టారో (13-11-2016 to 19-11-2016) | From November 19 to November 13, 2016 to | Sakshi
Sakshi News home page

టారో (13-11-2016 to 19-11-2016)

Published Sat, Nov 12 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

టారో (13-11-2016 to  19-11-2016)

టారో (13-11-2016 to 19-11-2016)

13 నవంబర్ నుంచి 19 నవంబర్, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
భావోద్వేగాలు, అనుభూతులు అన్నీ తాత్కాలికమేనని గ్రహిస్తారు. మీ అంతశ్చేతన అద్దంలా పరిశుభ్రంగా ఉంటుంది. వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా సాగుతుంది. చిన్న చిన్న ఒడుదొడుకులుండవచ్చు కానీ, జీవితంలోని ఇతర ఆనందాలతో పోల్చుకుంటే అవెంత? మీ పని మీరు మనసు పెట్టి, ఆత్మవిశ్వాసంతో చేయండి.
లక్కీ కలర్: లేతగులాబీ

 

వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా నిజాయితీగా వ్యవహరిస్తే భయాలు తొలగుతాయి. మిమ్మల్ని బాధిస్తున్న ముల్లును నేర్పుగా పెకలించి వేస్తే మీ అంత కచ్చితమైన వ్యక్తి మరొకరు లేరని మీకే అర్థం అవుతుంది. నూతన గృహనిర్మాణం లేదా ఇంటి ఆధునీకరణ పనుల్లో పడతారు. మీ సత్తా నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
లక్కీ కలర్: పసుపు

మిథునం (మే 21 - జూన్ 20)
ఇంటా బయటా జరగనున్న కొన్ని ప్రధాన సంఘటనలు మిమ్మల్ని కుదిపి వేయవచ్చు. మీరు చేస్తున్నదంతా బాధ్యతాయుతంగా చేస్తున్నదేనని మీరు గ్రహిస్తే జీవితంలో అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ఎప్పుడో విడిచిపెట్టిన బంధువులు, బంధుత్వాలు, పాత సంబంధాలు తిరిగి కలుస్తాయి. ఛలోక్తులు విసిరేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి.
లక్కీ కలర్: మావిచిగురు

కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
గురుబలం వల్ల మీకు ఈవారం బాగా కలిసి వస్తుంది. విజయం వరిస్తుంది. నిన్న అనేది జరిగిపోయింది. రేపు అనేది ఇంకా పుట్టలేదు. కాబట్టి భూతభవిష్యత్ కాలాలను విడిచిపెట్టి వర్తమానంలో సంపూర్తిగా జీవించడం అలవాటు చేసుకోండి. అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. అవిశ్రాంతంగా పని చేయడం అనారోగ్యకరం అని గ్రహించండి. మార్మిక కవితలు లేదా ప్రేమగీతాల రచనకు శ్రీకారం చుట్టండి. మీ అంతర్గత శక్తులను వెలికి తీయండి.
లక్కీ కలర్: చాకొలేట్

సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
కొత్త అవకాశంతోపాటే కొత్త సవాళ్లూ పొంచి ఉంటాయని తెలుసుకోండి.సమస్యలను ఎదుర్కొంటేనే అధిగమించగలం. ఆత్మవిశ్వాసంతో సమస్యను ఎదుర్కొన్నప్పుడే కదా, మీ సామర్థ్యం బయటపడేది. కొత్తదనం కోసం అన్వేషించండి. మనసు చెప్పే మాటను వినండి. మీ సృజనాత్మకత  మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది.
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
సమస్యలు, సవాళ్లు లేని జీవితం చప్పిడి పప్పు వంటిది. మీరు కోరినవన్నిటినీ పొందాలనుకుంటే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. అప్పుడే కదా జీవితం చైతన్యంతో ప్రకాశించేది! ఈ వారంలో మీరు చేసే ప్రయాణం మీకు కొత్త ఉత్సాహాన్ని, డబ్బును తెచ్చిపెడుతుంది. మీ జీవిత భాగస్వామిని కానుకలతో సంతృప్తి పరచేందుకు ప్రయత్నించండి.
లక్కీ కలర్: వెండిరంగు

తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
వృత్తిపరంగా ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన అవకాశం సిద్ధంగా ఉంది. రేపటికోసం తపన పడుతూ ఉంటే ఈరోజు ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుందని గ్రహించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు తక్షణం మీకు తగిన అత్యుత్తమమైన మార్గం కనిపించకపోవచ్చు కానీ, మీ ముందున్న మార్గం కూడా ఉత్తమమైనదే. ఇతరుల అవసరాలను తీర్చేముందు మీవి మీకు ముఖ్యమే కదా!
లక్కీ కలర్: పసుపు

వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఈవారం మీకు మంచి వినోదభరితంగా, ఉల్లాసంగా... ఇంకా చెప్పాలంటే సరసంగా గడిచిపోతుంది. మీ ప్రేమకోసం పడిగాపులు పడుతున్న వారిని పనిగట్టుకుని మరీ పలకరించి, వారిని ఆశ్చర్యంలో ముంచెత్తండి. ఛాందసమైన ఆలోచనలను విడిచిపెట్టి, కొత్తగా, వైవిధ్యంగా జీవించడం అలవాటు చేసుకోండి. మీ చరిష్మా మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికీ పోదు.
లక్కీ కలర్: నారింజ

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
మీరనుకున్నది నెరవేరుతుంది. వ్యాపారంలో మీరు అనుకుంటున్న కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి మంచి లాభాలను కళ్లజూస్తారు. గొప్ప ఆదాయాన్ని పొందుతారు. తమ శక్తి సామర్థ్యాలేమిటో తమకే తెలియని వారికి ప్రతివిషయంలోనూ భయమే! జ్ఞాని దేనికీ భయపడడు. ఈవారం ఓ గొప్ప సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పబోతోంది.
లక్కీ కలర్: దొండపండు ఎరుపు

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
జీవితమంటేనే స్వేచ్ఛ. ఎవరూ ఎవరినీ కట్టడి చేయజాలరని అనుకుంటారు. మనం ప్రేమించే వారిని మనం కట్టడి చేస్తాం. మనల్ని ప్రేమించే వారు తమ ప్రేమతో మన ముందరి కాళ్లకు బంధాలు వేస్తారు. అహాన్ని అణ చిపెడితేనే ఆనందం. త్వరలోనే కొత్త బంధాలు, బాధ్యతలు ఏర్పడనున్నాయి. ఆమోదించక తప్పదు.
లక్కీ కలర్: బూడిదరంగు


కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
జీవితం అంటే ప్రశ్న కాదు.. సమస్య అసలే కాదు. జీవితమంటే జీవించడమే! ఎదురైనవాటన్నింటినీ ఆమోదిస్తూ, అనుభవిస్తూ వాలుకు కొట్టుకుపోవడమే జీవితం. బోర్‌డమ్ నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోండి. కొత్తగా తయారవండి. స్నేహితులతో సరదాగా గడపండి. కుటుంబంతో కలసి లాంగ్‌టూర్‌కి వెళ్లండి. రొటీన్ నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండండి.
లక్కీ కలర్: వంకాయరంగు

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
వృత్తివ్యాపారాలలో ఊహలనుంచి బయటపడి, వాస్తవంగా ఆలోచించడం, ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోండి. ఇంటిలో లేదా ఆఫీసులో కొత్త మార్పు చోటు చేసుకోబోతోంది. సృజనాత్మక ఆలోచనతో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు, చిన్న చిన్న మార్పులు కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేయగలవు. అత్యుత్తమమైన వాటి గురించి ఆలోచన చేయండి. అందుబాటులో ఉన్న వాటిని ఆమోదించండి. మీ అభిప్రాయాలలో కాస్త పట్టువిడుపు ధోరణి అవసరం.
లక్కీ కలర్: లేత పసుపు

ఇన్సియా టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement