ప్రెగ్నెన్సీ సమయంలో Urinary Tract Infection (UTI) సాధారణం అని చెబుతుంటారు. దీనికి కారణం ఏమిటి? ఎలాంటి నివారణ చర్యలు ఉన్నాయి?
– వాణి, అనకాపల్లి
ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ మామూలు వారిలో కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూత్రాశయం వెనుకకు ఆనుకొనే గర్భాశయం ఉంటుంది. బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం పెరుగుతూ మూత్రాశయం పైన బరువు పడటం, ఒత్తిడి పడటం వల్ల మూత్రం పూర్తిగా మూత్రాశయం నుంచి బయటకు రాలేకపోవచ్చు. అందువల్ల మూత్రం కొద్దిగా మూత్రాశయంలో నిల్వ ఉండిపోయే అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా పెరిగి, వ్యాప్తి చెంది మూత్రాశయం నుంచి యురెటర్స్‌కు, తద్వారా కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల మంచినీళ్లను తాగాలి. మూత్రం వస్తుంటే ఆపుకోకుండా మూత్ర విసర్జన చేస్తుండాలి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రం చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన తర్వాత యోనిభాగం దగ్గర చెమ్మ లేకుండా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. దానివల్ల రక్తహీనత లేకుండా, రోగనిరోధకశక్తి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ చేయించుకొని, అందులో ఇన్‌ఫెక్షన్స్ ఉంటే యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ యాంటీ బయోటిక్స్ కోర్సు వాడాల్సి ఉంటుంది.
∙నా వయసు 29 ఏళ్లు. నేను బాగా లావుగా ఉంటాను. అలాగే మా అమ్మానాన్నలిద్దరికీ హైబీపీ ఉంది. అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. కాన్పుకు నా బరువేమైనా ప్రాబ్లమవుతుందా? అలాగే బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయా? దయచేసి సలహాలు, సూచనలు ఇవ్వగలరు.
– లహరి, రాజమండ్రి
బరువు ఎక్కువగా ఉంటే గర్భం దాల్చకముందే తగ్గడం మంచిది. కుటుంబంలో తల్లిదండ్రులకు బీపీ ఎక్కువగా ఉంటే, గర్భంతో ఉన్నప్పుడు బరువు పెరగకుండా ఉండటం, బీపీ పెరిగే రిస్క్‌ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటే, డాక్టర్ పర్యవేక్షణలో ఎకోస్ప్రిన్ మాత్ర వేసుకోవడం మంచిది. ముందు ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగి ఉంటే, తర్వాత ప్రెగ్నెన్సీలో ఎకోస్ప్రిన్ మాత్ర వాడటం, ప్రెగ్నెన్సీలో బీపీ పెరుగుతుంటే టైమ్‌కు చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ సలహామేరకు బీపీ మాత్రలు కూడా సక్రమంగా వాడాలి. ప్రెగ్నెన్సీలో బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అంతేకాకుండా అన్ని వసతులూ కలిగిన ఆసుపత్రిలో కాన్పు కావడం, అవసరమైతే డాక్టర్ సలహామేరకు సమయానికి ముందుగానే కాన్పు చేయించుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సమస్య జటిలం కాకుండా, ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకునే అవకాశాలు పెరుగుతాయి.
∙మా స్నేహితురాలికి ్క Pre-eclampsia డిజార్డర్ వచ్చిందని విన్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఈ డిజార్డర్ ప్రమాదకరమా? దానికి నివారణ ఏమిటి?
– ఆర్‌సి, హైదరాబాద్
Pre-eclampsia అంటే గర్భిణులలో బీపీ పెరిగి, మూత్రంలో ప్రొటీన్, ఆల్బుమిన్ లీక్ అవ్వడం, శరీరంలో మార్పులు, నీరు చేరడం, కిడ్నీ, మెదడు, లివర్ వంటి అవయవాల పనితీరులో మార్పులను ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఈ పరిస్థితిలో సరైన చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే గుర్రపువాతం, ఫిట్స్ రావడం, కళ్లు మసకబారి కనిపించకపోవడం, అలాగే ఉంటే కోమాలోకి వెళ్లడం, కిడ్నీలు, లివర్ దెబ్బతినడం. అధిక రక్తస్రావం వంటి ప్రాణాపాయస్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగా కడుపులో బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, మాయ విడిపోవడం, బిడ్డకు రక్తసరఫరా తగ్గిపోయి బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో గర్భంలో వచ్చే అనేక మార్పుల వల్ల, జన్యుపరంగా, అధిక బరువు వల్ల, రక్తం గూడుకట్టే గుణంలో మార్పువల్ల.. ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల తల్లిలోని రక్తనాళాలు సరిగా వ్యాకోచించకపోవడం వల్ల తల్లిలో బీపీ పెరగడం, అలాగే ఇతర అవయవాల సమస్యలు ఏర్పడి ప్రీ ఎక్లాంప్సియా రావడం జరుగుతుంది. ఇది రాకుండా నూటికి నూరు శాతం నివారించలేము. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల, కొందరిలో ఈ లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల, చికిత్స తీసుకోవడం వల్ల సమస్యలు అధికం కాకుండా అడ్డుకోవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్
హైదర్‌నగర్ ,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment