బ్లైండ్ రిలేషన్‌షిప్ | Blind Relationship | Sakshi
Sakshi News home page

బ్లైండ్ రిలేషన్‌షిప్

Published Sat, Oct 28 2017 10:48 PM | Last Updated on Sat, Oct 28 2017 10:57 PM

Blind Relationship

ఇప్పుడున్న టాప్‌ హీరోల్లో ఒకరైన స్టార్‌ నటించిన సినిమాలోని సన్నివేశాలివి. ఈ సినిమా దర్శకుడు ఈమధ్య కాలంలో నటుడిగానూ సూపర్‌ అనిపించుకుంటున్నారు. తెలుగు సినిమా రొమాంటిక్‌ కామెడీలకు ఒక కొత్త దారిని చూపించిన ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం!?

సిద్ధు, మధు.. ఇద్దరిదీ చూడముచ్చటైన జంట. కాలేజీలో ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసే కనిపిస్తారు. ఒకరంటే ఒకరికి పిచ్చి ఇష్టం. సిద్ధు అందరినీ ఫ్రెండ్‌.. ఫ్రెండ్‌.. అని పరిచయం చేయగలడు కానీ, మధును మాత్రం కేవలం ఫ్రెండ్‌ అని పరిచయం చేయలేడు. అతడికి తెలుసు.. మధు ఫ్రెండ్‌ కంటే ఎక్కువే అని. మధు కూడా అలా పరిచయం చేయడంలో సిద్ధు పడే ఇబ్బందిని గ్రహించి నవ్వుతుంది. ఆమెకూ తెలుసు సిద్ధు తనకు ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అని. ప్రేమా? ఎవ్వరూ ఆ విషయాన్ని ఒప్పుకోలేదు, చెప్పుకోలేదు కూడా. సరిగ్గా కాలేజీలో ఫైనల్‌ ఎగ్జామ్స్‌ దగ్గర పడే సమయానికి సిద్ధు, మధులకు ఒక గొడవ జరిగింది. అది చూడ్డానికి సిల్లీగానే అనిపించొచ్చు. సిల్లీ అయితే కాదు. గొడవలో మాటా మాటా పెరిగి, ఇద్దరూ మాట్లాడుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చేశారు. విడిపోయారు. సిద్ధు, మధు ఇప్పుడు ఫ్రెండ్స్‌ కూడా కాదు.పరీక్షలైపోయాయి. సెలవులు అయిపోయాయి. మళ్లీ కాలేజీ మొదలైంది. సిద్ధు, మధు ఎవరికి వారే అన్నట్టుగానే ఉన్నారు. ఒక విషయం మాత్రం వాళ్లను మళ్లీ మాట్లాడుకునేలా చేసింది. బాబు – శాంతిల ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. వాళ్లిద్దరూ కలవాలంటే, వీళ్లిద్దరూ కలవాలి.

యూనివర్సిటీలో మధు ఎదురైనా, ఆమెను పట్టించుకోకుండానే ముందుకు కదిలాడు సిద్ధు.   అలా వెళ్లిపోతున్న సిద్ధును, ‘‘సిద్ధు..’’ అని పిలిచి ఆపింది మధు.      ‘ఏంటి?’ అన్నట్టు చూశాడు సిద్ధు. ‘‘నేన్నీతో రాజీపడటానికి వచ్చానని తప్పుగా అనుకోకు.’’ మధు మాట్లాడటం మొదలుపెట్టింది. ‘‘రాజీ పడటం తప్పని ఎవరన్నారు?’’ సిద్ధు. ‘‘ఇలాచూడూ.. నీతో.. సారీ.. మీతో.. ఆర్గ్యుమెంట్‌కి రాలేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను. ఈ టు మంత్స్‌ సమ్మర్‌ హాలీడేస్‌లో మనం ఊరికెళ్లినప్పుడు ఇక్కడ ఏమేమో జరిగాయి. బాబు శాంతిని చూడటానికి వాళ్లింటికి వెళ్లి శాంతి అనుకొని వాళ్ల నాన్నను లేపి దొరికిపోయాడు. శాంతిని వాళ్ల నాన్న హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బాబు క్లాస్‌కి వచ్చాడా?’’ చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తూ అడిగింది మధు. సిద్ధుపై కోపం ఆమెకు ఏమాత్రం తగ్గలేదు.‘‘రాలేదే?’’ ‘‘మనం పెంచిన లవ్‌. ఇప్పుడు ప్రాబ్లమ్‌లో ఇరుక్కుపోయింది.’’ సిద్ధు ఆ మాటకు ఎలా రియాక్ట్‌ అవుతున్నాడో చూస్తోంది మధు. తన మాటను వెంటనే సరిచేస్తూ, ‘‘ఐ మీన్, బాబు – శాంతిల లవ్‌ గురించి మాట్లాడుతున్నాను’’ అంది. ‘‘శాంతిని చూశావా? సారీ.. చూశారా?’’ సిద్ధు పెద్దగా ఆసక్తి చూపనట్టుగానే అడిగాడు.

‘‘నేనిప్పుడు అక్కణ్నుంచే  వస్తున్నాను. శాంతి కుమిలి కుమిలి ఏడుస్తోంది. నిన్ను, బాబును కలిపే బాధ్యత నాదని చెప్పొచ్చాను. ఆ విషయం గురించే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు కూడా మీ ఫ్రెండ్‌కి ప్రామిస్‌ చేశారు. సో, నేను నా ఫ్రెండ్‌కు చేసిన ప్రామిస్‌ కోసం.. మీరు మీ ఫ్రెండ్‌కు చేసిన ప్రామిస్‌ కోసం మనిద్దరం కలిసి..’’ అంటూ సిద్ధును చూస్తూ మాట్లాడ్డం ఆపేసింది మధు.సిద్ధు సిగరెట్‌ వెలిగిస్తున్నాడు. అంతకు కొన్ని రోజుల ముందరే మధు కోసం సిగరెట్‌ మానేశాడు సిద్ధు. ఇప్పుడు మళ్లీ వెలిగించడం ఆమెకు చిరాకు తెప్పించింది.మధు అలా చూస్తూ ఉండటం గమనించిన సిద్ధు,‘‘కలసి?’’ పూర్తి చేయమన్నట్టు అడిగాడు.‘‘కలసి.. కలసి వాళ్లిద్దరినీ కలపాలి.’’ కోపాన్ని దాచుకుంటూనే, బాధను బయటపెడుతూనే చెప్పింది మధు.‘‘మనిద్దరం కలసి అన్నాను చూడండీ.. ఆ విషయంలో మనం కొంచెం కరెక్ట్‌గా ఉండాలి.’’ కొంచెం గట్టిగా, కోపాన్నంతా దాచుకుంటూ చెప్పింది మధు.‘‘మనిద్దరం కలసి తిరగబోయే రోజుల్లో మన మధ్య ఉండేది ఎలాంటి సంబంధమో ఇప్పుడే మనం నిర్ణయించుకోవాలి’’ మధు మాట్లాడుతూ పోతుంటే సిద్ధు ఏదీ పట్టనివాడిలా సిగరెట్‌ పొగను గాల్లోకి వదులుతున్నాడు.‘‘అది స్నేహం కాదు. ప్రేమ కాదు. వేరే ఏ సంబంధమూ కాదు. జస్ట్‌ ఓ గుడ్డి సంబంధం. ఎ బ్లైండ్‌ రిలేషన్‌షిప్‌. ఎ రిలేషన్‌షిప్‌ విచ్‌ హాజ్‌ నో మీనింగ్‌. ఆ సంబంధం కూడా వాళ్లిద్దరూ కలిసేవరకే!’’ సిగరెట్‌ పొగను గట్టిగా పీల్చి వదిలాడు సిద్ధు.   ‘‘నేను చెప్పినట్టు మీరుంటారని ఆశిస్తున్నాను. నడుచుకుంటారని నమ్ముతున్నాను’’ ఆ మాటతో ముగించింది మధు.‘‘నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, మీరూ అదే చెప్పారు.’’ మధు మాట్లాడటం ఆపేసిన కొన్ని సెకండ్లకు సిద్ధు నోరు విప్పాడు.

కొన్ని నిమిషాల తర్వాత. ఒంటరిగా పార్క్‌లో ఓ బెంచీపై కూర్చున్న బాబును కలిసేందుకు వచ్చారు మధు, సిద్ధు. బాబును చూడ్డమే, ‘‘ఆ గడ్డమేంట్రా?’’ అంటూ గట్టిగా నవ్వాడు సిద్ధు. మధు.. సిద్ధును కోపంగా చూస్తూ నిలబడింది. ‘‘ఆ.. అందుకే.. అందుకే ప్రేమ, దోమాలాంటి తొక్కలో కమిట్‌మెంట్స్‌ పెట్టుకోకూడదు. ఇప్పుడు నన్ను చూడు.. ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత ఉల్లాసంగా ఉన్నానో.. ఎందుకంటే నేనెవర్నీ లవ్‌ చేయలేదూ.. ఏ సమస్యలోనూ ఇరుక్కోలేదు.. నీలాగా..’’ అంటూ మరింత గట్టిగా నవ్వాడు సిద్ధు. ఇంక కోపాన్ని దాచుకోలేకపోయిన మధు, ‘‘సిద్ధు.. మనసులో బాధను ఉంచుకొని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం, చూడ్డానికి అసహ్యంగా ఉంది’’ అంది కోపాన్ని బయటపెడుతూ. ‘‘ఏంటీ?’’ అన్నాడు సిద్ధు. ‘‘ఐ మీన్‌.. బాబు కోసం నువ్‌ లోలోన పడుతున్న బాధను గురించి చెప్తున్నాను.’’ మధు మాటలకు కొన్ని సెకండ్లు ఆగిపోయి మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు సిద్ధు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement