సృజనం: ఓ నీగ్రో కథ | Story of the Negro | Sakshi
Sakshi News home page

సృజనం: ఓ నీగ్రో కథ

Published Sun, Sep 15 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

సృజనం: ఓ నీగ్రో కథ

సృజనం: ఓ నీగ్రో కథ

ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్న సమయంలో నేను మొబైల్, మాంటెగోమరి వాగుల మధ్య ఉన్న దారిలో నడుచుకుంటూ పోతున్నాను. అప్పటికే నేను కొన్ని మైళ్ల దూరం నడిచి ఉండొచ్చు. ఎవరైనా వాహనదారుడు వచ్చి నాకు లిఫ్ట్ ఇస్తే బాగుండును అని అనుకున్నాను. అదే సమయంలో ఒక అందమైన ముఖంతో ప్రశాంతంగా కనిపించే ఓ వ్యక్తి తన ట్రక్కును నా పక్కన ఆపాడు. నేను వెళ్లవలసిన ప్రదేశం గురించి అడిగి నన్ను లోపలికి ఆహ్వానించాడు. నేను ట్రక్కులోకి ఎక్కటానికి తలుపు తెరిచినప్పుడు, అతడి కాళ్ల దగ్గర ఒక బందూకు కనిపించింది. 

నా గుండె గుభేల్‌మంది. అది అతడు కూర్చున్న సీటుకు ఆనించి ఉంది. నాకు చప్పున ఒక విషయం గుర్తొచ్చింది. అలబామాకు చెందిన తెల్లవారికి నల్లవారిని వేడుక కోసం కాల్చి చంపే వ్యసనం ఉండటం గుర్తుకొచ్చింది. నేను ట్రక్ ఎక్కటానికి సంకోచించాను. అది గమనించినట్టు అతను నవ్వుతూ అన్నాడు, ‘‘లోపలికి రా, అది జింకల్ని వేటాడటం కోసం...’’  అతడి కాంతిమంతమైన ముఖాన్ని చూశాను. మనిషి సభ్యత గలవాడే అనిపించింది. ట్రక్ ఎక్కి కూర్చున్నాను. ‘‘అంత దూరం నడుచుకుంటూ బయలుదేరావా? ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదా?’’ అని అతను అడిగాడు.
 
 ఇదంతా అతడి వ్యక్తిత్వపు ఒక పార్శ్వం మాత్రమే. బహుశా మరొక పార్శ్వం అతడి భార్య, పిల్లలు, స్నేహితులు చూసి ఉండరు. దీన్ని అతను ఎవరికీ చూపించడు. అది బలిపశువుకు మాత్రమే చూపించే ముఖం.  ‘‘లేదు, ఇప్పుడు మీరే నాకు లిఫ్ట్ ఇచ్చారు’’ అన్నాను. అతడికి సుమారు యాభై మూడేళ్లు. ఒక కుటుంబానికి పెద్ద అయిన అతడు ఇద్దరు పిల్లల తండ్రి, ఇద్దరు మనుమలకు తాత. వ్యాపారం చేసుకుంటున్నాడు. వేట కోసం అడవి వైపు బయలుదేరాడు. ఈ విషయాలు అతడితో జరిపిన సంభాషణ వల్ల తెలిశాయి. నేనొక సభ్యత గల తెల్ల వ్యక్తిని కలిశాను అని అనిపించింది.
 
 ‘‘నీకు పెళ్లయిందా?’’
 ‘‘అయింది’’ అన్నాను.
 ‘‘పిల్లలు...’’
 ‘‘ముగ్గురు...’’
 ‘‘నీ భార్య అందంగా ఉంటుందా?’’
 ‘‘అందంగా ఉంటుంది.’’
 అతను కాస్సేపు ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయాడు. తరువాత -
 ‘‘ఆమె తెల్లవారి ద్వారా పొందిన పిల్లలు ఎంత మంది?’’
 నా తలమీద పిడుగు పడ్డట్టయ్యింది. ఒక్క క్షణం మౌనం రాజ్యమేలింది.
 నేను నా నల్లటి చేతుల్ని చూసుకున్నాను. వేలికి పెళ్లినాడు నా భార్య తొడిగిన ఉంగరం కనిపించింది. అతను డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. మళ్లీ మా మధ్య సంభాషణ కొనసాగింది. నా భావాలను దాటి అతను ముందుకు సాగుతున్నాడు. అక్కడి తెల్లవాళ్లు నీగ్రో స్త్రీలను ఇష్టపడుతున్నారని చెప్పి, ‘‘నేనూ కావలిసినంత మంది నల్ల ఆడవారిని అద్దెకు తీసుకున్నాను. అలా నియమించుకున్న అందరితోనూ పడుకున్నాను’’ అన్నాడు. ట్రక్ టైర్లు రోడ్డు మీద పరిగెడుతున్న సద్దు వినిపిస్తోంది. ఆ టైర్లు నా గుండెల మీది నుంచే పోతున్నట్టు అనిపించింది. అతను నావైపు తిరిగి అడిగాడు, ‘‘దీని గురించి నీకేమనిపిస్తుంది?’’ ‘‘దీన్ని ఎవరూ ప్రతిఘటించలేదా?’’ నేను అడిగాను. ‘‘వాళ్లకు జీవితం గడవాలి కదా. అంగీకరించకపోతే పని ఉండదు. పని లేకపోతే తినటానికి పిడికెడు మెతుకులు ఉండవు’’ అన్నాడతను వంకరగా నవ్వుతూ. నేను రోడ్డు వైపు చూశాను. పెద్ద పెద్ద పైన్ చెట్లు వెనక్కు పరిగెడుతున్నాయి. వాటి టెర్‌పెంటైన్ వాసన ట్రక్ నడుపుతున్న ఆ తెల్ల వ్యక్తి ధరించిన ఖాకీ బట్టల వాసనతో కలిసి చిత్రమైన వాసన వేస్తోంది.
 
 ‘‘మీకు ఇదంతా విచిత్రంగా అనిపిస్తుంది కదా?’’
 నేనప్పుడు పంటి బిగువున జవాబు చెప్పాల్సి వచ్చింది.
 ‘‘ఆ, ఇందులో ఏముంది ప్రకృతి సహజం...’’ అన్నాను మనస్సు చంపుకుని.
 లేదా ఇంకేదైనా చెప్పి అతను మరింత రెచ్చిపోవటాన్ని తప్పించాల్సి ఉంది. మళ్లీ అతను రెట్టిస్తూ అడిగాడు-
 ‘‘ఏమంటున్నావు?’’
 ‘‘సరైనదే అనిపిస్తోంది...’’ గొణిగాను.
 ‘‘ఇది ఇక్కడ అందరూ చేస్తున్నదే. నీకు తెలియదా?’’
 ‘‘లేదు, నాకు తెలియదు.’’
 
 ‘‘అందరూ ఇదే చేస్తున్నారు. అయినా నీవు ఇందుకు సంతోషపడాలి. ఎందుకంటే మీకు మా వల్ల తెల్లపిల్లలు పుడతారు. మీలో తెల్లవారి రక్తం వచ్చి చేరుతుంది కదా’’ అన్నాడు.  తెల్లవాడి వ్యంగ్యం నా హృదయాన్ని ముక్కలు చేసింది. తెల్లవాళ్లు నీగ్రోల గురించి మాట్లాడేటప్పుడు వారి శీలం పట్ల చాలా చులకనగా మాట్లాడుతారు. వారి లైంగిక నిజాయితీ పట్ల అవహేళనగా మాట్లాడుతారు. వ్యాపిస్తున్న వర్ణ సంకరం పట్ల భయభీతులైనట్లు ప్రవర్తిస్తారు. నీగ్రోకు వంశవాహిక పరిశుద్ధత లేదని ఆక్షేపిస్తారు. దక్షిణ అమెరికాలో ఇప్పటికే వర్ణ సంకరం వాడుకలో ఉంది. దీనికంతా ముఖ్య కారకులు తెల్లవారే. ఇది వారి ద్వంద్వ నీతి. జనాంగపు పరిశుద్ధత గురించి అతడు మాట్లాడుతూనే ఉన్నాడు.
 
 అటు తరువాత నేను ఈ విషయం గురించి కొందరు తెల్లవాళ్లను విచారించినప్పుడు అందరూ దీన్ని నిజమేనన్నారు. దక్షిణ అమెరికాలో ప్రతి పల్లెలోనూ ఇది జరుగుతున్నదే. అయినా దక్షిణ అమెరికాలోని ఈ పరిస్థితి ఎన్నడూ ఏ పత్రికలోనూ వెలుగు చూడలేదు. ఎందుకంటే నాతోపాటు ప్రయాణిస్తున్న తెల్లవ్యక్తి చెబుతున్నట్టు అలబామాకు చెందిన ఏ స్త్రీ (నీగ్రో స్త్రీ) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయదు, చేయలేదు. ఎవరైనా తమకు జరిగిన మానభంగం గురించి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది? నేను ఆలోచిస్తుండగా, అతను నా మౌనాన్ని నా అసహనం అని గుర్తించాడు. ‘‘నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు?’’
 ‘‘టెక్సాస్ నుంచి’’ అన్నాను. ‘‘రావటానికి కారణం?’’
 ‘‘పనికోసం వెదుక్కుంటూ వచ్చాను.’’
 ‘‘ఇక్కడే తిష్ట వేసి సమస్యలు సృష్టించటానికి వచ్చావా?’’
 ‘‘లేదు... లేదు.’’
 ‘‘ఇక్కడ నివాసమేర్పరుచుకుని నీగ్రోలను సంఘటిత పరిస్తే నిన్ను ఎలా మట్టుబెట్టాలో మాకు తెలుసు.’’
 ‘‘నాకు ఆ ఉద్దేశం లేదు.’’
 ‘‘ఇక్కడకొచ్చి కుట్రలు పన్నేవారిని ఏం చేస్తారో తెలుసా?’’
 ‘‘తెలియదు.’’
 ‘‘జైల్లో వేస్తాం. లేదా కాల్చి చంపుతాం.’’
 అతడి క్రూరమైన మాటల వల్ల నాకు బాధ కలిగింది. నేను అతడి ముఖం చూశాను. అతడి నీలిరంగు కళ్లు ఇప్పుడు ఎర్రబారి ఉన్నాయి. అతడి కంఠంలో నీగ్రోలకు సరియైన పాఠం నేర్పిస్తానన్న రోషం ఉంది. ఆ రోషపు తీవ్రత వల్ల నాకు భయం వేసింది. అతడిలో కోపం క్షణక్షణానికి పెరుగుతున్నట్టు అనిపించింది. అతడి కంఠధ్వనిలో ఉద్వేగం, పైశాచికత్వం పొంగింది. రోడ్డు పక్కన దట్టమైన అడవి వెనక్కు జరుగుతోంది. అతను బయటికి చూస్తూ తల ఊపుతూ -  ‘‘నీగ్రోలను చంపి ఈ అడవిలో విసిరేసినా ఎవరూ పట్టించుకోరు. తెలుసా?’’ అన్నాడు.  ‘‘అవును’’ అన్నాను.
 
 నేను మౌనాన్ని ఆశ్రయించాను. ఆ వ్యక్తిని నేను జీవితపు విభిన్న పాత్రల్లో ఊహించటానికి ప్రయత్నించాను. మనుమలతో ఆడుకుంటున్నట్టు, చర్చీలో ప్రార్థన చేస్తున్నట్టు, తెల్లవారగానే లేచి కాఫీ తాగి షేవ్ చేసుకుంటున్నట్టు, భార్యతో స్నేహితుల ఇళ్లకు వెళ్లినట్టు, అయితే ఎందుకో అసాధ్యమనిపించింది. ఆ వ్యక్తి ఇలాంటి నడవడికకు యోగ్యుడు కాదనిపించింది. పోలిక ఎందుకో అసహ్యమనిపించింది. ట్రక్‌లో నేను ఎక్కినప్పుడు అతణ్ని ఒక సౌమ్యుడైన వ్యక్తిగా ఊహించుకున్నాను. ఇదంతా అతడి వ్యక్తిత్వపు ఒక పార్శ్వం మాత్రమే. బహుశా మరొక పార్శ్వం అతడి భార్య, పిల్లలు, స్నేహితులు చూసి ఉండరు. దీన్ని అతను ఎవరికీ చూపించడు. అది బలిపశువుకు మాత్రమే చూపించే ముఖం. ఇతర సమయాల్లో అతనొక ప్రియమైన తండ్రి, ఆత్మీయుడైన స్నేహితుడు, సమాజంలో గౌరవింపబడుతున్న వ్యక్తి.
 
 అతను ముఖం ముడివేసుకున్నాడు. మళ్లీ యధాస్థితికి రావటానికి కొద్ది సమయం పట్టింది. మెయిన్ రోడ్డు నుంచి పక్కకు వెళ్లే ఓ మట్టిరోడ్డు దగ్గర ట్రక్ ఆపాడు. ఆ మట్టి దారిలో అతను వెళ్లాలి. ఇంతసేపు మేమిద్దరం పరస్పరం ఆలోచనల పోరులో నిమగ్నమయ్యామన్న విషయం అతడికి అర్థమై ఉండాలి. ‘‘నేను ఇక్కడి నుంచి అడివిలోకి వెళ్లాలి. బహుశా నీవు మళ్లీ ఈ మెయిన్ రోడ్డు వెంబడే నడిచి వెళ్లాలి’’ అన్నాడు. నేను అతడికి థాంక్స్ చెప్పి, తలుపు తెరిచి ట్రక్ దిగాను. అతను మళ్లీ అన్నాడు - ‘‘ఇది ఎలా జరిగిందంటే మేము మీతో వ్యాపారం చేస్తాం. నిజం. మీ ఆడవాళ్లతో పడుకుంటాం. ఇదీ నిజమే. ఇంతకుమించి మీరెవరూ మా లెక్కలో లేరు. మీరు మా స్థాయికి ఎదగలేరు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవటం మంచిది. దీన్ని మీరు ఎంతగా అర్థం చేసుకుంటే మీరు అంత క్షేమంగా ఉంటారు.’’
 
 ‘‘ఔను ఔను’’ నేను గొణిగాను. తరువాత అతను ట్రక్‌తో పాటు అడవిలో కనుమరుగయ్యాడు. సాయంత్రపు గాలి వీస్తోంది. నేను రోడ్డు దాటి మరొక పక్కకు వచ్చి కూర్చున్నాను. వచ్చే వాహనాల కోసం ఎదురుచూడసాగాను. ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను సురక్షితుణ్నని అనిపించింది. సాయంత్రపు నక్షత్రాలు ఆకాశంలో తొంగి చూడసాగాయి. నేల వేడిమి నింగిని ఆవరించినట్టు ఆకాశం ఎర్రబారసాగింది.
 - మూలం: జాన్ హార్వర్డ్ గ్రిఫన్
 అనువాదం: రంగనాథ రామచంద్రరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement