క్షణం ఆలస్యమైనా విమానం నేలకూలేది! | Delayed aircraft were destroyed in a moment! | Sakshi
Sakshi News home page

క్షణం ఆలస్యమైనా విమానం నేలకూలేది!

Published Sun, Feb 22 2015 1:56 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

క్షణం ఆలస్యమైనా విమానం నేలకూలేది!

క్షణం ఆలస్యమైనా విమానం నేలకూలేది!

యుద్ధ క్షేత్రం
సాధారణంగా ప్రత్యర్థి విమానాలు దాడికి దిగినప్పుడు సైరన్ మోగించి హెచ్చరిక జారీ చేస్తారు. వెంటనే అందరూ ఇళ్ల పక్కనే ఉన్న ట్రెంచ్‌లోకి వెళ్లి తలదాచుకోవాలి. అలా చేస్తే బాంబుదాడిలో ఇళ్లు ధ్వంసమైనా మనుషులకు చాలా వరకు ప్రమాదం ఉండదు! 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో ఉన్నారు. అది ఆయన మొదటి పోస్టింగ్! ‘సైరన్’ మోగగానే భార్యతో సహా ట్రెంచ్‌లోకి వెళ్లారు.

నాలుగు వందల గజాల దూరంలో పడ్డ బాంబుల తీవ్రతను ఎదుర్కొన్నారు. శత్రువుల విమానాన్ని నేలకూల్చడంలోనూ, దేశ విమానాన్ని కాపాడుకోవడంలోనూ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అప్పటి ఆ అనుభవాలు...

 
వైమానికదళంలో ప్రధానంగా మా సేవలు ఉత్తరభారతదేశంలోనే కేంద్రీకృతమై ఉంటాయి. గగనతలాన్ని రక్షించడం ఎయిర్ డిఫెన్స్ విభాగం బాధ్యత. శత్రువుల కదలికలను రాడార్ ద్వారా గమనిస్తూ తక్షణ చర్యలకు సంకేతాలు, ఆదేశాలు జారీ చేయడం మా విధి. ‘ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్’లో పనిచేశాను. అధునాతన రాడార్ వ్యవస్థ ద్వారా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానం ఆచూకీ కూడా తెలుసుకోవచ్చు. పాకిస్తాన్‌లో ఒక విమానం గాల్లోకి లేచిందంటే అది లాహోర్ నుంచా కరాచీ నుంచా అని కూడా తెలిసిపోతుంది.
 
నరాలు తెగే ఉత్కంఠ...
ప్రత్యర్థుల దాడిని నిలువరించిన అనేక సంఘటనల్లో ప్రధానమైనది 1971లో జరిగింది. అప్పుడు కోల్‌కతా దగ్గర ఈస్టర్న్ సెక్టార్‌లో పనిచేస్తున్నాను. కలైకొండ ఎయిర్ బేస్ నుంచి మన రెండు మిగ్ విమానాలు పాకిస్తాన్‌కు చెందిన రెండు సేబర్ విమానాలతో తలపడ్డాయి. తూర్పు పాకిస్తాన్‌లోని ఢాకా (ఇప్పుడది బంగ్లాదేశ్ రాజధాని) లక్ష్యంగా సాగిందా దాడి. మన మిగ్ పాక్ సేబర్‌ని కొట్టేసింది. దాంతో రెండో సేబర్ వెనక్కి వెళ్లిపోయింది. మన మిగ్ విమానాలు రెండూ వెనక్కి వస్తుండగా ఊహించని పరిణామం... పాక్ మరో రెండు సేబర్‌లను పంపించింది. ఆ విషయం మన పైలట్‌లకు తెలియదు.

రాడార్ ద్వారా నేను గుర్తించి, వెంటనే సమాచారాన్నందించాను. అప్పుడు మన విమానాల్లో తగినంత ఇంధనం ఉందో లేదోననే సందేహం. ఆ సమయంలో మన పైలట్‌లు సేబర్‌లతో తలపడడానికే సిద్ధమయ్యారు. ఒక సేబర్‌ను నేలకూల్చారు కూడా. దాంతో రెండో సేబర్ వెనక్కి వెళ్లిపోయింది (సేబర్లు జంటగా పోరాడుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఒక్క  సేబర్ యుద్ధానికి దిగదు). అప్పుడు మన వాళ్లు వెనక్కి రావడానికి తగినంత ఇంధనం లేదని స్పష్టంగా తేలిపోయింది. వాటిని మానిటర్ చేస్తున్న నాలో తీవ్రమైన ఉత్కంఠ. వెంటనే ‘ఏ క్షణాన్నయినా యుద్ధ విమానాలు ల్యాండ్ కావచ్చు.

రన్‌వేలు సిద్ధంగా ఉంచండి’ అని కోల్‌కతా బేస్‌కి సమాచారం ఇచ్చి, పైలట్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాను. ఇంజన్ ఆఫ్ చేసి కొంత దూరం ప్రయాణించి, నేలకు దగ్గరగా వచ్చినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి ల్యాండ్ చేశారు పైలట్లు. అప్పటికి ఒక విమానంలో అయితే ట్యాంకు పూర్తిగా ఖాళీ అయిపోయింది. ల్యాండ్ కావడం మరో నిమిషం ఆలస్యం అయినా ఆ మిగ్ నేలకూలేది. యుద్ధంలో ప్రత్యర్థి చేతిలో నేలకూలకుండా రక్షించుకుని ఇంధనకొరతతో విమానం నేలకూలితే అది సైనికుడికి గుండె పిండేసినంత బాధ. పైలట్‌కి, ఎయిర్ బేస్‌కి మధ్య సమన్వయం కుదర్చడంలో సెకన్లలో స్పందించి తీసుకున్న నిర్ణయమే ఆ ప్రమాదాన్ని నివారించింది.
 
నేను పంజాబ్, హర్యానా, జోధ్‌పూర్, రాజస్థాన్, కశ్మీర్, మిజోరాం రాష్ట్రాల్లో పనిచేశాను. పంజాబ్, రాజస్థాన్‌లలో ఎయిర్ డిఫెన్స్ ఆపరేషనల్ ఎఫిషియెన్సీకి గాను నాకు మన ప్రభుత్వం 1976లో విశిష్ట సేవాపతకాన్ని ప్రదానం చేసింది.
రిపోర్టింగ్: వాకా మంజులా రెడ్డి
manjula.features@sakshi.com
 
మాది వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల. దార్వాడ్ యూనివర్సిటీ నుంచి ఎం.ఎ చేసి, రక్షణరంగంలోకి వెళ్లాను. రెండు దశాబ్దాల పాటు ఉద్యోగం చేసి 43 ఏళ్ల వయసులో 1985లో రిటైరయ్యాను. తర్వాత, ఈసీఐఎల్‌లో  సీనియర్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈవెనింగ్ కాలేజ్‌లో ఎంబీఏ చదివాను. అందులోంచి కూడా రిటైరయ్యాక, విశ్రాంత రక్షణరంగ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్‌గా సైనిక్‌పురి, వాయుపురి, ఆ పరిసరాల్లో నివాసముంటున్న మాజీ రక్షణ రంగ ఉద్యోగుల కోసం పని చేస్తున్నాను.
- మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement