అవినీతిని కలియుగ ధర్మంగా ఆచరించే ప్రభుత్వోద్యోగి ధర్మారావు ఇందులో ప్రధాన పాత్ర. అతడి భార్య జానకి అవినీతి సంపాదన పాపమని హెచ్చరించినా, వితండవాదంతో ఆమె నోరుమూయిస్తాడు.
రైట్ వే దిశగా...
పుస్తకం : రాంగ్‌వే (నవల) రచన : ఎస్.ఎం.ప్రాణ్‌రావు
విషయం : అవినీతిని కలియుగ ధర్మంగా ఆచరించే ప్రభుత్వోద్యోగి ధర్మారావు ఇందులో ప్రధాన పాత్ర. అతడి భార్య జానకి అవినీతి సంపాదన పాపమని హెచ్చరించినా, వితండవాదంతో ఆమె నోరుమూయిస్తాడు. అతడి భావజాల ప్రభావంతో పెరిగే పిల్లలు చిదంబరం, లత! వీరికి పూర్తి విరుద్ధమైనది కేశవరావు కుటుంబం. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి. భర్త నిజాయితీ వల్లే తన కలలు నెరవేరడం లేదని బాధపడే ప్రవృత్తి గలది అతడి భార్య కౌసల్య. అవినీతి వ్యవస్థ పట్ల ద్వేషంతో తీవ్రవాదిగా మారి, అజ్ఞాత జీవితం గడిపే విలక్షణ పాత్ర మల్లప్ప. అవినీతి సామాజిక విలువలను తారుమారు చేస్తుందనీ, ప్రజల నరనరాల్లో జీర్ణించుకున్న ‘రాంగ్‌వే’ (అవినీతి) నుండి రైట్ వే వైపు పాఠకులను నడిపించాలన్న అంతర్లీన సందేశం నవల్లో ఉంది. సముచిత పాత్ర చిత్రణతో, పాత్రల మధ్య ఉద్వేగ భరిత సంభాషణలతో ఉత్కంఠను రేకెత్తించారు రచయిత ప్రాణ్‌రావు.
- డా॥పి.వి.సుబ్బారావు
పిల్లల కథలు
పుస్తకం : పట్టు ఎలా పుట్టింది? మరిన్ని కథలు
రచన : సుధామూర్తి
అనువాదం : రేణు చామర్తి, జ్యోతిర్మయి
విషయం : సామాన్య శైలిలో జానపద కథా విధానంతో సంఘ జీవనానికి అవసరమయ్యే నీతిని రంగరించి రాసిన 21 కథలివి. మనది గాని సొమ్మును అనుభవించగూడదని ‘అసలైన వారసుడు’; ఎంత ధనాన్ని సంపాదించినా కష్టపడే తత్త్వాన్ని వదలకూడదని ‘లక్ష్మి చంచలంగా ఎందుకుంటుంది’; ప్రతి చిన్న సహాయానికి ఫలితాన్ని ఆశించకూడదని ‘దానితో నాకేం లాభం’ బోధిస్తాయి. ఉపాయంతో కూడిన శ్రమతో ఎదగవచ్చనే జీవిత పాఠాన్ని మహిళా రైతు ‘కావేరి ఉపాయం’లో నిరూపిస్తుంది. ఒకరు చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మకూడదని ‘గాడిద కర్ర’ ఉపదేశిస్తుంది. విద్యార్థుల్లో చారిత్రక శాస్త్రీయ దృక్పథాన్ని ‘పట్టు ఎలా పుట్టింది’ అలవరుస్తుంది. పంచతంత్రం, తెనాలి రామలింగని కథల్లాగే నేరుగా సత్ప్రవర్తనను బోధించకుండా, జీవిత విలువల్ని చొప్పించి మనసుకు హత్తుకునేలా రాసిన కథలివి!
- డా॥గోపవరం పద్మప్రియ
కొత్త సాహిత్య ‘జిప్సీ’
పుస్తకం : జిప్సీ రచన : సాగర్ శ్రీరామకవచం
విషయం : ఉద్వేగభరిత సంవేదనా మూలాల్లోంచి ఆధునికాంతర వాద ఛాయల్లోంచి వెలుగు చూసిన ప్రక్రియ ‘ముక్కాణీలు’. వీటి సృష్టికర్త సాగర్ శ్రీరామకవచం. ఏదైనా కొత్తదనాన్ని తలకెత్తుకొని కాలంతో కలిసి నడవాలనేది ఈయన మనస్తత్వం. ప్రాచీన పద్య రూపంతో ఆధునిక కవిత్వాన్ని మేళవించిన రూపంగా వీటిని తన మాటలో పేర్కొన్నాడు. ప్రతి పద్యంలోను మూడు పాదాల తరువాత విరామం ఉంటుంది. నాలుగో పాదం పై మూడు పాదాలతో సంభాషిస్తుంది. తీసుకున్న వస్తువును బట్టి పద్య విస్తృతి కొనసాగుతుంది. ఈ ‘జిప్సీ’ కవులైనవాళ్లకి ఓ కొత్త కవిత రాయడానికి ప్రేరణ కలిగిస్తుంది. ఒకరు ఆలోచించిన రీతిలో మరొకరు ఆలోచించలేని విధంగా ప్రతి పద్యం ఉంటుంది.
‘ఇల్లు అమ్మితే ఊరుని అమ్ముకున్నట్టే/ఏముందని మళ్లీ వస్తామిక్కడికి/ ఎవరున్నారని తారట్లాడ్తామిక్కడ/........../పాత యిల్లు వెలవెలా పోవచ్చు కాని అది నిలువెల్లా చారుధామం.’ ఈ ప్రక్రియకు కవులు ఆకర్షితులవుతారనీ, మరెన్నో ముక్కాణీలు చలామణిలోకి వస్తాయనీ ఆశిస్తూ కవిని అభినందిస్తున్నాను.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
కొత్త పుస్తకాలు
ప్రతిజ్ఞ- యాభై ఏండ్ల వివక్ష
సంపాదకుడు: ఎలికట్టె శంకర్‌రావు
పేజీలు: 68; వెల: 30
ప్రతులకు: ఎన్ ఎస్ అరుణ, నోముల సాహిత్య సమితి, సాయిటవర్స్, నాగార్జున కాలనీ, నల్లగొండ. ఫోన్: 9346359268
కులం పునాదులు
రచన: కత్తి పద్మారావు
పేజీలు: 156; వెల: 100
ప్రతులకు: కత్తి స్వర్ణకుమారి, అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, 6-3-600/ఎ/2/-1, ఎఫ్ 5, తేజస్విని అపార్ట్‌మెంట్స్, హిల్‌టాప్ కాలనీ, ఎర్రమంజిల్, హైదరాబాద్-82. ఫోన్: 9849741695
అనివార్యం (కథలు)
రచన: పంజాల జగన్నాథం
పేజీలు: 88; వెల: 120
ప్రతులకు: రచయిత, 7-2-92, మంకమ్మతోట, కరీంనగర్-1. ఫోన్: 9948531985
హైందవ శంఖారావం
రచన: పిరాట్ల వేంకటేశ్వర్లు
పేజీలు: 168; వెల: 100
ప్రతులకు: సాహిత్య నికేతన్, కేశవనిలయం, బర్కత్‌పుర, హైదరాబాద్-27
116 కథలు
రచన: డా. పి.బి.మనోహర్
పేజీలు: 232; వెల: 75
ప్రతులకు: రచయిత, 8-17-11, బాలాజీరావుపేట, తెనాలి-522201. ఫోన్: 9848363638
తెలంగాణ-సీమాంధ్ర సమస్యకు శాశ్వత పరిష్కారం
రచన: డా. ఎం.కృష్ణారెడ్డి
పేజీలు: 144; వెల: 150
ప్రతులకు: itc_forum@yahoo.com ఫోన్: 9246270199