పచ్చబొట్టు | Funday crime story | Sakshi
Sakshi News home page

పచ్చబొట్టు

Published Sun, Jun 3 2018 12:56 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Funday crime story - Sakshi

‘‘సార్‌! నా భార్య ఆత్మహత్య చేసుకుంది. మీరు అర్జెంటుగా రావాలి,’’ గోపాలపట్నం ఎస్సై రాజేష్‌కు ఫోన్‌ ఎత్తగానే వినిపించిన మాటలవి. రాజేష్‌ బయటకు వచ్చి బుల్లెట్‌ స్టార్ట్‌ చేశాడు. సింహాచలం వైపు బుల్లెట్‌ దూకించాడు.రాజేష్‌ వెళ్లేసరికి శవం ముందు ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గోడకి చేరగిలబడి ఓ నడి వయస్కుడు ఆమెనే చూస్తూ ఏడుస్తున్నాడు. రాజేష్‌ ఆయన దగ్గరకి వెళ్లి పరిచయం చేసుకున్నాడు. ‘‘అవున్సార్‌! నేనే మీకు ఫోన్‌ చేశా’’ అన్నాడతను. ‘‘ఈమె నా భార్య,’’ శవం వైపు చూపిస్తూ కొనసాగించాడు. ‘‘మీ భార్యకి ఆత్మహత్య చేసుకునేంత అవసరం ఏమొచ్చింది?’’ అడిగాడు రాజేష్‌.
‘‘ఏమో సార్‌! రాత్రివరకు బాగానే ఉంది. ఉదయం లేచేసరికి శవమైంది’’ అంటూ రెండు చేతుల్లో ముఖం పెట్టుకుని బోరున విలపించాడు.‘‘మీకు పెళ్లై ఎన్నాళ్లైంది?’’ ప్రశ్నించాడు రాజేష్‌. ‘‘ఆరునెలలు,’’ చెప్పాడతను.‘‘ఓకే! మీరేమైనా గొడవ పడ్డారా?’’ రాజేష్‌ మాటల్ని మధ్యలోనే అడ్డుకుని, ‘‘నో..నో.. అలాంటిదేమీ లేదు. ఒకరికొకరం అన్నట్టుగా అన్యోన్యంగా ఉండేవాళ్లం’’ అన్నాడతను. బెడ్‌ రూవ్‌ులోకి వెళ్లి చుట్టూ చూశాడు రాజేష్‌. ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చి ఉన్నాయి. పాల గ్లాసు కింద పడిపోయి ఉంది. విషం కలిపిన పాలు తాగి ఆత్మహత్య చేసుకుందన్న మాట. మంచి ఆదాయమున్న భర్త. ఎంత తిన్నా తరగని ఆస్తి. భర్త ముఖం చూస్తే అణువణువూ అమాయకత్వం నిండినట్టు కనిపిస్తోంది. విచారణలో కూడా అతను మంచి మనిషే అని తేలింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?

గదంతా పరీక్షగా చూశాడు. టేబుల్‌ మీద ముందు రోజు దినపత్రికలు ఉన్నాయి. ఓ పత్రికను తిరగేశాడు. లోపల ‘శ్రద్ధాంజలి’ అని కింద ఒకబ్బాయి ఫొటో ఉంది. చాలా అందంగా ఉన్నాడు. పాపం చిన్న వయసులోనే కాలం చేశాడు. పేపరు మడిచి అక్కడే పెట్టేశాడు. బయటికి వచ్చాడు. రాజేష్‌ ఆమె శవాన్ని పరీక్షించి చూశాడు. నిద్ర పోయినట్టే ఉంది. ఆమె ఎడమ చేతి మీద ‘శ్రీ’ అని పచ్చబొట్టు ఉంది. అది గమనించి ఆమె భర్త చెప్పాడు, ‘‘అది నా పేరే.. శ్రీకర్‌. ముద్దుగా నన్ను శ్రీ అని పిలిచేది’’.‘‘ఓ.. అలాగా! మీరంటే మీ శ్రీమతికి చాలా ప్రేమన్న మాట’’ అన్నాడు రాజేష్‌.అవునంటూ బాధగా తలూపాడు శ్రీకర్‌. రాజేష్‌ అతణ్ని ఓదార్చి, ‘‘మా ఫర్దర్‌ ఇన్వెస్టిగేషన్‌కి మీరు కొంచెం సహకరించాలి’’ అన్నాడు. పోలీసు లాంచనాలన్నీ పూర్తి చేసిన తర్వాత శవాన్ని పోస్ట్‌మార్టవ్‌ుకి పంపించారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాడు.రాజేష్‌ బుర్రనిండా ఆలోచనలే. హఠాత్తుగా బుర్రలో ఏదో మెరుపు మెరిసినట్టు అయింది. మొబైల్‌ తీసి అంబులెన్స్‌లో ఉన్న కానిస్టేబుల్‌కి ఫోన్‌ చేశాడు – ‘‘శంకర్‌! నువ్వు దగ్గరుండి పోస్ట్‌మార్టవ్‌ు పనులు పూర్తి చేయించి రిపోర్ట్‌ స్టేషన్‌కి తీసుకురా... ఈలోగా నేను జాయిన్‌ అవుతాను’’. శ్రీకర్‌ ఇంటికి బుల్లెట్‌ తిప్పాడు రాజేష్‌. ‘‘మిస్టర్‌ శ్రీకర్‌... మీ బెడ్‌ రూవ్‌ు చెక్‌ చెయ్యాలి!’’ అన్నాడు రాజేష్‌. ‘‘రండి సార్‌...’’ అంటూ బెడ్‌రూవ్‌ులోకి తీసుకెళ్లాడు.రాజేష్‌ బెడ్‌రూవ్‌ులోకి వెళ్లి టేబుల్‌ మీద ఉన్న పేపర్లు తిరగేశాడు. గత దినం పేపరు తీశాడు. ‘శ్రద్ధాంజలి’ అని ఉన్న యువకుడి ఫొటో మీద దృష్టి నిలిపాడు. ఆ ఫొటో కింద శ్రీకాంత్‌ అని జననం మరణం తేదీలు వేసి ఉన్నాయి. ఆ ఫొటో వంక చూశాడు. ‘‘మిస్టర్‌... మీరు అయిదు నిమిషాలు బయట వెయిట్‌ చేస్తారా?’’ అడిగాడు రాజేష్‌. కాసేపటికి రాజేష్‌ గది బయటికొచ్చి, ‘‘మిస్టర్‌ శ్రీకర్‌... యు ఆర్‌ అండర్‌ అరెస్ట్‌..’’ అన్నాడు. ‘‘వాట్‌ డు యు మీన్‌?’’ అన్నాడు శ్రీకర్‌.రాజేష్‌ ఏం మాట్లాడకుండా శ్రీకర్‌ను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లాడు.

‘‘సింహాచలం ఆత్మహత్య కేసు తాలూకు పోస్ట్‌మార్టవ్‌ు రిపోర్ట్‌ వచ్చింది. ఆమెది ఆత్మహత్య కాదు. ప్లాన్‌డ్‌ మర్డర్‌..’’ సీఐతో చెప్పాడు రాజేష్‌. ఒక్కసారిగా అదిరిపడ్డట్టు చూశాడు సీఐ. ‘‘భార్య మీద అనుమానంతో శ్రీకర్‌ ఆమెతో ప్రేమగా మాట్లాడి పాలలో విషం కలిపి తాగించాడు. ఆ రోజు శ్రీకర్‌ ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి భార్య రమ్య ఎవరితోనో ఫోన్‌లో ఏడుస్తూ మాట్లాడుతోంది. అనుమానం వచ్చిన శ్రీకర్‌ చాటుగా విన్నాడు. రమ్యతో కలిసి చదువుకున్న ఓ అబ్బాయి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. తన పేరు శ్రీకాంత్‌. భర్తను చూసిన కంగారులో ఫోన్‌ ఆఫ్‌ చేయకుండా పక్కన పడేసింది.హడావుడిలోరికార్డింగ్‌ బటన్‌ ప్రెస్‌ చేసింది. ‘ఎవరితో మాట్లాడుతున్నావ్‌?’ అన్నాడు శ్రీకర్‌. ఏడుస్తూనే ఇదంతా చెప్పింది రమ్య.‘అంటే పెళ్లికి ముందు ప్రేమాయణమా?’ కోపంతో రగిలిపోతూ అడిగాడు. ‘దేవుడి సాక్షిగా చెబుతున్నాను. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే’, ఏడుస్తూనే ప్రమాణం చేసింది. శ్రీకర్‌ కొన్ని క్షణాలపాటుమౌనంగా ఉండిపోయాడు.‘ఓ! సారీ రమ్య!’ అని ప్రేమగా గుండెకు హత్తుకున్నాడు. ఏడుస్తూ ఏడుస్తూ అలాగే భర్త గుండెలపై వాలిపోయింది. తర్వాత భర్త ఇప్పుడే వస్తానని చెప్పి వంటగదిలోకి వెళ్లి పాలు మరగబెట్టి అందులో విషం కలిపి బెడ్‌రూవ్‌ులో పడుకున్న రమ్యకు ఇచ్చాడు. అవి తాగిన భార్య శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది’’ వివరించాడు రాజేష్‌.‘‘అది సరే, పేపర్లో పడ్డ శ్రీకాంత్‌కీ రమ్యకీ పరిచయం ఉందని ఎలా ఊహించావు?’’‘‘ఆమె చేతిమీద శ్రీ అనే పచ్చబొట్టే క్లూ ఇచ్చింది. పేపర్లో పడ్డ ఫొటో కింద శ్రీకాంత్‌ అనే పేరు సడన్‌గా గుర్తొచ్చింది. వెంటనే శ్రీకర్‌ ఇంటికి వెళ్లి బెడ్‌రూవ్‌ులో ఉన్న పేపరు తిరగేసి ఆ ఫొటోను పరీక్షగా చూశా.దానిపైన నీటి చుక్కలు పడి ఆరిపోయినట్టు స్పష్టంగా కనిపించాయి. ఆ ఫొటోకి ఆమెకి సంబంధం ఉందేమోనని అనుమానించి, శ్రీకర్‌ని అయిదు నిమిషాలు బయట ఉండమని బెడ్‌రూమ్‌ అంతా వెతికాను. ఆమె ఫోన్‌ దొరికింది. కంగారులో ఆమె రికార్డింగ్‌ బటన్‌ ప్రెస్‌ చేయడం వల్ల, వారిద్దరి సంభాషణ స్పష్టంగా రికార్డ్‌ అయింది.    శ్రీకర్‌ని స్టేషన్‌కి తీసుకొచ్చి మనదైన శైలిలో విచారించే సరికి నిజం ఒప్పుకున్నాడు. పాపం భర్త అనుమానం పెనుభూతమై రమ్యను బలిగొంది. ఆమె చేతి మీద పచ్చబొట్టు ఉన్న శ్రీ అంటే శ్రీకరే... శ్రీకాంత్‌ కాదు’’ నిట్టూర్పు విడిచి చెప్పాడు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌.
- ఎస్‌.ఆర్‌.ఎల్‌. లక్ష్మీనాయుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement