాప్తంగా సైకిల్‌ వాడకం ఎంత తగ్గిపోయినా.. ప్రత్యేకించి వాటినే వాడే వారికోసం స్పెషల్‌గా సైకిల్‌ పాత్‌లను కూడా నిర్మించాయి చైనా, జర్మనీ, అమెరికా వంటి కొన్ని దేశాలు.... రయ్‌ రయ్‌ మంటూ పరుగులు తీసే కార్లు, బైకులు, లారీలు, వ్యాన్లతో సంబంధం లేకుండా కేవలం సైకిళ్ల కోసం స్పెషల్‌ రోడ్లను, బ్రిడ్జ్‌లను సమకూర్చి ఔరా అనిపిస్తున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement