దాని  వల్ల ఇబ్బందా? | funday health counciling | Sakshi
Sakshi News home page

దాని  వల్ల ఇబ్బందా?

Published Sun, Feb 18 2018 1:19 AM | Last Updated on Sun, Feb 18 2018 1:25 AM

funday health counciling - Sakshi

గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వేసుకోవాల్సిన వ్యాక్సిన్‌ల గురించి తెలియ జేయగలరు. నాకు అప్పుడప్పుడు దగ్గు బాగా వస్తోంది. దగ్గడం వల్ల కడుపులో బిడ్డకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా?
– ఎల్‌ఆర్, రాజోలు

వ్యాక్సిన్స్‌ అంటే కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్‌ రాకుండా ఉండటానికి శరీరంలోకి ఆయా ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించిన క్రిములను ఇన్‌యాక్టివ్‌ చేసి అతికొద్ది మోతాదులో లేదా క్రిముల మీద ఉండే దాని యాంటిజన్‌ను లేదా  ఇన్‌యాక్టివ్‌ క్రిములలో హాని కలిగించే టాక్సిన్‌ను చిన్న ఇంజెక్షన్‌ ద్వారా పంపించడాన్ని వ్యాక్సిన్‌ అంటారు. దీనివల్ల ఆ క్రిములకు వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీస్‌ తయారవుతాయి. తర్వాత ఎప్పుడైనా శరీరంలోకి రోగక్రిములు ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీస్‌ ఆ క్రిములను వృద్ధి కాకుండా అడ్డుకుంటాయి. అలా ఇన్‌ఫెక్షన్‌ రాకుండా చేస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని వ్యాక్సిన్లను ఇవ్వొచ్చు. సాధారణంగా గర్భిణీ స్త్రీలు రెండుసార్లు టెటానస్‌ టాక్సాయిడ్‌ (టీటీ) ఇంజెక్షన్‌ను నెల వ్యవధిలో తీసుకోవాలి. దీనివల్ల కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకి టెటానస్‌ అనే ప్రాణాంతక వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక డోస్‌ టీటీతో పాటు ఏడవ నెలలో టీడాప్‌ అనే వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల పుట్టే బిడ్డలో కోరింత దగ్గు, డిఫ్తీరియా వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఫ్లూ ఎక్కువగా ఉండే అక్టోబర్, నవంబర్‌ నెలల్లో అవసరమైతే ఫ్లూ వ్యాక్సిన్‌ ఒక డోస్‌ను డాక్టర్‌ సలహామేరకు తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో ఫ్లూ వ్యాధి సోకితే, వాటి లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే బిడ్డకి సోకే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల యాంటీబాడీస్‌ ఆ వ్యాధి రాకుండా, అలాగే బిడ్డకి సోకకుండా, రోగక్రిములను అడ్డుకుంటాయి. కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీ హెపటైటిస్‌–బి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఉన్న వాతావరణంలో ఉన్నప్పుడు డాక్టర్‌ సలహా మేరకు హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. 

దగ్గడం వల్ల బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాకపోతే తరచూ దగ్గడం వల్ల పొత్తికడుపు మీద ఒత్తిడి పెరిగి, కడుపులో నొప్పి రావడం, కొందరిలో ఒత్తిడికి మూత్రం కారిపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకానీ బిడ్డకు ఏమీ కాదు. ఎందుకంటే బిడ్డ చుట్టూ ఉమ్మనీరు, ఉమ్మనీరు పొర, గర్భాశయ కండరాలు.. షాక్‌ అబ్జార్బర్స్‌లా పని చేస్తాయి. అలాగే దగ్గువల్ల కలిగే ఒత్తిడిని బిడ్డ వరకు చేరనీయవు. కొందరిలో మాయ కిందకు ఉన్నా, గర్భాశయ ముఖద్వారం కొద్దిగా లూజుగా ఉన్నా, కొందరు తరచూ తీవ్రంగా దగ్గుతూ ఉంటే, కొన్నిసార్లు బ్లీడింగ్‌ అవ్వడం, ఉమ్మనీరు పోవడం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. దగ్గు వచ్చినప్పుడు పొత్తికడుపు కింద చెయ్యిపెట్టుకుని, కూర్చొని దగ్గడం మంచిది. మీకు తరచూ దగ్గు వస్తుందంటున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్‌ని కలిసి గొంతు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ లేదా అలర్జీ లేదా మరే ఇతర కారణాల వల్ల దగ్గు వస్తుందో తెలుసుకొని చికిత్స తీసుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే వేరే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉంటే... అది వేరే అవయవాలకు పాకడం వంటి సమస్యలతో పాటు బిడ్డకి సోకే అవకాశంతో పాటు  బిడ్డకి ఆక్సిజన్‌ వాయువు తగ్గే ప్రమాదం కూడా ఉంటుంది.

∙మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటోంది. అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి వస్తోంది. ‘మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ కావచ్చు’ అని నా స్నేహితురాలు అంటోంది. ఇది నిజమేనా? మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన లక్షణాలను ఎలా గుర్తించాలి? – బీఎన్, మండపేట
కొన్ని సందర్భాల్లో రోగకారక క్రిములు యోనిభాగం లేదా మలవిసర్జన ద్వారం దగ్గర నుంచి మూత్ర విసర్జన ద్వారం ద్వారా పైకి మూత్రాశయానికి, నిర్లక్ష్యం చేస్తే అక్కడి నుంచి మూత్రాశయ గొట్టాలకు, తద్వారా కిడ్నీలకు పాకి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతాయి. మూత్రంలో మంట, పొత్తికడుపులో నొప్పి, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రానికి వెళ్లేలోపల అది లీక్‌ అవ్వడం, మూత్రంలో రక్తం పడటం, చలి, జ్వరం, నడుము నొప్పి వంటి రకరకాల లక్షణాలు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను బట్టి ఉంటాయి. యోనిలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు, మూత్రం బయటకు వచ్చేటప్పుడు, యోనిభాగం దగ్గర మంట, దురద, పొత్తి కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉండొచ్చు. ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి పరీక్ష చేయించుకోండి. కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్, యూరిన్‌ కల్చర్‌ సెన్సిటివిటీ వంటివి చేయించుకొని, దానికి తగ్గ చికిత్స తీసుకోవడం మంచిది. మందులతో పాటు మంచినీళ్లు కనీసం మూడు లీటర్లయినా తాగాలి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కి శుభ్రపరచుకోవడం, శారీరక పరిశుభ్రత వంటివి పాటించడం మంచిది. ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తే ఇన్‌ఫెక్షన్‌ కిడ్నీలకు పాకడం జరుగుతుంది. అలాగే రక్తంలోకి, శరీరంలోకి పాకి ప్రాణాంతకంగా మారే అవకాశాలూ లేకపోలేదు. 

- డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ ,హైదరాబాద్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement