కుడి ఎడమైతే | Funday crime story of the week 19-05-2019 | Sakshi
Sakshi News home page

కుడి ఎడమైతే

Published Sun, May 19 2019 1:00 AM | Last Updated on Sun, May 19 2019 1:00 AM

Funday crime story of the week 19-05-2019 - Sakshi

ఆ భవంతి పేరు ‘లక్ష్మీనిలయం’. అందులో డెబ్బయ్యేళ్ల పురుషోత్తమరావు, అరవై అయిదేళ్ల లక్ష్మీదేవి, ఆరేళ్ల మనవరాలు ‘గుడ్డీ’ ఉంటారు. మూడేళ్ళ క్రితం కొడుకు, కోడలూ కారు యాక్సిడెంటులో పోవడంతో, మనవరాలి బాధ్యత వారిపైన పడింది. పాపను చూసుకోవడానికి సులోచనను ఆయాగా పెట్టుకున్నారు. సులోచన తమ్ముడు శ్రీహరి ఆమధ్యే దుబాయ్‌ నుంచి తిరిగొచ్చాడు. అక్కతోనే ఉంటున్నాడు. ఆ రోజు‘లక్ష్మీనిలయం’లో భయంకర నిశ్శబ్దం అలముకుంది. కారణం– కోటిరూపాయల విలువచేసే వజ్రాలహారం మాయమయింది!క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ లావణ్యకు  వజ్రాలహారం చోరీ గురించి ఫిర్యాదు అందగానే తన సిబ్బందితో లక్ష్మీ నిలయానికి వెళ్ళింది.భవనమంతా తిరిగి క్లూస్‌ కోసం వెదికింది. సులోచన ఉంటున్న ఔట్‌ హౌస్‌నీ, పరిసరాలనూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇంటి బయట పాసేజ్‌లో సగం కాల్చి పడేసిన సిగరెట్‌ కనిపించింది. చేతి రుమాలుతో దాన్ని తీసి జేబులో వేసుకుందామె. సులోచన సుమారు ఏడాదిగా పనిచేస్తోందనీ, నమ్మకస్తురాలనీ చెప్పింది లక్ష్మీదేవి. శ్రీహరి గురించి కూడా మంచిగానే చెప్పింది. పురుషోత్తమరావు భార్య అభిప్రాయాన్ని బలపరచాడు. ఒంట్లో బావుండకపోవడంతో ఆదివారం రాత్రి తాను నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నట్టు చెప్పింది లక్ష్మీదేవి. తనకు స్మోకింగ్‌ అలవాటు లేదనీ, ఆదివారం రోజున ఇంటికి విజిటర్స్‌ ఎవరూ రాలేదనీ చెప్పాడు అతను.  శనివారం రోజున లక్ష్మీదేవి వజ్రాలహారాన్ని మెళ్ళో వేసుకుని పార్టీకి వెళ్ళడం తాను చూశానంది సులోచన. వాళ్ళు పార్టీ నుంచి తిరిగిరావడం కానీ, హారాన్ని బీరువాలో పెట్టడం కానీ తనకు తెలియదంది. తనకు బాయ్‌ఫ్రెండ్స్‌ ఎవరూ లేరనీ, ఆదివారం తన గదికి ఎవరూ రాలేదనీ చెప్పిందామె. శ్రీహరి ఇంటరాగేషన్లో కొత్త విషయాలేవీ తెలియలేదు. ‘తాను అసలు ఆ వజ్రాలహారాన్నే చూళ్ళేదని చెప్పాడతను. అతను స్మోక్‌ చేస్తాడని తెలుసుకుని, పాసేజ్‌లో దొరికిన సిగరెట్‌ పీకను చూపించింది. అది తనది కాదనీ, తాను ‘చార్మినార్‌’ బ్రాండే వాడతానని చెప్పాడు. ఆ ఇంటికి సంబంధించినంత వరకు ఆ ఐదుగురితోపాటు కారు డ్రైవర్‌ నూకరాజు, మెయిన్‌ గేట్‌ దగ్గర మూడు షిఫ్టుల్లో పనిచేసే ముగ్గురు వాచ్‌మెన్‌ కూడా ఉన్నారు. నూకరాజుకు పాతికేళ్ళుంటాయి. ఆర్నెల్ల క్రితమే చేరాడు. ‘వెల్‌–డిసిప్లిన్డ్‌’ అంటూ కితాబు ఇచ్చాడు పురుషోత్తమరావు. నూకరాజు ఆదివారం నుంచి మూడురోజులు సెలవు తీసుకున్నాడు. కనుక అనుమానితుల జాబితా నుంచి అతన్ని తొలగించింది. 

సెకండ్‌ షిఫ్ట్‌ వాచ్‌ మేన్‌ పరమేశానికి యాభయ్యేళ్ళుంటాయి. ఎక్స్‌–సర్వీస్‌ మేన్‌. తన షిఫ్ట్‌లో ఎవరూ ఇంటికి రాలేదని చెప్పాడు. థర్డ్‌ షిఫ్ట్‌ వాచ్‌ మేన్‌ కొండలరావుకు నలభయ్‌ ఐదేళ్ళుంటాయి. ‘‘నిన్న సాయంత్రం నుంచి నా భార్యకు జ్వరం. అందువల్ల రాత్రి డ్యూటీ ఎక్కిన అరగంటకు ఇంటికి వచ్చేశాను మేడమ్‌! ఆ సమయంలోఎదురింటి వాచ్‌మేన్‌ ఏడుకొండలిని చూసుకోమని చెప్పాను. పదకొండు గంటలకు తిరిగి వెళ్ళాను’’ చెప్పాడు. ఏడుకొండలు మంచివాడేననీ, తమ మధ్య అప్పుడప్పుడు అలాంటి అడ్జెస్ట్‌మెంట్స్‌ మామూలేననీచెప్పాడు. అనంతరం ఏడుకొండల్ని ప్రశ్నించిన ఇన్‌స్పెక్టర్‌కి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో పురుషోత్తమరావు స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ కారులో బైటకువెళ్ళాడు. అతను వెళ్ళిన కాసేపటికి సులోచన ఆటోలో ఎక్కడికో వెళ్ళింది. పురుషోత్తమరావు రాకముందే, వెళ్ళిన ఆటోలోనే తిరిగి వచ్చేసింది. పురుషోత్తమరావు తిరిగి వచ్చిన కొన్ని నిముషాలకు శ్రీహరి బైటకు వెళ్ళాడు. ఎప్పుడు తిరిగొచ్చాడో తెలియదు. అలవాటు ప్రకారం సులోచన వెళ్ళొచ్చిన ఆటో నంబర్‌ని చూసిన ఏడుకొండలు,లావణ్య అడగడంతో గుర్తుచేసుకుని చెప్పాడు. ఆ ఆటోని పట్టుకుని, ఆదివారం రాత్రి సులోచన ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్న లావణ్య ఆశ్చర్యానికి మేరలేకపోయింది.

మర్నాడు మధ్యాహ్నం ఇన్‌స్పెక్టర్‌ ‘లక్ష్మీనిలయానికి’ వెళ్ళేసరికి పురుషోత్తమరావు ఇంటివద్ద లేడు. లక్ష్మీదేవి కునుకు తీస్తోంది. గుడ్డీ తన గదిలో ఆడుకుంటోంది. ‘‘గుడ్‌ ఆఫ్టర్‌ నూన్, ఆంటీ!’’ అంటూ ఎదురొచ్చిన గుడ్డీని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది లావణ్య. పాప గదిలో కూర్చున్నారిద్దరూ. పాప తన స్కూల్‌ కబుర్లూ, ఫ్రెండ్స్‌ గురించీ గలగలా మాట్లాడేస్తూంటే, మురిపెంగా చూసింది లావణ్య. ఆల్బమ్‌ ఒకటి తెచ్చి చూపిస్తూ, ‘‘ఈ ఫొటోలన్నీ నేనే తీశాను, ఆంటీ!’’ అంది పాప. పెర్ఫెక్ట్‌ గా వచ్చిన ఆ ఫోటోలను చూసి, ఆరేళ్ళ ఆ చిన్నారి ట్యాలెంట్‌ కి ఆశ్చర్యపోయిందామె. పాప తన కెమెరా తెచ్చి చూపించింది. ఫారిన్‌–మేడ్‌ హై–డెఫినిషన్‌ మినీ కెమేరా అది. ఫోటోలో డేటు, టైమూ కూడా పడతాయి. లావణ్య చూపులు ఆల్బమ్‌లోని లక్ష్మీదేవి ఫొటో మీద పడ్డాయి. గదిలో బీరువా దగ్గర నిలుచుని ఉందావిడ. వజ్రాలహారం దాచిన బీరువా అది. ఫొటో మీద ఆ ఆదివారపు తేదీ, రాత్రి తొమ్మిదింపావు సమయమూ ప్రింట్‌ అయ్యాయి. ఆవిడ పైపెదవి మీద ఎడమభాగంలో స్పష్టంగా కనిపిస్తూన్న పుట్టుమచ్చ ఫొటోగ్రఫీలో గుడ్డీకి ఉన్న నైపుణ్యతను చాటుతోంది. ‘‘నాన్నమ్మకు ఫొటో తీయించుకోవడం ఇష్టం ఉండదు. ఆ రాత్రి తాను బీరువాను తెరుస్తూండగా, ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించిన తన రూపాన్ని తనకు తెలియకుండా క్లిక్‌ చేసేశాను’’ అంది గుడ్డీ నవ్వుతూ. ‘‘గుడ్‌ వర్క్‌!’’ అని మెచ్చుకుంది లావణ్య. ‘‘ఫొటో బావుంది. నేను తీసుకోనా?’’ అనడిగింది. ‘‘నా దగ్గర ఇంకో కాపీ ఉంది’’ అంటూ, దాన్ని తీసిచ్చింది గుడ్డీ.తనకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్స్‌ లో ప్రైజులు వచ్చాయంటూ, ఆ ప్రైజులను, తాను వేసిన వేషాల ఫొటోలనూ ఉత్సాహంగా చూపించింది గుడ్డీ. తనను సులోచన ఆంటీ తయారు చేసేదని చెప్పింది. లక్ష్మీదేవి నిద్రలేవడంతో హాల్లోకి వెళ్ళింది లావణ్య. ఆవిడ ఇచ్చిన కాఫీ తాగుతూంటే, పురుషోత్తమరావు కూడా వచ్చాడు. ‘‘హారం ఆచూకీ ఏమైనా తెలిసిందా?’’ అనడిగాడు.లేదనీ, కొన్ని క్లారిఫికేషన్స్‌ కోసం వచ్చాననీ చెప్పింది లావణ్య. ఇద్దరూ స్టడీరూమ్‌లో కూర్చున్నారు. ఆదివారం రాత్రి లక్ష్మీదేవి నిద్రమాత్రలు తీసుకున్న విషయం ప్రస్తావించింది ఆమె. తానే భార్యకు పిల్స్‌ ఇచ్చినట్టూ, ఆమె వాటిని మింగి మంచినీళ్ళు తాగి పడుకున్నట్టూ చెప్పాడు అతను. ‘‘ఆదివారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళారు మీరు?’’ హఠాత్తుగా ప్రశ్నించిందామె. ‘పురుషోత్తమరావు తమ్ముడి కుటుంబం ఆ ఊళ్ళోనే ఉంటోంది. ఆర్థికంగా ఇబ్బందులకు గురైన ఆ కుటుంబాన్ని భార్యకు తెలియకుండా ఆదుకుంటున్నాడు అతను. ఆరోజు రాత్రి మరదలికి మెడికల్‌ ఎమెర్జెన్సీరావడంతో హాస్పిటల్లో అడ్మిట్‌ చేసి, తమ్ముడు అతనికి ఫోన్‌ చేశాడు. పురుషోత్తమరావు వెళ్ళి కొంత డబ్బు ఇచ్చివచ్చాడు.’‘‘తమ్ముడి కుటుంబానికి సాయం చేయడం నా భార్యకు ఇష్టముండదు. అందుకే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచాను’’ అన్నాడు పురుషోత్తమరావు. తరువాత లక్ష్మీదేవిని పిలిచింది లావణ్య. ‘‘మీకు నిద్రలో లేచి తిరిగే అలవాటుందా?’’ అనడిగింది. లేదన్నదావిడ.‘‘ఆదివారం రాత్రి నిద్రమాత్రలు వేసుకుని పడుకుని, మర్నాడు తెల్లవారేంత వరకు లేవలేదన్నారు మీరు. కానీ, అదే రాత్రి తొమ్మిదింపావుకు హారం దాచిన బీరువాను ఎలా తెరిచారు?’’ ఆవిడ ముఖ కవళికలను గమనిస్తూ అడిగింది లావణ్య. ‘‘మీరు బీరువా తెరుస్తూండగా తీయబడ్డ ఫొటో నా వద్ద ఉంది’’.

ఆశ్చర్యంగా చూసిందావిడ. ‘‘నా కొడుకు, కోడలూ పోయాక నేను ఫొటో దిగడం మానేశాను. ఎందుకంటే, మేమెంతో ముచ్చటపడి ఫ్యామిలీ అంతా స్టూడియోకి వెళ్ళి ఫొటో తీయించుకున్న మూడోరోజునే ఆ ప్రమాదం జరిగింది’’ బాధగా అందావిడ. ‘‘కనుక నా ఫొటో మీ దగ్గర ఉందంటే నేను నమ్మను’’.  గుడ్డీ తీసిన ఫొటోని ఆవిడకు చూపించలేదు లావణ్య.అక్కడి నుంచి ఔట్‌ హౌస్‌ కి వెళ్ళింది. సులోచన ఇంట్లోనే ఉంది. శ్రీహరి బయటకు వెళ్ళాడంది. ‘‘అమ్మగారి హారం ఆచూకీ ఏదైనా తెలిసిందా మేడమ్‌?’’ అనడిగింది.‘‘ఇంకా లేదు. ప్రతి నేరస్తడూ ఏదో ఒక పొరపాటు చేయక మానడు. అది చిన్నదైనా సరే. ఆ పొరపాటు కోసమే గాలిస్తున్నాను’’ అంది లావణ్య. ‘‘అన్నట్టు, పురుషోత్తమరావుగారి డ్రైవర్‌ ఎలాంటివాడు?’’. మంచివాడేననీ, తన పనేదో తనదేకానీ, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోడనీ చెప్పింది సులోచన. లావణ్య శ్రీహరి కోసం వెయిట్‌  చేయలేదు. అతని గురించి ఆల్రెడీ విచారించింది. దుబాయ్‌లో ఓ గొడౌన్లో పని చేసేవాడతను. యజమాని సక్రమంగా జీతం చెల్లించకుండా ఎక్స్‌ప్లాయిట్‌ చేస్తూండడంతో, ఇండియాకి తిరిగి వచ్చేశాడు. క్రిమినల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. ఆదివారం రాత్రి పక్కవీధిలో చివరగా ఉన్న ఇంటికి వెళ్ళాడతను. ఆ ఇంట్లోని సర్వెంట్‌ మెయిడ్‌ తో అతనికి అక్రమ సంబంధం ఉంది. అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకుంటూంటారు ఇద్దరూ.శంకరం ఆదివారం రోజున తాను లక్ష్మీనిలయానికి వెళ్ళినట్టూ, అందరూ పడుకోవడంతో కాసేపుండి తిరిగి వెళ్ళిపోయినట్టూ చెప్పాడు.  సిగరెట్‌ కాలుస్తూ హాల్లోనే కూర్చున్నాడనీ, హారం సంగతీ తనకు తెలియదనీ చెప్పాడు. వెళ్ళిపోతూ కాలుస్తూన్న సిగరెట్‌ని ఆర్పేసి కిటికీలోంచి బయటకు విసిరేసినట్టు చెప్పి, ఇన్‌స్పెక్టర్‌ చూపించిన సిగరెట్‌ పీక తనదేనని ఒప్పుకున్నాడు. లావణ్యకు పాత సినిమా పాటలంటే ఇష్టం. ఇంట్లో రికార్డర్‌లో వస్తూన్న దేవదాసు సినిమాలోని పాటలు వింటూ, కేసు పేపర్స్‌ ని స్టడీ చేస్తోంది. ‘జగమే మాయా’ పాట అయిపోగానే, ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’ మొదలయింది. తన్మయత్వంతో ఆలకిస్తూన్న లావణ్య, ఉన్నట్టుండి ఉలికిపడింది. హఠాత్తుగా గుడ్డీ చెప్పిన విషయం ఒకటి స్ఫురణకు వచ్చింది. ‘ఎస్‌! ఈ కేసులో నేను ఎదురు చూస్తూన్న బ్రేక్‌ త్రూ ఇదే!’ అనుకుంటూ చటుక్కున లేచి కూర్చుంది.తిన్నగా గుడ్డీ గదిలోకి వెళుతూన్న ఇన్‌స్పెక్టర్‌ని చూసి విస్తుపోయారు పురుషోత్తమరావు, లక్ష్మీదేవిలు. ‘‘గుడ్డీ! ఆ రోజు నువ్వు తీసిన నాన్నమ్మ ఫొటో మిర్రర్‌ ఇమేజ్‌ అన్నావు కదూ?’’ అనడిగింది లావణ్య. ఔనంది ఆ పిల్ల. లక్ష్మీదేవిని బీరువా వద్ద గుడ్డీ చెప్పిన విధంగా నిలుచోమంది లావణ్య. తాను గుడ్డీ గదిలో నిలుచుని చూసింది. నిలువుటద్దంలో ఆవిడ ఇమేజ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. హుషారుగా గుడ్డీ బుగ్గమీద ముద్దాడింది. 

రాత్రి తొమ్మిది గంటలకు మల్కాజ్‌గిరిలోని ఓ ఇంట్లోంచి బయటకు వచ్చారు ఓ యువతి, ఓ యువకుడు. పైటచెంగు ముఖానికి కప్పుకుందామె. అతని తలమీద ఫెల్ట్‌ హ్యాట్‌ ఉంది. చేతిలో ట్రావెల్‌ బ్యాగ్‌ ఉంది. ఓ పాత అంబాసడర్‌ కారులో కూర్చున్నారు. అతను డ్తైవ్‌ చేస్తూంటే, ఆమె అతని పక్కను కూర్చుంది. కారు సికిందరాబాద్‌ రైల్వే స్టేషన్‌కి చేరుకోగానే దిగి స్టేషన్‌లోకి వెళ్ళారు వాళ్ళు. క్లోక్‌ రూమ్‌కి వెళ్ళి రశీదు ఇచ్చి, చిన్న బ్రీఫ్‌ కేసు తీసుకున్నారు. అనంతరం కదలడానికి సిద్ధంగా ఉన్న నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కబోయారు. వెనుక నుంచి ఎవరో చేయి పట్టుకుని లాగుతున్నట్టనిపించి వెనక్కు తలతిప్పిన ఆ యువకుడు, మఫ్టీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ లావణ్యను చూసి ఖంగుతిన్నాడు. అతను పారిపోబోతూంటే, చేతిని చాకులా బిగించి అతని మెడపైన కొట్టింది లావణ్య. గిలగిలలాడుతూ నేల కరచాడు. ఆమె, అతని చేతిలోని బ్రీఫ్‌ కేసును లాక్కుని, ప్లెయిన్‌ క్లోత్స్‌ లో ఉన్న తన మనుషులకు సైగచేయడంతో, అతనికి అరదండాలు తగిలించడమే కాక, ఆ యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పెట్టె తెరచి చూసిన లావణ్య కళ్లు మెరిసాయి.

‘లక్ష్మీనిలయం’లో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది ఇన్‌స్పెక్టర్‌ లావణ్య. వజ్రాలహారంతోపాటు నేరస్తులనూ హాజరుపరచింది. ‘‘దురాశ బహుచెడ్డది. సులోచన నిజాయితీపరురాలే అయినా, డ్రైవర్‌ నూకరాజు ప్రోద్బలంతో చోరీకి పూనుకుంది. గతరాత్రి ఇద్దరూ వజ్రాలహారంతో ఉడాయించబోతూంటే రెడ్‌ హ్యాండెడ్‌ గా çపట్టుకున్నాం’’ చెప్పింది లావణ్య. ‘‘అసలు మీ అనుమానం సులోచనపైకి ఎలా వచ్చింది?’’ ఆశ్చర్యంగా అడిగాడు పురుషోత్తమరావు. ‘‘ఆదివారం రాత్రి లక్ష్మీదేవి నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయింది. కానీ, అదే రాత్రి తొమ్మిదింపావుకు ఆవిడ హారాన్ని దాచిన బీరువాను తెరుస్తూండగా అద్దంలో చూసి ఫొటో తీసింది గుడ్డీ. ఒడ్డూ పొడవూ ఇంచుమించు లక్ష్మీదేవిలాగే ఉంటుంది సులోచన. ఎవరికీ అనుమానం రాకుండా ఆవిడలా వేషం వేసుకుంది. పెదవి మీది పుట్టుమచ్చను దిద్దుకోవడం కూడా మరచిపోలేదు. బీరువా తాళపుచెవులు లక్ష్మీదేవి తలగడ కింద ఉంటాయన్న సంగతి ఆమె ఎరుగును. తాళం చెవులను సంగ్రహించి బీరువా తెరచి హారాన్ని దొంగిలించింది. తరువాత వేషం మార్చుకుని దాన్ని తీసుకువెళ్ళి నూకరాజుకు ఇచ్చి వచ్చింది. అతని వలపులో చిక్కుకున్న సులోచన అయిష్టంగానే అతని పథకాన్ని అమలుపరచింది. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌ అన్నాడు ఓ సినీకవి. కానీ అది ఘోరమైన పొరపాటని ఈ కేసు నిరూపించింది గుడ్డీ తీసిన ఫొటో నా పరిశోధనలో అత్యంత కీలకమైన క్లూ అయింది. నేరం చేసే సమయంలో ఆ వ్యక్తి యొక్క మానసికస్థితి నార్మల్‌గా ఉండదు. అందువల్ల ఏదో ఒక పొరపాటు చేయక మానడు. సులోచన విషయంలోనూ అదే జరిగింది’’ చెప్పింది లావణ్య. ‘‘పుట్టుమచ్చను ఎడమ వైపుకు బదులు కుడివైపు పెట్టుకుంది. అందుకే అద్దంలో అది ఎడమవైపు కనిపించింది. అదే ఆమెను పట్టిచ్చింది. అండ్‌ ద క్రెడిట్‌ గోస్‌ టు ద లిటిల్‌ గుడ్డీ!’’.హాల్లో చప్పట్లు మార్మోగుతుంటే సులోచన ఖిన్నవదనంతో తల వంచుకుంది.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement