
అప్పుడు సరిగ్గా ఉదయం 8.20 అయింది. ఆజానుబాహువు– అరవింద దళాయతాక్షుడు ఔనో కాదో కళ్లద్దాల వెనుక కనబట్టం లేదు. నల్లనివాడు కాదుగాని, చేత ధరించిన బ్రీఫ్‌కేస్ నల్లగానే ఉంది. రైలు దిగి తిన్నగా పెద్దపెద్ద అడుగులేసుకుంటూ స్టేషన్‌లో ఓ ఫర్లాంగు దూరంలో ఉన్న ఓ రెస్టారెంట్‌ని దాటి వెళుతున్నాడు. రెస్టారెంట్‌లో కూర్చుని, అప్పుడే రైలు దిగిన ప్రయాణికులు, ఆవురావురుమంటూ టిఫిన్‌లు తిని కాఫీలు తాగుతున్నారు. రెస్టారెంట్‌లోంచి నాసికాపుటాల్ని తాకి నోరూరించే సువాసనలు కూడా ఆ నరమానవుడిలో ఏ విధమైన చలనాన్నీ కలిగించలేదంటే చాలా ముఖ్యమైన పనిమీదే ఉన్నట్లున్నాడు గురుడు.
మూడు నాలుగు మలుపులు తిరిగి ఎదురుగా గర్వంగా నిలబడి ఉన్న ‘శాన్ రోజరియో జాతీయ బ్యాంకు’ ముందు నిలబడ్డాడు– పరిశీలనగా చూశాడు. తల పంకించాడు. తన జేబులో చెయ్యి పెట్టి ఓ చిన్న విజిటింగ్ కార్డులాంటిది పైకితీసి ఒకసారి పరిశీలించి– మెరిసీ మెరవని చిరునవ్వును బలవంతంగా అదిమిపెట్టి– కృతనిశ్చయంతో లోపల ప్రవేశించాడు. అప్పుడే బ్యాంకు సిబ్బంది కొంతమంది వచ్చారు– వాళ్ల వాళ్ల సీట్లలో సర్దుకుంటున్నారు. మరికొందరు వస్తున్నారు. క్యాషియర్ కరెన్సీ లెక్క పెట్టుకుని కౌంటరు తాళాలు తీసుకుని ఇంకో కౌంటరులో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మన ఆగంతకుడుగారు క్యాష్ కౌంటర్ ముందు నిలబడి సిద్ధంగా ఉన్నాడు. క్యాషియర్ విసుగ్గా మొహంపెట్టి ‘‘కౌంటర్ తెరవడానికి ఇంకో పదినిమిషాలు టైముంది మహానుభావా!’’ అన్నాడు.
వచ్చిన ఆసామీ జేబులోంచి ఓ కార్డు తీసి కౌంటరు కన్నంలోంచి పైకి తోశాడు. దీని మీద...
జేఎఫ్‌సీ నెటిల్‌విక్–
నేషనల్ బ్యాంక్ ఎగ్జామినర్
అని ఉంది.
క్యాషియర్ కంగారుపడిపోయాడు.
‘‘మీ..రా.. సర్!... మీరు ఇదివరకు ఎప్పుడూ ఇటు రాలేదనుకుంటాను... అందుకే మీరు ఎవరో కస్టమర్ అయుంటారనుకున్నాను. క్షమించండి... అటు తిరిగి రండి సర్... ముందు మేనేజర్‌గారిని కలవడం పద్ధతి కదా!... పరిచయం చేస్తాను’’ అన్నాడు భయం భయంగా...
బ్యాంకు మేనేజర్ మేజర్ థామస్ బి కింగ్‌మన్ మహాశయుడు– అయితే ఎంత పెద్దపేరు పెట్టినా చివరకు మిగిలేది టామ్ డిక్ హ్యారీలాంటిది ఏదో మిగులుతుంది. అతని పూర్తి పేరుతోకాక మేజర్ టామ్ అని పిలుస్తుంటారు. పరస్పర పరిచయాలు అయ్యాక...
‘‘అరె మీరొచ్చారేమిటి? మేం వస్తాడనుకుంటున్నది శామ్ టర్నర్ కదా! నాలుగేళ్ల నుంచి ఆయనే మా బ్యాంకు ఇన్‌స్పెక్షన్ నిర్వహిస్తున్నాడు. అహ! దానికేముంది లెండి... మాది చిన్న బ్యాంకు ఏదో నెట్టుకొస్తున్నాం తప్ప మా టర్నోవర్ కూడా అంతంత మాత్రం. కొంచెం నిదానంగానే చేతురుగాని. అసలు టర్నరయితే అసలేం చూడకుండానే ‘వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్’ అని రాసి పారేయండి కింద వేలిముద్ర వేసేద్దాం అంటాడు.. హహ్హహ్హ!’’ అంటాడనికాదు– మా లావాదేవీలు అంత నిర్దుష్టంగా ఉంటాయి సుమా! అని, అయితే ఆయన వెరిఫై చెయ్యకమానడు హ్హె! హ్హె! హ్హె! అంటూ వెర్రినవ్వులాంటిదేదో నవ్వేశాడు. ఈ ఆడిటర్‌గారిది కర్రపిడి వ్యాపారం. ముఖంమీద ఏ భావాలూ పట్టుకోలేరు.
‘‘ఇటు వాళ్లు– ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్లు ఈ ప్రాంతానికి మారి చెక్ చెయ్యాలని స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి’’ అని వడివడిగా అనేసి ‘‘క్యాష్‌కౌంటర్‌కి, స్ట్రాంగ్‌రూమ్‌కి పదండి’’ అన్నాడు ప్యాంటు జేబులో చెయ్యిపెట్టుకుని స్టిఫ్‌గా లేస్తూ.
‘‘ఆల్‌రైట్ పెర్రిడొర్సీ! ఈయన వ్యవహారం చూసుకోవోయ్’’ అన్నాడు క్యాషియర్ వైపు చూస్తూ.
పెర్రిడోర్సీ మహాకాయుడు. అతని చేతిలో చిల్లర లెక్కపెట్టేటప్పుడు చూడాలి చిన్న చిన్న తుపాకి రవ్వల్లా మెరుస్తుంటాయి నాణేలు.
ఈ నాణేల లెక్క ప్రహసనం ఇలా జరుగుతుండగా ఓ చిన్న తమాషా జరిగింది. టామ్ కింగ్‌మన్– మెసెంజర్ రాయ్‌కి కళ్లతో ఏదో సంజ్ఞ చేయడం, రాయ్ మెల్లగా పక్క నుంచి రోడ్డు మీదకు జారిపోవడం– తిన్నగా స్టాక్‌మన్ నేషనల్ బ్యాంకుకు పరుగు తీయడం జరిగింది. బహుశ! అవతల మా బ్యాంకు ఇన్‌స్పెక్షన్ జరుగుతోందని ఉప్పందించమని పంపాడేమో అనుకుంటే పొరపాటే! ఒక చోట ఆడిటింగ్ జరుగుతుంటే మరో బ్యాంకుకు ఉప్పు అందించడం వాళ్లలో వాళ్లు ఏర్పాటు చేసుకున్న ఒక అవగాహన– కేవలం అండర్‌స్టాండింగ్.
ఆ బ్యాంకు మేనేజర్ కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. ఇలా కొత్త ఆడిటర్ వచ్చి నానా పెంటా పెడుతున్నాడని విని– చిరునవ్వు నవ్వాడు బక్లీ అనే ఆ మేనేజర్. రాసే ఫైలును పక్కన పెట్టేడు–
‘‘కూర్చోవోయ్ రాయ్– టేక్ యువర్ సీట్’’ అన్నాడు. ‘‘నో సర్! మళ్లీ వెళ్లిపోవాలి. వచ్చిన కొత్తాయన చండాశసనం ముండావాడిలా ఉన్నాడు’’.
‘‘కాఫీ తాగి వెళ్లవోయ్– ఈలోగా ఉపద్రవాలేం జరగవు– కాఫీ కూడా ‘ఉప’ద్రవమే.. హ్హె హ్హె హ్హె’’ అని నవ్వేశాడు.
‘‘కాద్సార్’’
‘‘ఏదీ లేదు సర్, ‘‘తప్పదు’’ అని ఫ్లాస్కులోని కాఫీ కప్పులో పోసి అందించాడు– చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన మేనేజర్లేమో– వాళ్లెప్పుడూ తరతమ భేదాలనూ, అంతరాలనూ పాటించేవారు కాదు...
కాఫీ పూర్తిచేసి ‘‘వస్తాను సర్’’ అని లేచాడు రాయ్. ‘‘చూడు మిస్టర్ రాయ్... సమయానికి ఆదుకోలేనందుకు అయాం సారీ... ఈ ఉత్తరాన్ని మీ బాస్‌కి ఇవ్వు’’
‘‘సమయానికి ఆదుకోవడం ఏమిటి సర్!’’ వెర్రిమొహం వేశాడు రాయ్.
‘‘ప్రశ్నలొద్దు– నే చెప్పినట్టు చెయ్యి’’ అన్నాడు బక్లీ.
‘పెద్దవాళ్ల గోలలు మనకేల?’ అనుకుని అతడిచ్చిన కవర్‌ని జాగ్రత్తగా తీసుకెళ్లి టామ్‌కి అందించాడు. సందేశాన్ని కూడా వినిపించాడు చెవిలో. ఈలోగా ఆడిట్ ఇన్‌స్పెక్షన్ చరమ ఘట్టంలోకి వచ్చింది. ‘‘ఇంక చివరి ఐటమ్– లోన్స్– దాంతో ఈ ఇన్‌స్పెక్షన్ పూర్తయిపోతుంది.. ఈసారి అంతా పర్‌ఫెక్ట్‌గా ఉంది ఇంతవరకు. ఇల్లలకగానే పండుగ అనుకోకండి– ఎప్పటికైనా మిమ్మల్ని హ్యాండ్సప్ అనిపించగలను’’
అంటూ లోన్ ఓచర్స్ ఫైల్‌ను గబగబా ఒకదాని తర్వాత ఒకటి చకచకా తిరగేసి– తన బ్రీఫ్‌కేసు తీసి నోట్స్‌లో అన్ని ఐటమ్స్ ముందూ ‘‘రైట్’’ మార్కులు పెట్టేసి ఓ లోన్ ఓచర్స్ ముందు మాత్రం ‘‘?’’ పెట్టి టప్పున మూసేసి–
‘‘థాంక్యూ మిస్టర్ కింగ్‌మన్.. సీయూ’’ అనబోయి– ఒక్కసారి మీ గదిలోకి దయచేస్తారా... మాట్లాడాలి’’ అన్నాడు.
ఇద్దరూ మేనేజర్‌గారి ప్రత్యేకమైన గదిలో కూర్చున్నారు. ఆడిటర్ చాలా హుషారుగా ఉన్నాడు. అది తాను ఆడిట్‌ను రికార్డు స్పీడులో ముగించినందుకు తనను తాను అభినందించుకుంటున్న హుషారు కావచ్చు. లేదా మరొకందుకు కావచ్చు. ఆయన ఏమంటాడో వింటేగాని చెప్పలేం.
‘‘అయ్యా ఘనత వహించిన మేనేజర్‌గారూ! మీ బ్యాంకు నిర్వహణ చాలా ప్రశంసనీయంగానే ఉంది. ‘‘నే’’ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పంటలు దెబ్బతినడం మూలానా చాలా బ్యాంకులు చేతులెత్తేసిన తరుణంలో స్వల్పలాభాల్లోనా గెంటుకొస్తున్నారంటే ప్రశంసార్హమే– మీ గుమాస్తాలంతా ఒళ్లు వంచి కష్టపడి పనిచేసే స్వభావం కలవాళ్లే– లెడ్జర్లు, పద్దు పుస్తకాలు, కరెన్సీ నోట్ల లెక్కలు, చిల్లరతో బ్యాలెన్సయ్యాయంటే– నేను మిమ్మల్ని అభినందించి తీరాలి... కాని... కాని...’’
అల్పపీడనం తాకిడి నుంచి తీరం బయట పడిందనుకుంటే... మళ్లీ వెనుదిరిగి ముంచుకొచ్చిందేమోనని షాక్ తిన్నవాడిలా కనబడుతున్నాడు టామ్. అయితే నెటిల్‌విక్‌గారికి ‘కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అన్నంత హుషారుగా ఉంది.
‘‘చూడండి మిస్టర్ టామ్ 40 వేల పౌండ్ల ముఖవిలువ గల కేవలం ఆరు బాండ్ పత్రాలు మీ ఫైల్‌లో కనబడటం లేదు. వాటి నిజ విలువ 70 వేల వరకు ఉండవచ్చు– మరి అవి ఏమయ్యాయో మరి..?’’
‘‘అదే చెప్పబోతున్నాను సర్! అని ఒక్కసారిగా నాటకీయంగా గొంతు సవరించుకుని లేచి పైపు వెలిగించాడు టామ్. నెటిల్‌విక్ విలాసంగా సిగరెట్ వెలిగించి గుండెల నిండా పొగ పీల్చి రింగు రింగులుగా వదులుతూ.. వెటకారంగా...
‘‘ఊ.. చెప్పండి సర్’’
‘‘అబ్బే ఏం లేదు సర్! ఇది మా స్నేహితుడు బాబ్– వాడూ నేనూ చిన్నప్పట్నించి ఒకే కంచం, ఒకే మంచంగా పెరిగినవాళ్లం– ఇద్దరం పేదరికంలోంచి పైకి వచ్చిన వాళ్లం. వాడూ పశువుల్ని కాశాడు– నేనూ కాశాను. పశువుల ధరలు పలికినప్పుడు డబ్బు చేసి వాడు షేర్ బ్రోకర్‌గా ఎదిగాడు, నేను బ్యాంకు మేనేజర్‌గా ఎదిగాను. అయితే ఏ రోజూ వాణ్ణి నేనుగాని వాడు నన్నుగాని కలుసుకోకుండా ఉండేవాళ్లం కాదు. వాడికి గుర్రప్పందేలంటే తగని పిచ్చి...
‘‘ఇరవై సంవత్సరాలు వెనక్కి వెడితే (బాబూ ఈ పురాణం నాకెందుకట!! ఈ 70 వేలకీ దీనికీ సంబంధం ఏమిటట– విసుక్కున్నాడు నెటిల్‌విక్) నేను ఈ గ్రామానికి షరీఫ్‌నయ్యాను. వాణ్ణి నా సెక్రటరీని చేసుకున్నాను. ఇది మేం పశువుల బేరాల్లో సొమ్ము చేసుకోకముందే అనుకోండి. అయితే అప్పుడు షరీఫే కలెక్టరుగా కూడా వ్యవహరించేవాణ్ణి– ఈ రోజుల్లో కలెక్టరంటే, షరీఫంటే తేలికైపోయింది గాని ఆ రోజుల్లో అది చాలా గొప్ప. అప్పుడే నాకు ఒక గుర్తింపు వచ్చి పిల్లల్నివ్వడానికి ముందుకొచ్చారు. అంతవరకు నేను తోక తెగిన గాలిపటంలా తిరిగిన వాణ్ణే హ్హ! హ్హ! హ్హ!’’ అని నవ్వి చిలుము పట్టిన పైపును దులిపి– మళ్లీ దాన్లో టొబాకోని దట్టించి, దీర్ఘాలోచనగా అటూ ఇటూ తిరుగుతూ– ఆలోచిస్తున్నాడు.
నెటిల్‌విక్– రెండో బ్యాంకు పనికూడా సాధ్యమైనంత తొందరగా ముగించుకుని 11.35 ట్రెయిన్‌లో వెళ్లిపోదామనే ఆత్రంలో ఉన్నాడు. ఈ 70 వేల పౌండ్ల కుంభకోణం ఏమిటో తేలాలి. ఆలస్యాన్నయినా సహించగలడు గాని అవినీతిని క్షమించడం తన నిఘంటువులోనే లేదు. ‘‘త్వరగా తెమల్చవయ్యా మహానుభావా!’’ అని మనసులో అనుకోగలడు కాని పైకి తేలాడో తాను తేలికైపోతాడు. ఇలాంటి టామ్, డిక్, హ్యారీలు తనకు కొత్త కాదు. గ్రీన్‌విచ్ గ్రామంలో నేషనల్ గ్రిండ్లీ బ్యాంకులో క్యాష్ ట్యాలీ కాలేదు. తను నిలదీసేసరికి క్యాషియర్ జేబులోంచి రివాల్వరు తీసి కాల్చుకు చచ్చిపోయాడు. అయినా తను లొంగలేదు– తగ్గిన డబ్బుని భార్యాపిల్లల పుస్తెలూ పూసలూ అమ్మించి మరీ కట్టించి వదిలాడు. డ్యూటీ అంటే డ్యూటీయే. దాన్లో ఇక వెసులుబాట్లూ, నసుగుళ్లూ ఉండరాదు. విందాం దీనికి ఎలా మసిపూసి మారేడుకాయ చేస్తాడో.
టామ్ హరికథ మొదలుపెట్టాడు ‘‘పెళ్లంటే నూరేళ్ల పంట... అప్పటిదాకా అనామకుడిగా ఉండిపోయిన వాడికి బాధ్యతలు, బంధుత్వాలు, బంధాలు పెరుగుతాయి. నువ్వు లేచి కాలకృత్యాలు తీర్చుకుని షేవ్ చేసుకుని పొగలుకక్కే కాఫీ తాగుతుంటే ముద్దు ముద్దుగా మీ పాపా, బాబూ గుడ్ మోణింగ్ డాడీ అంటూ ఆప్యాయంగా బుగ్గల మీద ఒక పప్పీ ఇచ్చారనుకో నిజంగా ఒళ్లు ఆనందంతో పులకించిపోదోయ్–
ఇంకో రౌండ్‌లో ఒరేయ్– ఏరా... అని తర్వాత ‘ల–’కార ప్రయోగంలోకి కూడా దిగేలా ఉన్నాడు.
‘‘బాబూ టామ్‌గారూ! ప్రాణాలు తియ్యక సబ్జెక్టులోకి రండి’’ అన్నాడు అసహనంగా వాచీ చూసుకుంటూ–
‘‘ఆ ఎక్కడున్నాం? నాకు పెళ్లయిన ఆర్నెల్లకే మా బాబ్‌గాడూ పెళ్లాడేశాడు. షరా మామూలే. వాడు గుర్రపు రేసులు మాత్రం మానడు– మా చెల్లెమ్మ అంటే ఐ మీన్, మా బాబ్‌గాడి భార్యామణి మాత్రం కన్నీళ్లు పెట్టుకుని ‘‘చూడండి అన్నయ్యగారూ... ఈయన ఇల్లట్టకుండా ఎలా తిరుగుతున్నారో’’ అని తరచు బాధపడుతుండేది.
‘‘ఏం చెల్లెమ్మా– వాడికి రేసులూ లాభసాటిగానే ఉన్నాయిగా– వాడి జాతకంలో గెలుపేగాని ఓటమి లేదు’’ అని ఓదార్చేవాణ్ణి.
‘‘అబ్బబ్బా!’’ అని నెటిల్‌విక్ చికాకు పడిపోతున్నాడు. ఒకో రౌండ్ స్పీచ్‌కొట్టి, పదేసి నిమిషాలు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోవడం– మళ్లీ ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా–
‘‘ఆ ఎక్కడికొచ్చింది కథ... యస్..’’ అని అనబోతుండగా ఏదో ట్రెయిన్ దడదడమని చప్పుడు చేసుకుంటూ వెళ్లిపోతోంది.
‘‘అరె 11.45 ట్రెయినా?’’ కంగారుగా అనేశాడు నెటిల్‌విక్.
‘‘మరేం కంగారు లేదు సర్. ఇది 10.45 డౌన్ ట్రెయిన్. మీది అప్ ట్రెయిన్ కదా... మరో గంటపైగా టైము ఉంది. మీరు తీరుబడిగా డిన్నరు తీసుకు వెళ్లొచ్చు.’’
‘‘మరి ఆ రెండో బ్యాంకు సంగతి?’’
‘‘మళ్లీ ఓ క్యాంపు వేసుకుందురుగాని– కంగారేం?’’
‘‘నో, నో.. ప్రతిదీ అనుకున్న ప్రకారం జరగడమే నా పద్ధతి– ఇంతకీ ఆ 70 వేల పౌండ్ల సంగతి...’’
‘‘ఆ వేళ, అది శుక్రవారం, వీకెండ్ సన్నాహంలో బాబ్ ఇంట్లో ఉండగా మెసెంజర్ 65 వేల పౌండ్ల క్యాష్ తెచ్చి బ్యాంకుకు రమ్మన్నాడు. సరే మళ్లీ ఎవడు వెనక్కెళ్తాడని చెప్పేసి ‘‘బాబ్’’ ఐరన్‌సేఫ్‌లో దాచి తాళాలు వాడికే ఇచ్చి ఇద్దరం బోటు షికారు ప్లాన్ చేసుకోవడంలో మునిగిపోయాం. సరే ఆదివారం హాయిగా గడిపేసి సోమవారం ఉదయమే తాళాలు తీసి ‘‘క్యాష్’’పట్రారా అంటే బాబ్‌గాడు నసగడం ప్రారంభించాడు. ఏరా అని నిలదీసే సరికి గుర్రప్పందేల్లో పెట్టేశానని, దురదృష్టం కొద్ది పోగొట్టుకున్నానని– మళ్లీ నెలలో తనకు రావలసిన షేర్లు ఉన్నాయని, ఎడ్జస్ట్ చేస్తానని...’’
‘‘సర్’’ అని రాయ్ ప్రవేశించి, ఏదో కవర్ అందించి– ‘‘సర్’’ అని తలవంచుకుని వినయంగా వెళ్లిపోయాడు. అయితే ఎగ్జామినర్ మాత్రం– ఆ కవర్‌లో ఏమి ఉంటుందో– దాన్ని జేబులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందామని రెడీగా కూర్చున్నాడు.
టామ్ కవర్‌ని నిర్ల్‌యంగా చింపి, కాగితాన్ని పైకి లాగి ఆల్‌మోస్ట్ చూడకుండానే టేబుల్‌మీద పారేశాడు. కథ మాత్రం కొనసాగించాడు. ‘‘ఇంతకీ బాబ్ డబ్బు వాడేసుకున్నట్టు– రెండ్రోజుల్లో సర్దేస్తానంటే..’’
‘‘అదంతా నాకనవసరం... ఉండాల్సిన బిల్స్... ఉండాల్సిన చోట ఉండకపోవడం పెద్ద నేరం. నీ కాకమ్మ పిచికమ్మ కథలు నాకనవసరం...’’ చాలా సీరియస్‌గానే అన్నాడు.
బిత్తరపోతాడనుకున్న టామ్ కనీసం తత్తరపాటైనా పడలేదు. ‘‘హ్హ హ్హ హ్హ’’ అని వికటాట్టహాసం చేశాడు.
‘‘అలాంటి ప్రమాదం ఏమీ లేదు మిస్టర్ నెటిల్‌విక్... నువ్వు ఆఫీసులో పుట్టి ఆఫీసులో పెరిగి రూల్సుని భోంచేసి డబ్బుల గలగల మ్యూజిక్కులో పెరిగినవాడివి! నీకు సెన్సాఫ్ హ్యూమర్– ప్రాక్టికల్ జోక్స్ అంటే తెలీదనుకుంటాను– ఇక్కడ మా స్టయిల్ వేరు. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ చావాలిరా’’ అన్నది మా తత్వం... ఘనత వహించిన పరీక్షాధికారిగారూ! మిమ్మల్నో ఆటపట్టిద్దామని మీరు క్యాష్ లెక్కెడుతుండగా ఆ ఫైల్‌లోంచి నేనే కొన్ని బిల్స్ మాయం చేశా... ఇవిగో ఆ బిల్స్, స్టాక్స్, బాండ్స్, షేర్స్... హ్హ హ్హ హ్హ..’’ అని నవ్వేశాడు.
నెటిల్‌విక్ చేష్టలుడిగి అలా కూర్చుండిపోయాడు.
‘‘ఆల్‌రైట్, ఆల్‌రైట్’’ అంటూ తను డైరీలో రాసుకున్న రిమార్కులు కొట్టేసి.. ‘‘మహానుభావా నీ ప్రాక్టికల్ జోక్ కాదుగాని... నేను వేసుకున్న డబుల్ ప్రోగ్రామ్ పాడు చేశావు కదా... ఇంకా స్టాక్‌మన్ నేషనల్ బ్యాంకు పని రేపే చేస్తా– దయచేసి మీ మెసంజర్‌ని సాయం ఇచ్చి గెస్ట్‌హౌస్‌కు దారి చూపిస్తారా– ఈ రాత్రికి ఇక్కడే మకాం’’ అని ఓ వెకిలి నవ్వు నవ్వేసి– కరచాలనం చేసి రాయ్ వెనకాల రాగా వెళ్లిపోయాడు.
ఇక్కడికి ఈ కథ అయిపోయినట్లే కాని... ఒక చిన్న విషయాన్ని చెప్పుకుని ముగిద్దాం.
బల్లమీద ఉన్న కవర్లో కాగితం మీద ఇలా రాసి ఉంది.
ప్రియమైన టామ్,
వేటకుక్కలు విజృంభిస్తున్నాయన్న కబురు విన్నాను. టర్నరయితే ఇబ్బంది ఉండకపోను. ప్రస్తుతం మా బ్యాంకులో 22 వేల డాలర్ల బ్యాలన్సు ఉంది. ఉండాల్సింది మరో ‘0’ అదనం. అంటే 2.20 లక్షల డాలర్లు. స్నేహితులు రాన్, ఫిషన్లు– గొర్రెలు కొనుక్కుంటామంటే 20 వేలు అప్పిచ్చాను.– మూజువాణీగా... వెధవలు సమయానికి ఎడ్రస్ లేకుండా పోయారు.
అందుకే ఈ రాత్రికి ఈ ఆడిటర్‌గాడు ఇక్కడే ఆగిపోయేట్టు చూడమని ‘‘హరికథా కాలక్షేపం నీకలవాటేగా’’ అని రిక్వెస్ట్ చేశాను కథా–హరికథా రంజుగానే సాగుతున్నట్లు మీ వాళ్లు ఫోన్ చేశారు. మెనీ మెనీ థ్యాంక్స్– వెధవలిద్దరూ 10.45 ట్రెయిన్‌లో తగలడ్డారు. బేరాల్లో లాభం బాగానే తీశార్ట. డబ్బు రెడీ... నెటిల్‌విక్‌గాడు కాదు... వాడి జేజెమ్మ కూడా... మన పిక్కమీద వెంట్రుక కూడా పీకలేరు
థాంక్యూ ఫర్ ది కోపరేషన్
బాబ్ బక్లీ
టామ్ కవర్‌ని ముక్కలు ముక్కలు చేసి చెత్తబుట్టలో పారేసి చేతులు దులుపుకున్నాడు.
ఇంగ్లిష్ మూలం : ఓ హెన్రీ
అనువాదం: ఎంవీ నారాయణాచార్య
Comments
Please login to add a commentAdd a comment