సమీక్షణం : ప్రకృతి హిత పోరాటం | Book review | Sakshi
Sakshi News home page

సమీక్షణం : ప్రకృతి హిత పోరాటం

Published Sun, Aug 18 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

Book review

 పేజీలు: 176 వెల: 80
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు
 పుస్తకం    :    ఆకుపచ్చ విధ్వంసం
 జానర్    :    ఫిక్షన్/నవల
 రచన    :    శిరంశెట్టి కాంతారావు
 విషయం    :    శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, పలాస ప్రాంతాల్లోని పచ్చని బీల భూముల్ని విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణానికి ధారపోయడంతో, చుట్టుపక్కలున్న 18 గ్రామాల ప్రజానీకం ‘ప్రాకృతిక సమతౌల్యం కాపాడే, తమ జీవనాధార భూముల్ని రక్షించుకోవడం కోసం ఉద్యమం చేశారు. ఆ వాస్తవ సంఘటనకు కాల్పనిక రూపమే ‘ఆకుపచ్చ విధ్వసం’. కథకుడు కాంతారావు తొలి నవల ఇది.
 సామ్రాజ్యవాద దండయాత్రలో భాగంగా రాష్ట్రాలను, దేశాలను అప్పుల ఊబిలోకి నెడుతూ ప్రజలను రాజకీయ, ఆర్థిక, సైనిక అవసరాలు తీర్చే బంట్లుగా మార్చే గ్లోబల్ కుట్రలకు సజీవ సాక్ష్యం ఇది.
 చట్టబద్ధ వనరుల దోపిడీలో పాలకులే దళారులుగా మారే దౌర్భాగ్యాన్ని, పరిశ్రమల పేరు చెప్పి అమెరికన్ నిర్మాణ రంగ సంస్థల ఖజానాను నింపడానికి ప్రజల ప్రాణాల్ని పునాదులుగా చేయటాన్ని గుర్తించిన ప్రజల ధర్మాగ్రహ పోరాటం ఇది.
 ఎండమ్మ లాంటి సాధారణ స్త్రీ కూడా అపర కాళికలా తిరగబడి కన్నబిడ్డల్ని కోల్పోయినా చెక్కుచెదరని ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.
 నవల ఆసాంతం చదివించేలా సాగి ప్రజాగ్రహంతో పాఠకుల్ని మమేకమయ్యేలా, వనరుల దోపిడీ పట్ల జాగరుకత కలిగించేలా సాగిన రచన ఇది.
 - మీరాసాహెబ్
 
 ఆమె చుట్టూ తిరిగే కథలు
 పేజీలు: 154 వెల: 90
 ప్రతులకు: రచయిత్రి,
 8-3-168/20/16, సిద్ధార్థ నగర్ నార్త్,
 హైదరాబాద్-38; ఫోన్: 040-23713744
 
 పుస్తకం    :    కొత్త కథ చెప్పవూ?
 రచన    :    స్వర్ణ ప్రభాతలక్ష్మి
 
 విషయం    :    ఇందులోని కథలన్నీ(21) చాలావరకు స్త్రీల కథలే కాని, స్త్రీవాద కథలు కాదు. స్త్రీ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోను ఎదుర్కొనే సమస్యలకు కథల రూపమిచ్చారు.
 కాసింత ప్రేమకే కరిగిపోయి ఆడది కాటికెళ్లేదాక, కనిపెట్టుకుంటుందన్న స్త్రీ ప్రేమతత్వాన్ని నిలువుటద్దంలో చూపిస్తుంది ‘ఇది ఇంతే’. ఇగోయిజం తప్ప మరో యిజంతో సంబంధం లేని వ్యక్తులతో వారి ఇజానికి దెబ్బతగలకుండా సహనంతో సంసారాన్ని నెట్టుకొచ్చే స్త్రీలకు ప్రతీకలుగా ‘అప్పుడప్పుడు’లో నళిని, ‘అద్దానికి అవతలి వైపు’లో సంఘమిత్ర దర్శనమిస్తారు. తనకు కాబోయే భర్త గుణగణాలను నేర్పుతో పరీక్షించే స్త్రీలుగా ‘అనుభవం’లో మోహనప్రియ, ‘శ్రుతి తప్పిన రాగం’లో సౌమ్య కనిపిస్తారు. నరమృగాలు తిరిగే ఈ జనారణ్యంలో స్త్రీల బాల్యం ఎలా నలిగిపోతుందో ‘కొత్త కథ చెప్పవూ?’లో కన్పిస్తుంది.
 - డా॥జి.పద్మప్రియ
 
 ఒక కోటమ్మ పోరాటం
 పేజీలు: 198 వెల: 120
 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు
 పుస్తకం    :    ముద్ర
 జానర్    :    ఫిక్షన్/నవల
 రచన    :    డా॥వి.ఆర్.రాసాని
 విషయం    :    రచయిత రాయలసీమ ప్రాంతంలో ఉన్న బసివినీ దురాచారాన్ని నిశితంగా పరిశీలించి, బాధితులైన స్త్రీల విదారక గాథలను విని చలించి రాసిన సంస్కరణాత్మక నవల ఇది. బుడ్డెమ్మ, కోటమ్మ వంటివారి విషాద గాథలు కంటతడి పెట్టిస్తాయి. ఆచారానికి తలొంచిన కోటమ్మ, తిరిగి అదే ఆచారానికి విరుద్ధంగా  బిడ్డను కన్నది. ఆ ఊరి స్త్రీలలో చైతన్యాన్ని రగిలించి, బసివినీ వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం చేసిన కోటమ్మ ఈ నవల్లో ధీర నాయిక.
 శైలి: కన్నడ, హిందీలోకి కూడా అనువాదమైన ఈ నవలను ప్రథమ పురుష కథనంతో, రాయలసీమ మాండలికంలో, సజీవ పాత్ర చిత్రణతో తీర్చిదిద్దాడు రచయిత.
 - డా॥పి.వి.సుబ్బారావు
 
 కొత్త పుస్తకాలు
 కోస్తాంధ్ర కవిత్వంలో ప్రాంతీయ చైతన్యం
 (2000-2010)
 రచన: ఆల్సి నాగేశ్వరరావు
 పేజీలు: 144; వెల: 80; ప్రతులకు: రమ్యభారతి, సాహిత్య త్రైమాస పత్రిక, 1-4/3-36, సంజయ్ గాంధీ కాలనీ, విద్యాధరపురం, విజయవాడ-12
 డా.కోట్నీస్
 ఆంగ్లం: జాంగ్ షెన్
 తెలుగు: గుండా సత్యనారాయణ రెడ్డి
 పేజీలు: 154; వెల: 100; ప్రతులకు: పోరునేల, 201, వినమ్రత క్లాసిక్స్, అల్కాపురి, హైదరాబాద్-35.
 ఖడ్గం కన్నీరు కార్చదు (కవిత్వం)
 రచన: మాదిరాజు రంగారావు
 పేజీలు: 54; వెల: 50
 ప్రతులకు: నవోదయా బుక్ హౌజ్, ఎక్స్ రోడ్స్, కాచిగూడ, హైదరాబాద్-27.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement