
అశోక్ పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెడుతూనే ఇన్‌స్పెక్టర్ విజయ్‌కి నమస్కరిస్తూ, ‘‘సార్! నిన్న రాత్రి నా ఇంట్లో దొంగతనం జరిగింది’’ అన్నాడు.‘‘వివరంగా చెప్పండి’’ కుర్చీ చూపిస్తూ అన్నాడు విజయ్. అశోక్ కుర్చీలో కూర్చున్నాడు. ‘‘నా పేరు అశోక్ కుమార్. ఆర్మీలో పనిచేసి ఏడాది కిందటే రిటైరయ్యాను. ప్రస్తుతం స్టేట్‌బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. నిన్న రాత్రి నేను నైట్ డ్యూటీలో ఉన్నాను. నా ఇల్లు గుండమ్మ కాలనీలో ఉంది. ఇంట్లో నా భార్య, పదేళ్ల కొడుకు రాజు మాత్రమే ఉన్నారు. రాత్రిపూట ఎవడో దొంగ మా పెరట్లోని చెట్టెక్కి మేడపై ఉన్న గదిలోకి దూరాడు. నా భార్య, కొడుకు కింద ఉన్న బెడ్ రూమ్‌లో పడుకోవడం వల్ల దొంగ సునాయాసంగా గదిలోని బీరువా తాళం పగలగొట్టి, అందులో ఉన్న నాలుగు తులాల బంగారం, పదివేల నగదు దోచుకున్నాడు. వాటితో పాటు బీరువాలోనే ఉన్న నా పిస్తోలును కూడా తీసుకెళ్లాడు’’ అని బాధగా చెప్పాడు.
‘‘మీ పిస్తోలుకు లైసెన్స్ ఉందా?’’ అడిగాడు విజయ్.‘‘ఉంది. తీవ్రవాదుల నుంచి ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన పిస్తోలు అది’’ అంటూ అశోక్ జేబులోంచి లైసెన్స్ తీసి చూపించాడు. ‘‘ముందుగా దొంగతనం జరిగిన మీ ఇంటిని పరిశీలిద్దాం. పదండి’’ అంటూ లేచాడు.కాసేపట్లోనే విజయ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో అశోక్ ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇల్లు కాలనీ చివర్లో ఉంది. పెరట్లోని వేపచెట్టు కొమ్మ బాల్కనీ పక్క నుంచి వెళ్లింది. ఆ కొమ్మ పైనుంచి దొంగ మేడ మీదకు చేరుకున్నాడని విజయ్ గ్రహించాడు. మేడ మీది గదిలో తాళం పగులగొట్టి బీరువా తెరిచిన గుర్తులు ఉన్నాయి. బీరువాలోని సామానంతా నేల మీద చెల్లాచెదురుగా పడి ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు బీరువా మీద ఉన్న వేలిముద్రలను సేకరించారు.అశోక్ భార్య మాలతిని, కొడుకును ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రశ్నించాడు. మాలతి జరిగినదంతా వివరించింది. ‘‘మా ఆయన ఇంట్లో లేకపోవడంతో నేను, రాజు కింద హాల్‌లోనే పడుకున్నాం. ఉదయం నిద్ర లేచాక రాజు ఆడుకోవడానికి మేడ మీదకు వెళ్లాడు. అప్పుడే దొంగతనం జరిగిన విషయం తెలిసింది. నేను వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఏమేం పోయాయో చూశాక ఆయన మీ దగ్గరకొచ్చారు’’ అంది.
సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన వేలిముద్రల్లో అశోక్ కుటుంబ సభ్యుల వేలిముద్రలతో పాటు ఒక కొత్త వ్యక్తి వేలిముద్రలు కూడా ఉన్నాయి. అవి దొంగ వేలిముద్రలని గ్రహించాడు విజయ్.కానీ ఆ వేలిముద్రలు పోలీసు రికార్డుల్లో లేకపోవడంతో అతని పరిశోధన ముందుకు సాగలేదు. గుండమ్మ కాలనీకి దగ్గర్లో ఒక మురికివాడ ఉంది. అక్కడ నివసించే నాగరాజు అనే తాగుబోతు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడని ఇన్‌ఫార్మర్ల ద్వారా విజయ్‌కి తెలిసింది. వెంటనే అనుమానంతో నాగరాజును అదుపులోకి తీసుకున్నాడు. థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. ఎంత కొట్టినా నాగరాజు అశోక్ ఇంట్లో దొంగతనం చెయ్యలేదనే వాదించాడు. పైగా అతని వేలిముద్రలు కూడా సంఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలతో మ్యాచ్ కాలేదు. చేసేదిలేక నాగరాజును విజయ్ వదిలేశాడు.మరుసటి రోజు ఒక అనూహ్య సంఘటన జరిగింది. అశోక్ కొడుకు రాజు చదివే మిల్టన్ ప్రైవేట్ స్కూల్‌లో ఒక హత్య జరిగింది. మ్యాథ్స్ టీచర్ అయిన రంగారావుని ఎవరో అతి దగ్గర నుంచి పిస్తోల్‌తో కాల్చి చంపారు. ఇంటర్వెల్ సమయంలో పిల్లలు, టీచర్లు అంతా స్కూలు బయట ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. అప్పుడు రంగారావు స్టాఫ్‌రూములో ఒంటరిగా ఉన్నాడు. తూటా నేరుగా ఛాతీలోకి దూసుకుపోవడంతో అతను కూర్చున్న కుర్చీలోనే ప్రాణం వదిలాడు. హంతకుణ్ణి ఎవరూ చూడలేదు.
ఇన్స్‌పెక్టర్ విజయ్ స్కూల్‌లోని టీచర్లు, విద్యార్థులను ప్రశ్నించాడు. రంగారావు శత్రువుల గురించి కూపీ లాగాడు. రంగారావు స్వభావరీత్యా కోపిష్టి అని, విద్యార్థులతో పాటు సహోద్యోగులపై కూడా తరచుగా చిర్రుబుర్రులాడే వాడని తెలిసింది. రెండు రోజుల కిందటే అతను ప్యూన్ గోవిందును అందరి ముందూ చెడామడా తిట్టాడని కొందరు చెప్పారు. విజయ్‌కి గోవిందుపై అనుమానం కలిగింది. అతడే అశోక్ ఇంట్లో దొంగతనం చేసి ఉండవచ్చని, అక్కడ దొంగిలించిన పిస్తోలుతోనే రంగారావుని ఉండవచ్చని అనుకున్నాడు. వెంటనే గోవిందును అదుపులోకి తీసుకుని, థర్డ్‌డిగ్రీ ప్రయోగించాడు. ఎంత బలప్రయోగం చేసినా, తాను నిర్దోషినని వాదించాడు గోవిందు. అతని వేలిముద్రలు కూడా అశోక్ ఇంట్లో లభించిన వేలిముద్రలతో మ్యాచ్ కాలేదు. గోవిందు ఇంకా కస్టడీలో ఉండగానే మరో హత్య జరిగింది. ఈసారి హత్యకు గురైనదెవరో కాదు, తాగుబోతు నాగరాజు. అతను ఒంటరిగా వెళుతున్నప్పుడు ఎవరో అతన్ని పిస్తోలుతో కాల్చి చంపారు. ఈసారి కూడా హంతకుణ్ణి ఎవరూ చూడలేదు.ఫోరెన్సిక్ రిపోర్టుల ప్రకారం నాగరాజు, రంగారావుల చావుకు కారణమైన బుల్లెట్లు ఒకే పిస్తోలు నుంచి వెలువడ్డాయి. ఆ పిస్తోలు అశోక్ ఇంట్లో చోరీ అయిన పిస్తోలే అని విజయ్‌కి అర్థమైంది. ఇంకో హత్య జరగక ముందే హంతకుణ్ణి పట్టుకోవాలనుకున్నాడు.
అశోక్ ఇంట్లో దొంగతనం జరిగిన రోజే విజయ్ నగరంలోని పాత బంగారు నగలు కొనే వ్యాపాస్తులందరికీ చోరీ అయిన నగల వివరాలు అందించాడు. త్వరలోనే దాని ఫలితం కనిపించింది. వీరేష్ అనే చిల్లరదొంగ ఆ నగలు అమ్మబోతూ పట్టుబడ్డాడు. అతని వేలి ముద్రలు కూడా అశోక్ ఇంట్లో లభించిన వేలిముద్రలతో సరిపోయాయి. దాంతో జంట హత్యల మిస్టరీ కూడా విడిపోతుందనుకున్నాడు ఇన్‌స్పెక్టర్ విజయ్.కానీ వీరేష్ దొంగతనం నేరం ఒప్పుకున్నాడు గానీ, హత్యల గురించి తనకు తెలియదన్నాడు. అశోక్ ఇంటి బీరువాలోని డబ్బు, నగలు మాత్రమే తీసుకుని, పిస్తోలును అక్కడే వదిలేశానన్నాడు. ఎంత బలప్రయోగం చేసినా వీరేష్ పోలీసులకు ఇదే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. కథ మళ్లీ మొదటికొచ్చింది. దొంగ దొరికినా హంతకుడు దొరకలేదు. అశోక్ పిస్తోలును ఎవరు దొంగిలించారు? ఈ హత్యలెందుకు చేస్తున్నారు? ఇన్‌స్పెక్టర్ విజయ్‌కి ఏమీ అంతుబట్టలేదు.రాత్రి ఎనిమిది గంటలకు పోలీస్ స్టేషన్‌లో ఫోన్ మోగింది. విజయ్ ఫోనెత్తాడు. అవతల అశోక్ కంగారుగా చెప్పాడు. ‘‘సార్, నేను బాత్రూంలో ఉన్నప్పుడు హఠాత్తుగా మా ఇంటి వెనుక వైపు పిస్తోలు పేలిన శబ్దం వినిపించింది. నేను వెంటనే అక్కడకు వెళ్లి చూస్తే ఒక పిచ్చికుక్క చచ్చి పడి ఉంది. ఎవరో దాన్ని కాల్చి చంపారు. అది నా పిస్తోలు కావచ్చు. పిస్తోలు పేల్చిన వ్యక్తి మా వీధి దాటి పోలేదు. ఏదో ఒక ఇంట్లో దాక్కుని ఉంటాడని నా అనుమానం. మీరు వెంటనే ఇక్కడికొస్తే వాణ్ణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు’’ అన్నాడు అశోక్.విజయ్ ఆగమేఘాల మీద గుండమ్మ కాలనీకి చేరుకున్నాడు. అశోక్‌తో కలసి వీధిలోని ఇళ్లన్నీ గాలించినా, పిస్తోలు పేల్చిన వ్యక్తి చిక్కలేదు. నిరాశగా అశోక్ ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు అనుకోకుండా విజయ్ దృష్టి అశోక్ కొడుకు రాజుపై పడింది. రాజు కంగారుపడుతున్నాడు. మాటిమాటికీ తన స్కూలు బ్యాగు వైపు చూస్తున్నాడు. విజయ్ కళ్లు మెరిశాయి. వెంటనే ఆ బ్యాగు అందుకుని, దాన్ని తెరిచి చూశాడు. బ్యాగులో పుస్తకాల మధ్య పిస్తోలు కనిపించింది. అది చూసి విజయ్‌తో పాటు అశోక్, మాలతి కూడా నివ్వెరపోయారు. ‘‘మీ నాన్న పిస్తోలు దొంగిలించింది నువ్వా?’’ విజయ్ రాజును గద్దిస్తూ అడిగాడు.
రాజు ఔనన్నట్లు తల ఊపి, జరిగినదంతా చెప్పేశాడు.‘‘నాకు పిస్తోలుతో ఆడుకోవడమంటే ఇష్టం. ప్రతిసారీ దీపావళి పిస్తోలుతో ఆడుకుని విసుగు పుట్టింది. నిజం పిస్తోలుతో ఆడుకోవాలనిపించింది. ఒకసారి ఇంటర్నెట్‌లో పిస్తోలును ఎలా పేలుస్తారో చూశాను. అది చూశాక డాడీ పిస్తోలుతో ఆడుకోవాలనిపించింది. కానీ డాడీ తన పిస్తోలును ఎవరినీ ముట్టుకోనివ్వడు. అందుకే ఆ రోజు దొంగతనం జరిగినప్పుడు ఎవరూ చూడకుండా బీరువాలో డాడీ పిస్తోలును నా బ్యాగులో దాచేశాను. దాంతోనే మా టీచర్‌ని, తాగుబోతుని, పిచ్చికుక్కని కాల్చాను. వీళ్లంతా చెడ్డవాళ్లు. సినిమాల్లో మీరో చెడ్డవాళ్లని చంపినట్టే నేను కూడా వాళ్లను కాల్చి చంపేశాను.’’ అమాయకంగా చెప్పాడు రాజు.ఇన్స్‌పెక్టర్ విజయ్ రాజుని కస్టడీలోకి తీసుకుని, మర్నాడు కోర్టులో హాజరుపరచాడు. రాజు మైనర్ కావడంతో కోర్టు అతన్ని బాల నేరస్తుల కేంద్రానికి పంపింది.
- మహబూబ్ బాషా
Comments
Please login to add a commentAdd a comment