పోలీస్‌ జీప్‌ | funday crime story | Sakshi
Sakshi News home page

పోలీస్‌ జీప్‌

Published Sun, May 6 2018 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

funday crime story - Sakshi

‘ఒరేయ్‌ రాజూ! నీకీ విషయం తెలీదేట్రా! గోశాల జంక్షన్‌ దగ్గర యాక్సిడెంట్‌ జరిగిందట. మీ చిన్నాన్న కొడుకు లేడూ.. అదేరా మీ శ్రీనుగాడు. వాణ్ని పోలీసు జీపు గుద్దేసిందట. పాపం ఎలాగున్నాడో ఏమో?’’ గోశాలకేసి పరిగెడుతున్నాడు ఈరన్న.నాకు నోటమాట రాలేదు. ఆత్రుతగా అతని వెనుకే పరుగందుకున్నాను.గోశాల మూడు రోడ్ల జంక్షన్‌. మధ్యలో పెద్ద రావి చెట్టు. అప్పటికే అక్కడ జనమంతా గుమిగూడి ఉన్నారు. మేం వెళ్లే్లసరికి శ్రీనుగాణ్ని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు.‘‘ఏమైందిరా?’’ జనాల మధ్యఏడుస్తూ నిలబడ్డ నర్సింహాన్ని చూసి అడిగాను.‘‘ఏమో అన్నయ్యా! ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు శ్రీనివాస నగర్‌ వెళ్లొస్తానన్నాడు. సైకిల్‌ తీస్తుంటే వద్దని తిట్టాడు నాన్న. అయినా వినకుండా వచ్చాడు. ఇదిగో ఇప్పుడిలా!’’ ఏడుస్తూనే అన్నాడు నర్సింహ.    ‘‘ప్రాణహాని లేదు కదా’’ ఆత్రుతగా అడిగాను.‘‘ఏమో! చూసిన వాళ్లంతా స్పాట్‌లోనే చనిపోయాడంటున్నారు. ప్రమాదం జరిగీ జరగ్గానే పోలీసులు అదే జీపులో పెద్దాసుపత్రికి తీసుకుపోయారట. నేనూ ఇప్పుడే వచ్చాను’’ చెప్పాడు నర్సింహ.గంటా గంటన్నరలోపే అనుకుంటా అంబులెన్స్‌ ఒకటి సైరన్‌ వేసుకుంటూ వచ్చింది. దాన్ని చూస్తూనే మా అందరికీ దుఃఖం ఆగలేదు. దాని వెనుకే పోలీసు జీపు కూడా ఫాలో అయి వచ్చింది. శ్రీనుగాడి శవాన్ని అప్పగించేసి వెంటనే వెళ్లిపోయారు పోలీసులు.అప్పటికే సాయంత్రం ఆరైపోయింది. చీకటి ముసురుకుంది. నాకెందుకో మనసంతా ఆందోళనగా ఉంది. మనసు మనసులో లేదు. ఆలోచిస్తూ నడుస్తున్నాను.‘పోలీసులే గుద్దేసి, కేసూగీసూ లేకుండా మాఫీ చేసేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?’ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది.తెల్లారితే శ్రీను శవాన్ని దహనం చేస్తారు. ఈలోపే ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి? ఎస్‌! పేపర్‌వాళ్లకి ఈ విషయం చెబితేనే, బయటి ప్రపంచానికి తెలుస్తుంది. పేపరాఫీసుకి ఫోన్‌ చేశాను. ‘‘సార్‌! మాది అడివివరం గ్రామం. మా ఊళ్లో ఒక కుర్రాణ్ని పోలీసు జీపు గుద్దేసింది. ఆ కుర్రాడు చనిపోయాడు’’ నెమ్మదిగా నసుగుతూ విషయం చెప్పాను.

అరగంటలో వచ్చి వాలిపోయాడతను. అతను టీవీ రిపోర్టర్లు, పేపర్‌ రిపోర్టర్లు అందరికీ ఉప్పందించినట్లున్నాడు. పదీపదిహేను మంది మూకుమ్మడి దాడి చేశారు. రాత్రి ఎనిమిది గంటల వార్తల్లో అన్ని టీవీ చానెళ్లలో ఇదే వార్త.సరిగ్గా అర్ధరాత్రి నాలుగైదు జీపుల్లో పోలీసులు వచ్చారు. బంధువులంతా శోకసంద్రంలో మునిగి ఉన్నారు. పోలీసుల హడావుడి చూసి ఊరంతా ఉలిక్కిపడి లేచింది. మా వాళ్లెవరూ ఇళ్లకు కూడా వెళ్లలేదు. నేనో మూల నక్కి నిలబడ్డాను. ‘‘ఇక్కడ జరిగిన యాక్సిడెంట్‌ గురించి ప్రెస్‌ వాళ్లకి ఎవరు లీక్‌ చేశారు? ఇది సాధారణ ప్రమాదమే కదా. ఇప్పుడు చూడండి. ఈ కేసు తలనొప్పిలా తయారైంది’’ అని ఓ పోలీస్‌ అధికారి పబ్లిక్‌ మీద అరుస్తున్నాడు. అలా అంటూనే శ్రీను శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్‌ కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లమని ఆర్డర్‌ జారీ చేశాడు.నేను అనుకున్నట్లే పోలీసు కేసు నమోదైంది. ఆ మర్నాడు పోస్టుమార్టమ్‌ జరిగాక శవాన్ని అప్పగించేశారు. దహన సంస్కారాలయ్యాక అందరం బజార్లో రావిచెట్టు కింద కూర్చున్నాం. గోపాలపట్నం నుంచి బుల్లెట్‌ మీద ఎస్సై, ఒక కానిస్టేబుల్‌ వచ్చారు. ‘‘ఇక్కడ నరేంద్ర ఎవరు?’’ బుల్లెట్‌ దిగుతూనే కానిస్టేబుల్‌ మా దగ్గరకు వచ్చి అడిగాడు. పోలీసులు నా గురించి అడిగేసరికి ఉలిక్కిపడ్డాను. నాకెందుకో ఒళ్లు వణకసాగింది. మనసులో ఏదో భయం మొదలైంది. వినయంగా వెళ్లి ఎస్సైగారికి నమస్కారం చేశాను.

‘‘మీరే కదా.. పేపర్‌ వాళ్లకి ఈ యాక్సిడెంట్‌ మెసేజ్‌ చెప్పింది’’ నాకేసి చూస్తూ అడిగాడు. అదిరిపడ్డాను. నా పేరు, వివరాలు పోలీసులకెలా తెలుసాయి?’’‘‘ఓకే నరేంద్ర. నేను క్రైమ్‌బ్రాంచ్‌ నుంచి వచ్చాను. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. డోంట్‌ వర్రీ. మీరు చేసింది మంచి పనే. తప్పు కాదు. వర్రీ కాకండి’’ అన్నాడు ఎస్సై. అతనలా అనేసరికి నా మనసు కాస్త కుదుటపడింది.‘‘సార్‌! యాక్సిడెంట్‌ జరిగిన విషయమే తెలుసు. అదే పేపర్‌ వాళ్లకి ఫోన్‌ చేసి చెప్పాను’’ వినయంగా అన్నాను. ‘‘మీ ఫోన్‌ నంబర్‌ ఇదే కదా, అవసరమున్నప్పుడు మీకు కాల్‌ చేస్తాను. దయచేసి మాకు సహకరించండి. ఇప్పుడు ఇది పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ కేస్‌’’ చెప్పాడు ఎస్సై. నాకేమీ అర్థంకాక అయోమయంగా చూశాను.‘‘పేపర్లో వార్త చూసి ఎవరో లాయర్‌గారు ప్రజావ్యాజ్యం వేశారు. పోలీసు జీపు యాక్సిడెంట్‌కి సంబంధించి బాధితుడికి అన్యాయం జరగకుండా న్యాయవిచారణ జరిపించమని కోర్టుని కోరాడు. దాంతో కోర్టు నాకీ ఎంక్వైయిరీ బాధ్యతలు అప్పగించింది. మీరు ఫోన్‌ చేసిన పేపర్‌ ఆఫీసులో మీ ఫోన్‌ నంబర్‌ తీసుకొని మీ వివరాలు సేకరించి ఇక్కడకు వచ్చాను. మీకు ఎలాంటి వివరాలు తెలిసినా నాకు ఫోన్‌ చెయ్యండి’’ అంటూ తన ఫోన్‌ నంబర్‌ ఉన్న విజిటింగ్‌ కార్డును నాకిచ్చాడు ఆ ఎస్సై.‘‘అలాగే సార్‌’’ అన్నాను సంతోషంగా. ఒక పోలీసాఫీసర్‌ నాకంత వివరంగా కేసు గురించి చెబుతున్నప్పుడు ఇక నాకెందుకు భయమనుకున్నాను.

‘‘మేం యాక్సిడెంట్‌ స్పాట్‌కి వెళ్లాం. అక్కడ చలివేంద్రం ఉంది కదా. ఆ కుర్రాడే ప్రత్యక్ష సాక్షి. ఇంకా ఎవరైనా యాక్సిడెంట్‌ జరిగినప్పుడు అక్కడున్నారేమో ఆరా తియ్యండి నరేంద్ర’’ అడిగాడు ఎస్సై.‘‘కేసు రిజిస్టర్‌ అయిందిగా. రావలసిన రాయితీలు, ఇన్సూరెన్స్‌లు గట్రా అన్నీ వస్తాయి. కాకపోతే ఈ ప్రమాదం పోలీసుల నిర్లక్ష్యమా? లేక నిజంగా యాక్సిడెంటా? అనేది తేలాలి. ఓకే థ్యాంక్యూ నరేంద్ర..’’అంటూ ఎస్సై బుల్లెట్‌ స్టార్ట్‌ చేశాడు. అతని వెనుక ఎక్కి కూర్చున్నాడు కానిస్టేబుల్‌. పోలీసులు వెళ్లిపోయాక బజార్లో ఉన్నవాళ్లంతా వచ్చి నన్ను చుట్టుముట్టారు.‘‘ఆ రోజు పోలీసులు కొండకెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందంటున్నారట్రా. ఇంకా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండ్రా. ఎస్సైగారికి సమాచారం ఇవ్వొచ్చు’’ అన్నాను ఆలోచిస్తూ.‘‘ఒరేయ్‌ నరేంద్ర! ఆ రోజు ఆ పోలీసోళ్లు గోపాలపట్నం నుంచి వస్తూ నా దుకాణం దగ్గర ఆగి సిగరెట్లు కొనుక్కున్నార్రా. అప్పుడు మన శ్రీనుగాడు ఆ జీపు డ్రైవర్‌తో ఏదో మాట్లాడటం చూశాను’’ అన్నాడు కిళ్లీ కొట్టు కన్నయ్య.ఆ మాట వింటూనే ఉలిక్కిపడ్డాను. పోలీసు జీపు డ్రైవర్‌తో శ్రీనుగాడికి పనేంటి? జీపు డ్రైవర్‌తో మాట్లాడేంత చనువుందా? ఇంతకీ ఏం మాట్లాడుంటాడు? ఆలోచిస్తూ ఉండిపోయాను. ‘‘శ్రీనుగాడితో మరో కుర్రాడు కూడా ఉన్నాడ్రా!’’ ఆలోచిస్తూ అన్నాడు కిళ్లీకొట్టు కన్నయ్య.‘‘నిజమా! ఎవరా కుర్రాడు?’’ ఆత్రుతగా అడిగాను. ఈ సమాచారం క్రైమ్‌బ్రాంచ్‌ ఎస్సైకి చేరవెయ్యాలి. దీనివల్ల వీసమెల్తైనా కేసుకు మేలు జరుగుతుందేమో! అనుకున్నాను.‘‘మన ఊరోడో.. పక్కూరోడో.. ఆ కుర్రాడు సరిగా పోలిక దొరకలేదురా?’’ తల గోక్కుంటూ విచారంగా అన్నాడు కన్నయ్య. ఆ వెంటనే వీళ్లు చెప్పిందంతా ఎస్సైకి పూసగుచ్చినట్లుగా చెప్పేశాను. ‘‘వెల్‌ డన్‌ నరేంద్ర. ఆ కుర్రాడెవరో ఆరా తియ్యి. నేను ఎంటరయితే భయపడి ఎవరూ నిజం చెప్పరు’’ అన్నాడు ఎస్సై. ‘‘అలాగే సర్‌!’’ అన్నాను ఉత్సాహంగా.ఆ రోజే శ్రీను చదువుకుంటున్న కాలేజీకి వెళ్లాను. కాలేజీకి వెళ్లి శ్రీనుతో చనువుగా ఉండేవాడి స్నేహితుల జాబితా సంపాదించాను. శ్రీను పెద్దఖర్మ రోజు వాడి స్నేహితులందర్నీ పిలవాలని అనుకుంటున్నామని అబద్ధమాడితే గాని ఒకరొకరు బయటపడలేదు. పదిమంది వరకు ఉన్నారు. 

‘‘అన్నా! శ్రీను చాలా మంచోడన్నా. ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు. ఎవరన్నా గొడవపడితే ఇద్దరికీ రాజీచేసి దోస్తీ చేసేవాడు. చదువులో కూడా సూపర్‌ బ్రిలియంటన్నా’’ దాదాపుగా అందరూ శ్రీను గురించి మంచి మాటలే చెబుతున్నారు. ‘‘అన్నా! రాజీవ్‌ గాడొకడున్నాడు. ఆడు రెండు రోజులుగా కాలేజీకి రావడం లేదు. వాడు మా అందరికన్నా శ్రీనుగాడికి జిగురు దోస్తన్నా. వాణ్ని కూడా తీసుకొస్తాం’’ ఓ కుర్రాడు నేను వచ్చేయబోతుంటే పరుగున నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఒక్కసారిగా నాలో ఉత్సాహం పెరిగింది. ఆ రోజు శ్రీనుగాడితో ఉన్నది ఆ కుర్రాడే కావచ్చు. ‘‘ఆ అబ్బాయిది ఏ ఊరు?’’ అడిగాను. ‘‘అడివివరం దగ్గర విజినిగిరి పాలెం’’.వెంటనే నేరుగా విజినిగిరి పాలెం వెళ్లాను. రెండు రోజుల నుంచి జ్వరంగా ఉందని కాలేజీకి వెళ్లలేదని చెప్పాడు రాజీవ్‌. ‘‘శ్రీనుకి యాక్సిడెంట్‌ జరిగినరోజు ఉదయాన్నే నువ్వు, శ్రీను కలుసుకున్నారు కదూ?’’ అనడిగా.‘‘ఆ.. ఆ.. అవునన్నా’’ తడబడుతూ చెప్పాడు.‘‘ఎక్కడ? కలుసుకున్నాక ఏం జరిగింది?’’‘‘అడివివరం మెయిన్‌ రోడ్డు మీద. ఆ రోజు మాకు కాలేజీ లేదు. ఊరికే కలుద్దామని వెళ్లాను. మేమిద్దరం మాట్లాడుకుంటూ మెయిన్‌ రోడ్డు వారగా నడుస్తూ వెళ్తున్నాం. ఇంతలో పోలీసు జీపు వచ్చి పాన్‌షాపు ముందు ఆగింది. జీపు పక్క నుంచే ఇద్దరం ముందుకు వెళ్తున్నాం. ఇంతలో పోలీసు జీపులో కూర్చున్న డ్రైవర్‌ మమ్మల్ని పిలిచాడు. ఎందుకో అనుకుని ఆగాం. జీపు దగ్గరకు రమ్మన్నాడు. వెళ్లాం. ఏం కళ్లు కనిపించడం లేదా? పోలీసు జీపు అని తెలిసి ఒళ్లు దగ్గర పెట్టుకొని నడవలేరా? అని కోపంగా అన్నాడు జీపు డ్రైవర్‌. మేమేం చేశామని శ్రీను ఎదురు ప్రశ్న వేశాడు. ‘జీపు మీద ఎవర్రా బాదింది?’ కళ్లు ఎర్రజేస్తూ అడిగాడు.

‘మాట్లాడుకుంటూ వెళ్తూ నేనే జీపు మీద నెమ్మదిగా దరువేశాను. గట్టిగా బాదలేదు సార్‌..’ అన్నాన్నేను భయపడుతూ. ‘వేస్తార్రా వేస్తారు. కాలో చెయ్యో తీసేస్తే ఆ పొగరు వగరు వదిలిపోతుంది’ అన్నాడతను కోపంగా. ‘పదరా!’ అంటూ శ్రీనే అతణ్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి నన్ను లాక్కొచ్చేశాడు. ఆ డ్రైవర్‌ వెనుక నుంచి బూతులు తిడుతున్నా పట్టించుకోకుండా వచ్చాం. అంతే అన్నా జరిగింది. ఆ మధ్యాహ్నమే శ్రీనుకి యాక్సిడెంట్‌ జరిగిందని తెలిసిందన్నా. అప్పటి నుంచి నాకీ మాయదారి జ్వరం తగులుకుంది’’ అన్నాడు రాజీవ్‌.ఆ రోజు జరిగిందంతా క్రైమ్‌బ్రాంచ్‌ ఎస్సైకి ఫోన్‌ చేసి చెప్పాను. ఆ జీపు డ్రైవర్‌ కానిస్టేబుల్‌ కాదని, హోమ్‌గార్డ్‌ అని చెప్పాడు. నన్ను పోలీస్‌ స్టేషన్‌కి వచ్చి కలవమన్నాడు. వెంటనే వెళ్లి కలిశా. నేను వెళ్లగానే కానిస్టేబుల్‌కు చెప్పి జీపు డ్రైవర్‌ హోమ్‌గార్డ్‌ని వెంటబెట్టుకుని పిలిపించాడు. ‘‘నువ్వు ఆ రోజు ఉదయం మొన్న యాక్సిడెంట్‌లో చనిపోయిన శ్రీనుతో గొడవ పడ్డావట. నిజమేనా?’’ అడిగాడు ఎస్సై. ఆ హోమ్‌గార్డును ఎక్కడో చూసినట్టుంది నాకు. ఒక్కసారి చూస్తేమర్చిపోయే రూపం కాదు. ఎక్కడో.. ఎప్పుడో.. చూశాను. ఎక్కడ? ఎప్పుడు? ‘‘ఏమో సార్‌. నాకు గుర్తులేదు. ఎవరో ఇద్దరు కుర్రాళ్లు రోడ్డు మీద గెంతుకుంటూ మన జీపు మీద దబదబా చరుస్తూ వెళ్తుంటే పిలిచి చీవాట్లు పెట్టాను సార్‌. అంతే!’’ అన్నాడు ఆ హోమ్‌గార్డ్‌.అప్పుడు గుర్తొచ్చింది. ఎస్‌.. అతనే ఇతను. శ్రీను స్నేహితుల వివరాలు కనుక్కోవడానికి కాలేజీకి వెళ్లినప్పుడు.. అక్కడ చూశాను. ఓ అమ్మాయిని బైక్‌ మీద తీసుకెళ్తూ మా అందరికేసి ఓరగా తల ఎత్తి చూశాడు. అతణ్ని నేను గమనించాను. ఎస్‌.. అతనే.. !

ఆ వెంటనే ఎస్సై దగ్గర వీడ్కోలు తీసుకుని విజినిగిరి పాలెం వెళ్లాను. రాజీవ్‌ని కలిసి శ్రీను ఎవరెవరితో స్నేహంగా ఉంటాడో పట్టుబట్టి మళ్లా నా దగ్గరున్న జాబితాతో సరి చూసుకున్నాను. రాజీవ్‌తో పదిహేనుమందయ్యారు. అందులో నలుగురు అమ్మాయిలున్నారు. కాలేజీలో ఆ కుర్రాళ్లు మగ పిల్లల పేర్లే చెప్పారు. అమ్మాయిల పేర్లు చెప్పలేదు. అక్కడి నుంచి కాలేజీకి వెళ్లాను. పదిమంది కుర్రాళ్లు నన్ను చూస్తూనే దగ్గరికి వచ్చారు. నలుగురమ్మాయిల గురించి ఆరా తీశాను. సిగ్గుపడుతూ తలలు దించుకున్నారు.‘‘అమ్మాయిలు కదా. ఎందుకులే అని చెప్ప లేదన్నా’’ అన్నారు. వాళ్లను నాకు చూపించారు. నా అనుమానం నిజమైంది. అందులో ఒక అమ్మాయి నా దృష్టిలో పడింది. ఆ అమ్మాయే ఈ అమ్మాయ నుకున్నాను. హోమ్‌గార్డు ఈ అమ్మాయితోనే వెళ్లాడని నిర్ధారించుకున్నాను. అక్కడి నుంచే క్రైమ్‌బ్రాంచ్‌ ఎస్సైకి ఫోన్‌ చేసి విషయం వివరించాను.అంతే! ఆ మరునాడే అన్ని పేపర్లలో శ్రీను యాక్సిడెంటల్‌గా చనిపోలేదని, ఇది ఒక ప్రీ ప్లాన్డ్‌ మర్డరని వార్త వచ్చింది. క్రైమ్‌ ఎస్సైయే స్వయంగా ప్రెస్‌మీట్‌లో చెప్పాడు.
చనిపోయిన శ్రీను కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడని... ఆ అమ్మాయి అన్నే శ్రీనుని జీపుతో గుద్ది చంపేశాడని... అతను పోలీసు డిపార్ట్‌మెంట్లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి అని...  శ్రీను మరణం వెనుక ఉన్న ఈ రహస్యాన్ని ఛేదించడంలో నరేంద్ర అనే యువకుడు సహకరించాడని వివరించారు. 

       ∙  ఇందూ రమణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement