
తలకట్టుకు పనిముట్టు
ఫ్లాష్ బ్యాక్
రోజూ తల దువ్వుకుంటూనే ఉంటాం. ఎప్పటికెయ్యది ప్రస్తుతమనే రీతిలో వర్తమాన ఫ్యాషన్లకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు తలకట్టును తీర్చిదిద్దుకుంటూనే ఉంటాం. కాస్త కుడి ఎడమలగానో, నడి మధ్యగానో పాపిట తీర్చి, తలపై జుట్టును చెక్కుచెదరకుండా సర్దుకుంటాం. పాపిటి బెడద ఎందుకనుకుంటే... గాలికి చెదర కుండా జుట్టుకు కాస్త నూనెనో, క్రీమునో, జెల్‌నో పట్టించి ఎగదువ్వేస్తాం. ఇదంతా మనకు అనుదిన అనివార్య కార్యక్రమం. అయితే పని పూర్తయ్యాక దువ్వెనను మాత్రం పక్కన పడేస్తాం. కానీ ఎప్పుడైనా, అసలీ దువ్వెన ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని కనిపెట్టినదెవరని ఆలోచించామా?
తెలుసుకోవాలే గానీ, దువ్వెనకు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ నిత్యావసర పరికరాన్ని దాదాపు ఐదు వేల ఏళ్ల కిందటే కనిపెట్టారు. అప్పట్లోనే పర్షియాలో దువ్వెనల వాడకం ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. తొలి రోజుల్లో ఏనుగు దంతాలతో, తాబేటి చిప్పలతో దువ్వెనలు తయారు చేసేవాళ్లు. ఇవి దొరకడం కాస్త కష్టం కాబట్టి... తర్వాత కలప, లోహాలతో కూడా దువ్వెనలను తయారు చేయడం మొదలెట్టారు. దంతపు దువ్వెనలు, తాబేటి చిప్ప దువ్వెనలు, కలప, లోహ దువ్వెనలను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దే వాళ్లు. తలకట్టును అందంగా తీర్చిదిద్దు కోవడం కోసమే కాకుండా, తలకు పట్టిన పేలను తొలగించుకోవడానికి కూడా వాటిని వాడేవాళ్లు. ఇప్పటికీ దువ్వెనలను ఇవే ప్రయోజనాల కోసం మనం వాడుతున్నాం.
అయితే ప్లాస్టిక్ వాడుకలోకి వచ్చాక దువ్వెనల తీరుతెన్నులే మారిపోయాయి. పాతకాలం దువ్వెనలు మ్యూజియములకే పరిమితమయ్యాయి. పైగా దువ్వెన రూపు మారిపోయి రకరకాల మోడళ్లు వచ్చాయి. చివరికి కరెంటుతో, బ్యాటరీలతో పని చేసే దువ్వెనలు కూడా వచ్చేశాయి!