srujanam
-
సృజనం: ఆదాం సమాధి
నా వెనుక నిలబడి వాటినే చూస్తూ, ‘‘మడుసుల ఊహకు అందవు దేవుని క్రియలు’’ అన్నాడు మామయ్య. నేను గ్లాసు కిందపెట్టి వెళ్దామని లేచాను. ‘‘ఒరేయ్! ఓ నలుగురు పోయి ఆ సమాధి సంగతి సూడండి’’ పురమాయించాడు మా కుల పెద్ద. దూరం నుంచి రావాల్సిన మేము పొద్దున్నే వచ్చేశాం కాబట్టి పనులు ఊపందుకున్నాయి. అప్పుడే మా పిన్ని పోయి రెండోరోజు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎక్కడ తవ్వాలి అని చర్చ మొదలైంది. ‘‘తూర్పేపున నాయినమ్మ, తాతయ్యలను ఏసిన చోట తవ్వండి’’ మావాళ్లెవరో అన్నారు. ‘‘అక్కడ నేల మరీ చిత్తడిగా ఉంటాది. దక్షిణేపున ఆ ఆదాంగాడి సమాధికి ఎదురుగుండా తవ్వండి. రేపు కొడుకులు సమాధి కట్టిత్తే బాగా ఉంటాది’’ ఇంకెవరో చెప్పారు. అలా నేను మొదటిసారి ఆ సమాధి గురించి విన్నాను. కానీ అప్పటి పరిస్థితుల్లో పెద్దగా పట్టించుకోలేదు. పదకొండు గంటల వేళ చర్చిలో ప్రార్థనలు ముగించి, ఆనుకొనే ఉన్న సమాధి స్థలానికి పెట్టె తీసుకుపోయాం. బరువెక్కిన గుండెలతో మా పిన్నిని ఖననం చేసి, అనాలోచితంగా పరిసరాలు పరిశీలించాను. సమాధులు కూడా వ్యక్తుల సామాజిక స్థాయి తెలియజేస్తూ విభిన్నంగా ఉన్నాయి. కొన్ని కేవలం మట్టితో కప్పబడి ఉంటే, ఇంకొన్ని త్రిభుజాకారంలో, మరికొన్ని చతుర్భుజాకారంలో సిమెంట్ చేయబడి ఉన్నాయి. స్థితిమంతులు రంగురంగుల టైల్స్ కూడా అంటించారు. మొత్తానికి మనుషులు తమలోని అంతరాలు సమాధుల వద్ద కూడా సమాధి కానివ్వరనిపించింది. దేవుని దృష్టిలో అందరూ సమానమని తెలియజెప్తూ అన్నిటిమీదా శిలువ గుర్తు ఉండటం మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. చుట్టూ ఉన్న వాటిమీద పేర్లు చదువుతూ ముందుకు నడిచాను. ఊరివాళ్లు ఏర్పాటు చేసిన భోజనాలు కానిచ్చి, దినం తేదీ గురించిన చర్చ మొదలెట్టారు మావాళ్లు. అప్పుడు గమనించాను నేను ఆదాం మామయ్య అక్కడ లేకపోవడం. మా ఇంట ఇటువంటి సందర్భాలలో అన్నీ తానై వ్యవహరించేవాడు కనబడకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఊళ్లో ఉండే మా పిన్ని కొడుకుని అడిగాను. వాడు నిర్లక్ష్యంగా చూపు తిప్పుకున్నాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు ముసిముసిగా నవ్వుకోవడం నేను గమనించలేకపోలేదు. మా నాన్నకి బాబాయి కూతురి భర్త ఆదాం మామయ్య. ఈ ఊళ్లోనే స్థిరపడి, మా కుటుంబంలో భాగమైనాడు. రెండేళ్ల క్రితం బాప్ప (మేనత్త) పోయాక, ఉన్న ఒక్క కొడుక్కీ పెళ్లి చేసి వ్యవసాయం అతనికి అప్పజెప్పాడు. కొడుకూ కోడలూ ఇందాక పిన్నిని తీసుకుపోయేటప్పుడు కనబడ్డారు అన్న విషయం గుర్తుకువచ్చి చుట్టూ వెదికాను. వంటింట్లో ఉన్న ఆయన కోడలి దగ్గరకెళ్లి, ‘‘మామయ్యేడమ్మా?’’ అని అడిగాను. ‘‘ఇంటికాడ ఉన్నాడన్నయ్యా. నిన్నోపాలి కనపడి ఎళ్లమన్నాడు’’ అని చెప్పి, తన పనిలో పడిపోయింది. నేను చెప్పులు తొడుక్కుని మెల్లగా ఆదాం మామయ్య ఇంటివైపు నడిచాను. పంచలో మడత కుర్చీలో కూర్చొని, కాళ్లు పిట్టగోడకు తన్నిపెట్టి కునుకు తీస్తున్నాడు మామయ్య. నేను పిలవంగానే లేచి, నాకు కుర్చీ తెచ్చిచ్చాడు. ఆరడుగుల ఎత్తు, కాయ కష్టంతో గట్టిపడిన శరీరంతో వయసు తెలీకుండా ఉండే మామయ్య - ఇప్పుడు నడుం వంగి, ముడతలు పడిన ఒంటితో బాగా జంకి, మొహం పీక్కుపోయి ఉన్నాడు. ‘‘నువ్వొత్తావని నాకెరకేరా!’’ అన్నాడు కుర్చీలో వెనక్కు వాలి. ‘‘రాకుండా ఎట్టా ఉంటాను మాయ్యా?’’ బాధగా చెప్పాను నేను. ‘‘చిన్నగున్నప్పుడు నన్ను పిన్నమ్మే ఎత్తుకు పెంచిందని మాయమ్మ పద్దాకా చెప్పుతా ఉండేది’’ అన్నాను. తల నిలువుగా ఆడిస్తూ, ‘‘నన్నెతుక్కుంటా వత్తావనిరా నానన్నది’’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ‘‘నువ్వు ఆడ అగుబడలేదు. ఇందాక సమాధి కాడికి రాకపోతివి, వొంట్లో బాలేదేమోనని మీ కోడలిని అడిగి, ఇంటికాడ ఉన్నావంటే ఇట్టా వచ్చా’’ అని చెప్పాను. నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి, లేచి లోపలికి వెళ్లి, ఓ కవరు తీసుకు వచ్చి నా చేతిలో పెట్టాడాయన. తెరచి చూస్తే, అందులో రెండు ఫొటోలు ఉన్నాయి. ‘‘ఎవురిది మాయ్యా ఈ సమాదె? దీన్ని ఫొటో ఎందుకు తీయించినారు?’’ నిజంగానే ఆశ్చర్యపోయాను. మళ్లీ నిర్వికారంగా నవ్వాడాయన. ‘‘నువ్వాటికోసమే వచ్చావనుకున్నాన్రా. పీటరు నీకేటి సెప్పనేదా సమాధి గురించి?’’ ‘‘లేదు మాయ్యా! పీటరు సమాధి గురించి సెప్పడమేటి?’’ నాకు అర్థం కాక అడిగాను. కుర్చీలో ముందుకు వంగి, శూన్యంలోకి చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు ఆదాం మామయ్య. ‘‘నీ కూతురు పెళ్లికి ఊరి నుండి మనోళ్లనందర్నీ తీసుకెళ్లినావు గదా. నీతో సదువుకున్న పంతులుగోరి పిల్లాడు పీటర్‌ను కూడా పిల్సినావు గందా. ఆళ్ల నాన్నది మా ఊరే, ఆల్లదీ మా ఇంటి పేరే. అప్పట్లో రాకపోకలు బాగానే ఉండేయి. పంతులుగోరు ఈ ఊళ్లో పనిసేసేటప్పుడే పీటరు తల్లి కలరా తగిలి పోయింది. ఇక్కడే చర్చిలో సమాధి సేశారు. ఆడికి అప్పుడు పదేళ్లుంటాయనుకుంటా. మీ బాప్పే ఆడిని కొన్నాళ్లు సాకింది. తరవాత పంతులుగోరికి బదిలీయై, ఏరే ఊరెళ్లిపోయినారు. కానొరే ఆడు ఇన్నేళ్ల తరవాత కూడా నన్ను గుర్తెట్టుకొని అభిమానంగా కొత్త బట్టలు కొనిపెట్టాడ్రా’’ కళ్లు తుడుచుకున్నాడు మామయ్య. నా ఒక్కగానొక్క కూతురు పెళ్లికి మా చుట్టాలనందరినీ తీసుకెళ్లాను. ఇంటర్నెట్టు పుణ్యమా అని మా ఊరి బడిలో చదువుకున్న వాళ్లందరమూ ఓ గ్రూపుగా ఏర్పడ్డాము. వారిని కూడా పెళ్లికి ఆహ్వానించాను. అలా వచ్చినవారిలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే పీటరు కూడా ఒకడు. ‘‘బాబాయ్! బాబాయ్! అంటా ఆ రోజంతా ఆడు నన్ను ఇడసనేలేదు. మా సుట్టపోళ్లందర్నీ అడిగాడు. మాటల్లో నాను మీ బాప్ప సచ్చిపోయిన ఇసయం సెప్పా. పంతులుగోరు పోయినేడు ఆడు కలకత్తాలో పన్జేత్తన్నప్పుడు పోయినాడంట. అప్పుడు ఆడ చర్చిలో డబ్బు కట్టి పూడ్చినాడంట. ఎంత బతిమాలినా ఆళ్ల సంఘపోళ్లకు తప్ప ఏరేటోళ్లకి సమాధి కట్టుకోడానికి ఒల్లకోలేదని సెప్పి, శాన బాధపడ్డాడు. ఈయాళ ఎంత సంపాయిచ్చినా కన్నోళ్లకు గురుతుగా ఏమీ సెయ్యలేకపోతన్నానని ఊళ్లోని ఆళ్లమ్మ సమాధి గురించి అడిగినాడ్రా. అప్పట్లో ఇట్టా సిమెంటుతో కట్టే పద్వాతినేదని నాపరాయి మీన పేరుసెక్కి అడుసు అలికేవోళ్లని సెప్పాను. చర్చీ లోపల ఆ రాళ్లు తప్పక పడి ఉంటాయన్నాను. ఆడు ఆ రాయి ఉన్న శోట సిమెంటుతో సమాధి కట్టాలంటే చర్చీకి ఎంత సొమ్ము చెల్లించాలని అడిగాడ్రా’’ మామయ్య ఉద్వేగానికి లోనవుతున్నాడు. నేను భుజం మీద చెయ్యి వేసి, ఆయన్ను శాంతపరిచే విధంగా ఏదో చెప్పబోయాను. ‘‘నాను ఆడిని మోసం సెయ్యనేదురా’’ అని తల ఆడిస్తూ కుర్చీలో వెనక్కు వాలాడు. కాసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. మళ్లీ ఆయనే, ‘‘ఇంకా పల్లెటూళ్లలో అంత దుస్థితి రానేదని, కట్టుడు ఖరుసు పెట్టుకుంటే సాలన్నాను. ఆడు శానా సంతోశంతో ఎంటనే జేబీలో నుండి కొంత సొమ్ము తీసి ఇచ్చినాడు. పాలరాయి బిళ్లలు అంటిత్తే బాగుంటాదని చెప్పితే ఇంకొంత ఆడూరెళ్లాక అంపిత్తానన్నాడు’’ నా భృకుటి ముడిపడింది. మామయ్య చెప్పుకుపోతున్నాడు, ‘‘తిరిగొచ్చాక నాను చర్చీ చుట్టూతా ఎదికాను కానీ ఆ తల్లి సమాధి రాయి యాడా నాకు అగుబడనేదు. కొంతమంది పెద్దోళ్లని అడిగినా ఎవ్వురూ కచ్చితంగా సెప్పనేక పోయినారురా. తుఫానులు, కొన్నిసార్లు మెరక తోలడం వల్ల కొన్ని రాళ్లు భూమిలో దిగబడి పోనాయనుకుంటా. కాలం గడిసిపోతా ఉన్నాది, దుడ్డు నా సేతిలో నుండి జారిపోతా ఉంది - అప్పుడే సమాధుల పండగొచ్చింది. మీ బాప్ప గోతి కాడ మైనపొత్తులు ఎలిగిత్తాంటే నాకు పీటరోళ్లమ్మ దీనంగా సూత్తన్నట్టుగా అనిపించినాదిరా. నా పానం అల్లాడిపోనాదిరా. ఏదో ఒకటి సెయ్యాలని నిర్ణయించేసుకుని ఎన్నో ఇదాల ఆలోశించాను. నీ కూతురు నెల తప్పిందని తెల్సింది. నువైదో నెల్లో సలివిడి తీసుకురమ్మంటావని, అప్పుడు తప్పనిసరిగా ఈ ఇషయం అడుగుతావని - ఈలోపే కట్టించేద్దారని, నా కొడుక్కూడా తెలీకుండా అప్పుసేశాను. తాపీ మేస్త్రీని మాటాడాను. ఇసకా, ఇటికా, సిమెంటు తోలించాను.’’ మామయ్య లోనికి వెళ్లి గ్లాసులో చల్ల తెచ్చి ఇచ్చాడు. ఏదో మాటలాడాలని తపిస్తున్నా కానీ, నా నోరు పెగలడం లేదు. ఓసారి కవరులో నుంచి ఫొటోలు తీసి చూశాను. నా వెనుక నిలబడి వాటినే చూస్తూ, ‘‘మడుసుల ఊహకు అందవు దేవుని క్రియలు’’ అన్నాడు మామయ్య. నేను గ్లాసు కిందపెట్టి వెళ్దామని లేచాను. ‘‘పీటరు నాకు ఇచ్చిన దాంట్లో సగం సొమ్ముకు ఇది కట్టించాను - మొత్తం మెడితే పాలరాయితో తయారయ్యేదే, కానీ...’’ నేను ఒక అడుగు ముందుకు వేసి వెనుతిరిగి ఆగాను. ‘‘ఏదో దిక్కున ఆరడుగుల్లో కట్టీసెయ్యమని మేస్త్రీకి సెప్పాను. అప్పుడే ఎనకీదిలో మన సంఘత్తురాలు ఒకామె పోతే సూసొద్దారని ఎళ్లాను. ఆమె పేరు మారతమ్మ. పీటరోళ్లమ్మ పేరు కూడా అదే. ఎంటనే నాను ఒక ఆలోచన సేశాను. కూలిపంజేస్కునే ఆ మారతమ్మ కొడుక్కూడా దానికి తలాడిచ్చాడు. ఆళ్లు తీపించిన గోతిలో మేస్త్రీ బేస్మెంటు ఏశాడు. తన తల్లికి సమాధి కట్టించమని పీటరు ఇచ్చిన సొమ్ముతో ఎవురికో కట్టించి, దాన్ని సూపించి ఆడిని నమ్మిద్దారనుకున్నాను. ఇశ్వాస మూలం కానిది పాపము అని బైబిలు వాక్యం. సకలాలోచనలూ ఎరిగిన భగమంతుడు నా పాపానికి జీతాన్ని ఇక్కడే ఇచ్చేశాడ్రా’’ మామయ్య పిట్టగోడ మీద కూర్చుని కన్నీరు కార్చాడు. నేను నిలబడే వింటున్నాను. ‘‘రోజు కూలీలు పని తొరగా చెయ్యరని నాను ఆడనే కూసొని అదిలిచ్చేవోడిని. అది సూసి జనం నొసలు చిట్లించారు. ఇంటి పేరుతో సహా పలానోళ్ల భార్య అనో, తల్లి అనో రాయించాల్సిన రాయి మీద ఒట్టిగా ‘శ్రీమతి మారతమ్మగారు ప్రభువునందు నిదురించారు’ అని యేయించాను- తారీకులు కూడా లేకుండా. దానికీ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఆదాం గాడికి ఈ సమాధి మీద ఇంత ఇదేంటని. తరువాత టవును నుండి ఫొటోవులబ్బాయిని తీస్కవచ్చి పీటర్‌కు అంపిద్దారని ఫొటోవులు దింపాను. అది సూసిన గొడ్లు కాచే పిళ్లోళు ఇళ్లకెళ్లి చెప్పారు. అంతే, ఊరు ఊరంతా గుప్పుమంది. రకరకాల కథలు పుట్టుకొచ్చేశాయి. నాను సెప్పేదంతా ఇనేటోళ్లు నా ఎనకే నవ్వేటోళ్లు. ఆకిరికి నా కొడుకూ కోడలూ కూడా సొంత పెళ్లానికి ఒగ్గేసి అరువుదెచ్చి మరీ ఏరోళ్లకు కట్టించినానని నిలదీసినారు. దానికి ‘ఆదాం సమాధి’ అని పేరెట్టి ఊళ్లో అంతా ఎళాకోళంగా...’’ ఇంక మాట్లాడలేకపోయాడు మామయ్య - నేనూ మాట్లాడకుండా వచ్చేశాను. ‘‘ఇంత శ్రమకోర్చి, నిందలు పడీ కట్టించినదానిని చూడటానికి అంకులు లేరని తెలిస్తే, తాతయ్య బాధపడతారని అక్కడ ఆయనకు చెప్పకుండా వీటిని ఇక్కడకు తీసుకొచ్చి చించేశారన్నమాట’’ అడిగింది నా కూతురు. నేను చింపి వేసిన ఫొటో ముక్కలు టేబులుపై తిరిగి అమర్చే ప్రయత్నం చేస్తూ, తల అడ్డంగా ఊపుతూ, రెండు చేతులతో వాటిని ఓ దగ్గరకు చేర్చాను. నా కన్నీటి బొట్లు నా చేతుల మీదే పడ్డాయి. ‘‘నీ పెళ్లైన వారం పది రోజులకే పీటరు నా బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని, కొంత సొమ్ము దాంట్లో జమ చేశాడు. పెళ్లిలో బహుమతి చదివించావు కదరా మళ్లీ ఇదేమిటి అనడిగితే, ‘మా ఆదాం బాబాయ్‌కి అందించరా’ అని మాత్రమే చెప్పాడమ్మా’’ నా గొంతు గద్గదమవుతుంది, మా అమ్మాయి నన్నే చూస్తుంది. అసలు ఆ విషయం చెబుదామనే మొన్న ఆదాం తాతయ్యను వెదుక్కుంటూ వాళ్లింటికి వెళ్లాను. కానీ ఆయన చెప్పింది విన్నాక, నేను చేసిన పనికి సిగ్గేసిందమ్మా. ‘‘వ్యవసాయానికి పెట్టుబడి కావాలనో, కొడుకు తనను సరిగా చూడటం లేదనో తాతయ్య పీటరు దగ్గర బీద ఏడుపులు యేడ్చి ఉంటాడు. అందుకు జాలిపడి వాడు ఆయనకు ఇమ్మని డబ్బు పంపాడనుకున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకూడదంటే ఆదిలోనే తొక్కేయాలని, నేను ఆ సొమ్ము గురించి తాతయ్యకు చెప్పలేదమ్మా. కొన్నాళ్లకు పీటరు పోయాడని తెలిసింది. వెంటనే వాడి కొడుక్కు ఫోను చేసి, ఈ డబ్బు విషయం చెప్పాను. అతను మా నాన్న ఎవరికి ఇవ్వాలని ఆశించారో వారికే అందజేయండి అన్నాడు. అసలు ఆ విషయం చెబుదామనే మొన్న ఆదాం తాతయ్యను వెదుక్కుంటూ వాళ్లింటికి వెళ్లాను. కానీ ఆయన చెప్పింది విన్నాక, నేను చేసిన పనికి సిగ్గేసిందమ్మా.’’ ఉపసంహారం: మా పిన్ని సమాధి ఐదేళ్లకే బీటలు వారింది. మూడేళ్లు శ్రద్ధ వహించిన కొడుకులు, తరువాత పట్టించుకోవడం మానేశారు. ఆదాం మామయ్య శాశ్వతంగా అదే చర్చి ప్రాంగణానికి చేరిపోయాడు. పట్టుబట్టి కొడుకు ఆయన్ని వేరే దిక్కున పొడుకోబెట్టాడు. ఆపై పొలాలు అమ్ముకొని దగ్గర్లోని టౌవునుకు వలసపోయాడు. నేనూ పట్టణంలోని ఓ సిమెట్రీలో స్థలం కొనుక్కుని సెటిలైపోయాను. మారతమ్మ కొడుకు అవమాన భారంతో ఊరు వదిలి పోయాడు. కానీ ఊరి జనం ఇంకా ఆ సమాధి గురించి ఎగతాళిగా మాటలాడతానే ఉన్నారు. కారణం ప్రతీ సంవత్సరం సమాధుల పండుగకు నెలరోజుల ముందు చర్చి పాస్టరు పేరు మీద మనియార్డరు ద్వారా కొంత సొమ్ము అందుతోంది. ఫ్రమ్ అడ్రస్సు తప్పుగా రాసినా, నా కూతురు ఎం.ఒ. ఫారమ్ మీద ఒక వాక్యం మాత్రం ఎప్పుడూ కరెక్టుగానే రాస్తుంది. ‘ఆదాంగారి సమాధికి మరమ్మత్తులు చేయించి, సున్నాలు వేయించండి’ అని. మేము ఆశించిన సమాధికే సున్నాలు పడుతున్నాయి. ఎందుకంటే ఆదాం మామయ్యకు ఆయన కొడుకు అసలు సమాధినే కట్టించలేదు. - అనీల్ ప్రసాద్ లింగం -
సృజనం: అదే - ఇది
‘‘ఏం చేయమంటావు రవి పాత్రను?’’ అని మా అన్నని అడిగాను. ‘‘చంపెయ్’’ అన్నాడు. మొదట్లో నాకది కరెక్ట్ అనిపించింది. కానీ, కుటుంబం కోసం బతికే ప్రకాష్ గుర్తుకు వచ్చాడు. ‘‘నేను రచయితని!’’ ‘‘ఏం కూశావురా!’’ అని నాన్న అనినా, ఈ భావం నా మనస్సులో బలంగా నాటుకుపోయింది. నా పిచ్చి రాతలకు పైసా రాకపోయినా పర్లేదు, ఒకటైనా రాయాలి. నాకా పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఇప్పటివరకు జీవితం మొత్తం మీద పాఠ్యపుస్తకాలు కాకుండా, చదివింది ఒకే ఒక పుస్తకం. కానీ, ఎప్పుడూ చదువుతూనే ఉంటాను. పేపర్లు, వారపత్రికలు లాంటివి. సర్లే ఈ పురాణం అంతా ఎందుకు? నేరుగా రాయడానికి వెళ్లిపోదాం రండి! నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఉన్నాడు. పేరెందుకు లెండి! ఒకరోజు ఫోన్ చేసి వాడి కష్టాలు చెప్పి, నాకు కన్నీళ్లు తెప్పించాడు. ఆ కష్టమే నా కథ చదివేవారికి కలగాలని వాడి పాత్రకు నా ఆలోచనలు తగిలించి, వాడినే ముఖ్య పాత్రను చేశాను. ఆ పాత్రకు రవి అని నామకరణం చేశాను. రవి అనే పేరే ఎందుకు? రవి అంటే సూర్యుడు. కుర్రాడు ఎప్పుడూ ఉదయించే సూర్యుడిలా ఉండాలనీ, అలా ఎప్పటికీ ఉండిపోవాలని, ఈ పేరు పెట్టాను. పేరుకే పిచ్చెకించేశాను కదా! నా ఫ్రెండ్ మూడుపూటలా వేరు వేరు చోట్ల పనిచేసేవాడిని అని చెప్పాడు. కానీ, ఎక్కడెక్కడ చేస్తున్నాడో చెప్పలేదు. వాడు చెప్పకపోతే ఏం? నేను రవిని ఉద్యోగంలో చేర్పిస్తాను. నేను రోజూ వెళ్లే ఇంటర్నెట్లో పనిచేసే కుర్రాడు గుర్తుకు వచ్చి, ఒక షిఫ్ట్‌కి రవిని ఇంటర్నెట్లో చేర్చాను. మరి సినిమా హాలూ! నాకు విపరీతంగా నచ్చేది సినిమా, సినిమా హాలే. కాబట్టి రవిని హాల్లో టికెట్లు చించే పనిలో చేర్పించాను. రవి కీతా పని అనుకుంటాడేమో అని ‘ఐమ్యాక్స్’లో చేర్పించాను. వద్దు వద్దు రవిగాడికి పొగరెక్కిపోద్ది. పేరు లేని హాల్లో, చెప్పుకోలేని జీతంతో తోసేశాను. మరి మూడో షిఫ్ట్. దీని కోసం చాలా ఆలోచించా! ఒకరోజు మా పెద్దనాన్న కొడుకుతో రోడ్డుమీద నడుస్తున్నాను. నాకు వరుసకు వాడు అన్నే అయినా, ఏ రోజూ వాడిని ‘అన్నా’ అని పిలిచిన పాపాన్ని మూటగట్టుకోలేదు. ఆ అంగడీ, ఈ అంగడీ తిరిగి ఏం కొనకుండా బాగా అలసిపోయాం. టిఫిన్ తినాలని వాడు అనడంతో నీరసంగా ఉన్న నాకు కొంత ఉత్సాహం వచ్చింది. మేము నడిచే వీధిలోనే ఒక టిఫిన్ అంగడి ఉంది. పెద్ద హోటల్ కాకపోయినా, అక్కడి నెయ్యి దోశ తింటే నాలుగేళ్లు మర్చిపోలేరు. ఒకసారి నా ఫ్రెండ్‌తో అక్కడికి వెళ్లాను. ఇన్నేళ్లు ఇదే ఊరిలో ఉన్నా, అక్కడ తిననందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. మళ్లీ అక్కడ తినడం అనే ఆలోచనతో తొందరగా హోటల్ దగ్గరకు చేరుకున్నాం. నేను హోటల్ లోపలికి వెళ్లబోతుంటే, అన్న మాత్రం నేరుగా నడుచుకుంటూ హోటల్ దాటి వెళ్లడం చూసి, నేను అన్న దగ్గరకు వెళ్లి, ‘‘ఏమయ్యా?’’ అన్నాను పరిస్థితి అర్థం కాక. ‘‘అక్కడ వద్దులే. ఇంకో దగ్గరకు వెళ్దాం’’ అన్నాడు హోటల్ వైపు చూపిస్తూ. ‘‘ఇక్కడ నెయ్యి దోశ అదిరిపోద్ది తెలుసా?’’ అని నోట్లో ఊరుతున్న లాలాజలాన్ని మింగేశాను. ‘‘అక్కడ నా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు. బాగుండదు, వద్దులే’’ అన్నాడు. వెంటనే నాకు నా సొంత అన్న గుర్తుకు వచ్చాడు. కొన్ని రోజుల క్రితం వాడు కూడా ఇలానే అన్నాడు. అప్పుడు ఏమనకపోయినా, ఈసారి మాత్రం కోపం పొడుచుకొచ్చింది. ‘‘ఓహో! ఫ్రెండ్ పనిచేసే దగ్గర తింటే నామోషి కదా!’’ అన్నాను వ్యంగ్యంగా. ‘‘నామోషియా! నా తలకాయా! ఫ్రెండ్ పనిచేసే దగ్గరకు వెళ్లి, వాడినే చెట్నీ వెయ్యి, సాంబారు పొయ్యి అని ఎలా అడగను? వాడి టైమ్ బాగలేక ఇలా చదువు మానేసి పనికి కుదిరాడు.’’ ఆ సమాధానం నాకు చాలా తేడాగా అనిపించింది. అలాంటి సందర్భాల్లో మనం నామోషీగా ఫీల్ అవుతుంటాం. కానీ ఎదుటివాడు ఏం అనుకుంటాడు అని ఆలోచించం! అంతే, వెంటనే ఇంటికి వచ్చి రవిని మూడో షిఫ్ట్ కింద హోటల్లో చేర్పించి, వాడికి ఈ సన్నివేశాన్ని జతచేశాను. హాల్లో ఒకణ్ని పరిచయం చేసుకుని మరీ, రిలీజ్ సినిమాకు టికెట్ సంపాదించేవాడిని. నాలాగే రవి స్నేహితులు రవిని ఉపయోగించుకునేటట్లు చేశాను. రవితో పాటు పనిచేసేవాళ్లు టికెట్లను డబ్బుకు అమ్ముకున్నా, రవికి స్నేహితుల దగ్గర డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు. మరి హీరో పాత్ర అన్నాక, ఆ మాత్రం మంచి లక్షణాలు లేకపోతే ఎలా? చదివిన బీటెక్ చదువుకు సరిపడేలా ఉద్యోగం వెతుక్కునే ప్రయత్నాలు కూడా చేసేవాడు రవి. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటర్వ్యూ ఉంటే, చేసే పనికి సెలవు పెట్టడం, వెళ్లి రావడం, ఉద్యోగం రాకపోవడం చాలా తొందరగా జరిగిపోయేవి. ఒక మంచి రోజున, రవి ఇంటర్నెట్లో తన ముందు షిఫ్ట్‌లో పనిచేసే కుర్రాడితో చెప్పడం, వాడు ‘‘ఎన్నిసార్లు చెప్తావురా?’’ అన్న మాటతో రవి గాలి తీసేట్టు చేశాను. ఇంత చేసినా, రాసినా నాకు తృప్తి లేదు. ఇప్పటివరకు జరిగిన వాటిలో బాధపడటానికి ఏమీ లేదు అని తెలుసుకున్నాను. మళ్లీ ఆలోచనలో పడ్డాను. మొదటి నుండి కష్టాలు పడేవాడిని చూస్తే ఎవరికీ జాలి కలగదు అన్న విషయాన్ని గ్రహించి, కొన్ని మార్పులు చేశాను. రవికి మొదట్లో ఇంట్లో నుండే డబ్బు వచ్చేది. అది చాలక, జల్సాల కోసం ఇంకా ఎక్కువ అడిగేటట్టు చేశాను. ఇంట్లో వాళ్లు లేవనడంతో ఇంటర్నెట్లో మూడు గంటలు పనిచేసేవాడు. ఇంటర్వ్యూ ఉన్నప్పుడు వాటికి వెళ్తూ, స్నేహితులతో కలిసి హైదరాబాద్ మొత్తం తిరిగేటట్టు చేశాను. ఇలాంటి సందర్భంలో రవికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చేటట్టు చేసి, జాయినింగ్ మూడు నెలల తర్వాత పెట్టించాను. ‘రవిగాడు బాగా కష్టపడుతున్నా’డని ఇంటర్నెట్ ఫ్రెండ్ ఫీల్ అయ్యి, ‘‘ఎందుకు మామా కష్టపడతావు? ఇంటికెళ్లి జాయినింగ్ అప్పుడు రా’’ అని నీరసంగా అనేలా చేసి సంతోషపడ్డాను. ఇలాంటి సమయంలో రవికి ఒక పెద్ద షాక్ తగలాలి. అప్పుడే కిక్. అందుకని రవి కుటుంబాన్ని అప్పులపాలు చేశాను. సరిగ్గా ఇంటికి బయలుదేరుతున్న సమయంలో రవికీ అతని అంకుల్ సుబ్రమణ్యానికీ జరిగే సంభాషణలో, ‘‘నేను ఇచ్చిన డబ్బుతో చదువుకున్నావ్, నిజం చెప్పాలంటే నేనే నిన్ను చదివించాను. అలాంటిది కనీసం వడ్డీ కూడా కట్టవా?’’ అని అనిపించాను. ‘సంఘ సేవ చేసినవాడు మాట్లాడినట్లు మాట్లాడి, మళ్లీ వడ్డీ అడుగుతున్నాడు దొంగ సచ్చినోడు’ అని రవి మనస్సులో అనుకున్న మాట, ఈ ప్రపంచంలో నుంచే పుట్టింది. ఇది నాకు చాలా నచ్చి రాశాను. ఒకరోజు నా ఫ్రెండ్ ప్రకాష్ నన్ను కలిసినప్పుడు, తను చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం తనకు ఇష్టం లేదని చెప్పాడు. వాడు, పాపం ఆ ఉద్యోగం సంపాదించడం కోసం చాలా కష్టపడ్డాడు. రాత్రి, పగలు అని తేడా లేకుండా చదివాడు. ప్రకాష్ కలిసిన తర్వాతి రోజే పేపర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చదివాను. దానికి కారణం తన బోరింగ్ లైఫే అన్న ఆ కుర్రాడి సూసైడ్ నోట్, ఈ కథ క్లైమాక్స్‌కు నాంది పలికింది. నేనంటే తేడాగా ఆలోచించి రచయితను కావాలనుకున్నాను. కానీ, నేను సృష్టించిన రవి పాత్రకు అంత సీన్ లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచం ఒకేలా నడుస్తోంది. డిగ్రీ చేయడం, ఉద్యోగంలో ఇరుక్కుపోవడం, రవిని కూడా అలాగే తయారుచేశాను. చాలా కష్టాలు పడి మూడు పూటలా పనిచేసి నెలనెలా వడ్డీ కట్టడం కోసం ఇంటికి డబ్బులు పంపించేవాడు. అలా జరిగిన మూడు నెలల తర్వాత, ఒక మంచి రోజున ఉద్యోగంలో చేరాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హోదా వచ్చేసింది రవికి. సారీ, వచ్చేలా చేశాను. వారం రోజులు ఏ పనీ చెప్పకపోవడంతో రవికి భయం పట్టుకుంది. ‘ఎక్కడ తనని ఉద్యోగంలో నుంచి తీసేస్తారో’ అని. కానీ నేను అలా చేయలేదు. వారం తర్వాత రవికి ప్రాజెక్ట్ మేనేజర్ చేత పని చెప్పించాను. ఒక మూడు, నాలుగుసార్లు తప్పుగా చేశాక, తిట్లు తిన్నాక, కరెక్ట్‌గా చేశాడు. రోజూ ఉదయాన్నే ఎనిమిదికి బయలుదేరి, ఆఫీస్‌కి వెళ్తే, తిరిగి ఇంటికొచ్చేది రాత్రి తొమ్మిదికే. ఎన్ని రోజులు గడిచినా ఆఫీస్‌లో ఎవ్వరూ స్నేహితులు కాలేదు. రవిని చాలా మూడీ ఫెలోగా తీర్చిదిద్దాను. ఏ పని చేసినా ఆసక్తి ఉండదు. దాంతో ఎప్పుడూ ఎవరితో మాట్లాడకుండా, మూలన ఉన్న తన క్యాబిన్ దగ్గర కూర్చొని పని చేసుకునేవాడు. చిన్నప్పటినుండి జనాలు పరిగెత్తితే పరిగెత్తడం, పడుకుంటే పడుకోవడం, ఇంతే తప్ప తనకు ఒక ఇష్టం ఉందని కూడా గ్రహించలేనివాడు రవి. ఒంటరిగా రూమ్‌లో కూర్చొని బుక్ ముందు పెట్టుకుని కాసేపు చదివి, తర్వాత జుట్టు పీక్కొని, బుక్‌ని విసిరికొట్టిన సంఘటనలు రవి జీవితంలో చదువుకునేటప్పుడు ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయి. ఇవన్నీ భరించలేక ఒకరోజు ఆఫీస్ బిల్డింగ్ పైకి ఎక్కాడు. ఒక్కడుగు వేస్తే వీటన్నిటికీ దూరంగా వెళ్లిపోవచ్చు. ‘‘ఏం చేయమంటావు రవి పాత్రను?’’ అని మా అన్నని అడిగాను. ‘‘చంపెయ్’’ అన్నాడు. మొదట్లో నాకది కరెక్ట్ అనిపించింది. కానీ, కుటుంబం కోసం బతికే ప్రకాష్ గుర్తుకు వచ్చాడు. ‘‘రవిని చంపి నేను హంతకుడిని కాలేను.’’ రవి మేడమీద నిలబడి కళ్లు మూసుకున్నాడు. అమ్మ, చెల్లెలు గుర్తుకువచ్చి, ఆ అడుగుని వెనకకు వేశాడు. ఆ తర్వాత నుంచి రవి రోజూ బతుకుతూ చస్తున్నాడు. నా కథ పూర్తయింది. పత్రికకు పంపి చాలా రోజులు ఎదురుచూశాను. లాభం లేదు. మళ్లీ రాయాలనుకున్నాను. కానీ, రవి కథ చాలా మంచిదే! అందుకే ఒక ఆలోచన వచ్చింది. రవి పాత్రను అలాగే ఉంచి, కథనంలో మార్పు చేశాను. పనిచేయడం, ఉద్యోగం కోసం వెతుకులాట, చివరికి బతకడం అన్నీ అలానే ఉంచి, ఇలా రాశాను. ఇప్పటివరకు మీరు చదివిన ఇదే - అది. - చక్రతానం యుగంధర్ -
సృజనం: ఓ నీగ్రో కథ
ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్న సమయంలో నేను మొబైల్, మాంటెగోమరి వాగుల మధ్య ఉన్న దారిలో నడుచుకుంటూ పోతున్నాను. అప్పటికే నేను కొన్ని మైళ్ల దూరం నడిచి ఉండొచ్చు. ఎవరైనా వాహనదారుడు వచ్చి నాకు లిఫ్ట్ ఇస్తే బాగుండును అని అనుకున్నాను. అదే సమయంలో ఒక అందమైన ముఖంతో ప్రశాంతంగా కనిపించే ఓ వ్యక్తి తన ట్రక్కును నా పక్కన ఆపాడు. నేను వెళ్లవలసిన ప్రదేశం గురించి అడిగి నన్ను లోపలికి ఆహ్వానించాడు. నేను ట్రక్కులోకి ఎక్కటానికి తలుపు తెరిచినప్పుడు, అతడి కాళ్ల దగ్గర ఒక బందూకు కనిపించింది. నా గుండె గుభేల్మంది. అది అతడు కూర్చున్న సీటుకు ఆనించి ఉంది. నాకు చప్పున ఒక విషయం గుర్తొచ్చింది. అలబామాకు చెందిన తెల్లవారికి నల్లవారిని వేడుక కోసం కాల్చి చంపే వ్యసనం ఉండటం గుర్తుకొచ్చింది. నేను ట్రక్ ఎక్కటానికి సంకోచించాను. అది గమనించినట్టు అతను నవ్వుతూ అన్నాడు, ‘‘లోపలికి రా, అది జింకల్ని వేటాడటం కోసం...’’ అతడి కాంతిమంతమైన ముఖాన్ని చూశాను. మనిషి సభ్యత గలవాడే అనిపించింది. ట్రక్ ఎక్కి కూర్చున్నాను. ‘‘అంత దూరం నడుచుకుంటూ బయలుదేరావా? ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదా?’’ అని అతను అడిగాడు. ఇదంతా అతడి వ్యక్తిత్వపు ఒక పార్శ్వం మాత్రమే. బహుశా మరొక పార్శ్వం అతడి భార్య, పిల్లలు, స్నేహితులు చూసి ఉండరు. దీన్ని అతను ఎవరికీ చూపించడు. అది బలిపశువుకు మాత్రమే చూపించే ముఖం. ‘‘లేదు, ఇప్పుడు మీరే నాకు లిఫ్ట్ ఇచ్చారు’’ అన్నాను. అతడికి సుమారు యాభై మూడేళ్లు. ఒక కుటుంబానికి పెద్ద అయిన అతడు ఇద్దరు పిల్లల తండ్రి, ఇద్దరు మనుమలకు తాత. వ్యాపారం చేసుకుంటున్నాడు. వేట కోసం అడవి వైపు బయలుదేరాడు. ఈ విషయాలు అతడితో జరిపిన సంభాషణ వల్ల తెలిశాయి. నేనొక సభ్యత గల తెల్ల వ్యక్తిని కలిశాను అని అనిపించింది. ‘‘నీకు పెళ్లయిందా?’’ ‘‘అయింది’’ అన్నాను. ‘‘పిల్లలు...’’ ‘‘ముగ్గురు...’’ ‘‘నీ భార్య అందంగా ఉంటుందా?’’ ‘‘అందంగా ఉంటుంది.’’ అతను కాస్సేపు ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయాడు. తరువాత - ‘‘ఆమె తెల్లవారి ద్వారా పొందిన పిల్లలు ఎంత మంది?’’ నా తలమీద పిడుగు పడ్డట్టయ్యింది. ఒక్క క్షణం మౌనం రాజ్యమేలింది. నేను నా నల్లటి చేతుల్ని చూసుకున్నాను. వేలికి పెళ్లినాడు నా భార్య తొడిగిన ఉంగరం కనిపించింది. అతను డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. మళ్లీ మా మధ్య సంభాషణ కొనసాగింది. నా భావాలను దాటి అతను ముందుకు సాగుతున్నాడు. అక్కడి తెల్లవాళ్లు నీగ్రో స్త్రీలను ఇష్టపడుతున్నారని చెప్పి, ‘‘నేనూ కావలిసినంత మంది నల్ల ఆడవారిని అద్దెకు తీసుకున్నాను. అలా నియమించుకున్న అందరితోనూ పడుకున్నాను’’ అన్నాడు. ట్రక్ టైర్లు రోడ్డు మీద పరిగెడుతున్న సద్దు వినిపిస్తోంది. ఆ టైర్లు నా గుండెల మీది నుంచే పోతున్నట్టు అనిపించింది. అతను నావైపు తిరిగి అడిగాడు, ‘‘దీని గురించి నీకేమనిపిస్తుంది?’’ ‘‘దీన్ని ఎవరూ ప్రతిఘటించలేదా?’’ నేను అడిగాను. ‘‘వాళ్లకు జీవితం గడవాలి కదా. అంగీకరించకపోతే పని ఉండదు. పని లేకపోతే తినటానికి పిడికెడు మెతుకులు ఉండవు’’ అన్నాడతను వంకరగా నవ్వుతూ. నేను రోడ్డు వైపు చూశాను. పెద్ద పెద్ద పైన్ చెట్లు వెనక్కు పరిగెడుతున్నాయి. వాటి టెర్పెంటైన్ వాసన ట్రక్ నడుపుతున్న ఆ తెల్ల వ్యక్తి ధరించిన ఖాకీ బట్టల వాసనతో కలిసి చిత్రమైన వాసన వేస్తోంది. ‘‘మీకు ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది కదా?’’ నేనప్పుడు పంటి బిగువున జవాబు చెప్పాల్సి వచ్చింది. ‘‘ఆ, ఇందులో ఏముంది ప్రకృతి సహజం...’’ అన్నాను మనస్సు చంపుకుని. లేదా ఇంకేదైనా చెప్పి అతను మరింత రెచ్చిపోవటాన్ని తప్పించాల్సి ఉంది. మళ్లీ అతను రెట్టిస్తూ అడిగాడు- ‘‘ఏమంటున్నావు?’’ ‘‘సరైనదే అనిపిస్తోంది...’’ గొణిగాను. ‘‘ఇది ఇక్కడ అందరూ చేస్తున్నదే. నీకు తెలియదా?’’ ‘‘లేదు, నాకు తెలియదు.’’ ‘‘అందరూ ఇదే చేస్తున్నారు. అయినా నీవు ఇందుకు సంతోషపడాలి. ఎందుకంటే మీకు మా వల్ల తెల్లపిల్లలు పుడతారు. మీలో తెల్లవారి రక్తం వచ్చి చేరుతుంది కదా’’ అన్నాడు. తెల్లవాడి వ్యంగ్యం నా హృదయాన్ని ముక్కలు చేసింది. తెల్లవాళ్లు నీగ్రోల గురించి మాట్లాడేటప్పుడు వారి శీలం పట్ల చాలా చులకనగా మాట్లాడుతారు. వారి లైంగిక నిజాయితీ పట్ల అవహేళనగా మాట్లాడుతారు. వ్యాపిస్తున్న వర్ణ సంకరం పట్ల భయభీతులైనట్లు ప్రవర్తిస్తారు. నీగ్రోకు వంశవాహిక పరిశుద్ధత లేదని ఆక్షేపిస్తారు. దక్షిణ అమెరికాలో ఇప్పటికే వర్ణ సంకరం వాడుకలో ఉంది. దీనికంతా ముఖ్య కారకులు తెల్లవారే. ఇది వారి ద్వంద్వ నీతి. జనాంగపు పరిశుద్ధత గురించి అతడు మాట్లాడుతూనే ఉన్నాడు. అటు తరువాత నేను ఈ విషయం గురించి కొందరు తెల్లవాళ్లను విచారించినప్పుడు అందరూ దీన్ని నిజమేనన్నారు. దక్షిణ అమెరికాలో ప్రతి పల్లెలోనూ ఇది జరుగుతున్నదే. అయినా దక్షిణ అమెరికాలోని ఈ పరిస్థితి ఎన్నడూ ఏ పత్రికలోనూ వెలుగు చూడలేదు. ఎందుకంటే నాతోపాటు ప్రయాణిస్తున్న తెల్లవ్యక్తి చెబుతున్నట్టు అలబామాకు చెందిన ఏ స్త్రీ (నీగ్రో స్త్రీ) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయదు, చేయలేదు. ఎవరైనా తమకు జరిగిన మానభంగం గురించి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? నేను ఆలోచిస్తుండగా, అతను నా మౌనాన్ని నా అసహనం అని గుర్తించాడు. ‘‘నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?’’ ‘‘టెక్సాస్ నుంచి’’ అన్నాను. ‘‘రావటానికి కారణం?’’ ‘‘పనికోసం వెదుక్కుంటూ వచ్చాను.’’ ‘‘ఇక్కడే తిష్ట వేసి సమస్యలు సృష్టించటానికి వచ్చావా?’’ ‘‘లేదు... లేదు.’’ ‘‘ఇక్కడ నివాసమేర్పరుచుకుని నీగ్రోలను సంఘటిత పరిస్తే నిన్ను ఎలా మట్టుబెట్టాలో మాకు తెలుసు.’’ ‘‘నాకు ఆ ఉద్దేశం లేదు.’’ ‘‘ఇక్కడకొచ్చి కుట్రలు పన్నేవారిని ఏం చేస్తారో తెలుసా?’’ ‘‘తెలియదు.’’ ‘‘జైల్లో వేస్తాం. లేదా కాల్చి చంపుతాం.’’ అతడి క్రూరమైన మాటల వల్ల నాకు బాధ కలిగింది. నేను అతడి ముఖం చూశాను. అతడి నీలిరంగు కళ్లు ఇప్పుడు ఎర్రబారి ఉన్నాయి. అతడి కంఠంలో నీగ్రోలకు సరియైన పాఠం నేర్పిస్తానన్న రోషం ఉంది. ఆ రోషపు తీవ్రత వల్ల నాకు భయం వేసింది. అతడిలో కోపం క్షణక్షణానికి పెరుగుతున్నట్టు అనిపించింది. అతడి కంఠధ్వనిలో ఉద్వేగం, పైశాచికత్వం పొంగింది. రోడ్డు పక్కన దట్టమైన అడవి వెనక్కు జరుగుతోంది. అతను బయటికి చూస్తూ తల ఊపుతూ - ‘‘నీగ్రోలను చంపి ఈ అడవిలో విసిరేసినా ఎవరూ పట్టించుకోరు. తెలుసా?’’ అన్నాడు. ‘‘అవును’’ అన్నాను. నేను మౌనాన్ని ఆశ్రయించాను. ఆ వ్యక్తిని నేను జీవితపు విభిన్న పాత్రల్లో ఊహించటానికి ప్రయత్నించాను. మనుమలతో ఆడుకుంటున్నట్టు, చర్చీలో ప్రార్థన చేస్తున్నట్టు, తెల్లవారగానే లేచి కాఫీ తాగి షేవ్ చేసుకుంటున్నట్టు, భార్యతో స్నేహితుల ఇళ్లకు వెళ్లినట్టు, అయితే ఎందుకో అసాధ్యమనిపించింది. ఆ వ్యక్తి ఇలాంటి నడవడికకు యోగ్యుడు కాదనిపించింది. పోలిక ఎందుకో అసహ్యమనిపించింది. ట్రక్‌లో నేను ఎక్కినప్పుడు అతణ్ని ఒక సౌమ్యుడైన వ్యక్తిగా ఊహించుకున్నాను. ఇదంతా అతడి వ్యక్తిత్వపు ఒక పార్శ్వం మాత్రమే. బహుశా మరొక పార్శ్వం అతడి భార్య, పిల్లలు, స్నేహితులు చూసి ఉండరు. దీన్ని అతను ఎవరికీ చూపించడు. అది బలిపశువుకు మాత్రమే చూపించే ముఖం. ఇతర సమయాల్లో అతనొక ప్రియమైన తండ్రి, ఆత్మీయుడైన స్నేహితుడు, సమాజంలో గౌరవింపబడుతున్న వ్యక్తి. అతను ముఖం ముడివేసుకున్నాడు. మళ్లీ యధాస్థితికి రావటానికి కొద్ది సమయం పట్టింది. మెయిన్ రోడ్డు నుంచి పక్కకు వెళ్లే ఓ మట్టిరోడ్డు దగ్గర ట్రక్ ఆపాడు. ఆ మట్టి దారిలో అతను వెళ్లాలి. ఇంతసేపు మేమిద్దరం పరస్పరం ఆలోచనల పోరులో నిమగ్నమయ్యామన్న విషయం అతడికి అర్థమై ఉండాలి. ‘‘నేను ఇక్కడి నుంచి అడివిలోకి వెళ్లాలి. బహుశా నీవు మళ్లీ ఈ మెయిన్ రోడ్డు వెంబడే నడిచి వెళ్లాలి’’ అన్నాడు. నేను అతడికి థాంక్స్ చెప్పి, తలుపు తెరిచి ట్రక్ దిగాను. అతను మళ్లీ అన్నాడు - ‘‘ఇది ఎలా జరిగిందంటే మేము మీతో వ్యాపారం చేస్తాం. నిజం. మీ ఆడవాళ్లతో పడుకుంటాం. ఇదీ నిజమే. ఇంతకుమించి మీరెవరూ మా లెక్కలో లేరు. మీరు మా స్థాయికి ఎదగలేరు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవటం మంచిది. దీన్ని మీరు ఎంతగా అర్థం చేసుకుంటే మీరు అంత క్షేమంగా ఉంటారు.’’ ‘‘ఔను ఔను’’ నేను గొణిగాను. తరువాత అతను ట్రక్‌తో పాటు అడవిలో కనుమరుగయ్యాడు. సాయంత్రపు గాలి వీస్తోంది. నేను రోడ్డు దాటి మరొక పక్కకు వచ్చి కూర్చున్నాను. వచ్చే వాహనాల కోసం ఎదురుచూడసాగాను. ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను సురక్షితుణ్నని అనిపించింది. సాయంత్రపు నక్షత్రాలు ఆకాశంలో తొంగి చూడసాగాయి. నేల వేడిమి నింగిని ఆవరించినట్టు ఆకాశం ఎర్రబారసాగింది. - మూలం: జాన్ హార్వర్డ్ గ్రిఫన్ అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
సృజనం: చీకటి కోయిల
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైలు బయల్దేరటానికి నాలుగైదు నిమిషాల ముందు ఎక్కిందా అమ్మాయి. చేతిలో పసివాడు, వెనుక నాలుగైదేళ్ల పాప. వాళ్లని దిగబెట్టడానికి వచ్చిన పెద్దమనిషి అన్ని జాగ్రత్తలు చెప్పాడు. ‘‘పిల్లలతో ఉంది కాస్త చూసుకోండమ్మా’’ అన్నాడు నా భార్య భారతితో. ఆమె మరేం ఫర్లేదన్నట్లు నవ్వుతూ తలాడించింది. దాదాపు ఆయన వయసువాళ్లం మేము ఇద్దరం అదే కూపేలో కనపడేసరికి ఆయనకి ధైర్యం కలిగినట్లుంది. ‘‘నేనింక దిగుతానమ్మా’’ అన్నాడాయన లేస్తూ. ‘‘సరే నాన్నా. దిగగానే ఫోన్ చేస్తాలే’’ అంది ఆ అమ్మాయి. వాళ్లిద్దరి మధ్య సంభాషణే కాకుండా మౌన విషాదమేదో సాగినట్లు నాకనిపించింది. ‘‘బాయ్... తాతయ్యా’’ చిన్నపిల్ల చెప్పింది. ఆయన వెళ్లబోతున్నవాడల్లా ఆగి వెనక్కి వచ్చి పిల్లని ముద్దుపెట్టుకొని ‘‘బాయ్ బంగారం’’ అన్నాడు. ఆ వెంటనే వడివడిగా కంపార్ట్మెంట్ దిగి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయి ఆయనవైపు కూడా చూడకుండా తల దించుకొని ఉంది. అర్థం కానిదేదో మిగిలిపోయినట్లు అనిపించింది నాకు. అయిదు నిమిషాల్లో ఆడవాళ్ల మధ్య మాటలు మొదలయ్యాయి. మా ఆవిడ సేకరించిన వివరాల ప్రకారం ఆ అమ్మాయి పేరు నిత్య. తల్లిదండ్రులు, అన్నయ్య హైదరాబాద్‌లో ఉంటున్నారు. పిల్లాడికి అయిదో నెల వచ్చిన తరువాత పురిటి మంచం ఒకసారి చూడాలని వచ్చి రెండు రోజులుండి వెళుతోంది. ఇవన్నీ మా ఆవిడ ప్రశ్నలకి జవాబులుగా వచ్చినవే తప్ప, ఆ పిల్ల తనంత తానుగా ఏ విషయమూ చెప్పలేదు. ‘‘మరి నిన్ను అత్తగారింటిలో దిగబెట్టడానికి మీవాళ్లు ఎవరూ రావట్లేదా?’’ అనే ప్రశ్నకు మాత్రం జవాబు రాలేదు. ‘‘నీకెందుకే అనవసరపు విషయాలు?’’ దాంతో మా ఆవిడ అప్పటిదాకా నిర్వహించిన పరిచయ కార్యక్రమం తాత్కాలికంగా ముగిసింది. సాయంత్రం ఏడు దాటుతుండగా అనుకుంటాను ఆ పసిపిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా ఆపలేదు. పాలిచ్చింది, ఆడించింది. అయినా ఫలితం లేదు. ఆమె కూతురు మాత్రం ఏమీ ఎరగనట్లు మా పక్కనే ఉన్న కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది. ‘‘ఏమిటమ్మా అలా ఏడుస్తున్నాడు?’’ అంది నా భార్య సాయం చేసే ఉద్దేశంతో. ‘‘నిద్ర వచ్చినట్లుంది ఆంటీ’’ చెప్పిందామె. ‘‘కాస్త కాళ్ల మీదేసుకొని ఊపమ్మా’’ మరో సలహా ఇచ్చింది. ఆ అమ్మాయి కాళ్లు చాపుకొని పిల్లాణ్ని కాళ్లమీద వేసుకొని ఊపింది. అదీ ఫలించలేదు. ‘‘ఊరికే ఊపితే ఎలా? చక్కగా ఓ లాలి పాట పాడు’’ మళ్లీ మా ఆవిడ. ‘‘అసలు నీకెందుకే’’ అన్నాను నేను మళ్లీ. ఆ అమ్మాయి తటపటాయించింది. ‘‘రైల్లో జనం ఉన్నారనా? పిల్లవాడికి పాడితే ఎవ్వరూ ఏమీ అనుకోరు. పాటలు పాడి నిద్రపుచ్చడం అలవాటు చేస్తే వాళ్ల తెలివితేటలు పెరుగుతాయని పెద్దవాళ్లు చెప్తారు.’’ ‘‘ఊరుకోవే. పాపం ఆ పిల్లకి పాటలు వచ్చో రావో’’ ఆ పిల్ల చప్పున తలెత్తి నా వైపు చూసింది. ఆ కళ్లలో మళ్లీ ఏదో కథ కనపడింది కానీ అది తెలిసే లోపే తలదించుకుంది. ‘‘ఆ? మీరు మరీనూ. మాకంతా వచ్చి పాడామా? పాట ఎట్లా ఉన్న తల్లిపాటే జోలపాట పిల్లాడికి. దానివల్ల వాళ్లకి సంగీతం సాహిత్యం లాంటి అభిరుచులు వస్తాయి. మా అమ్మ చెప్పేది’’ అంటూ మళ్లీ ఆ అమ్మాయి వైపు చూసింది. ఆ అమ్మాయి నవ్వి ఊరుకుంది. పిల్లాడు ఇంకా అలాగే ఏడుస్తున్నాడు. ‘‘ఏమిటోనమ్మా మీ జనరేషనే అంత! ఒక లాలిపాట రాదు, ఓ ముగ్గెయ్యడం రాదు, ఉగ్గు అంటే ఏమిటో తెలియదు’’ ఎదురుగా ఉన్న పిల్ల నొచ్చుకుంటుందేమో అన్న ధ్యాస కూడా లేకుండా అంటోంది నా శ్రీమతి. అటు వైపు నుంచి విశాలమైన చిరునవ్వుతో మాత్రమే సమాధానం వస్తోంది. చిత్రంగా ఉందా నవ్వు. అంతకు ముందు వాళ్ల నాన్న కూడా అంతే. చూస్తుంటే ఈ కుటుంబంలో అందరూ ప్రత్యేకమైన వ్యక్తుల్లా పరిచయం అవుతున్నారు. మా పక్కన కూర్చొని ఉన్న ఆ అమ్మాయి కూతురూ అంతే. చడీ చప్పుడు లేకుండా కిటికీలోంచి చూస్తూనే ఉంది తప్ప మాతో ఎవ్వరితో మాట్లాడలేదు. ఆ వయసు పిల్లల్లా ఒకటి కావాలని కానీ వద్దని కానీ పేచీ లేదు. వీళ్లంతా గుండె నిండా ఏదో బరువు మోస్తున్నారని నాకనిపించసాగింది. ‘‘అమ్మాయి... నాకు మీ అమ్మ వయసుంటుంది. చాదస్తం అనుకోకుండా నా మాట విను. మీ అమ్మని అడిగి రెండు లాలిపాటలు, ఓ రెండు మంగళహారతి పాటలు నేర్చుకో’’ ‘‘నాకు పాటలు నేర్పించారండీ మా వాళ్లు’’ ఆ పిల్ల అంది. ‘‘మరింకేం! పాడటానికి సిగ్గా? పాడటానికి, పాలివ్వడానికి సిగ్గుపడితే ఎట్లా?’’ హుకూం జారీ చేసింది. ఇక తప్పదని ఆ అమ్మాయి సిద్ధం అయ్యింది. రెండు కాళ్లు పద్మాసనంలా వేసుకొని, పిల్లాణ్ని ఒడిలో పెట్టుకొని, గొంతు సవరించుకుంది. పెదాలను తడుపుకొని, ఒకసారి మావైపు చూసి కళ్లు మూసుకుంది. ‘‘డోలాయాంచల డోలాయాం హరే డోలాయాం...’’ మేమిద్దరం ముఖముఖాలు చూసుకున్నాం. లాలిపాట అంటే ఎవరైనా ‘జో అచ్యుతానంద’ పాడుతారు. లేకపోతే ‘రామాలాలీ’ అని పాడుతారు. ఈ అమ్మాయేంటి ఈ పాట పాడుతోందన్న ఆశ్చర్యం మా ఆవిడ కళ్లలో కనపడుతోంది. ‘‘మీన కూర్మ వరాహా.. మృగపతి అవతారా..’’ పాట మత్తుగా సాగుతోంది. పిల్లాడు క్షణాల్లో కిక్కురుమనడం ఆపేశాడు. మా పక్కన కూర్చున్న పాప దిగి వెళ్లి తల్లి పక్కన కూర్చొని ఆమెనే చూస్తూ ఉండిపోయింది. ‘‘దానవారే... గుణశౌరే... ధరణీధర మరుజనక’’ అప్పటిదాకా ఐ-ఫోన్లో పాటలు వింటున్న సైడు బెర్త్ కుర్రాడు ఇయర్ ఫోన్స్ తీసేసి పాట విన్నాడు. ఆ అమ్మాయి గొంతు బాగున్న విషయం ఇంతకుముందు మాట్లాడినప్పుడే అర్థం అయింది. కానీ ఇంత శాస్త్రీయంగా పాడుతుందని నేను ఊహించలేదు. వరాళి రాగం రైలు శబ్దాల మధ్యలో నుంచి మత్తు మందులా పరుచుకుంది. ఆ మత్తులో అందరం జోగాడుతుండగానే పాట అయిపోయింది. సైడు బెర్త్ అబ్బాయి చప్పట్లు కొట్టాడు. ‘‘ఇంత బాగా పాడగలిగినదానివి ఇందాక బెట్టు చేశావే? ఇంకొకటి పాడరాదు. నాకోసం...’’ అడిగింది నా భార్య. ఆ పిల్ల తలూపి మొదలుపెట్టింది. ‘‘లాలనుచు నూచేరు లలన లిరుగడలా... బాలగండవీర బాలగోపాల’’ పాడే విధానం చూస్తే ఆ అమ్మాయికి కచ్చితంగా సంగీత జ్ఞానం ఉందని అర్థమౌతోంది. లాలి పాడుతూ పిల్లాణ్ని జో కొడుతోంది అనుకున్నాను కానీ, జాగ్రత్తగా గమనిస్తే, తాళం వేసుకుంటోందని అర్థం అయ్యింది. ఈసారి పాటలో సంగతులు కూడా ఎక్కువయ్యాయి. ‘‘లాలీ లాలి లాలీ లాలి’’ అంటూ ఆ పాట కూడా ముగిసింది. ఈ రెండో పాట సగానికి వచ్చేసరికే పసిపిల్లాడు గాఢంగా నిద్రపోయాడు. పక్క కూపేలో ఉన్న మరో ఇద్దరు కూడా వచ్చి కూర్చున్నారు. కంపార్ట్మెంట్లో చిన్న కచేరియే జరిగింది. ఈసారి ఇంకో పాట పాడమని ఎవరూ అడగలేదు. ఆ అమ్మాయి తనంతట తానే మొదలుపెట్టింది. ఈసారి తిల్లాన..! ‘‘నాదిర్దిత్తోం నాదిర్దిత్తోం’’ ఒక ప్రవాహంలాగ దూకుతూ, ఉరుకుతూ. ఆ అమ్మాయి కళ్లు మూసుకొని ఏదో అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ పాడింది. మా శ్రీమతి చాలా ఇబ్బంది పడిపోయింది. సాక్షాత్తూ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ముందు నిలబడితే, మంగళహారతి పాడమని పాపం చేసినంత బాధపడిపోయింది. సంగీతంలో తెలియని లోతులేవో స్పృశించినంత ఆనందంగా ఆ అమ్మాయి కన్నీళ్లు కార్చేసి పాట పూర్తి చేసింది. అక్కడే నిలబడిపోయిన టీసీ, హాకర్స్‌తో సహా అందరూ చప్పట్లు కొట్టారు. ఆ అమ్మాయి కూతురైతే మా అందరి చప్పట్లు చూసి ఇంకా ఆనందంగా కేరింతలు కొట్టింది. సాక్షాత్తూ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ముందు నిలబడితే, మంగళహారతి పాడమని పాపం చేసినంత బాధపడిపోయింది. ఆ అమ్మాయి ఏదో ట్రాన్స్ నుండి మేలుకొన్నట్లు కళ్లు తెరిచి, తడబడి, ‘‘బాబు నిద్రపోయాడు. ఇంక నేను కూడా పడుకుంటానండీ’’ అంది. మా సమాధానం వినకుండా చకచక లేచి బెర్తు మీద గుడ్డ పరిచి సర్దటం మొదలుపెట్టింది. పాటలు ఇంకా వినాలని ఉన్నా నేను అడగలేదు. ఆ అమ్మాయి పిల్లలిద్దర్నీ బెర్త్ మీద పడుకోబెట్టి తాను మాత్రం కిటికీకి ఆనుకొని కళ్లు మూసుకొంది. మాతో తెచ్చుకున్నవి తిని మేము కూడా నిద్రకి ఉపక్రమించాం. లైట్లు ఆర్పేశాం. ఎప్పుడో ఒక రాత్రిపూట ఆ అమ్మాయి, కూతురు మాట్లాడుకుంటుంటే వినపడి మెలకువ వచ్చింది. ‘‘నువ్వు బాగా పాడావు మమ్మీ.’’ ‘‘ఊ!’’ ‘‘మరి నువ్వు ఎప్పుడూ పాడవెందుకు?’’ ‘‘ఎందుకంటే నేను ఇలా ఎవరి ముందూ పాడనని డాడీకి ప్రామిస్ చేశాను కాబట్టి.’’ ‘‘ఎందుకు?’’ ‘‘డాడీకి పాటలంటే ఇష్టం లేదు.’’ ‘‘ఎందుకు ఇష్టం లేదు?’’ ‘‘ఎందుకంటే... లేదు అంతే. నీకు వంకాయ కూర ఇష్టం లేదంటావు కదా. అలాగే డాడీకి పాటలంటే ఇష్టం లేదు. నేను ఈ రోజు పాటలు పాడానని డాడీకి చెప్పకూడదు. సరేనా?’’ ‘‘ఎందుకు చెప్పకూడదూ?’’ ‘‘చెప్తే ప్రామిస్ తప్పానని డాడీకి కోపం వస్తుంది. కోపం వస్తే డాడీ ఏం చేస్తాడో తెలుసు కదా?’’ ‘‘ఊ!’’ అంతే. ఆ తరువాత ఆ అమ్మాయి ఎప్పుడు దిగిపోయిందో, ఏ స్టేషన్లో దిగిపోయిందో నేను చూడలేదు. - అరిపిరాల సత్యప్రసాద్