పిడకలు.కామ్ | Dung Cakes (Pidakalu) in Online | Sakshi
Sakshi News home page

పిడకలు.కామ్

Published Sun, Jan 10 2016 9:09 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

పిడకలు.కామ్

పిడకలు.కామ్

అప్రాచ్య దేశాల్లో ఎక్కడ చూసినా బోసిగోడలే! ఏ ఇళ్లలో చూసినా పొగలేని పొయ్యిలే! పేడ పరిమళం నాసికకు సోకే అవకాశమే ఉండదు. దగ్గరగా ఉండేవాటి విలువను మనం తెలుసుకోలేం. పిడకలూ అందుకు అతీతం కాదు. దూరపు కొండలు ఎంత నునుపుగా ఉంటాయో, దగ్గరగా చూశాక విదేశాల్లో స్థిరపడ్డ మనవాళ్లకు తాము కోల్పోతున్నదేదో అర్థమయ్యే ఉంటుంది. మన కళా సంస్కృతుల విలువ మాత్రమే కాదు, సంస్కృతిలో అవిభాజ్యమైన పిడకల విలువ కూడా వాళ్లకు బాగానే తెలిసొచ్చి ఉంటుంది.

బహుశ అందుకేనేమో! ఆన్‌లైన్‌లో పిడకలకు గిరాకీ పెరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని, ఒక నొక్కు నొక్కితే చాలు. పిడకల పార్సెల్ ఇంటికొచ్చిపడుతోంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. అనే రీతిలో దేశభక్తులగు మన ప్రవాసులు పార్సెళ్లలో పిడకలు తెప్పించుకుంటూ, వాటితో అక్కడ సంప్రదాయానికి లోటు రాకుండా భోగిమంటలు వేసుకుంటున్నారు.
 
పిడకలు - ఉపయోగాలు
* తొలిరోజుల్లో పిడకలను వంటచెరకుకు అనుబంధంగా వాడేవారని తెలిసిందే. పిడకలు కాలిన తర్వాత మిగిలిన బూడిదను అంట్లగిన్నెలు తోముకోవడానికే కాదు, పళ్లుతోముకోవడానికి కూడా ఉపయోగించేవాళ్లు.
* పిడకలు తయారు చేసేటప్పుడు పేడలో కాసిన్ని వేపాకులు కూడా కలిపేవారు. వేపాకులు కలిపిన పిడకలను ఎండబెట్టిన తర్వాత కాలిస్తే, వాటి నుంచి వెలువడే పొగకు దోమలు పరారయ్యేవి. మస్కిటో కాయిల్స్ తెలియని రోజుల్లో జనాలు వీటినే కాల్చేవారు.
* సగటు పరిమాణంలో ఉండే ఒక పిడక నుంచి దాదాపు 2100 కిలోజౌల్స్ శక్తి విడుదలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. అందువల్ల వీటిని ప్రత్యామ్నాయ ఇంధనంగా భేషుగ్గా వాడుకోవచ్చు.
* తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్లు పిడకల పరిశ్రమను పెట్టుకునే అవకాశాన్ని నిక్షేపంగా పరిశీలించవచ్చు. ఆన్‌లైన్ మార్కెట్‌లో డజను పిడకల ధర దాదాపు రూ.150 వరకు పలుకుతోంది.
- పన్యాల జగన్నాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement