
ఛత్రపతి శివాజీ
ప్రపంచంలో లక్షాధికారులు చాలామందే ఉంటారు. లక్షల సంపద పోగేసుకున్న వారు కాదు, చెక్కుచెదరని లక్ష్యశుద్ధి ఉన్నవారు మాత్రమే ప్రజలకు మార్గదర్శకులు కాగలరు. అలాంటి వారే లక్ష్యాధికారులు అవుతారు. ప్రజల మీద అపారమైన ప్రేమతో, పీడన నుంచి, దోపిడీ నుంచి ప్రజలను విముక్తం చేయాలనే ఉన్నత లక్ష్యంతో పోరాటం సాగించిన ధీరోదాత్తులు మాత్రమే చరిత్రలో వీరులుగా నిలిచిపోతారు. అలాంటి వీరులనే ప్రజలు మనస్ఫూర్తిగా మననం చేసుకుంటారు. ఛత్రపతి శివాజీ జయంతి (ఫిబ్రవరి 19) సందర్భంగా కొందరు వీరుల గురించి సంక్షిప్తంగా...
ఛత్రపతి శివాజీ
మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ. శివాజీ తండ్రి షాహాజీ ఒక సేనాని. బీజాపూర్ రాజ్యంలోని కొన్ని జాగీర్లపై ఆయనకు ఆధిపత్యం ఉండేది. తల్లి జిజియాబాయి చిన్నప్పుడు శివాజీకి రామాయణ, మహాభారత కథలు, వీరుల గాథలు చెప్పేది. శివాజీపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది. సుల్తానుల పాలన నుంచి మరాఠా ప్రజలను విముక్తం చేయాలనే లక్ష్యంతో పోరాటం సాగించి, స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మరాఠాలను ఏకం చేసి బీజాపూర్ సుల్తాను అదిల్‌షాహీ సేనలతో పలుమార్లు యుద్ధాలు చేశాడు. బీజాపూర్ రాజ్యంలోని భూభాగాన్ని చాలావరకు కైవసం చేసుకుని, 1674లో స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరాఠా రాజ్యానికి మొఘల్‌ల నుంచి ముప్పు ఉండటంతో ఔరంగజేబు హయాంలోని మొఘల్ సేనలతో కడవరకు పోరాటం సాగిస్తూనే వచ్చాడు.
మహారాణా ప్రతాప్
ఉత్తర భారతదేశంలోని చాలా భాగం బలమైన మొఘల్ సామ్రాజ్యం పరిధిలో ఉన్న కాలంలో మేవార్ రాజ్యాన్ని ఏలిన రాజపుత్రుడు మహారాణా ప్రతాప్. మొఘల్ చక్రవర్తి అక్బర్‌ను ఎదిరించిన ఏకైక వీరుడు. అప్పట్లో గుజరాత్ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యం పరిధిలో ఉండేది. మేవార్ మీదుగా గుజరాత్‌కు దగ్గరి రహదారిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అక్బర్ చక్రవర్తి చాలా ప్రయత్నాలే చేశాడు. అక్బర్ సేనలు మేవార్ తూర్పు భూభాగాన్ని కొంతవరకు ఆక్రమించుకున్నా, దుర్గమారణ్యాలతో నిండిన పడమటి ప్రాంతాన్ని మాత్రం ఆక్రమించుకోలేకపోయాయి.
రాణి దుర్గావతి
సామ్రాజ్య విస్తరణ కాంక్షతో దురాక్రమణకు తెగబడ్డ మొఘల్ సేనలను తరిమికొట్టిన వీరవనిత రాణి దుర్గావతి. చందేల్ యువరాణి అయిన దుర్గావతి గోండు రాకుమారుడు దల్‌పత్‌షాను పెళ్లాడింది. కొంత కాలానికి వారికి కొడుకు వీర్ నారాయణ్ పుట్టాడు. తర్వాత ఐదేళ్లకే దల్‌పత్‌షా మరణించడంతో దుర్గావతి రాజ్యభారాన్ని స్వీకరించింది. మాల్వా రాజు బాజ్ బహదూర్ గోండు రాజ్యంపై యుద్ధానికి దిగి దుర్గావతి సేనల చేతిలో చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో బయటపడ్డాడు. ఆ తర్వాత మొఘల్ సేనలు బాజ్ బహదూర్‌ను ఓడించడంతో మాల్వా రాజ్యం మొఘల్ అధీనంలోకి వచ్చింది. మాల్వా సరిహద్దుల్లోనే ఉన్న గోండు రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు మొఘల్ సేనలు దండెత్తినప్పుడు రాణి దుర్గావతి యుద్ధరంగంలోకి దిగి, ఒక దశలో వారిని తరిమి కొట్టింది. మొక్కవోని ధైర్యంతో పోరాటం కొనసాగించింది. చివరకు ఓటమి అనివార్యమవడంతో యుద్ధరంగంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మాహుతి చేసుకుంది.
రాణి చెన్నమ్మ
సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిని ఎదిరించిన వీర వనిత కిట్టూరు రాణి చెన్నమ్మ. తన సొంత రాజ్యానికి రాణి అయింది. దేశాయ్ వంశానికి చెందిన రాజా మల్లసర్జను పెళ్లాడింది. చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందింది. రాజా మల్లసర్జ, రాణి చెన్నమ్మ దంపతులకు ఒక కొడుకు పుట్టి చనిపోవడంతో శివలింగప్ప అనే బాలుడిని దత్తత తీసుకుని, అతడిని సింహాసనానికి వారసుడిగా ప్రకటించింది. శివలింగప్ప రాజ్యాధికారం చేపట్టడానికి వీల్లేదంటూ అప్పటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అభ్యంతరపెడుతూ జారీ చేసిన ఆదేశాలను చెన్నమ్మ పట్టించుకోలేదు. ఆగ్రహించిన బ్రిటిష్ బలగాలు కిట్టూరు ఖజానాను స్వాధీనం చేసుకోవడానికి దాడికి తెగబడ్డాయి. రాణి చెన్నమ్మ వీరోచితంగా బ్రిటిష్ సేనలను ఎదిరించింది. తొలి విడత పోరులో బ్రిటిష్ సేనలు భారీనష్టాన్ని చవిచూశాయి. యుద్ధంలో బ్రిటిష్ కలెక్టర్, రాజకీయ ప్రతినిధి సెయింట్ జాన్ థాకరే మరణించాడు.రెండో విడత పోరులో సబ్‌కలెక్టర్ మన్రో మరణించాడు. రాణి చెన్నమ్మ వీరోచిత పోరాటం సాగించినప్పటికీ, బ్రిటిష్ బలగాలు ఆమెను పట్టి బంధించి, కోటలోనే బందీ చేశాయి. ఆమె ఆ కోటలోనే ప్రాణాలు విడిచింది.
రాణి లక్ష్మీబాయి
1857 నాటి మొదటి స్వాతంత్య్ర సమరంలో బ్రిటిష్ సేనలను ఎదిరించిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆమె అసలు పేరు మణికర్ణిక. వారణాసిలో పుట్టింది. ఝాన్సీ రాజు గంగాధరరావును పెళ్లాడటంతో అప్పటి సంప్రదాయం ప్రకారం లక్ష్మీబాయిగా పేరు మార్చుకుంది. పెళ్లయిన పదకొండేళ్లకే భర్త మరణించడంతో రాజ్యభారం స్వీకరించింది. అప్పటికి దత్తపుత్రుడు ఇంకా పసివాడే. లక్ష్మీబాయి భర్త మరణం తర్వాత నాటి బ్రిటిష్ ప్రభుత్వం రాణి అధికారాన్ని గుర్తించ నిరాకరించింది. ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి సేనలను పంపింది. వీరోచిత పోరాటం సాగించిన లక్ష్మీబాయి దత్తపుత్రుడితో సహా కోటను వీడి రాణి మహల్‌కు చేరుకుంది. అక్కడకు వచ్చిన బ్రిటిష్ దూతతో ఝాన్సీని వదులుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందింది.
వేలు నాచియార్
బ్రిటిష్ వారిని యుద్ధరంగంలో ఎదిరించడమే కాదు, వారిపై విజయం కూడా సాధించిన తొలి వీరనారి వేలు నాచియార్. ఆమె రామ నాథపురం యువరాణి. శివగంగై రాజు ముత్తువడుగణతపెరియ ఉదయదేవర్‌ను పెళ్లాడింది. వారికి వెల్లాచ్చి అనే కుమార్తె కలిగింది. ఆర్కాట్ నవాబు సేనలు, బ్రిటిష్ సేనలతో జరిగిన యుద్ధంలో నాచియార్ భర్త ఉదయదేవర్ వీరమరణం చెందాడు. భర్త మరణంతో నాచియార్ తన కుమార్తెను తీసుకుని కోట వదిలి దిండిగల్ చేరుకుని, అక్కడే ఎనిమిదేళ్లు అజ్ఞాతంలో గడిపింది. అజ్ఞాతంలో ఉంటూనే సైనిక శక్తిని పోగు చేసుకుంది. దిండిగల్ పాలకుడు గోపాల నాయకర్, హైదర్ అలీల సైనిక సహకారంతో 1780లో బ్రిటిష్ వారిపై యుద్ధానికి దిగింది. వేలు నాచియార్‌కు విశ్వసనీయురాలైన కుయిలి బ్రిటిష్ ఆయుధాగారంపై ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో బ్రిటిష్ బలగాలు బెంబేలెత్తిపోయాయి. యుద్ధంలో గెలుపొందిన వేలు నాచియార్ తిరిగి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. నాచియార్ తర్వాత ఆమె కుమార్తె వెల్లాచ్చి శివగంగై రాజ్య బాధ్యతలు చేపట్టింది.
కన్నెగంటి హనుమంతు
‘నీరు పెట్టావా, నారు వేశావా, కోత కోశావా, కుప్ప నూర్చావా... ఎందుకు కట్టాలిరా శిస్తు?’ అంటూ బ్రిటిష్ వారి దాష్టీకాలపై గర్జించిన తెలుగు వీరుడు కన్నెగంటి హనుమంతు. బ్రిటిష్ పాలకులు ప్రజల ముక్కుపిండి అన్యాయంగా పన్నులు వసూలు చేయడానికి వ్యతిరేకంగా తిరగబడ్డ కన్నెగంటి హనుమంతు పల్నాడు ప్రాంతంలోని మించాలపాడు గ్రామంలో పుట్టాడు. జనాన్ని కూడగట్టుకుని బ్రిటిష్ వారిపై తిరగబడ్డ హనుమంతు పోలీసుల తూటాలకు నేలకొరిగాడు. హనుమంతు మరణంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహం పల్నాడు తిరుగుబాటుకు దారితీసింది.
తిరోత్ సింగ్
బ్రిటిష్ వారిపై తొలి స్వాతంత్య్ర పోరాటానికి ముందే వారిని ఎదిరించిన గిరిజన నాయకుడు తిరోత్ సింగ్. బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలో ఖాసీ తెగకు చెందిన తిరోత్ సింగ్ తన ప్రాంత ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరు సాగించాడు. బ్రిటిష్ వారు తుపాకులు, ఫిరంగులతో యుద్ధానికి దిగితే, తిరోత్ సింగ్ నాయకత్వంలో ఖాసీలు సంప్రదాయ ఆయుధాలతోనే వారిని ఎదిరించారు. తూటా గాయాలకు గురైన తిరోత్ సింగ్ ఒక గుహలో తలదాచుకున్నాడు. ఒక నమ్మకద్రోహి కారణంగా బ్రిటిష్ వారికి బందీగా చిక్కాడు. అతడిని ఢాకాకు తరలించగా, అక్కడే 1835 జూలై 17న కన్నుమూశాడు.
బిర్సా ముండా
బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గిరిజన యోధుడు బిర్సా ముండా. ‘అబువా రాజ్ సెతెర్ జానా, మహారాణి రాజ్ తుండు జానా’ (ఇప్పుడిక మన రాజ్యం రావాల్సిందే... మహారాణి రాజ్యం అంతం కావాల్సిందే) నినాదంతో గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చి, తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. చక్రధర్‌పూర్ సమీపంలోని అడవిలో నిద్రిస్తున్న సమయంలో బ్రిటిష్ బలగాలు బిర్సా ముండాను నిర్బంధంలోకి తీసుకుని, రాంచీ జైలుకు తరలించాయి. అక్కడే అతడు 1900 జూన్ 9న అనుమానాస్పదంగా మరణించాడు.
ఖుదీరామ్ బోస్
స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడు ఖుదీరామ్ బోస్. బెంగాల్ ప్రెసిడెన్సీ చీఫ్ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ను హతమార్చడానికి ముజఫర్‌పూర్‌లో చేసిన ప్రయత్నం కూడా విఫలం కావడంతో కాలిబాటన తప్పించుకుని పారిపోతూ వైని స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద రెండు రివాల్వర్లు, తూటాలు బయటపడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం అతడికి ఉరిశిక్ష విధించింది. అప్పటికి అతడి వయసు పద్దెనిమిదేళ్లు మాత్రమే.
అల్లూరి సీతారామరాజు
బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. స్వాతంత్య్రం సాధించడానికి సాయుధ పోరాటమే మార్గమని నమ్మి, కడవరకు పోరాటం సాగించాడు. గిరిజనులను ఏకం చేసి, వారిని పోరుబాట పట్టించాడు. అప్పటి స్పెషల్ కమిషనర్ రూథర్‌ఫర్డ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ బలగాలు సీతారామరాజు ఆచూకీ కోసం మన్యం ప్రజలను నానా హింసలు పెట్టారు. చివరకు ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి ఆయనను నిర్బంధించారు. తర్వాత ఎలాంటి విచారణ లేకుండా చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు.
బేగమ్ హజ్రత్ మహల్
సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన వీరనారీమణులలో ఒకరు బేగమ్ హజ్రత్ మహల్. బ్రిటిష్ సేనలు 1856లో అవ«ద్ రాజ్యాన్ని ఆక్రమించుకోవడంతో రాజు వజీద్ అలీ షా కలకత్తాకు చేరుకుని, అక్కడ ప్రవాస జీవితం గడపసాగాడు. అయితే, రాణి హజ్రత్ మహల్ రాజ్యభారాన్ని తన చేతుల్లోకి తీసుకుని, బ్రిటిష్ బలగాలను తిప్పికొట్టి, తన కొడుకు బిర్జిస్ ఖద్రాను అవ«ద్ పాలకుడిగా ప్రకటించింది. కొంతకాలానికి బ్రిటిష్ సేనలు మరిన్ని బలగాలతో విరుచుకుపడి అవ«ద్‌ను ఆక్రమించుకోవడంతో హజ్రత్ మహల్ నేపాల్‌లో ఆశ్రయం పొంది, శేషజీవితాన్ని అక్కడే ముగించింది.
తిరుపూర్ కుమరన్
అహింసా మార్గంలో బ్రిటిష్ వారిపై స్వాతంత్య్ర ఉద్యమాన్ని సాగించి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు తిరుపూర్ కుమరన్. మద్రాసు ప్రెసిడెన్సీలోని చెన్నిమలైకి చెందిన కుమరన్ దేశబంధు యువజన సంఘాన్ని స్థాపించి యువకులందరినీ ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించాడు. ఒకసారి తిరుపూర్‌లోని నొయ్యల్ నదీ తీరంలో జాతీయ జెండాను చేత పట్టుకుని నిరసన ప్రదర్శన చేస్తుండగా, బ్రిటిష్ పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాలతో కుమరన్ చేతిలో జెండాను పట్టుకునే ప్రాణాలు విడిచాడు.
చంద్రశేఖర్ ఆజాద్
చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. పోలీసులు కోర్టులో హాజరుపరచినప్పుడు పేరేంటని అడిగిన జడ్జికి తన పేరు ‘ఆజాద్’ అని బదులివ్వడంతో చంద్రశేఖర్ ఆజాద్‌గా ప్రసిద్ధి పొందాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ 1922లో అర్ధంతరంగా నిలిపివేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆజాద్, బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి సాయుధ మార్గంలో పోరు సాగించాడు. అలహాబాద్‌లోని ఒక పార్కులో ఉండగా, పోలీసులు చుటుముట్టి కాల్పులు జరిపారు. ఆజాద్ వారిని తన తుపాకితో ఎదిరించి, ముగ్గురు పోలీసులను మట్టుబెట్టాడు. గాయపడిన ఆజాద్, పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో తనను తాను కాల్చుకుని ప్రాణాలు విడిచాడు.
భగత్ సింగ్
సాయుధ మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించి, ధైర్యంగా ఉరిశిక్షను ఎదుర్కొన్న ధీరుడు భగత్ సింగ్. లాలా లజపత్‌రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ను అంతం చేయాలనుకున్నాడు. తన సహచరుడు శివరామ్ రాజగురుతో కలసి పొరపాటున జేమ్స్ స్కాట్ అనుకుని జేమ్స్ సాండర్స్ అనే బ్రిటిష్ పోలీసు అధికారిపై కాల్పులు జరిపాడు. బ్రిటిష్ చట్టాలకు నిరసనగా సెంట్రల్ అసెంబ్లీ సమావేశం కొనసాగుతుండగా, బటుకేశ్వర్ దత్ అనే సహచరుడితో కలసి అసెంబ్లీ హాలులోకి రెండు బాంబులు విసిరాడు. పోలీసులు అక్కడే వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో భగత్ సింగ్‌తో పాటు ఆయన సహచరులు రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఉరిశిక్ష పడింది.
కొమరం భీమ్
బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతంలో ఒకవైపు స్వాతంత్రోద్యమం కొనసాగుతున్న కాలంలో తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరు సాగించిన గిరిజన వీరుడు కొమరం భీమ్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పరిసరాల్లోని గిరిజనులను ఏకం చేసి, గెరిల్లా పద్ధతుల్లో నిజాం సైనికులను ఎదిరించాడు. భీమ్ తండ్రి ఆదివాసీల హక్కులపై ప్రశ్నించిన పాపానికి అతన్ని నిజాం అటవీ అధికారులు హతమార్చారు. ఆ సంఘటన భీమ్‌పై బాగా ప్రభావం చూపింది. యువకుడిగా ఎదిగిన తర్వాత ‘జల్, జంగిల్, జమీన్’ నినాదంతో గిరిజనులను ఏకం చేశాడు. తాలూక్‌దార్ అబ్దుల్ సత్తార్ ఆధ్వర్యంలో పోలీసులు తుపాకులతో కాల్పులు జరిపినప్పుడు భీమ్ నాయకత్వంలోని గోండులు విల్లంబులతో వారిని ఎదిరించారు. ఆ పోరాటంలోనే కొమరం భీమ్ అమరుడయ్యాడు.
1857 నాటి వీరులు...
వివిధ కాలాల్లో, వివిధ సందర్భాల్లో ప్రజలకు అండగా ఉంటూ, స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరుబాటలో ముందుకు సాగిన వారు చాలామందే ఉన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగినప్పుడు ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో మంగల్ పాండే, బహదూర్ షా, బఖ్త్ ఖాన్, నానా సాహెబ్, తాంతియా తోపే, సురేంద్ర సాయి, మౌల్వీ అహ్మదుల్లా, మౌల్వీ లియాఖత్ అలీ, తుఫ్జల్ హసన్ ఖాన్, మహమ్మద్ ఖాన్, అబ్దుల్ అలీ ఖాన్, ఖాన్ బహదూర్ ఖాన్, ఫిరోజ్ షా, కందర్పేశ్వర సింగ్, రాజా ప్రతాప్ సింగ్, జయ్‌దయాల్ సింగ్, హర్‌దయాల్ సింగ్, గజాధర్ సింగ్, కదమ్ సింగ్, కున్వర్ సింగ్, అమర్ సింగ్ వంటి వీరులు ఉన్నారు. వీరందరూ శాయశక్తులా సాయుధ మార్గంలోనే బ్రిటిష్ బలగాలను ఎదిరించారు. పోరుబాటలో సాగిన వారిలో కొందరు యుద్ధక్షేత్రంలో ప్రాణాలు కోల్పోతే, మరికొందరు బ్రిటిష్ సేనలకు చిక్కి మరణశిక్షలకు, జైలు శిక్షలకు గురయ్యారు. ఆధునిక ఆయుధ సంపత్తి, భారీ సైనిక బలగాల సాయంతో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సిపాయిల తిరుగుబాటును, ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో చెలరేగిన పోరాటాలను అణచివేసింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరికం భారత భూభాగంపై ఆధిపత్యాన్ని కైవసం చేసుకుంది.
మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత...
మొదటి స్వాతంత్య్ర సంగ్రామం తర్వాతి కాలంలో పూణేలో ఐక్యవర్ధినీ సభను స్థాపించిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే దక్కన్ ప్రాంతంలో విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. ఒక నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల బ్రిటిష్ పోలీసులకు పట్టుబడి జైలు పాలైనా, జైలు నుంచి పారిపోయాడు. అయితే, మళ్లీ పట్టుబడి జైలు పాలయ్యాడు. జైలులోనే ఆమరణ నిరాహారదీక్ష సాగిస్తూ 1883 ఫిబ్రవరి 17న ప్రాణాలు విడిచాడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో అహింసా మార్గంలో స్వాతంత్య్ర ఉద్యమం అప్పటి ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపింది. అదేకాలంలో బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టడానికి సాయుధ మార్గమే సరైనదని తలచి, విప్లవ సంస్థలను ఏర్పరచి పోరు కొనసాగించిన యోధులు చాలామంది ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం 1905లో బెంగాల్ విభజనకు తెగబడటంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టాలనే ఉద్దేశంతో తూర్పు బెంగాల్‌లో ప్రమథనాథ్ మిత్రా ‘అనుశీలన్ సమితి’ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. అదేకాలంలో కొందరు సాయుధ మార్గంలో ‘గదర్ పార్టీ’ని నెలకొల్పారు. అరబిందొ ఘోష్, ఆయన సోదరుడు బరిన్ ఘోష్ విప్లవమార్గం పట్టారు. బరిన్ ఘోష్ నేతృత్వంలో ‘జుగాంతర్’ సంస్థను స్థాపించిన విప్లవకారులు మొదటి ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి విఫలయత్నాలు చేశారు. చిట్టగాంగ్‌లో విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన సూర్యసేన్ బ్రిటిష్ బలగాలను తిప్పికొట్టి, కొద్దికాలం స్థానిక ప్రభుత్వాన్ని నడిపాడు. తర్వాత పోలీసులకు చిక్కి, ఉరిశిక్షకు బలైపోయాడు. కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాక సుభాష్‌చంద్ర బోస్ ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపించి నాటి యువతరంలో పోరాట స్ఫూర్తి రగిల్చారు. ఇలాంటి వీరులు ఎందరెందరో ఉన్నారు. చరిత్రకెక్కిన వారు కొందరైతే, చరిత్రపుటల్లో మరుగునపడిన వారు ఇంకెందరో...