మగాళ్లు చెడ్డవాళ్లేం కాదు!
ఇంటర్వ్యూ
కాన్ఫిడెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది నిత్యామీనన్. దాపరికాలు లేకుండా ఏ రహస్యాన్నయినా విప్పి చెబుతుంది. నదురూ బెదురూ లేకుండా ఏ అభిప్రాయాన్నయినా కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడిస్తుంది. తన దగ్గర వేషాలేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తానంటూనే, మగవాళ్లందరూ చెడ్డవాళ్లేమీ కాదంటూ నమ్మకాన్ని వ్యక్తపరుస్తోన్న నిత్య మనోభావాలు...
మొదటిసారి మేకప్ వేసింది..?
ఎనిమిదేళ్ల వయసులో. మా ఇంటి పక్కన ఓ ఫొటోగ్రాఫర్ ఉండేవారు. ఆయన నా ఫొటో ఒకటి తీసుకుని తన యాడ్ ఏజెన్సీలో పెట్టారు. అది ఓ డెరైక్టర్ చూసి ఫోన్ చేశారు. తను తీయబోతోన్న ఇంగ్లిష్ సినిమాలో టబుకి చెల్లెలిగా నన్ను తీసుకుంటానన్నారు. మొదట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు కానీ నేను సరదా పడటంతో ఓకే అన్నారు. అలా ‘హనుమాన్’ సినిమాతో యాక్టర్‌ని అయిపోయా!
నటిగా సెటిలవ్వాలని అప్పుడే ఫిక్సైపోయారా?
లేదు. మా కుటుంబాల్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అందుకే నా దృష్టీ చదువుపైనే ఉండేది. మాస్ కమ్యునికేషన్స్ చదివి కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేశా. కానీ ఆ ఫీల్డ్ నాకు సరిపడదనిపించి మానేశా.
మరి ఈ ఫీల్డ్ మీకు సరిపడిందా?
ఊహూ... నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని ఎన్నోసార్లు అనిపించింది. ఈ ఫీల్డ్‌లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. ఓ మంచి పాత్ర చేసినప్పుడు సంతోషంగా ఉంటుంది. కానీ సెలెబ్రిటీ స్టేటస్ విసు గనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దొంగచాటుగా ఫొటోలు తీయడం, మా గురించి ఏవేవో ఊహించి ప్రచారం చేయడం నాకు నచ్చదు. అలాగే మేము తమతో క్లోజ్‌గా ఉండాలని కొందరు ఆశిస్తారు. అలా చేయకపోతే మంచి అమ్మాయి కాదంటూ ముద్ర వేసేస్తారు. అయినా నేను నాకు నచ్చినట్టే ఉంటాను.
మీరు యారొగెంట్ అనేది అందుకేనా?
ఏమో. నిజానికి నేను పొగరుగా ఉండను. స్ట్రిక్ట్‌గా ఉంటాను. అమ్మ, నాన్న ఉద్యోగస్తులు. నాతో రాలేరు. నా మేనేజర్ కూడా నాతో ఉండడు. అలాంటప్పుడు నా గురించి నేనే జాగ్రత్త తీసుకోవాలి కదా! అందుకే ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే ఊరుకోను. లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను. అది యారొగెన్సీ కాదు. మంచి విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా నిర్భయంగా చెప్పేయాలి. లేదంటే మనల్ని మనమే తక్కువ చేసుకున్నవాళ్లం అవుతాం.
ఎక్కువగా లేడీ డెరైక్టర్స్‌తో పని చేస్తారు... సేఫ్టీ కోసమా?
అంజలీ మీనన్, నందిని, అంజు, శ్రీప్రియ లాంటి మహిళా దర్శకురాళ్లతో పని చేసే చాన్స్ అనుకోకుండానే వచ్చింది తప్ప నేను కావాలని వాళ్లని ఎంచుకోలేదు. అయినా నేనింత వరకూ పనిచేసిన వాళ్లలో ఏ మేల్ డెరైక్టర్, యాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మగాళ్లంతా చెడ్డవాళ్లు కాదుగా!
గ్లామర్ పాత్రలు చేయరేం?
నాకు సౌకర్యవంతంగా అనిపించనిదేదీ నేను చేయను. అందుకే కథ వినేటప్పుడే సీన్ల గురించి, కాస్ట్యూమ్స్ గురించి క్లియర్‌గా మాట్లాడేసుకుంటాను.
అలా అయితే అవకాశాలు తగ్గవా?
నాకు తగ్గలేదుగా! ఓ పాత్రకి నేనైతేనే సరిపోతాను అనుకున్నప్పుడు దర్శకులు నా దగ్గరకే వస్తున్నారు. వేరే వాళ్లకి ఇవ్వట్లేదుగా!
లావుగా ఉంటారని... పొట్టి అని?
(నవ్వుతూ) నేను ఫిజిక్‌ని మెయిం టెయిన్ చేయను. అందుకే కాస్త లావుగా ఉంటాను. నటన కోసం తిండిని త్యాగం చేయడం పిచ్చితనం అనిపిస్తుంది నాకు. ఇక హైట్ సంగతి. పొడవు, పొట్టి, అందం... ఇవన్నీ ఇచ్చేది దేవుడు. ప్రవర్తన సరిగ్గా లేకపోతే విమర్శించాలి గానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు.
పెళ్లెప్పుడు?
ఇతనితో నా జీవితం ఇప్పటికంటే బాగుంటుంది అనుకోదగ్గ వ్యక్తి ఎదురు పడినప్పుడు. తగనివాణ్ని చేసుకుని బాధపడే బదులు, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే మంచిది.
ఇంతవరకూ అలాంటి వ్యక్తి ఎదురు పడలేదా?
లేదు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓసారి ప్రేమలో పడ్డాను. కానీ అతనితో జీవితం అంత గొప్పగా ఉండదనిపించి విడి పోయాను. తర్వాత ఎప్పుడూ ఎవరినీ ప్రేమించలేదు. చూద్దాం... మళ్లీ నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుందో!
ఫన్‌డే మీద మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయండి. ప్రియదర్శిని రామ్, ఎడిటర్, ఫన్‌డే, సాక్షి దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com