లబ్‌...డబ్‌... | funday crime story | Sakshi
Sakshi News home page

లబ్‌...డబ్‌...

Published Sun, Mar 25 2018 1:27 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

funday crime story - Sakshi

నేను మెరుపు వేగంతో ముసలతన్ని పరుపు మీది నుంచి నేలపైకి తోసేసి, అదే ఊపులో బరువుగా ఉన్న పరుపును అతనిపైన కప్పేశాను. తర్వాత నా బరువంతా ఆ పరుపుపై వేసి బలంగా అదిమేస్తూ అతనికి ఊపిరి ఆడకుండా చేశాను. ఇలా చేస్తున్నప్పుడు పైశాచికపు ఆనందంతో నా పెదాలపై విషపు నవ్వు విచ్చుకుంది. పరుపు మీద ఉన్న నాకు అతని గుండె చప్పుడు కొద్ది నిమిషాల వరకు స్పష్టంగా వినబడింది. తర్వాత హఠాత్తుగా అది ఆగిపోయింది. ముసలతను చనిపోయాడు.నేను పరుపును పక్కకి జరిపి అతని ఎదపై చెవి ఆనించి చూశాను. చడీ చప్పుడు లేదు. అతని గుండె శాశ్వతంగా ఆగిపోయింది. అతని కళ్లు జీవం కోల్పోయాయి. అవి ఇంకెప్పుడూ నన్ను చిరాకు పెట్టలేవు. ముఖ్యంగా రక్తపు ముద్దలా ఎర్రగా ఉండే అతని ఎడమ కన్ను అంటే నాకు పరమ అసహ్యం. నేను అతణ్ని చంపడానికి అదీ ఒక కారణం.ఈ ముసలతను చాలా కాలం నుంచి మా ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్నాడు. అతనిది ఏ ఊరో నాకు తెలియదు. అతనికి నా అన్నవారెవరూ లేరు. కొంత డబ్బు, కొన్ని ఆస్తిపాస్తుల పత్రాలు మాత్రం అతని వద్ద ఉన్నాయి. అయితే అతని డబ్బుగాని పత్రాలనుగాని తస్కరించాలన్న దురుద్దేశం నాకు లేదు. కానీ ఎందుకో కొన్నాళ్లుగా ఆ ముసలతనిపై నాకు ద్వేషభావన ఏర్పడింది. దానికి కారణం భయానకంగా    ఉన్న అతని ఎడమ కన్ను కావచ్చు. ఆ కంటిని చూడగానే నేను ద్వేషంతో రగిలిపోయేవాణ్ని.

ఆ ద్వేషాగ్నిని చల్లార్చుకోవడానికే నేనతన్ని అంతమొందించాను. పైగా అతణ్ని చంపే ముందు బాగా భయపెట్టాలనుకున్నాను. నేనెంతగానో అసహ్యించుకునే ఆ రక్తపు ముద్దలాంటి అతని కన్ను భయంతో అదురుతుంటే చూసి ఆనందించాలనుకున్నాను.నా కోరిక తీర్చుకోవడానికి రోజూ సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు చప్పుడు చెయ్యకుండా అతని గది దగ్గరికెళ్లేవాణ్ని. ఆ సమయంలో ఇల్లంతా చీకటిగా ఉండేది. తన గదిలోని దీపాన్ని ఆర్పేసి చీకట్లో పడుకోవడం ముసలతనికి అలవాటు. నేను చిమ్నీకి దట్టంగా మసి పూసిన ఓ లాంతరు తీసుకొని ముసలతని గది తలుపు దగ్గరికెళ్లే వాణ్ని. తలుపును కొద్దిగా తెరిచి ఆ సందులోంచి లాంతరును లోపలికి దూర్చేవాణ్ని. తర్వాత చిమ్నీ మీది మసిని వేలిగోటితో కొద్దిగా తుడిచేవాణ్ని. కొద్దిగా అంటే ఎంతో తెలుసా? నువ్వు గింజ కన్నా తక్కువ. అందులోంచి ఒకే ఒక కిరణం బయటికి వెలువడేది. ఆ కిరణం గదిలో పడుకున్న ముసలతని ఎడమ కంటిపై నేరుగా, సూటిగా పడేలా నేను లాంతరుని పట్టుకునేవాణ్ని. అతని ఎడమ కనుగుడ్డు పెద్దగా ఉండటం వల్ల అతను పడుకున్నప్పుడు కూడా అది తెరుచుకునే ఉండేది. దానిపైన కాంతి కిరణం పడగానే అది అసహనంగా కొట్టుకునేది. అది చూసి నాకు అనిర్వచనీయమైన ఆనందం కలిగేది. నా మనసులోని ద్వేషాగ్ని కొద్దికొద్దిగా చల్లారేది.

ఇలా వారం రోజులు చేశాను. కానీ ఎనిమిదో రోజు రాత్రి ఇలా చేస్తున్నప్పుడు నా చేతివేలి గోరు చిమ్నీకి గట్టిగా తగలటంతో సన్నగా చప్పుడైంది. ఆ నిశ్శబ్ద నిశీధిలో అది ముసలతనికి పెద్దగా వినిపించినట్టుంది. అతను భయం, విస్మయం జత కలిసిన స్వరంతో ‘‘ఎవరూ?’’ అని అరిచాడు. నేను జవాబివ్వలేదు. ఉన్న చోటు నుంచి కదల్లేదు. ఇల్లంతా చిమ్మచీకటి, పైగా నేను నల్లటి దుస్తులు ధరించాను. అతనికెలా కన్పిస్తాను? నేను చాలాసేపటి వరకు కదలకుండా అలాగే కూర్చున్నాను.గంట తర్వాత లాంతరు చిమ్నీ మీది మసిని వేలిగోటితో గీకాను. సన్నటి దారపు పోగు లాంటి కాంతి కిరణం బయటికి వెలువడింది. దాన్ని సూటిగా ముసలాయన ఎడమ కన్నుపై పడేలా లాంతరును పట్టుకున్నాను. ఇప్పుడు ఆ కన్ను పూర్తిగా తెరుచుకొని ఉంది. భయంగా లాంతరు వైపు చూస్తోంది. రక్తపు ముద్దలా ఉన్న ఆ ఎర్రటి కనుగుడ్డును చూడగానే నాలో కసి రేగింది.భయంతో ముసలాయన గుండె కొట్టుకుంటున్న చప్పుడు నాకు స్పష్టంగా వినపడసాగింది.‘లబ్‌.. డబ్‌... లబ్‌... డబ్‌’ అంటూ.గంట నుంచి ముసలతను బిక్కుబిక్కుమంటూ పడుకున్నాడని నాకు అర్థమైంది. క్షణక్షణానికీ అతని భయం పెరుగుతోందనటానికి సూచనగా అతని గుండె చప్పుడు మరింతగా పెరగసాగింది. ఆ శబ్దాన్ని నేను భరించలేకపోయాను. వెంటనే దాన్ని ఆపకపోతే నాకు పిచ్చెక్కుతుందనిపించింది.

వెంటనే లాంతరు పక్కన పెట్టేసి అతని పరుపు దగ్గరికెళ్లాను. ఆ అలికిడికి ముసలతను కెవ్వుమంటూ గట్టిగా అరిచాడు.అంతే! నేను మెరుపు వేగంతో అతణ్ని పరుపుపై నుంచి కిందికి తోసేసి అదే పరుపుతో అతనికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాను. ఇప్పుడతని గుండె చప్పుడు శాశ్వతంగా మూగబోయింది. ఇంతవరకు నన్ను చిరాకు పెట్టిన ఆ ఎర్రటి కనుగుడ్డు కూడా జీవం కోల్పోయింది. ఇక నన్ను ఆ కన్నుగాని, గుండె చప్పుడుగాని ఇబ్బంది పెట్టలేవు.మీరు నన్ను పిచ్చివాడనుకుంటున్నారా? మీ అంచనా తప్పు. నేను హత్య చేశాక ఎంత తెలివిగా శవాన్ని మాయం చేశానో తెలిస్తే మీరు నా తెలివిని మెచ్చుకోకుండా ఉండలేరు. అమెరికాలోని చాలా ఇళ్లు కలపతోనే చేస్తారని మీకు తెలుసు కదా. చివరికి ఇంట్లోని నేలను కూడా చెక్క పలకలతోనే కప్పుతారు. ముసలాయన ఉండే గదిలో పలకల కింద ఓ నేలమాళిగ ఉంది. ఆ విషయం నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. నేను నేలమాళిగ మీద గల మూడు పలకల్ని తొలగించి ముసలాయన శవాన్ని అందులోకి చేర్చాను. తర్వాత పలకల్ని యథాస్థానంలో బిగించాను. ఆ పని ఎంత చాకచక్యంగా చేశానంటే, ఆ పలకల్ని తీసి మళ్లీ బిగించినట్టు బ్రహ్మదేవుడు కూడా కనుక్కోలేడు.నేను ఎంత తెలివిగా హత్య చేశానో చూశారా? ఘటనా స్థలంలో ఒక్క ఆధారాన్నీ వదల్లేదు. అక్కడ ఒక్క చుక్క రక్తం లేదు. చిన్న మరక కూడా పడలేదు. అంటే అక్కడ కడగటానికీ, తుడవటానికీ ఏమీ లేదు. అప్పుడు సమయం తెల్లవారుజాము నాలుగు గంటలు కావస్తోంది. కానీ దట్టమైన చీకటి వల్ల ఇంకా అర్ధరాత్రి దాటలేదనిపిస్తోంది.

గోడ గడియారం నాలుగు గంటలు కొట్టింది. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. నేను ఉలిక్కిపడలేదు. ఎందుకు భయపడాలి? నేనెక్కడా పొరపాటు చెయ్యలేదు కదా. ధైర్యంగా వెళ్లి తలుపు తీశాను. ముగ్గురు వ్యక్తులు లోపలికొచ్చారు. వారు పోలీసులు! రెండు గంటల క్రితం నా ఇంట్లోంచి ఓ గావుకేక వినపడిందని పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారట. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు నా ఇంటికొచ్చారు.నేను కంగారు పడలేదు. చిరునవ్వు నవ్వి వారికి స్వాగతం పలికాను. ‘‘మీకు కష్టం కలిగించినందుకు నన్ను క్షమించండి. ఆ గావుకేక నేను వేసిందే! ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇక్కడ పేయింగ్‌ గెస్ట్‌గా ఉన్న ముసలాయన తన ఊరికెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉండటం వల్ల కాబోలు నిద్రలో పీడ కలొచ్చి భయంతో అరిచాను సార్‌’’ వినయంగా చెప్పాను.తర్వాత నేను వారికి ఇల్లంతా తిప్పి చూపించాను. చివరగా మేం ముసలాయన గదిలోకి అడుగుపెట్టాం. అక్కడ ముసలాయనకి సంబంధించిన ఖరీదైన వస్తువులు, విలువైన పత్రాలను కూడా చూపించాను. వాటిని చూసి పోలీసులు సంతృప్తి చెందారు. నేను అత్యుత్సాహంగా ఆ గదిలో వారి కోసం కుర్చీలు వేసి కూర్చోమని చెప్పాను. ‘‘పాపం, మీరు నా కోసం నిద్ర  చెడగొట్టుకొని వచ్చారు. కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్లండి’’ అంటూ నేను కూడా కుర్చీలో కూలబడ్డాను. నా కుర్చీని సరిగ్గా నేలలో శవం ఉన్న చోట వేసుకున్నాను. చూశారా, నాకెంత ధైర్యమో!

పోలీసులు నా మాటల్ని తేలిగ్గా నమ్మేశారు. ఓ బరువు దిగిపోయినట్టు వారు నిశ్చింతగా కుర్చీల్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. అందులో నేను కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నాను.కాసేపు సరదాగా గడిచింది. అంతలో ఉన్నట్లుండి నా మనసులో అలజడి మొదలైంది. తల నొప్పిగా అనిపించింది. చెవుల్లో ఏవేవో శబ్దాలు వినిపించసాగాయి. పోలీసులు తొందరగా వెళ్లిపోతే బావుండనిపించింది. కానీ వారు మాటల్లో లీనమైపోయారు. నాకు విన్పిస్తున్న శబ్దాలు పోలీసులకు వినిపించకూడదని నేను గట్టిగా మాట్లాడసాగాను. కానీ నేను ఎంత గట్టిగా మాట్లాడితే ఆ శబ్దాలు అంతకన్నా గట్టిగా వినపడసాగాయి. అంతలో ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలిసి పోయింది. అవి నేను కూర్చున్న కుర్చీ కింద గల నేలమాళిగలో నుంచి వస్తున్నాయి. రాను రాను ఆ శబ్దాల తీవ్రత పెరగసాగింది. ఇప్పుడవి మరింత స్పష్టంగా వినిపించసాగాయి.‘‘లబ్‌... డబ్‌... లబ్‌.. డబ్‌...’’వేగంగా గుండె కొట్టుకునే శబ్దాలవి. సందేహం లేదు. ముమ్మాటికీ అవి ముసలాయన గుండె చప్పుళ్లే! కానీ ఇదెలా సాధ్యం? చనిపోయిన మనిషి గుండె ఎలా కొట్టుకుంటుంది?ఆ ఆలోచన రాగానే ఉద్వేగంతో నా గుండె ఆగిపోతుందేమోనని భయమేసింది. భయాందోళనల వల్ల నా ముఖం వివర్ణమైంది. విచిత్రమేమంటే, ఆ శబ్దాలు పోలీసులకు వినిపించడం లేదు. వారు ఉల్లాసంగా కూర్చొని తమ పాత కేసుల గురించి చర్చించుకుంటున్నారు.

పోలీసుల్ని వెళ్లగొట్టాలనే ఉద్దేశంతో వారి మాటలకు అడ్డు తగులుతూ వారి గురించి నిష్ఠూరంగా మాట్లాడటం మొదలెట్టాను. అయినా వారు నా మాటల్ని పట్టించుకోలేదు. దాంతో నేను కుర్చీలో నుంచి లేచి గదిలో అసహనంగా పచార్లు చేస్తూ, వారి ప్రతి మాటనీ తప్పు పట్టసాగాను. కోపంగా కాళ్లతో నేలను తన్నుతూ వారిని తిట్టసాగాను.వారు హఠాత్తుగా మాటలాపి నా వైపు  వింతగా చూశారు. అయినా వారు తమ కుర్చీలోంచి లేవలేదు. మరోపక్క ఆ శబ్దాల తీవ్రత క్షణక్షణానికీ పెరగసాగింది. ‘‘లబ్‌.. డబ్‌.. లబ్‌.. డబ్‌’’నాలో ఉద్వేగం తారాస్థాయికి చేరుకుంది. కోపంగా నా కుర్చీని పైకెత్తి దూరంగా విసిరేశాను. అది చూసి పోలీసులు మొదట విస్తుపోయినా తర్వాత ఒకరివైపొకరు చూసుకొని ముసిముసిగా నవ్వుకోసాగారు. అది చూసి నా కోపం నషాళానికి ఎక్కింది.వారెందుకు నవ్వుతున్నారు? నాకు వినిపిస్తున్న శబ్దాలు వారికి వినిపించడం లేదా? లేక అవి వినిపించనట్టు నటిస్తున్నారా? హే భగవాన్‌! వారి నవ్వు నన్ను చిత్రవధకు గురి చేస్తోంది. నా గుట్టుతెలిసిపోయిందని వారు నన్ను అవహేళన చేస్తున్నారా? వారి ఎగతాళిని నేను భరించలేక పోతున్నాను. పుండు మీద కారం చల్లినట్టు నేలమాళిగలో నుంచి ఆ శబ్దాలు మరింత పెద్దగా, కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. ‘‘లబ్‌.. డబ్‌.. లబ్‌.. డబ్‌..’’నేను భయంగా చెవులు మూసుకున్నాను. అయినా ఆ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. పైగా వాటి తీవ్రత క్షణక్షణానికీ పెరుగుతోంది. ఆ శబ్దాల తాకిడికి నా తల బద్దలవుతుందనిపించింది. వెంటనే వాటిని ఆపకపోతే నేను చచ్చిపోవడం ఖాయమనిపించింది.నేనిక తట్టుకోలేకపోయాను. గొంతు చిరిగిపోయేలా గట్టిగా అరిచాను. ‘‘మూర్ఖుల్లారా..! ఇంతసేపు చోద్యం చూస్తూ కూర్చున్నారా? నేను నేరాన్ని అంగీకరిస్తున్నాను. ఈ పలకల్ని తొలగించండి. వాటి కింద నేను దాచిన ఆ ముసలివాడి శవాన్ని వెంటనే ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లండి. ఆ శవం లోంచి వస్తున్న గుండె చప్పుడు నా ప్రాణాన్ని తోడేస్తోంది’’.

అంతలో ఉన్నట్లుండి నా మనసులో అలజడి మొదలైంది. తల నొప్పిగా అనిపించింది. చెవుల్లో ఏవేవో శబ్దాలు వినిపించసాగాయి. పోలీసులు తొందరగా వెళ్లిపోతే బావుండనిపించింది. కానీ వారు మాటల్లో లీనమైపోయారు. నాకు వినిపిస్తున్న శబ్దాలు పోలీసులకు వినిపించకూడదని నేను గట్టిగా మాట్లాడసాగాను. కానీ నేను ఎంత గట్టిగా మాట్లాడితే ఆ శబ్దాలు అంతకన్నా గట్టిగా వినపడసాగాయి. అంతలో ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో నాకు తెలిసి పోయింది. అవి నేను కూర్చున్న కుర్చీ కింద గల నేలమాళిగలో నుంచి వస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement