అర్ధరాత్రి వర్షం కుండపోతగా కురుస్తోంది.నగరంలోని ఓ సిమెట్రీ అది. రెయిన్ కోట్స్, గమ్ బూట్సూ ధరించిన నలుగురు దృఢకాయులు అందులోకి ప్రవేశించారు. ఒకడి చేతిలో ఓ పొడవాటి పెట్టె ఉంది. ఇంకొకడి దగ్గర బరువైన గోనెసంచి ఉంది. టార్చ్ లైట్ వెలుతురులో ఒక్కొక్క సమాధినే చూసుకుంటూ ముందుకు నడిచారు వాళ్లు. చివరికి ఓ సమాధి వద్ద ఆగారు. గోనెసంచిలోంచి పార, పలుగు, గునపం, వగైరా పనిముట్లను బయటకు తీశారు. ఒకడు టార్చ్ లైట్ వెలుతురును ఫోకస్ చేస్తూంటే, మిగతా ముగ్గురూ ఆ సమాధిని తవ్వడానికి ఉపక్రమించారు. శవపేటిక కనిపించగానే, ఇద్దరు వ్యక్తులు తాళ్ల సాయంతో గోతిలోకి దిగి తాళ్లను దానికి కట్టారు. నలుగురూ కలసి పేటికను పైకి తీశారు. సుత్తితో కొట్టి శవపేటికను తెరిచారు. లోపల ఫ్రెష్‌గా ఉన్న మృతదేహం కనిపించింది. వర్షానికి తడిసిపోకుండా శవాన్ని వాటర్ ప్రూఫ్ క్లాత్ తో కప్పి, తమతో తీసుకువచ్చిన పెట్టెలో ఉంచి క్లోజ్ చేసేశారు. సమాధిని పూర్తిగా పూడ్చకుండానే వదిలేసి, పనిముట్లను గోనెసంచిలో సర్దేసుకుని, డెడ్ బాడీ ఉన్న పెట్టెను మోసుకుంటూ సిమెట్రీ బయటకు నడిచారు. వీధిలో కొద్ది దూరంలో చిన్నసైజు ఆంబులెన్స్ ఒకటి ఆగి ఉంది. ఆ శవపేటికను అందులోకి ఎక్కించారు. దానితోపాటు ముగ్గురు వ్యక్తులు ఎక్కితే, టార్చ్ లైట్ చూపిస్తూన్న నాలుగవ వ్యక్తి వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తూన్న ఆ వర్షాన్ని చీల్చుకుంటూ ముందుకు పరుగెత్తింది ఆంబులెన్స్. గత కొన్ని నెలలుగా నగరంలోని సమాధుల నుండి శవాలు అదృశ్యమవుతున్నాయి. ప్రజలలో అలజడి రేపింది అది.బతికున్నవారిని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజడం కద్దు. కానీ, శవాలను ఏం చేసుకుంటారో!... అంతుపట్టలేదు క్రై మ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శివరామ్‌కి. కుల మతాల వివక్ష లేకుండా దొంగలు అందరి సమాధులనూ టార్గెట్ చేయడం విశేషం!
రాత్రి పదకొండు గంటలు అవుతుంది. సెల్‌ఫోన్ మోగడంతో పక్క మీద తలగడ పక్కనున్న ఫోన్‌ని అందుకుని స్క్రీన్ వంక చూశాడు బాలరాజు. అది ‘అన్న’ కాల్!‘‘ఏరా, రాజూ! పనిని గాలికి వదిలేసి పెళ్లాం పక్కలో వెచ్చగా తొంగున్నావట్రా?’’ అవతలి గొంతుక కర్కశంగా వినిపించడంతో గతుక్కుమన్నాడు బాలరాజు. ‘‘ఆఖరు బాడీని తెచ్చి అప్పుడే రెండు వారాలు దాటింది. ఏం చేస్తున్నావ్?’’ మళ్లీ కోపంగా అడిగాడు ‘అన్న’.‘‘లేదన్నా. ఆ పని మీదే ఉన్నాను. ఈ మధ్య సిమెట్రీల దగ్గర, శ్మశానాల దగ్గరా పోలీసుల నిఘా అధికంగా ఉంది. అందుకే కొద్ది రోజులు గ్యాప్ ఇద్దామని’’ నసిగాడు బాలరాజు.‘‘నెలకు కనీసం మూడు శవాలనయినా సప్లయ్ చేయాలన్నది మన కాంట్రాక్ట్. ఆర్నెల్లలో డజనుకు మించి సరఫరా చేయలేకపోయాం. మన మీద నమ్మకం సన్నగిల్లితే వాళ్లు మరో సోర్స్‌ని వెదుక్కునేప్రమాదం ఉంది.’’‘‘లేదన్నా. అలా జరగనివ్వను’’ హామీ ఇచ్చాడు బాలరాజు. ఓ క్షణం ఆగి, అన్నాడు ‘అన్న’ – ‘‘రెండు రోజుల్లో బాడీ ఏదీ దొరక్కపోతే నీ మనుషుల్లో ఒకణ్ణి చంపి అయినా, వాడి బాడీని తీసుకురా’’.బాలరాజు చిన్నగా ఉలికిపడ్డాడు. ‘‘అదేంటన్నా, అంత మాట అనేశావ్?’’ అవతల చిన్నగా నవ్వు వినిపించింది. ‘‘శవానికి లక్ష ఇస్తున్నాను. ఆ మాత్రం అథారిటీ ఉంటుందిలే నాకు!’’ ఫోన్ కట్‌అయింది. బాలరాజుకు ముప్పయ్ అయిదేళ్ళు ఉంటాయి. మనిషి ఎత్తుగా, దృఢంగా ఉంటాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవరుగా పనిచేసేవాడు. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోక ప్రతినెలా అప్పులు చేయవలసి వచ్చేది. అయితే, కొన్ని నెలల క్రితం అనుకోకుండా ‘అన్న’ తో పరిచయమయింది అతనికి. అది అతని జీవితాన్ని అనుకోని మలుపు తిప్పింది.కొందరు ‘పార్టీలకు’ శవాలనుసప్లయ్ చేసే సీక్రెట్ కాంట్రాక్ట్‌ని కుదుర్చుకున్నాడు ‘అన్న’. ఆ దందాలోకి బాలరాజును కూడా లాగి, ఆ వ్యవహారానికి ఇన్‌చార్జ్‌ని చేశాడు. ‘అన్న’ ది క్రిమినల్ మైండ్. పథకం అతనిదీ,ఆచరణబాలరాజుదీను. ‘అన్న’ సలహా మేరకు ఓ మినీ వ్యాన్‌ని వాయిదాల పద్ధతిలో తీసుకుని, దాన్ని ఆంబులెన్స్ గా మార్చుకున్నాడు బాలరాజు. పైకి అది ప్రైవేట్ ఆంబులెన్స్. లోపాయకారీగామాత్రం దొంగిలించిన శవాలకు రవాణా వాహనం! ఆ ‘ఆపరేషన్’లో పాలు పంచుకునే వ్యక్తులకు బాలరాజు తప్ప, ‘అన్న’ ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియదు.
సమాధి దొంగలను ఎలాగైనా పట్టుకుని తీరాలని కంకణం కట్టుకున్నాడు ఇన్‌స్పెక్టర్ శివరామ్. ఆ కేసు పూర్వాపరాలను నిశితంగా సమీక్షించాడు. శవాలు ఏయే ప్రాంతాల నుండి అదృశ్యమయ్యాయో, ఆ ప్రాంతాలకు మరోసారి వెళ్లి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాడు– తాము మిస్ చేసిన ‘క్లూస్’ ఏవైనా లభిస్తాయేమోనని. దొంగల ‘మోడస్ ఆపరెండీ’ని అధ్యయనం చేసి, అది ఒకే ముఠా పనేనని నిర్ధారించుకున్నాడు. ఆ ముఠా రాష్ట్రానికి చెందినదా, లేక ఇతర రాష్ట్రాలకు చెందినదా అన్నది మాత్రం తెలియలేదు. నగరంలోని పలు ప్రాంతాలలో అతను చేసిన దర్యాప్తులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఒకవేళ ఏ శవపేటికలోనయినా విలువైన వస్తువులో, బంగారమో దొరికితే దొంగలు వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తారు. అందుకే మార్వాడీ షాపులను, పాన్ షాపులను, ఇతర సోర్సెస్‌నీ అలర్ట్ చేసాడు. క్రిస్టియన్ సిమెట్రీస్, ముస్లిమ్ ఖబరస్తాన్‌లు, హిందూ శ్మశాన వాటికల వద్ద రాత్రులు ప్రత్యేకంగా పోలీసులను మఫ్టీలో ఏర్పాటు చేశాడు శివరామ్. అయితే, శ్మశాన వాతావరణానికి జడుసుకున్న ఒక కానిస్టేబుల్ జ్వరం తెచ్చుకున్నాడు. మరోచోట కానిస్టేబుల్‌కి ‘దయ్యాలు’ కనిపించాయి! భయంతో మంచం పట్టేశాడు. దాంతో ఎవరూ శ్మశాన డ్యూటీకి ముందుకు రావడం లేదు. నైట్ పెట్రోలింగును ఉధృతం చేయడంతోనే సంతృప్తి చెందవలసి వచ్చింది శివరామ్‌కి.
ఆ నెల రోజుల్లో మరో మూడు సమాధుల నుంచి శవాలు మాయమయ్యాయి. దాంతో నగర ప్రజలలో అసహనం, ఆగ్రహం పెరిగిపోయాయి. పోలీసుల అసమర్థతను తిట్టిపోశారు. ఇన్‌స్పెక్టర్ శివరామ్‌కి పై అధికారుల ఒత్తిడి అధికమయింది. అదే సమయంలో సిల్వర్ లైనింగులా అనిపించింది – ఓ రోజున ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ ఒకటి. అది మెడికల్ కాలేజెస్‌లోని ఎనాటమీ క్లాసుల గురించినది. దాన్ని కుతూహలంతో చదివాడు శివరామ్. దాని సారాంశం ఇది– ‘మెడికల్ కాలేజీల్లో ఎనాటమీ క్లాసులలో విద్యార్థుల చేత డిసెక్షన్ చేయించడానికి సరిపడినన్ని మృతదేహాలు సరఫరా కావడంలేదు.ప్రభుత్వాసుపత్రుల మార్చురీలలోని అన్–క్లెయిమ్డ్ బాడీస్‌ని సాధారణంగా మెడికల్ కాలేజీలకు తరలించడం జరుగుతుంది. వాటిని అనాథ శవాలుగా నిర్ణయించేందుకు న్యాయస్థానాలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి డిక్లేర్ చేసేసరికి జాప్యం జరగడమేకాక, శవాలు చెడిపోవడం కూడా కద్దు. పైగా, ప్రైవేట్ మెడికల్ కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగిపోతూండటంతో అందుబాటులో ఉన్న మృతదేహాలు సరిపోవడంలేదు. అందువల్ల ఎనాటమీ క్లాసులను ప్రాక్టికల్స్ లేకుండా థియరీతోనే సరిపెట్టడం జరుగుతోంది. దాన్ని మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణిస్తోంది.’ఆ ఆర్టికిల్ చదువుతూంటే ఇన్‌స్పెక్టర్ బుర్రలో కొత్త ఆలోచనలు రేగాయి. వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వెళ్లాడు. ఎనాటమీ క్లాసుల వారికి అందుతూన్న శవాలను గురించి చర్చించాడు. ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆయా కాలేజీలకు గత కొన్ని నెలలుగా లభ్యమైన శవాలను గూరించి ఆరా తీసాడు. ఎవరూ రికార్డులను సవ్యంగా మెయింటెయిన్ చేయడం లేదని గుర్తించాడు.
అనంతరం తన మేనకోడలిని అక్కడ చేర్పించదలచుకున్నట్టు చెబుతూ, మెడికల్ స్టూడెంట్స్‌తో మాట్లాడాడు. మఫ్టీలో ఉండడంతో అతన్ని ఓ పోలీసు ఆఫీసరుగా ఎవరూ గుర్తించలేదు. గత నెల్లాళ్లలో ఏయే కాలేజీలకు ఎన్ని శవాలు వచ్చాయోనని లోపాయకారీగా విచారించితే – మూడు ప్రైవేట్ కాలేజీలకు ఒక్కో శవం చొప్పున వచ్చినట్టు తెలిసింది. సమాధుల నుండి శవాలు మాయమైన రెండు రోజులకు అవి సప్లై చేయబడ్డట్టు గ్రహించాడు.ఆ కాలేజీలలో ఒకదానికి మారువేషంలో వెళ్ళాడు శివరామ్. ఆ కాలేజీ మార్చురీ అటెండర్‌ని మచ్చిక చేసుకుని, తాను ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి చెందినవాడననీ, ఎనాటమీ క్లాసులకు శవాలను సప్లై చేసే సోర్స్ కావాలనీ అడిగాడు.‘అప్పుడప్పుడు డెడ్ బాడీస్’ ఓ ఆంబులెన్స్ లో వస్తాయనీ, మిగతా వివరాలు తనకు తెలియవనీ చెప్పాడు అతను. ఆ ఆంబులెన్స్ నంబర్ ఇచ్చాడు. ఇన్‌స్పెక్టర్ ఆఫీసుకు తిరిగి వచ్చేసరికి, ఓ అరవయ్యేళ్ల వృద్ధుణ్ణి తెచ్చి లాకప్‌లో వేశారు అతని సిబ్బంది. బంగారు నెక్లెస్ ఒకటి ఓ పాన్ షాపులో అమ్మబోతూ పట్టుబడ్డాడట అతను. ఆ నగ తన కోడలిదనీ, కొడుకు తనకు తాగుడుకు డబ్బులు ఇవ్వడంలేదన్న కోపంతో దాన్ని అమ్మేయడానికి తెచ్చాననీ చెప్పాడు ముసలాడు. కానిస్టేబుల్స్ ని పంపించి అతని కొడుకును రప్పించాడు శివరామ్. తన పేరు గంగులు అనీ, కూలిపని చేసుకుంటాననీ చెప్పాడు వాడు. మొదట ఆ నెక్లెస్ గురించి తనకేమీ తెలియదన్నాడు. తరువాత అది తనకు ఎక్కడో దొరికిందన్నాడు. చితగ్గొట్టేసరికి, ‘ఓ ఆడమనిషి శవం మెళ్లో ఉంటే తీసుకున్నానంటూ’ నిజాలు బయటపెట్టాడు.. అతను చెప్పిన బాలరాజు ఆంబులెన్స్ నంబరూ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మార్చురీ అటెండర్ ఇచ్చిన నంబరూ ఒకటే. బాలరాజు ఇంటికి వెళ్ళాడు శివరాం. అతను నాలుగు రోజులుగా ఊళ్లో లేడు. మరదలి పెళ్లికి వెళ్లాడనీ, మర్నాడు వస్తాడనీ తెలిసింది. అతని గురించి విచారిస్తే... ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తూ ఆర్థికంగా కష్టపడుతూన్న బాలరాజు, కొద్ది నెలలలోనే జల్సా జీవితం గడుపుతున్నాడని తెలిసింది. మర్నాటి ఉదయం బాలరాజును నాంపల్లి రైల్వే స్టేషన్‌లోనే పికప్ చేసుకున్నాడు శివరామ్.ఎవరెవరో తన ఆంబులెన్సుని వాడుకుంటారనీ, శవాల సంగతి తనకు తెలియదనీ బుకాయించబోయాడు బాలరాజు. గంగులు తమ అధీనంలో ఉన్నాడనే సరికి గతుక్కుమన్నాడు. మాట మార్చి, ‘తానుఅన్న కోసం ఆంబులెన్స్‌ను నడుపుతాడనీ, అతను అనాథ శవాలను కొని మెడికల్ కాలేజీలకు సప్లయ్ చేస్తాడనీ’ చెప్పాడు. అయితే, పోలీస్ ట్రీట్‌మెంట్ రుచి చూశాక, నిజం కక్కక తప్పలేదు. నేరమంతా ‘అన్న’ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తూ, ‘అన్న’ పేరు గురవారెడ్డి అనీ, అతనికి తెలియకుండా తాను తన సెల్‌లో రికార్డ్ చేసిన తమ సంభాషణలను ప్లే చేసి వినిపించాడు. బాలరాజును తీసుకుని గురవారెడ్డి ఇంటికి వెళ్ళాడు శివరామ్. అతను ఇంట్లో లేడు. ‘గత దినం గురవారెడ్డి తల్లి డెత్ యానివర్సరీ అనీ, కార్యక్రమం ముగిసే సరికి సాయంత్రం అయిపోయిందనీ, ఆ తరువాత తల్లి సమాధిని దర్శించేందుకు అతను శ్మశానానికి వెళ్ళాడనీ’ చెప్పింది అతని భార్య. తద్దినం రోజున ఆవిడ సమాధి వద్దకు వెళ్ళి గంటల కొద్దీ గడిపి వస్తాడంది. తెల్లవారినా రాకపోయే సరికి ఫోన్ చేశామనీ, స్విచాఫ్ చేసి ఉందనీ చెప్పింది. అంతలో బాలరాజు సెల్ మ్రోగింది. శివరామ్ సైగనందుకుని స్పీకర్ ఆన్ చేశాడు అతను.
‘‘బాలరాజన్నా! ఊరి నుంచి వచ్చావా? మేము మార్చురీలో ఉన్నాం, వస్తావా?’’ అన్నాడు అవతలి వ్యక్తి. అది ‘అన్న’ ప్రైవేట్ మార్చురీ అని చెప్పాడు బాలరాజు. కానిస్టేబుల్స్‌ని గురవారెడ్డి ఇంటి దగ్గర కాపలా ఉంచి, బాలరాజుతో మార్చురీకి వెళ్లాడు శివరామ్. అక్కడ శవాన్ని చూసి బాలరాజు బిగుసుకుపోయాడు. శివరామ్ మఫ్టీలో ఉన్నందున, అతన్ని క్లెయింటుగా భావించారు అక్కడున్న వ్యక్తులు ఇద్దరూ. ‘‘పెద్దన్న చెప్పాడని, నువ్వు వచ్చేసరికి ఓ శవాన్ని తెచ్చి ఉంచమన్నావుకదా? ఇదిగో!’’ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి, బాలరాజుతో. ’’గంగులు గాడు ఎటు పోయాడో తెలీలేదు. మీరిద్దరూ లేకుండా సమాధి తవ్వడానికి మాకు ధైర్యం చాల్లేదన్నా! బాడీ అర్జెంటన్నావని, శ్మశానంలో తిరుగుతూన్న ఒకణ్ణి వెనుక నుంచి బుర్ర పగులగొట్టి వాడి శవాన్ని తెచ్చేశాం’’. ‘‘అన్నా! మా కష్టాన్ని గుర్తించి ఎప్పుడూ ఇచ్చేదాని కంటే ఎక్కువే ముట్టజెప్పాలి మాకు’’ అన్నాడు రెండోవాడు. శిలావిగ్రహంలా ఉండిపోయిన బాలరాజు తేరుకుని ఇన్‌స్పెక్టర్ వంక వెర్రిచూపులు చూశాడు. ‘‘సార్! ఇతనే ‘అన్న’ గురవారెడ్డి’’ అన్నాడు శవాన్ని చూపిస్తూ!!
- తిరుమలశ్రీ
సమాధి దొంగలు
Published Sun, Apr 28 2019 12:53 AM | Last Updated on Sun, Apr 28 2019 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment