నైట్ డ్యూటీలో ఉన్నాడు సోలాంగ్. రాత్రి పదకొండు అవుతుండగా తన ఫ్లోర్‌లోంచి పైఫ్లోర్‌లోని ఆఫీస్ డైనింగ్ హాల్‌లోకి వెళ్లాడు. దేనికైనా అందరూ ఒకేసారి వెళ్లిరావాలనే ‘హాఫేనవర్ బ్రేక్’లు ఉండే ఆఫీస్ కాదది. ‘ఎప్పుడెలా చస్తారో మీ ఇష్టం. ఇన్ టైమ్‌లో వర్క్ ఫినిష్ అయితే చాలు..’ అన్నట్లుంటాయి అక్కడి రూల్స్ అన్నీ.నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు రోజూ అదే టైమ్‌కి భోజనానికి లేస్తాడు సోలాంగ్. అప్పటికైనా ఆకలి కొరికేస్తోందని అతడు లేవడు. ఇంటి నుంచి ఏవో రెండు గిన్నెలు తెచ్చుకుంటాడు. అవి ఖాళీ చేయడం కోసం లేస్తాడు. ఆ గిన్నెలు కూడా అతడు పెట్టించుకుని తెచ్చుకున్నవి కావు. భార్య పెట్టిస్తే తెచ్చుకున్నవి. ఆ గిన్నెల్లో ఏం పెట్టావని అతడెప్పుడూ ఆఫీస్‌కు బయల్దేరే ముందు గానీ, ఆఫీస్‌కి వచ్చాక గానీ భార్యను అడగలేదు. కొత్తల్లో ఒకసారి అతడు అడక్కుండానే భార్యే చెప్పింది.. పై గిన్నెలో మీకిష్టమైన బంగాళదుంప వేపుడు, చల్ల మిరపకాయలు ఉన్నాయని. ఆమె అలా చెప్పినప్పుడు.. అతడన్నమాట.. ‘ఏదైతేనేం.. నోట్లోనే ఉండిపోయేదా! కడుపులోకి వెళ్లేదే కదా’ అని! ఆ లాజిక్ ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు నుంచీ గిన్నెల్లో ఏం పెట్టిందీ చెప్పడం మానేసింది. అప్పుడే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఏదో ఒకటి తినడం తప్ప, ఏదైనా ఒకటి తినాలని తన భర్తకు ప్రత్యేకంగా ఏమీ ఉండదని. అలాగని అతడికి ఇష్టమైనవి చేసి గిన్నెల్లో సర్దడం మానలేదు ఆమె. తనకు ఇష్టమైనవి ఇష్టంగా తింటున్నానన్న స్పృహైతే లేకుండా అతడు తినేసేవాడే కానీ, ఆమె మాత్రం పూర్తి స్పృహతో అతడు ఏవైతే ఇష్టంగా తింటాడో అవి మాత్రమే చేసి గిన్నెల్లో పెట్టేది.
క్యారియర్ తెరిచాడు సోలాంగ్. పెద్ద కంపెనీకి తగినంత పెద్ద డైనింగ్ హాల్ అది. ఓ యాభై వరకు టేబుల్స్ ఉంటాయి. సోలాంగ్ వెళ్లేటప్పటికి అవన్నీ ఖాళీగా ఉన్నాయి. సోలాంగ్ ఆ టైమ్‌కే డైనింగ్ హాల్‌కి రావడానికి అదొక కారణం. ఎవరూ ఉండరు. తనొక్కడే ఉంటాడు. ఒక్కడే కూర్చొని తింటూ ఆలోచనల్లో పడిపోవడం అతడి అలవాటు. ఆలోచనల మధ్య తింటుంటాడు తప్ప, తింటూ మధ్య మధ్య ఆలోచించడు. ఇంట్లో కూడా అంతే. ఎదురుగా భార్య కూర్చొని ఉన్నా.. తన ఆలోచనల్ని తను తింటుంటాడు. ఆమెతో మాట్లాడడు. కొంచెం పెట్టమనీ, ఇంక చాలనీ అనడు. భర్త ఏం తిన్నాక ఏం తింటాడో, ఏది ఎంత తింటాడో పెళ్లయిన ఆ మూడేళ్లలోనూ పెద్ద పీహెచ్‌డీనే చేసింది ఆమె.
డైనింగ్ హాల్లో ఒక్కడే తింటున్నాడు సోలాంగ్. అతడు తింటుంటే.. ఎప్పటిలాగే అతడిని ఆలోచనలు కొరుక్కుతింటున్నాయి. సోలాంగ్ ఎప్పుడూ ముగ్గురి గురించి ఆలోచిస్తుంటాడు. దేవుడు.. దెయ్యం.. మనిషి!ఈ ముగ్గురి మధ్య ఉండే సంబంధమే అతడి నిరంతర ఆలోచన. సోలాంగ్ తింటూ ఉంటే.. (ఆలోచిస్తూ ఉంటే).. డైనింగ్ హాల్‌లోకి ఎప్పుడొచ్చాడో గానీ ఓ వ్యక్తి నేరుగా సోలాంగ్ టేబుల్ దగ్గరకు వచ్చి, ‘‘నేనూ మీతో కలిసి కూర్చోవచ్చా?’’ అన్నాడు తన క్యారియర్‌ను బయటికి తీస్తూ. సోలాంగ్ అతడివైపు మౌనంగా చూశాడు. ‘‘ఒక్కణ్ణే తినడం నాకు అలవాటు లేదు’’ అన్నాడు ఆ వచ్చిన అతను. ‘‘కానీ నాది ఐపోవచ్చింది. మధ్యలోనే లేచి వెళ్తాను’’ అన్నాడు సోలాంగ్. ఎలాగైనా అతడిని అక్కడ కూర్చోనివ్వకపోవడం సోలాంగ్ ఉద్దేశం. అతడు నవ్వాడు. ‘‘రెండు క్షణాల్లో తినేస్తాను. బహుశా మీకంటే ముందే తినేస్తానేమో కూడా’’ అన్నాడు. అతడి డబ్బాలవైపు చూశాడు సోలాంగ్. అవి రెండు క్షణాల్లో అయిపోయేలా లేవు.. అతడు దెయ్యమో, దేవుడో అయితే తప్ప! అదే మాట అన్నాడు కూడా.ఆ మాటకు పెద్దగా నవ్వాడు అతను. ‘‘రండి. కూర్చోండి’’ అన్నాడు సోలాంగ్. అతడి జీవితంలో ఒక వ్యక్తిని అలా తన టేబుల్ మీదకు ఇన్వైట్ చెయ్యడం అదే మొదటిసారి.‘‘మిమ్మల్ని ఆఫీస్‌లో చాలాసార్లు చూశాను. ఎప్పుడూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తుంటారు కదా’’ అన్నాడు అతను. సోలాంగ్ నవ్వాడు. ఆ ‘సుదీర్ఘత’నే ఇంగ్లిష్‌లోకి అనువదించి అతడికి ఆఫీస్‌లో అంతా సోలాంగ్ అనే పేరు పెట్టారని కూడా ఆ వచ్చినతనికి తెలుసు. అయితే ఆ మాట పైకి అనలేదు.
‘‘నా పేరు విశిష్ట’’ అన్నాడు.. తన గిన్నెలు ఓపెన్ చేస్తూ. ‘అవునా’ అన్నట్లు చూశాడు సోలాంగ్. ఆ తర్వాత కొద్దిసేపటికే వాళ్లిద్దరి టాపిక్.. దెయ్యాల మీదకు, దేవుడి మీదకు మళ్లింది! ‘‘నాకు ఈ దెయ్యాల మీద, దేవుళ్ల మీద, మనుషుల మీద నమ్మకం లేదు’’ అన్నాడు విశిష్ట. పెద్దగా నవ్వాడు సోలాంగ్. ‘‘కనీసం మీ మీదైనా మీకు నమ్మకం ఉండాలి కదా’’ అన్నాడు. ‘‘మీరన్నది నాకు అర్థమయింది. మీ ఎదురుగా ఉన్న నేను.. దెయ్యమో, దేవుడో, మనిషో కాకుండా ఇంకొకరు అవడానికి అవకాశమే లేనప్పుడు.. ఈ ముగ్గురిలో నేను ఎవరో.. ఆ ఎవరినోనైనా నేనునమ్మకపోవడం ఎలా సాధ్యమౌతుందనే కదా మీరు అనడం’’ అన్నాడు విశిష్ట. ‘అంతే కదా’ అన్నట్లు చూశాడు సోలాంగ్.‘‘కానీ సుధీర్.. ‘నాకు నమ్మకం లేదు’ అని నేను అన్నది ఆ ముగ్గురి ఉనికి గురించి కాదు. ఆ ముగ్గురినీ నేను విశ్వసించను అని’’ అన్నాడు విశిష్ట. అదిరిపడ్డాడు సోలాంగ్. అయితే ఆ అదురుపాటును దాచుకుంటూ.. ‘‘నా పేరు మీకెలా తెలుసు?’’ అన్నాడు. ‘‘మీ పేరు అదే అయినప్పుడు.. ఆ పేరేగా నాకు తెలుస్తుంది’’ అన్నాడు విశిష్ట. సోలాంగ్‌కి చాలా సంతోషం వేసింది. విశిష్ట తనకు ఆప్తుడిలా అనిపించాడు. తనని అతడు తనలాగే గుర్తించాడు. తన ‘సుదీర్ఘత’కు ఎలాంటి గుర్తింపునూ ఇవ్వకుండా.
ఇద్దరి భోజనాలు పూర్తయ్యాయి. టాపిక్ మాత్రం పూర్తి కాలేదు. అది పూర్తయ్యేలా లేదనిపించి.. ‘‘ఇక నేను వెళ్తాను’’ అని పైకి లేచాడు విశిష్ట. సోలాంగ్ లేవలేదు.విశిష్ట లేచి, ఆ డైనింగ్ హాల్లోనే ఓ మూల.. మలుపులో ఉన్న సింక్ దగ్గరికి వెళ్లి గిన్నెల్ని కడుక్కుని, వాటిని మళ్లీ టేబుల్ దగ్గరకు తెచ్చి, టేబుల్ మీద ఉన్న లంచ్ బ్యాగ్‌లో సర్దుకుని కింది ఫ్లోర్‌లోకి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి ‘బై’అన్నట్లు సోలాంగ్ వైపు చెయ్యి ఊపాడు. సోలాంగ్ కూడా చెయ్యి ఊపాడు. సోలాంగ్‌కి, తిన్న తర్వాత గిన్నెలు కడిగే అలవాటు లేదు. వాటిని అలాగే లంచ్ బ్యాగ్‌లో పెట్టేస్తాడు. చేతులు కడుక్కోవడం తప్పదు కాబట్టి.. వాటిని మాత్రం కడుక్కుంటాడు. విశిష్ట వెళ్లిపోయాక కూడా, కొద్దిసేపు అలాగే కూర్చొని.. చేతులు ఎండిపోతున్నట్లుంటే అప్పుడు లేచి, సింక్ వైపు నడిచాడు సోలాంగ్. సింక్‌లో నీళ్ల చప్పుడు అవుతోంది! ట్యాప్‌ను సరిగా కట్టేయకుండా వెళ్లాడేమో విశిష్ట.. అనుకున్నాడు.మరో నాలుగడుగులు వేసి, మలుపు తిరిగి, సింక్ ఉన్న రూమ్‌లోకి వెళ్లాడు.నిజమే. లోపల ట్యాప్‌లోంచి నీళ్లు పడుతున్నాయి. అయితే అవి విశిష్ట తిప్పేసి వెళ్లడం వల్ల పడుతున్న నీళ్లు కాదు. ట్యాప్ తిప్పి విశిష్ట చేతులు కడుక్కుంటున్నప్పుడు పడుతున్న నీళ్లు!గుండె చిక్కబట్టుకుని ఒక్కసారిగా అక్కణ్ణుంచి డైనింగ్ హాల్ బయటికి పరుగులు తీశాడు సోలాంగ్. ఆ తర్వాతెప్పుడూ అతడు ఆఫీస్ డైనింగ్ హాల్లో ఒక్కడే కూర్చొని తినలేదు.
- మాధవ్ శింగరాజు
సోలాంగ్
Published Sun, Oct 21 2018 1:55 AM | Last Updated on Sun, Oct 21 2018 1:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment