సృజనం: అదే - ఇది | Chakrathanam yugander writes a story line with attention | Sakshi
Sakshi News home page

సృజనం: అదే - ఇది

Published Sun, Nov 10 2013 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

సృజనం: అదే - ఇది

సృజనం: అదే - ఇది

‘‘ఏం చేయమంటావు రవి పాత్రను?’’ అని మా అన్నని అడిగాను. ‘‘చంపెయ్’’ అన్నాడు. మొదట్లో నాకది కరెక్ట్ అనిపించింది. కానీ, కుటుంబం కోసం బతికే ప్రకాష్ గుర్తుకు వచ్చాడు.
 
 ‘‘నేను రచయితని!’’  ‘‘ఏం కూశావురా!’’ అని నాన్న అనినా, ఈ భావం నా మనస్సులో బలంగా నాటుకుపోయింది.
 నా పిచ్చి రాతలకు పైసా రాకపోయినా పర్లేదు, ఒకటైనా రాయాలి. నాకా పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇప్పటివరకు జీవితం మొత్తం మీద పాఠ్యపుస్తకాలు కాకుండా, చదివింది ఒకే ఒక పుస్తకం. కానీ, ఎప్పుడూ చదువుతూనే ఉంటాను. పేపర్లు, వారపత్రికలు లాంటివి. సర్లే ఈ పురాణం అంతా ఎందుకు? నేరుగా రాయడానికి వెళ్లిపోదాం రండి!
 
 నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఉన్నాడు. పేరెందుకు లెండి! ఒకరోజు ఫోన్ చేసి వాడి కష్టాలు చెప్పి, నాకు కన్నీళ్లు తెప్పించాడు. ఆ కష్టమే నా కథ చదివేవారికి కలగాలని వాడి పాత్రకు నా ఆలోచనలు తగిలించి, వాడినే ముఖ్య పాత్రను చేశాను. ఆ పాత్రకు రవి అని నామకరణం చేశాను. రవి అనే పేరే ఎందుకు? రవి అంటే సూర్యుడు. కుర్రాడు ఎప్పుడూ ఉదయించే సూర్యుడిలా ఉండాలనీ, అలా ఎప్పటికీ ఉండిపోవాలని, ఈ పేరు పెట్టాను.
 
 పేరుకే పిచ్చెకించేశాను కదా! నా ఫ్రెండ్ మూడుపూటలా వేరు వేరు చోట్ల పనిచేసేవాడిని అని చెప్పాడు. కానీ, ఎక్కడెక్కడ చేస్తున్నాడో చెప్పలేదు. వాడు చెప్పకపోతే ఏం? నేను రవిని ఉద్యోగంలో చేర్పిస్తాను.
 నేను రోజూ వెళ్లే ఇంటర్నెట్‌లో పనిచేసే కుర్రాడు గుర్తుకు వచ్చి, ఒక షిఫ్ట్‌కి రవిని ఇంటర్నెట్‌లో చేర్చాను. మరి సినిమా హాలూ! నాకు విపరీతంగా నచ్చేది సినిమా, సినిమా హాలే. కాబట్టి రవిని హాల్లో టికెట్లు చించే పనిలో చేర్పించాను. రవి కీతా పని అనుకుంటాడేమో అని ‘ఐమ్యాక్స్’లో చేర్పించాను. వద్దు వద్దు రవిగాడికి పొగరెక్కిపోద్ది. పేరు లేని హాల్లో, చెప్పుకోలేని జీతంతో తోసేశాను. మరి మూడో షిఫ్ట్. దీని కోసం చాలా ఆలోచించా!
 
 ఒకరోజు మా పెద్దనాన్న కొడుకుతో రోడ్డుమీద నడుస్తున్నాను. నాకు వరుసకు వాడు అన్నే అయినా, ఏ రోజూ వాడిని ‘అన్నా’ అని పిలిచిన పాపాన్ని మూటగట్టుకోలేదు. ఆ అంగడీ, ఈ అంగడీ తిరిగి ఏం కొనకుండా బాగా అలసిపోయాం. టిఫిన్ తినాలని వాడు అనడంతో నీరసంగా ఉన్న నాకు కొంత ఉత్సాహం వచ్చింది. మేము నడిచే వీధిలోనే ఒక టిఫిన్ అంగడి ఉంది. పెద్ద హోటల్ కాకపోయినా, అక్కడి నెయ్యి దోశ తింటే నాలుగేళ్లు మర్చిపోలేరు. ఒకసారి నా ఫ్రెండ్‌తో అక్కడికి వెళ్లాను. ఇన్నేళ్లు ఇదే ఊరిలో ఉన్నా, అక్కడ తిననందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. మళ్లీ అక్కడ తినడం అనే ఆలోచనతో తొందరగా హోటల్ దగ్గరకు చేరుకున్నాం. నేను హోటల్ లోపలికి వెళ్లబోతుంటే, అన్న మాత్రం నేరుగా నడుచుకుంటూ హోటల్ దాటి వెళ్లడం చూసి, నేను అన్న దగ్గరకు వెళ్లి,
 ‘‘ఏమయ్యా?’’ అన్నాను పరిస్థితి అర్థం కాక.
 ‘‘అక్కడ వద్దులే. ఇంకో దగ్గరకు వెళ్దాం’’ అన్నాడు హోటల్ వైపు చూపిస్తూ.
 ‘‘ఇక్కడ నెయ్యి దోశ అదిరిపోద్ది తెలుసా?’’ అని నోట్లో ఊరుతున్న లాలాజలాన్ని మింగేశాను.
 ‘‘అక్కడ నా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. బాగుండదు, వద్దులే’’ అన్నాడు.
 వెంటనే నాకు నా సొంత అన్న గుర్తుకు వచ్చాడు. కొన్ని రోజుల క్రితం వాడు కూడా ఇలానే అన్నాడు. అప్పుడు ఏమనకపోయినా, ఈసారి మాత్రం కోపం పొడుచుకొచ్చింది.
 ‘‘ఓహో! ఫ్రెండ్ పనిచేసే దగ్గర తింటే నామోషి కదా!’’ అన్నాను వ్యంగ్యంగా.
 ‘‘నామోషియా! నా తలకాయా! ఫ్రెండ్ పనిచేసే దగ్గరకు వెళ్లి, వాడినే చెట్నీ వెయ్యి, సాంబారు పొయ్యి అని ఎలా అడగను? వాడి టైమ్ బాగలేక ఇలా చదువు మానేసి పనికి కుదిరాడు.’’
 ఆ సమాధానం నాకు చాలా తేడాగా అనిపించింది. అలాంటి సందర్భాల్లో మనం నామోషీగా ఫీల్ అవుతుంటాం. కానీ ఎదుటివాడు ఏం అనుకుంటాడు అని ఆలోచించం! అంతే, వెంటనే ఇంటికి వచ్చి రవిని మూడో షిఫ్ట్ కింద హోటల్లో చేర్పించి, వాడికి ఈ సన్నివేశాన్ని జతచేశాను. హాల్లో ఒకణ్ని పరిచయం చేసుకుని మరీ, రిలీజ్ సినిమాకు టికెట్ సంపాదించేవాడిని. నాలాగే రవి స్నేహితులు రవిని ఉపయోగించుకునేటట్లు చేశాను. రవితో పాటు పనిచేసేవాళ్లు టికెట్లను డబ్బుకు అమ్ముకున్నా, రవికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు. మరి హీరో పాత్ర అన్నాక, ఆ మాత్రం మంచి లక్షణాలు లేకపోతే ఎలా?
 
 చదివిన బీటెక్ చదువుకు సరిపడేలా ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నాలు కూడా చేసేవాడు రవి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్వ్యూ ఉంటే, చేసే పనికి సెలవు పెట్టడం, వెళ్లి రావడం, ఉద్యోగం రాకపోవడం చాలా తొందరగా జరిగిపోయేవి. ఒక మంచి రోజున, రవి ఇంటర్నెట్‌లో తన ముందు షిఫ్ట్‌లో పనిచేసే కుర్రాడితో చెప్పడం, వాడు ‘‘ఎన్నిసార్లు చెప్తావురా?’’ అన్న మాటతో రవి గాలి తీసేట్టు చేశాను. ఇంత చేసినా, రాసినా నాకు తృప్తి లేదు. ఇప్పటివరకు జరిగిన వాటిలో బాధపడటానికి ఏమీ లేదు అని తెలుసుకున్నాను. మళ్లీ ఆలోచనలో పడ్డాను. మొదటి నుండి కష్టాలు పడేవాడిని చూస్తే ఎవరికీ జాలి కలగదు అన్న విషయాన్ని గ్రహించి, కొన్ని మార్పులు చేశాను.
 
 రవికి మొదట్లో ఇంట్లో నుండే డబ్బు వచ్చేది. అది చాలక, జల్సాల కోసం ఇంకా ఎక్కువ అడిగేటట్టు చేశాను. ఇంట్లో వాళ్లు లేవనడంతో ఇంటర్నెట్‌లో మూడు గంటలు పనిచేసేవాడు. ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వాటికి వెళ్తూ, స్నేహితులతో కలిసి హైదరాబాద్ మొత్తం తిరిగేటట్టు చేశాను. ఇలాంటి సందర్భంలో రవికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చేటట్టు చేసి, జాయినింగ్ మూడు నెలల తర్వాత పెట్టించాను. ‘రవిగాడు బాగా కష్టపడుతున్నా’డని ఇంటర్నెట్ ఫ్రెండ్ ఫీల్ అయ్యి, ‘‘ఎందుకు మామా కష్టపడతావు? ఇంటికెళ్లి జాయినింగ్ అప్పుడు రా’’ అని నీరసంగా అనేలా చేసి సంతోషపడ్డాను. ఇలాంటి సమయంలో రవికి ఒక పెద్ద షాక్ తగలాలి. అప్పుడే కిక్. అందుకని రవి కుటుంబాన్ని అప్పులపాలు చేశాను. సరిగ్గా ఇంటికి బయలుదేరుతున్న సమయంలో రవికీ అతని అంకుల్ సుబ్రమణ్యానికీ జరిగే సంభాషణలో, ‘‘నేను ఇచ్చిన డబ్బుతో చదువుకున్నావ్, నిజం చెప్పాలంటే నేనే నిన్ను చదివించాను. అలాంటిది కనీసం వడ్డీ కూడా కట్టవా?’’ అని అనిపించాను.
 
 ‘సంఘ సేవ చేసినవాడు మాట్లాడినట్లు మాట్లాడి, మళ్లీ వడ్డీ అడుగుతున్నాడు దొంగ సచ్చినోడు’ అని రవి మనస్సులో అనుకున్న మాట, ఈ ప్రపంచంలో నుంచే పుట్టింది. ఇది నాకు చాలా నచ్చి రాశాను.  ఒకరోజు నా ఫ్రెండ్ ప్రకాష్ నన్ను కలిసినప్పుడు, తను చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం తనకు ఇష్టం లేదని చెప్పాడు. వాడు, పాపం ఆ ఉద్యోగం సంపాదించడం కోసం చాలా కష్టపడ్డాడు. రాత్రి, పగలు అని తేడా లేకుండా చదివాడు. ప్రకాష్ కలిసిన తర్వాతి రోజే పేపర్లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చదివాను. దానికి కారణం తన బోరింగ్ లైఫే అన్న ఆ కుర్రాడి సూసైడ్ నోట్, ఈ కథ క్లైమాక్స్‌కు నాంది పలికింది.
 
 నేనంటే తేడాగా ఆలోచించి రచయితను కావాలనుకున్నాను. కానీ, నేను సృష్టించిన రవి పాత్రకు అంత సీన్ లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచం ఒకేలా నడుస్తోంది. డిగ్రీ చేయడం, ఉద్యోగంలో ఇరుక్కుపోవడం, రవిని కూడా అలాగే తయారుచేశాను. చాలా కష్టాలు పడి మూడు పూటలా పనిచేసి నెలనెలా వడ్డీ కట్టడం కోసం ఇంటికి డబ్బులు పంపించేవాడు. అలా జరిగిన మూడు నెలల తర్వాత, ఒక మంచి రోజున ఉద్యోగంలో చేరాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హోదా వచ్చేసింది రవికి. సారీ, వచ్చేలా చేశాను. వారం రోజులు ఏ పనీ చెప్పకపోవడంతో రవికి భయం పట్టుకుంది. ‘ఎక్కడ తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తారో’ అని. కానీ నేను అలా చేయలేదు. వారం తర్వాత రవికి ప్రాజెక్ట్ మేనేజర్ చేత పని చెప్పించాను. ఒక మూడు, నాలుగుసార్లు తప్పుగా చేశాక, తిట్లు తిన్నాక, కరెక్ట్‌గా చేశాడు.
 
 రోజూ ఉదయాన్నే ఎనిమిదికి బయలుదేరి, ఆఫీస్‌కి వెళ్తే, తిరిగి ఇంటికొచ్చేది రాత్రి తొమ్మిదికే. ఎన్ని రోజులు గడిచినా ఆఫీస్‌లో ఎవ్వరూ స్నేహితులు కాలేదు. రవిని చాలా మూడీ ఫెలోగా తీర్చిదిద్దాను. ఏ పని చేసినా ఆసక్తి ఉండదు. దాంతో ఎప్పుడూ ఎవరితో మాట్లాడకుండా, మూలన ఉన్న తన క్యాబిన్ దగ్గర కూర్చొని పని చేసుకునేవాడు. చిన్నప్పటినుండి జనాలు పరిగెత్తితే పరిగెత్తడం, పడుకుంటే పడుకోవడం, ఇంతే తప్ప తనకు ఒక ఇష్టం ఉందని కూడా గ్రహించలేనివాడు రవి. ఒంటరిగా రూమ్‌లో కూర్చొని బుక్ ముందు పెట్టుకుని కాసేపు చదివి, తర్వాత జుట్టు పీక్కొని, బుక్‌ని విసిరికొట్టిన సంఘటనలు రవి జీవితంలో చదువుకునేటప్పుడు ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి. ఇవన్నీ భరించలేక ఒకరోజు ఆఫీస్ బిల్డింగ్ పైకి ఎక్కాడు. ఒక్కడుగు వేస్తే వీటన్నిటికీ దూరంగా వెళ్లిపోవచ్చు.
 
 ‘‘ఏం చేయమంటావు రవి పాత్రను?’’ అని మా అన్నని అడిగాను. ‘‘చంపెయ్’’ అన్నాడు.
 మొదట్లో నాకది కరెక్ట్ అనిపించింది. కానీ, కుటుంబం కోసం బతికే ప్రకాష్ గుర్తుకు వచ్చాడు.
 ‘‘రవిని చంపి నేను హంతకుడిని కాలేను.’’ రవి మేడమీద నిలబడి కళ్లు మూసుకున్నాడు. అమ్మ, చెల్లెలు గుర్తుకువచ్చి, ఆ అడుగుని వెనకకు వేశాడు. ఆ తర్వాత నుంచి రవి రోజూ బతుకుతూ చస్తున్నాడు.
 నా కథ పూర్తయింది. పత్రికకు పంపి చాలా రోజులు ఎదురుచూశాను. లాభం లేదు. మళ్లీ రాయాలనుకున్నాను. కానీ, రవి కథ చాలా మంచిదే! అందుకే ఒక ఆలోచన వచ్చింది. రవి పాత్రను అలాగే ఉంచి, కథనంలో మార్పు చేశాను. పనిచేయడం, ఉద్యోగం కోసం వెతుకులాట, చివరికి బతకడం అన్నీ అలానే ఉంచి, ఇలా రాశాను. ఇప్పటివరకు మీరు చదివిన ఇదే - అది.
 - చక్రతానం యుగంధర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement