సృజనం: ఆదాం సమాధి | Dig for Aadham Tomb at Burial ground | Sakshi
Sakshi News home page

సృజనం: ఆదాం సమాధి

Published Sun, Dec 1 2013 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM

సృజనం: ఆదాం సమాధి

సృజనం: ఆదాం సమాధి

నా వెనుక నిలబడి వాటినే చూస్తూ, ‘‘మడుసుల ఊహకు అందవు దేవుని క్రియలు’’ అన్నాడు మామయ్య. నేను గ్లాసు కిందపెట్టి వెళ్దామని లేచాను.
 
 ‘‘ఒరేయ్! ఓ నలుగురు పోయి ఆ సమాధి సంగతి సూడండి’’ పురమాయించాడు మా కుల పెద్ద. దూరం నుంచి రావాల్సిన మేము పొద్దున్నే వచ్చేశాం కాబట్టి పనులు ఊపందుకున్నాయి. అప్పుడే మా పిన్ని పోయి రెండోరోజు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎక్కడ తవ్వాలి అని చర్చ మొదలైంది. ‘‘తూర్పేపున నాయినమ్మ, తాతయ్యలను ఏసిన చోట తవ్వండి’’ మావాళ్లెవరో అన్నారు. ‘‘అక్కడ నేల మరీ చిత్తడిగా ఉంటాది. దక్షిణేపున ఆ ఆదాంగాడి సమాధికి ఎదురుగుండా తవ్వండి. రేపు కొడుకులు సమాధి కట్టిత్తే బాగా ఉంటాది’’ ఇంకెవరో చెప్పారు. అలా నేను మొదటిసారి ఆ సమాధి గురించి విన్నాను. కానీ అప్పటి పరిస్థితుల్లో పెద్దగా పట్టించుకోలేదు. పదకొండు గంటల వేళ చర్చిలో ప్రార్థనలు ముగించి, ఆనుకొనే ఉన్న సమాధి స్థలానికి పెట్టె తీసుకుపోయాం. బరువెక్కిన గుండెలతో మా పిన్నిని ఖననం చేసి, అనాలోచితంగా పరిసరాలు పరిశీలించాను.
 
 సమాధులు కూడా వ్యక్తుల సామాజిక స్థాయి తెలియజేస్తూ విభిన్నంగా ఉన్నాయి. కొన్ని కేవలం మట్టితో కప్పబడి ఉంటే, ఇంకొన్ని త్రిభుజాకారంలో, మరికొన్ని చతుర్భుజాకారంలో సిమెంట్ చేయబడి ఉన్నాయి. స్థితిమంతులు రంగురంగుల టైల్స్ కూడా అంటించారు. మొత్తానికి మనుషులు తమలోని అంతరాలు సమాధుల వద్ద కూడా సమాధి కానివ్వరనిపించింది. దేవుని దృష్టిలో అందరూ సమానమని తెలియజెప్తూ అన్నిటిమీదా శిలువ గుర్తు ఉండటం మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. చుట్టూ ఉన్న వాటిమీద పేర్లు చదువుతూ ముందుకు నడిచాను.
    
ఊరివాళ్లు ఏర్పాటు చేసిన భోజనాలు కానిచ్చి, దినం తేదీ గురించిన చర్చ మొదలెట్టారు మావాళ్లు. అప్పుడు గమనించాను నేను ఆదాం మామయ్య అక్కడ లేకపోవడం. మా ఇంట ఇటువంటి సందర్భాలలో అన్నీ తానై వ్యవహరించేవాడు కనబడకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఊళ్లో ఉండే మా పిన్ని కొడుకుని అడిగాను. వాడు నిర్లక్ష్యంగా చూపు తిప్పుకున్నాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు ముసిముసిగా నవ్వుకోవడం నేను గమనించలేకపోలేదు. మా నాన్నకి బాబాయి కూతురి భర్త ఆదాం మామయ్య. ఈ ఊళ్లోనే స్థిరపడి, మా కుటుంబంలో భాగమైనాడు. రెండేళ్ల క్రితం బాప్ప (మేనత్త) పోయాక, ఉన్న ఒక్క కొడుక్కీ పెళ్లి చేసి వ్యవసాయం అతనికి అప్పజెప్పాడు. కొడుకూ కోడలూ ఇందాక పిన్నిని తీసుకుపోయేటప్పుడు కనబడ్డారు అన్న విషయం గుర్తుకువచ్చి చుట్టూ వెదికాను. వంటింట్లో ఉన్న ఆయన కోడలి దగ్గరకెళ్లి, ‘‘మామయ్యేడమ్మా?’’ అని అడిగాను. ‘‘ఇంటికాడ ఉన్నాడన్నయ్యా. నిన్నోపాలి కనపడి ఎళ్లమన్నాడు’’ అని చెప్పి, తన పనిలో పడిపోయింది. నేను చెప్పులు తొడుక్కుని మెల్లగా ఆదాం మామయ్య ఇంటివైపు నడిచాను.
    
 పంచలో మడత కుర్చీలో కూర్చొని, కాళ్లు పిట్టగోడకు తన్నిపెట్టి కునుకు తీస్తున్నాడు మామయ్య. నేను పిలవంగానే లేచి, నాకు కుర్చీ తెచ్చిచ్చాడు. ఆరడుగుల ఎత్తు, కాయ కష్టంతో గట్టిపడిన శరీరంతో వయసు తెలీకుండా ఉండే మామయ్య - ఇప్పుడు నడుం వంగి, ముడతలు పడిన ఒంటితో బాగా జంకి, మొహం పీక్కుపోయి ఉన్నాడు. ‘‘నువ్వొత్తావని నాకెరకేరా!’’ అన్నాడు కుర్చీలో వెనక్కు వాలి. ‘‘రాకుండా ఎట్టా ఉంటాను మాయ్యా?’’ బాధగా చెప్పాను నేను. ‘‘చిన్నగున్నప్పుడు నన్ను పిన్నమ్మే ఎత్తుకు పెంచిందని మాయమ్మ పద్దాకా చెప్పుతా ఉండేది’’ అన్నాను. తల నిలువుగా ఆడిస్తూ, ‘‘నన్నెతుక్కుంటా వత్తావనిరా నానన్నది’’ అన్నాడు. నాకు అర్థం కాలేదు. ‘‘నువ్వు ఆడ అగుబడలేదు. ఇందాక సమాధి కాడికి రాకపోతివి, వొంట్లో బాలేదేమోనని మీ కోడలిని అడిగి, ఇంటికాడ ఉన్నావంటే ఇట్టా వచ్చా’’ అని చెప్పాను.
 
 నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వి, లేచి లోపలికి వెళ్లి, ఓ కవరు తీసుకు వచ్చి నా చేతిలో పెట్టాడాయన. తెరచి చూస్తే, అందులో రెండు ఫొటోలు ఉన్నాయి. ‘‘ఎవురిది మాయ్యా ఈ సమాదె? దీన్ని ఫొటో ఎందుకు తీయించినారు?’’ నిజంగానే ఆశ్చర్యపోయాను. మళ్లీ నిర్వికారంగా నవ్వాడాయన. ‘‘నువ్వాటికోసమే వచ్చావనుకున్నాన్రా. పీటరు నీకేటి సెప్పనేదా సమాధి గురించి?’’ ‘‘లేదు మాయ్యా!  పీటరు సమాధి గురించి సెప్పడమేటి?’’ నాకు అర్థం కాక అడిగాను. కుర్చీలో ముందుకు వంగి, శూన్యంలోకి చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు ఆదాం మామయ్య.


 ‘‘నీ కూతురు పెళ్లికి ఊరి నుండి మనోళ్లనందర్నీ తీసుకెళ్లినావు గదా. నీతో సదువుకున్న పంతులుగోరి పిల్లాడు పీటర్ను కూడా పిల్సినావు గందా. ఆళ్ల నాన్నది మా ఊరే, ఆల్లదీ మా ఇంటి పేరే. అప్పట్లో రాకపోకలు బాగానే ఉండేయి. పంతులుగోరు ఈ ఊళ్లో పనిసేసేటప్పుడే పీటరు తల్లి కలరా తగిలి పోయింది. ఇక్కడే చర్చిలో సమాధి సేశారు. ఆడికి అప్పుడు పదేళ్లుంటాయనుకుంటా. మీ బాప్పే ఆడిని కొన్నాళ్లు సాకింది. తరవాత పంతులుగోరికి బదిలీయై, ఏరే ఊరెళ్లిపోయినారు. కానొరే ఆడు ఇన్నేళ్ల తరవాత కూడా నన్ను గుర్తెట్టుకొని అభిమానంగా కొత్త బట్టలు కొనిపెట్టాడ్రా’’ కళ్లు తుడుచుకున్నాడు మామయ్య.
 
 నా ఒక్కగానొక్క కూతురు పెళ్లికి మా చుట్టాలనందరినీ తీసుకెళ్లాను. ఇంటర్నెట్టు పుణ్యమా అని మా ఊరి బడిలో చదువుకున్న వాళ్లందరమూ ఓ గ్రూపుగా ఏర్పడ్డాము. వారిని కూడా పెళ్లికి ఆహ్వానించాను. అలా వచ్చినవారిలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే పీటరు కూడా ఒకడు. ‘‘బాబాయ్! బాబాయ్! అంటా ఆ రోజంతా ఆడు నన్ను ఇడసనేలేదు. మా సుట్టపోళ్లందర్నీ అడిగాడు. మాటల్లో నాను మీ బాప్ప సచ్చిపోయిన ఇసయం సెప్పా. పంతులుగోరు పోయినేడు ఆడు కలకత్తాలో పన్జేత్తన్నప్పుడు పోయినాడంట. అప్పుడు ఆడ చర్చిలో డబ్బు కట్టి పూడ్చినాడంట. ఎంత బతిమాలినా ఆళ్ల సంఘపోళ్లకు తప్ప ఏరేటోళ్లకి సమాధి కట్టుకోడానికి ఒల్లకోలేదని సెప్పి, శాన బాధపడ్డాడు. ఈయాళ ఎంత సంపాయిచ్చినా కన్నోళ్లకు గురుతుగా ఏమీ సెయ్యలేకపోతన్నానని ఊళ్లోని ఆళ్లమ్మ సమాధి గురించి అడిగినాడ్రా. అప్పట్లో ఇట్టా సిమెంటుతో కట్టే పద్వాతినేదని నాపరాయి మీన పేరుసెక్కి అడుసు అలికేవోళ్లని సెప్పాను. చర్చీ లోపల ఆ రాళ్లు తప్పక పడి ఉంటాయన్నాను. ఆడు ఆ రాయి ఉన్న శోట సిమెంటుతో సమాధి కట్టాలంటే చర్చీకి ఎంత సొమ్ము చెల్లించాలని అడిగాడ్రా’’ మామయ్య ఉద్వేగానికి లోనవుతున్నాడు. నేను భుజం మీద చెయ్యి వేసి, ఆయన్ను శాంతపరిచే విధంగా ఏదో చెప్పబోయాను.
 
 ‘‘నాను ఆడిని మోసం సెయ్యనేదురా’’ అని తల ఆడిస్తూ కుర్చీలో వెనక్కు వాలాడు. కాసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. మళ్లీ ఆయనే, ‘‘ఇంకా పల్లెటూళ్లలో అంత దుస్థితి రానేదని, కట్టుడు ఖరుసు పెట్టుకుంటే సాలన్నాను. ఆడు శానా సంతోశంతో ఎంటనే జేబీలో నుండి కొంత సొమ్ము తీసి ఇచ్చినాడు. పాలరాయి బిళ్లలు అంటిత్తే బాగుంటాదని చెప్పితే ఇంకొంత ఆడూరెళ్లాక అంపిత్తానన్నాడు’’ నా భృకుటి ముడిపడింది. మామయ్య చెప్పుకుపోతున్నాడు, ‘‘తిరిగొచ్చాక నాను చర్చీ చుట్టూతా ఎదికాను కానీ ఆ తల్లి సమాధి రాయి యాడా నాకు అగుబడనేదు. కొంతమంది పెద్దోళ్లని అడిగినా ఎవ్వురూ కచ్చితంగా సెప్పనేక పోయినారురా. తుఫానులు, కొన్నిసార్లు మెరక తోలడం వల్ల కొన్ని రాళ్లు భూమిలో దిగబడి పోనాయనుకుంటా. కాలం గడిసిపోతా ఉన్నాది, దుడ్డు నా సేతిలో నుండి జారిపోతా ఉంది - అప్పుడే సమాధుల పండగొచ్చింది. మీ బాప్ప గోతి కాడ మైనపొత్తులు ఎలిగిత్తాంటే నాకు పీటరోళ్లమ్మ దీనంగా సూత్తన్నట్టుగా అనిపించినాదిరా. నా పానం అల్లాడిపోనాదిరా. ఏదో ఒకటి సెయ్యాలని నిర్ణయించేసుకుని ఎన్నో ఇదాల ఆలోశించాను.   నీ కూతురు నెల తప్పిందని తెల్సింది. నువైదో నెల్లో సలివిడి తీసుకురమ్మంటావని, అప్పుడు తప్పనిసరిగా ఈ ఇషయం అడుగుతావని - ఈలోపే కట్టించేద్దారని, నా కొడుక్కూడా తెలీకుండా అప్పుసేశాను. తాపీ మేస్త్రీని మాటాడాను. ఇసకా, ఇటికా, సిమెంటు తోలించాను.’’
 
 మామయ్య లోనికి వెళ్లి గ్లాసులో చల్ల తెచ్చి ఇచ్చాడు. ఏదో మాటలాడాలని తపిస్తున్నా కానీ, నా నోరు పెగలడం లేదు. ఓసారి కవరులో నుంచి ఫొటోలు తీసి చూశాను. నా వెనుక నిలబడి వాటినే చూస్తూ, ‘‘మడుసుల ఊహకు అందవు దేవుని క్రియలు’’ అన్నాడు మామయ్య. నేను గ్లాసు కిందపెట్టి వెళ్దామని లేచాను. ‘‘పీటరు నాకు ఇచ్చిన దాంట్లో సగం సొమ్ముకు ఇది కట్టించాను - మొత్తం మెడితే పాలరాయితో తయారయ్యేదే, కానీ...’’ నేను ఒక అడుగు ముందుకు వేసి వెనుతిరిగి ఆగాను.
 
 ‘‘ఏదో దిక్కున ఆరడుగుల్లో కట్టీసెయ్యమని మేస్త్రీకి సెప్పాను. అప్పుడే ఎనకీదిలో మన సంఘత్తురాలు ఒకామె పోతే సూసొద్దారని ఎళ్లాను. ఆమె పేరు మారతమ్మ. పీటరోళ్లమ్మ పేరు కూడా అదే. ఎంటనే నాను ఒక ఆలోచన సేశాను. కూలిపంజేస్కునే ఆ మారతమ్మ కొడుక్కూడా దానికి తలాడిచ్చాడు. ఆళ్లు తీపించిన గోతిలో మేస్త్రీ బేస్మెంటు ఏశాడు. తన తల్లికి సమాధి కట్టించమని పీటరు ఇచ్చిన సొమ్ముతో ఎవురికో కట్టించి, దాన్ని సూపించి ఆడిని నమ్మిద్దారనుకున్నాను. ఇశ్వాస మూలం కానిది పాపము అని బైబిలు వాక్యం. సకలాలోచనలూ ఎరిగిన భగమంతుడు నా పాపానికి జీతాన్ని ఇక్కడే ఇచ్చేశాడ్రా’’ మామయ్య పిట్టగోడ మీద కూర్చుని కన్నీరు కార్చాడు. నేను నిలబడే వింటున్నాను.
 
 ‘‘రోజు కూలీలు పని తొరగా చెయ్యరని నాను ఆడనే కూసొని అదిలిచ్చేవోడిని. అది సూసి జనం నొసలు చిట్లించారు. ఇంటి పేరుతో సహా పలానోళ్ల భార్య అనో, తల్లి అనో రాయించాల్సిన రాయి మీద ఒట్టిగా ‘శ్రీమతి మారతమ్మగారు ప్రభువునందు నిదురించారు’ అని యేయించాను- తారీకులు కూడా లేకుండా. దానికీ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఆదాం గాడికి ఈ సమాధి మీద ఇంత ఇదేంటని. తరువాత టవును నుండి ఫొటోవులబ్బాయిని తీస్కవచ్చి పీటర్కు అంపిద్దారని ఫొటోవులు దింపాను. అది సూసిన గొడ్లు కాచే పిళ్లోళు ఇళ్లకెళ్లి చెప్పారు. అంతే, ఊరు ఊరంతా గుప్పుమంది. రకరకాల కథలు పుట్టుకొచ్చేశాయి. నాను సెప్పేదంతా ఇనేటోళ్లు నా ఎనకే నవ్వేటోళ్లు. ఆకిరికి నా కొడుకూ కోడలూ కూడా సొంత పెళ్లానికి ఒగ్గేసి అరువుదెచ్చి మరీ ఏరోళ్లకు కట్టించినానని నిలదీసినారు. దానికి ‘ఆదాం సమాధి’ అని పేరెట్టి ఊళ్లో అంతా ఎళాకోళంగా...’’ ఇంక మాట్లాడలేకపోయాడు మామయ్య - నేనూ మాట్లాడకుండా వచ్చేశాను.
 
    
 ‘‘ఇంత శ్రమకోర్చి, నిందలు పడీ కట్టించినదానిని చూడటానికి అంకులు లేరని తెలిస్తే, తాతయ్య బాధపడతారని అక్కడ ఆయనకు చెప్పకుండా వీటిని ఇక్కడకు తీసుకొచ్చి చించేశారన్నమాట’’ అడిగింది నా కూతురు. నేను చింపి వేసిన ఫొటో ముక్కలు టేబులుపై తిరిగి అమర్చే ప్రయత్నం చేస్తూ, తల అడ్డంగా ఊపుతూ, రెండు చేతులతో వాటిని ఓ దగ్గరకు చేర్చాను. నా కన్నీటి బొట్లు నా చేతుల మీదే పడ్డాయి. ‘‘నీ పెళ్లైన వారం పది రోజులకే పీటరు నా బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని, కొంత సొమ్ము దాంట్లో జమ చేశాడు. పెళ్లిలో బహుమతి చదివించావు కదరా మళ్లీ ఇదేమిటి అనడిగితే, ‘మా ఆదాం బాబాయ్‌కి అందించరా’ అని మాత్రమే చెప్పాడమ్మా’’ నా గొంతు గద్గదమవుతుంది, మా అమ్మాయి నన్నే చూస్తుంది.
 
 అసలు ఆ విషయం చెబుదామనే మొన్న ఆదాం తాతయ్యను వెదుక్కుంటూ వాళ్లింటికి వెళ్లాను. కానీ ఆయన చెప్పింది విన్నాక, నేను చేసిన పనికి సిగ్గేసిందమ్మా.   ‘‘వ్యవసాయానికి పెట్టుబడి కావాలనో, కొడుకు తనను సరిగా చూడటం లేదనో తాతయ్య పీటరు దగ్గర బీద ఏడుపులు యేడ్చి ఉంటాడు. అందుకు జాలిపడి వాడు ఆయనకు ఇమ్మని డబ్బు పంపాడనుకున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకూడదంటే ఆదిలోనే తొక్కేయాలని, నేను ఆ సొమ్ము గురించి తాతయ్యకు చెప్పలేదమ్మా. కొన్నాళ్లకు పీటరు పోయాడని తెలిసింది. వెంటనే వాడి కొడుక్కు ఫోను చేసి, ఈ డబ్బు విషయం చెప్పాను. అతను మా నాన్న ఎవరికి ఇవ్వాలని ఆశించారో వారికే అందజేయండి అన్నాడు. అసలు ఆ విషయం చెబుదామనే మొన్న ఆదాం తాతయ్యను వెదుక్కుంటూ వాళ్లింటికి వెళ్లాను. కానీ ఆయన చెప్పింది విన్నాక, నేను చేసిన పనికి సిగ్గేసిందమ్మా.’’
 
    
 ఉపసంహారం: మా పిన్ని సమాధి ఐదేళ్లకే బీటలు వారింది. మూడేళ్లు శ్రద్ధ వహించిన కొడుకులు, తరువాత పట్టించుకోవడం మానేశారు. ఆదాం మామయ్య శాశ్వతంగా అదే చర్చి ప్రాంగణానికి చేరిపోయాడు. పట్టుబట్టి కొడుకు ఆయన్ని వేరే దిక్కున పొడుకోబెట్టాడు. ఆపై పొలాలు అమ్ముకొని దగ్గర్లోని టౌవునుకు వలసపోయాడు. నేనూ పట్టణంలోని ఓ సిమెట్రీలో స్థలం కొనుక్కుని సెటిలైపోయాను. మారతమ్మ కొడుకు అవమాన భారంతో ఊరు వదిలి పోయాడు. కానీ ఊరి జనం ఇంకా ఆ సమాధి గురించి ఎగతాళిగా మాటలాడతానే ఉన్నారు. కారణం ప్రతీ సంవత్సరం సమాధుల పండుగకు నెలరోజుల ముందు చర్చి పాస్టరు పేరు మీద మనియార్డరు ద్వారా కొంత సొమ్ము అందుతోంది. ఫ్రమ్ అడ్రస్సు తప్పుగా రాసినా, నా కూతురు ఎం.ఒ. ఫారమ్ మీద ఒక వాక్యం మాత్రం ఎప్పుడూ కరెక్టుగానే రాస్తుంది. ‘ఆదాంగారి సమాధికి మరమ్మత్తులు చేయించి, సున్నాలు వేయించండి’ అని. మేము ఆశించిన సమాధికే సున్నాలు పడుతున్నాయి. ఎందుకంటే ఆదాం మామయ్యకు ఆయన కొడుకు అసలు సమాధినే కట్టించలేదు.
 - అనీల్ ప్రసాద్ లింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement