జయం మనదేరా! | funday Laughing gas | Sakshi
Sakshi News home page

జయం మనదేరా!

Published Sun, Feb 25 2018 12:09 AM | Last Updated on Sun, Feb 25 2018 12:09 AM

funday Laughing gas - Sakshi

పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎటు చూసినా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. డబ్బులు బాగా ఎక్కువైన వాళ్లే కాదు... బాగా తక్కువైన వాళ్లు కూడా అప్పు చేసి మరీ బెట్టింగ్‌లో డబ్బులు కాస్తున్నారు. ఇంతకీ బెట్టింగ్‌ దేని మీద? క్రికెట్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మీద కాదు. ఇండియా–పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ మీద కూడా కాదు. కుందేలు, తాబేలు పరుగు పందెం మీద! కూకట్‌పల్లిలో కుందేళ్ల సమావేశం జరుగుతోంది. ‘‘ఇది మన జాతి ఆత్మగౌరవ సమస్య. అప్పుడెప్పుడో మన ముత్తాత చేసిన మిస్టేకుకు ఇప్పటికీ పరువు పోతూనే ఉంది. ముత్తాత చేసిన తప్పు... మన చరిత్రలో మాయని మచ్చగా నిలిచింది. ఈసారి ఎలాగైనా సరే మనమే గెలవాలి!’’ అన్నది ఒక కుందేలు. ‘‘అవునూ... అవునూ’’ అని గట్టిగా అరిచాయి సాటి కుందేళ్లు. మరోవైపు తార్నాకలో తాబేళ్ల సమావేశం జరుగుతోంది.‘‘మన ముత్తాత తెలివి గురించి ఇప్పటికీ పిల్లలకు గొప్పగా చెబుతుంటారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ క్లాసుల్లో కూడా మన ముత్తాత పేరు పదే పదే మారుమోగిపోతుంటుంది. ఈసారి కూడా మనమే గెలవాలి. మన తాబేలు జాతి కీర్తిని శాశ్వతం చేయాలి’’ అంటూ సాటి  తాబేళ్లను  ఉద్దేశించి మైక్‌ అందుకొంది ఒక తాబేలు.

‘గెలుపెవరిది?’ అనే టాపిక్‌పై ‘నీల్సన్‌–వీల్సన్‌’ సంస్థ పెద్ద సర్వే నిర్వహించింది. 70 శాతం మంది మళ్లీ తాబేలే గెలుస్తుందని చెప్పారు. 20 శాతం మంది ఈసారి కుందేలు గెలుస్తుందని చెప్పారు. 10 శాతం మాత్రం ‘ఎవరి చేతిలో ఏముంది? అంతా దైవాధీనం’ అన్నారు.‘కుందేలు తెలుపు... కుందేలుదే గెలుపు’ అని కుందేళ్లు ప్రచారం ప్రారంభించాయి. ‘తాబేలుకు ఉంది డిప్ప.... కుందేలు చేతిలో చిప్ప’ అని తాబేళ్లు  ప్రచారం మొదలెట్టాయి.  పరుగుపందెం జరిగే రోజు రానే వచ్చింది. సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ నుంచి పరుగు పందెం మొదలైంది. పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు  ఎవరు ముందుగా చేరుకుంటే వారే విజేత. తాబేలు ఎప్పటిలాగే తన స్టయిల్లో మెల్లగా పరుగు మొదలు పెట్టింది. మరోవైపు కుందేలు మెరుపువేగంతో దూసుకుపోతుంది. ఆయాసం వచ్చి ఒక చోట ఆగింది కుందేలు. వెనక్కి తిరిగిచూసింది. తాబేలు జాడే లేదు. ఆకలి అయినట్లు అనిపించి అటు వైపు చూసింది. ‘ప్యారడైజ్‌ బిర్యానీ హౌస్‌’ కనిపించింది. కుందేలుకు నోరూరింది. ‘‘గడ్డి తినీ తినీ బోర్‌ కొడుతుంది. ఈరోజు బిర్యానీ  లాగించేద్దాం’’ అనుకుంటూ ఈల వేసుకుంటూ బిర్యానీ హౌస్‌కు వెళ్లింది. కొద్దిసేపటి తరువాత బయటికి వచ్చిన కుందేలు మళ్లీ పరుగందుకుంది. ‘హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌’ వరకు వచ్చిన కుందేలుకు నిద్ర ముంచుకొచ్చింది. ‘‘ఒక కునుకు తీసి వెళతాను. ఎనర్జీ వస్తుంది. ఆ తాబేలు వచ్చేదా చచ్చేదా!’’ అనుకుంటూ పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌లోని గడ్డిలో పడకేసింది కుందేలు.

సీన్‌ కట్‌ చేస్తే...తాబేలు పంజగుట్ట సర్కిల్‌ దాటింది. మరోవైపు కుందేలు జాడేలేదు.‘తార వెలుగుతుంది... తాబేలే గెలుస్తుంది’లాంటి  నినాదాలు పంజగుట్ట ఫ్లైఓవర్‌  అదిరేలా మారుమోగుతున్నాయి.ఇంకో అయిదారు అడుగులు వేస్తే....తాబేలే గెలుస్తుందనగా.... విల్లు నుంచి దూసుకొచ్చిన బాణంలా తాబేలు  వెనక నుంచి దూసుకు వచ్చి పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ముందు నిల్చొంది కుందేలు. అందరూ షాక్‌ అయ్యారు. ‘కుందేలు గెలిచింది...చరిత్రను తిరగ రాసింది’  నినాదం  మిన్నంటింది.‘‘మీరు గెలుస్తారని ఎవరూ   ఊహించలేదు. మీరు ఎక్కడో గుర్రు పెట్టి నిద్రపోయుంటారని  అందరూ అనుకున్నారు.  మీ విజయరహస్యం ఏమిటి?’’ మైక్‌లు కుందేలు మూతి ముందు పెట్టి అడిగింది మీడియా.‘‘నేను మ్యాథ్స్‌ స్టూడెంట్‌ను కావడం బాగా కలిసొచ్చింది. నేను గుర్రు పెట్టి నిద్ర పోయిన మాట వాస్తవమేగానీ... తగిన జాగ్రత్తలు తీసుకొని మరీ నిద్ర పోయాను. తాబేలు సగటు వేగం ఎంతో నాకు తెలుసు. అది క్లాక్‌ టవర్‌ నుంచి పబ్లిక్‌స్కూల్‌ వరకు రావడానికి ఎంత సమయం పడుతుందో క్యాలిక్‌లేట్‌ చేసుకొని ఆ సమయానికి నా సెల్‌ఫోన్‌లో అలారం సెట్‌  చేశాను. నా అంచనా తప్పలేదు. తాబేలు పబ్లిక్‌ స్కూల్‌ దగ్గరకు రాగానే  అలారం మోగింది. నిద్ర లేచాను. తాబేలును ఫాలో అయ్యాను. తాబేలు గతాన్ని నమ్ముకుంది. నేను టెక్నాలజీని నమ్ముకున్నాను’’ అసలు విషయం చెప్పింది కుందేలు.

రెండు రోజుల తరువాత...‘‘ఏం నత్తబావా... బొత్తిగా కనిపించడం లేదు’’ ఒక ఇరానీ చాయ్‌ హోటల్‌ దగ్గర కనిపించిన నత్తను అడిగింది తాబేలు.‘‘నత్తారింటికి దారేది!æ... అనే సినిమాలో లీడ్‌ రోల్‌ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉన్నానులే. అది సరేగానీ, పరుగు పందెంలో చిత్తుగా ఓడిపోయావట కదా! నాతో పందెం కాసే దమ్ముందా?’’ అని సవాలు విసిరింది నత్త.‘‘చివరికి నీకు కూడా లోకువైపోయానా! నీతో పందేనికి నేను రెడీ’’ అని సవాలు స్వీకరించింది తాబేలు. మరుసటి రోజు...సేమ్‌ ప్లేస్‌.... క్లాక్‌ టవర్‌ నుంచి పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ వరకు.తాబేలు వీరకసితో పరుగు మొదలు పెట్టింది. నత్త తన స్టయిల్లోనే అతి మెల్లగా  పరుగు మొదలుపెట్టింది.బేగంపేట పోలీస్‌స్టేషన్‌  వరకు వచ్చిన తాబేలు వెనక్కి తిరిగిచూసింది. నత్త జాడే లేదు. ఉత్సాహంతో మరింత వేగంగా పరుగందుకుంది.  కొద్దిసేపటి తరువాత పంజగుట్ట సర్కిల్‌ దగ్గరకు రానే వచ్చింది.పెద్ద షాక్‌! అప్పటికే పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ముందు నిల్చొని విక్టరీ సింబల్‌ చూపిస్తోంది నత్త!!‘‘మీ విజయ రహస్యం ఏమిటి?’’ అంటూ మీడియా నత్త ముందు మైకులు పెట్టింది.‘‘విజయం అనేది నిజం. ఇక రహస్యం అనేది రహస్యంగానే ఉండాలి’’ అని లౌక్యంగా బదులిచ్చింది  నత్త. మరుసటిరోజు...నత్త మెడలో పూలమాల వేసి అభిమానులు విజయోత్సవ  ర్యాలీ నిర్వహించారు. అమీర్‌పేట దగ్గర....‘‘అవును బావా.... నువ్వు గెలవడం ఇప్పటికీ షాకింగ్‌గానే ఉంది. ఏంటి సీక్రెట్‌?!’’ అని నత్త చెవిని దగ్గరకు తీసుకొని అడిగింది బామ్మర్ది నత్త.‘‘ఏం లేదు బామ్మర్ది... విక్టరీ సింబల్‌ చూపింది నేను కాదు... నా తమ్ముడు పాపారాయుడు! అచ్చం నాలాగే ఉంటాడు. మేమిద్దరం ట్విన్స్‌. మా పోటీ మొదలు కావడానికి ముందే... పాపారాయుడు పంజగుట్టలో ఒక సందులో నక్కాడు. తాబేలు రావడానికి ముందు... పోలీస్‌స్టేషన్‌ ముందు నిల్చొని విక్టరీ సింబల్‌ చూపాడు. నాలాగే ఉంటాడు కాబట్టి.... అందరూ నేనే అనుకున్నారు. అదీ విషయం’’ అని తన విజయరహస్యం చెప్పింది బావ నత్త!
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement