
చిన్ననాటి చందమామ కథే స్ఫూర్తి!
తొలియత్నం
మొదటి సినిమా అనగానే
దర్శకుడి మనసులో బోలెడన్ని ఊహలు, ఆలోచనలు.
ఎప్పటినుంచో దాచుకున్న ఐడియాలు, స్టోరీలు.
ఒక్కసారి అన్నీ దుమ్ము దులిపి...
ఏ లైన్ బాగుంటుంది,
ఏ కాంబినేషన్ వర్కవుట్ అవుతుంది,
అది తన కెరీర్‌కు సరైన ఫౌండేషన్ అవుతుందా, లేదా?...
ఇలా ఎన్నో ఈక్వేషన్లు, క్యాలిక్యులేషన్లు.
దర్శకుడు సాగర్ తన తొలి సినిమా సమయంలో
సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు.
చిన్ననాటి సరదా ఊహ తొలి యత్నానికి దారితీసిన వైనం గురించి సాగర్ ఫ్లాష్‌బ్యాక్.
చిన్నప్పుడు మద్రాస్‌లో చదువుకునేటప్పుడు చందమామలో రాకాసి లోయ సీరియల్‌ను కథను ఆసక్తిగా చదివేవాళ్లం. పిల్లలందరం కలిసి పెద్దయ్యాక, దీన్ని సినిమాగా తీయాలనుకున్నాం. అందులో ఒకడు అంత పెద్ద రాక్షసులకు మనం అన్నం ఎలా పెడతాం అన్నాడు. మరొకడు విజయా గార్డెన్స్ మొత్తం అద్దెకు తీసుకుని, పెద్ద పెద్ద చువ్వలున్న బోనులో పెట్టి పైనుంచి హెలికాప్టర్‌లోంచి ఆహారం విసిరేద్దాం అన్నాడు. అలా చిన్నతనంలో ఆ కథ చుట్టూతా బోలెడన్ని ఊహలు.
ఎస్సెల్సీ పూర్తయ్యాక, చదువు మీద ఆసక్తి లేకపోవడంతో ఖాళీగా ఉన్నాను. అప్పట్లో మా కుటుంబానికి బాగా తెలిసినతను, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. మా అమ్మ అతన్ని నాకేమైనా అవకాశం ఇప్పించమని అడిగింది. ‘సినిమాల్లో పనిచేయాలంటే చాలా సహనం, ఓర్పు ఉండాలి. మీవాడు అక్కడ సెట్ అవలేడు’ అనడంతో మా అమ్మ చాలా బాధపడింది.
ఆ సంఘటన నాలో పట్టుదలను పెంచింది. ఎలాగోలా సినిమా రంగంలోకి ప్రవేశించి, మధు పిక్చర్స్ మల్లికార్జునరావు తమ్ముడు శ్రీహరిగారి వద్ద, ‘ఇంటి గౌరవం’ అనే సినిమాకి ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా చేరాను. నన్ను నేను నిరూపించుకోవడానికి తీవ్రంగా కష్టపడేవాణ్ని. ఈ క్రమంలో ఒక చేదు సంఘటన ఎదురైంది. మొదట నాకు అవకాశం ఇవ్వకుండా మా అమ్మతో నా గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి, ఇక్కడ కూడా నన్ను అణగదొక్కడానికి ప్రయత్నించాడు. దాంతో నాకు కోపం వచ్చి అక్కడి నుంచి బయటికొచ్చేశాను. ఎటు వెళ్లాలో తెలీక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మా అన్నయ్య ద్వారా మహ్మద్ బీన్ తుగ్లక్ సినిమాకు అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. బీవీ ప్రసాద్‌గారు డెరైక్టర్.
దాసరి నారాయణరావుగారు రైటర్. ఆయన ద్వారా రేలంగి నరసింహారావు అసిస్టెంట్ అవడంతో నేను మరో మెట్టు ఎక్కి సెకెండ్ అసోసియేట్ డెరైక్టర్ అయ్యాను. అప్పట్లో మేం పనిచేసిన సినిమాను మా సొంత సినిమా అనుకుని పనిచేసేవాళ్లం. అసిస్టెంట్ నుంచి కో-డెరైక్టర్‌గా నా కెరీర్ సాగుతున్న క్రమంలో చాలామంది సినిమా డెరైక్షన్ చేయమని అడిగేవారు.
నేను మాత్రం సున్నితంగా తిరస్కరించాను. నా మీద నాకు నమ్మకం వచ్చాక, తప్పక చేస్తానని చెప్పాను. తర్వాత కోదండరామిరెడ్డిగారి ‘కిరాయి కోటిగాడు’ సినిమాకు కో-డెరైక్టర్‌గా సినిమా చేశాను. అది చాలా పెద్ద హిట్టయింది. ఇక నేను సొంతంగా చేస్తే బాగుంటుందనుకున్నా. అదే సమయంలో మద్రాస్ వాణీ సిల్క్ సెంటర్ యజమాని నా దగ్గరకు వచ్చి ఓ సినిమా చేద్దామన్నాడు. ఆయన ఉత్సాహం చూసి డేట్స్ కోసం కృష్ణగారి దగ్గరికి వెళ్లాను. కృష్ణగారు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. కొంతకాలం ఆగు, ప్రస్తుతానికి నరేష్‌తో సినిమా చేయి అన్నారు.
కథ మలుపు తిరిగింది. ఏం చేయాలా అన్న సంఘర్షణ మొదలైంది. అప్పుడు విజయకృష్ణా బ్యానర్‌లో పనిచేసే నా మిత్రుడు విఠల్ ఒక సినిమా చేద్దామని వచ్చాడు. ఎంతుంది అని అడిగా. ఐదు వేలు అన్నాడు. ఐదు రోజులకు కూడా సరిపోవు అన్నా. వెనుక లారీలో డబ్బొచ్చేస్తుంది అన్నాడు. సరే కానీ అన్నా. నిజానికి అప్పట్లో మద్రాస్‌లో రోజుకు పదిహేనొందలుంటే సినిమా తీయొచ్చు. ఫుడ్, ట్రాన్స్‌పోర్ట్ ప్రతిదీ అప్పు మీద దొరికేది. ఇక ఏ జానర్‌లో సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచించాం. అప్పుడు నా చిన్ననాటి చందమామ కథ గుర్తుకొచ్చింది. అది మదిలో మెదలగానే ఏదో తెలియని సంతోషం.
అదే సమయంలో ‘హిల్స్ హ్యావ్ నో ఐస్’ అనే ఇంగ్లిష్ సినిమా చూశాను. బాగా నచ్చింది. ఈ రెండు ఆలోచనల ఆధారంగా రాకాసి లోయ కథ అల్లుకున్నాను. కొడుకుతో పాటు వేటకు వెళ్లిన రంగనాథ్‌ను అడవి మనుషులు చంపుతారు. తిరిగి సిటీకి వచ్చిన కొడుకు పెద్దయ్యాక, తన తండ్రి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమంలో తన మిత్రులతో కలిసి రాకాసి లోయకు వస్తాడు. స్థూలంగా ఇదీ కథ. నరేష్, రాజేష్, రవివర్మ, విజయశాంతి, ముచ్చెర్ల అరుణ, దీప నటీనటులు. లొకేషన్ కోసం వేట మొదలైంది. తలకోన మద్రాస్‌కు చాలా దగ్గర. కానీ నాకు అదంత పరిచయం లేని ప్రాంతం. గతంలో కలియుగ సీత తీసినప్పుడు పశ్చిమ గోదావరిలోని బుట్టాయిగూడెం అడవులు బాగా పరిచయం. అక్కడ కరాటం కృష్ణమూర్తిగారని ఒక దొర ఉండేవారు. చుట్టుపక్కల ఆయన మాట వేదం. వెళ్లి ఆయనకు పరిస్థితి చెప్పాను. ఆయన అభయమివ్వగానే షూటింగ్ సగం పూర్తయిందనిపించింది. ఎందుకంటే అక్కడైతే మా బడ్జెట్‌లోనే సినిమా చేసుకోవచ్చు.
బుట్టాయిగూడెం గ్రామంలో మా యూనిట్‌కు వసతి కల్పించారు. మేకప్‌తో సహా ఆరు గంటలకు లొకేషన్‌లోకి వెళ్లాలనుకునేవాళ్లం. కానీ ఎవరూ సమయానికి రెడీ అవకపోవడంతో ఏ రోజు కూడా తొమ్మిదికి ముందు చేరుకోలేకపోయేవాళ్లం. కొండల్లో దారులు చాలా ఇరుకుగా ఉండేవి. ఎదురుగా మరో వెహికల్ వస్తే మా వాహనం ఆగిపోవాల్సిందే. లొకేషన్‌కు చేరుకునేసరికి ఆర్టిస్టుల ఒళ్లంతా దుమ్ము పేరుకుపోయేది. ఆ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకసారి షూటింగ్‌లో వాడుతున్న ఒరిజినల్ రివాల్వర్ మాయమైంది. ఎటు పోయిందో తెలియదు. నక్సలైట్స్ తీసుకుపోయారని కొంతమంది అన్నారు. మొత్తానికి చాలా టెన్షన్ పడ్డాం. కానీ అది దొరకలేదు.
ఈ సినిమాలో ఫలానా హీరో పక్కన ఫలానా హీరోయిన్ అని లేకున్నా, నరేష్, ముచ్చెర్ల అరుణతో ఒక పాట తీయాలనుకున్నాం. దాంతో విజయశాంతి అలిగింది. నేను కో-డెరైక్టర్‌గా పనిచేసిన రెండు మూడు సినిమాల్లో ముచ్చెర్ల అరుణ నటించడంతో ఆమెతో నాకు కొంత సాన్నిహిత్యం ఉంది. తనకెలాగో నచ్చచెప్పి నరేష్ పక్కన విజయశాంతితో పాట తీశా. దాంతో నరేశ్, ముచ్చెర్ల అరుణతో తీసిన సీన్‌ని తొలగించాల్సి వచ్చింది. ఈ సినిమాకు విజయశాంతి పారితోషికం 12 వేలు, ముచ్చెర్ల అరుణ పారితోషికం 14 వేలు. నలభై రోజుల సినిమా పూర్తయ్యాక, దీప ఉండే గూడేనికి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయాల్సిన సమయం వచ్చింది. చెట్ల మీద ఇళ్ల సెట్ వేయాలి. చాలా హడావుడిలో పని చేయడంతో ఆ సన్నివేశాలు నేననుకున్నంత బాగా రాలేదు. కానీ మొత్తానికి సినిమా బాగానే వచ్చిందని చెప్పాలి.
సినిమా పూర్తయ్యాక, నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మేం చాలా డబ్బు పెట్టి సినిమా కొన్నాం. మూడు పాటలు పెట్టి మా మొహాన విసిరేస్తే ఎలా అన్నారు. ఒక పని చేయండి, సినిమా చూసి ఎక్కడ పాట పెట్టొచ్చో చెప్పండి, పెడదాం అన్నాను. సినిమా చూసి ఎక్కడా ఒక్క పాట కూడా పెట్టడం కుదరదని అన్నారు. సినిమాలో ఉన్న మూడు పాటలకూ సత్యంగారు అద్భుతమైన సంగీతం అందించారు. విడుదలయ్యాక, సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకెండాఫ్‌లో సినిమా గ్రాఫ్ పడిపోతున్నా డెరైక్టర్ అదే టెంపోమెయిన్‌టెయిన్ చేశాడని ‘‘ది హిందూ’’ పత్రిక చాలా గొప్పగా రాసింది.
‘రాకాసి లోయ’ సినిమా చూసిన హిందీ రైటర్ ఒకాయన సవేరా హోటల్‌లో నన్ను కలిశాడు. ఆయన ఈ ఐడియా చాలా గ్రేట్, ఇంత గొప్ప ఐడియా మీకెలా వచ్చిందని నన్ను వేపుకు తినడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాలో తెలీక అప్పటికప్పుడు ఒక కథ అల్లేశాను. దేవుడు ఈ భూమ్మీద మనుషుల్ని మూడు చోట్ల సృష్టించాడు. నగరంలో సృష్టించబడినవాడికి అన్యాయాలు, అక్రమాలు చేయడం తెలుసు. పల్లెలో పుట్టినవాడికి తన కర్మానుసారం జీవించడం తెలుసు. కానీ అడవిలో ఉన్నవాడికి ఎప్పుడూ ఏదో అభద్రత, భయం ఉంటుంది. జంతువుల నుంచి, ప్రకృతి నుంచి, బయట నుంచి వచ్చే మనుషుల నుంచి ప్రమాదం ఉంటుంది. ఆ భయంలో భాగంగా చాలా విపరీత ప్రవర్తనతో ఉంటాడు. ఈ ఆలోచన నుంచే రాకాసి లోయ కథ పుట్టిందని చెప్పగానే ఆయన నన్ను విపరీతంగా పొగిడారు. అలా ‘రాకాసి లోయ’ నాకు చాలా అనుభవాలను మిగిల్చింది. నా తరువాత భవిష్యత్‌కు మంచి పునాది వేసింది.
-కె.క్రాంతికుమార్‌రెడ్డి