కాస్త స్లో... కానీ బోలెడు ఉపయోగం!
ఇంట్లోనే ఉండేవాళ్లకు రెండు పూటలా వంట చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఉద్యోగాలు చేసుకునేవాళ్లకు రెండో పూట వంట చేసుకోవడం కాస్త కష్టమైన పనే. అలసిపోవడం వల్ల బద్దకంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఆలస్యంగా రావలసి రావొచ్చు. అలాంటప్పుడు వంట చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటివారికి ఈ కుక్కర్ బాగా ఉపయోగపడుతుంది.
దీనిని ‘క్రాక్‌పాట్ స్లో కుక్కర్’ అంటారు. వెల ఐదు వేల వరకూ ఉంది. అయితే కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్స్‌లో 3 వేల నుంచీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. క్రాక్‌పాట్ కుక్కర్ కరెంటుతో పని చేస్తుంది. ఇందులో ఫుడ్ మామూలుగా కంటే కాస్త మెల్లగా ఉడుకుతుంది. ఎక్కువ వేడిమీద వేగంగా ఉడికిపోవడం వల్ల ఆహార పదార్థాల్లోని కొన్ని విటమిన్లు ఆవిరైపోతూ ఉంటాయి.
కొన్నిసార్లు మాడిపోతుంటాయి కూడా. అలా కాకుండా ఉండేందుకే ఈ స్లో కుక్కర్ రూపకల్పన జరిగింది. మెల్లగా ఉడుకుతుంది కాబట్టి, కుకర్ ఆన్‌చేసి బయట ఏదైనా పనివుంటే చేసుకుని రావొచ్చు. ఒకేసారి అన్నం, కూర వండుకునే సౌలభ్యం ఉంది కాబట్టి... సాయంత్రం వంట కోసం అవసరమైనవన్నీ కుక్కర్‌లో పెట్టి, ఏ టైముకి ఆన్ అవ్వాలో టైమ్ సెట్ చేసి పెడితే, ఆ టైముకి కుక్కర్ ఆన్ అవుతుంది. కరెంటు పోయినా, మళ్లీ రాగానే దానంతటదే ఆన్ అవుతుంది. ఉడి కాక ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోతుంది. ఒక్క మైనస్ ఏంటంటే... త్వరగా వండాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఉపయోగపడదు!