వినాయకచవితి వస్తుందంటే లేదా వచ్చిందంటే బాగా గుర్తుకు వచ్చేది బడ బడ బడా...దబ దబ దబా!ఏ ప్రాంతంలోనైనా ఉందో లేక మా ప్రాంతంలో మాత్రమే ఉందో తెలియదుగానీ చవితి రోజు తిట్లు తింటే శుభం జరుగుతుందనే గట్టి నమ్మకం మా ఊళ్లో ఉండేది. ‘ఇంట్లో వాళ్లు, బంధువుల తిట్లు పనికిరావు. కేవలం బయటి వాళ్ల తిట్లే వర్కవుటవుతాయి’ అనేది కూడా మరో నమ్మకం.మా ఊళ్లో ముక్కోపి రావుగోపాలరావు అని అంతెత్తు మనిషి ఉండేవాడు. ఆయన అసలు పేరు గోపాలు. విలన్‌లా ఉంటాడని, కంచుకంఠం ఆయన సొంతంఅని కావచ్చు....గోపాలును అందరూ రావుగోపాల్‌రావు అని పిలుచుకునేవాళ్లు.వినాయకచవితి రోజు ఈ రావుగోపాల్‌రావు(రా.గో)కు బాగా గిరాకీ ఉండేది.ఏ కారణం లేకుండానే కోపం తెచ్చుకునే రావుగోపాల్‌రావుకి ఆరోజు కావాలని చిరాకో, కోపమో తెప్పించేవారు ఊరి జనాలు. అవి ఎలా ఉండేవంటే....ఒకడు రా.గోని చూసి వెటకారంగా నవ్వేవాడు.మరొకడు ఆయన ముందే ఆయన గొంతును అనుకరించి వెక్కిరించేవాడు.ఇంకొకడు... ఆయన లాల్చి లాగి దూరంగా పరుగెత్తేవాడు.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో! తిట్టి తిట్టీ ఆయన అలిసిపోయేవాడే తప్ప, ఆయన్ని కవ్వించి తిట్లు తినాలనుకునే కస్టమర్లకు మాత్రం ఆరోజు కొరత ఉండేది కాదు.
ఇక ఇలా కాదు అనుకొని పండుగవస్తే చాలు ఏ చుట్టాల ఇంటికో, స్నేహితుల ఇంటికో వెళ్లి నోరు దాచుకునేవాడు రా.గో ‘‘ఎన్ని పండుగలకని ఇలా పారిపోతావు? ఏదో పరిష్కారం ఆలోచించు’’ అని చుట్ట వెలిగించాడు ఆయన ఆత్మీయుడు ఆముదం. ఈయన అసలు పేరు ఇది కాదు. ముఖం ఎప్పుడూ జిడ్డోడుతుందని ముద్దుగా ఆముదం అని పిలుచుకుంటారు జనాలు.‘‘ఏంజేయమంటావురా ఆముదం? ఈ పండుగ నా సావు కొచ్చింది’’ అని చుట్ట వెలిగించాడు రా.గోఅప్పుడు ఆముదం ఆయన చెవిలో ఏదో ఊదాడు.రా.గో ముఖం చిచ్చుబుడ్డి కంటే పవర్‌ఫుల్‌గా వెలిగిపోయింది!ఆరోజు వినాయకచవితి.కొత్త దుస్తులు ధరించి పాత వీధుల వెంట నడవసాగాడు రా.గో‘‘మనిషికో మాట.... నీకో దెబ్బ’’ అన్నాడు ఎదురుగా వస్తున్నవాడు పళ్లు ఇకిలిస్తు!సర్రుమని కాలింది రా.గోకు!అయినా సరే కూల్‌గా నవ్వాడు. అంతే కాదు తనను తిట్టిన వాడికి నమస్కారం పెట్టాడు. రా.గోలో ఊహించని ఈ సంస్కారానికి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అదిరిపడ్డాడు తిట్టినోడు!రా.గో సరిగ్గా సర్కారు బావి దగ్గరకు వచ్చాడో లేదో.... న్యూస్‌పేపర్‌ను ఉండలా చుట్టి ముఖం మీదికి బాల్‌లా విసిరాడు ఒకడు. అయినా సరే... కూల్‌గా నవ్వాడు రా.గో.
స్పీడ్‌గా నడవడం రా.గో అలవాటు. నడుస్తున్న దారిలో ఎవరో అరటి తొక్క విసిరారు. అది తొక్కి భారీ శబ్దంతో కిందపడిపోయాడు రా.గో. అయినా సరే ఓపికగా లేచాడే తప్ప ఎవరినీ తిట్టిన పాపాన పోలేదు.... ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరిగినా తనలో ‘కూల్’ని హీట్ కానివ్వలేదు రా.గో. దీంతో కవ్వింపు కస్టమర్లు తగ్గారు.‘అబ్బే! ఈయన్ను నమ్ముకొని లాభం లేదు’ అనుకునే పరిస్థితి వచ్చింది.చవితి రోజు తిట్లు తినడానికి ఉపయోగించే టెక్నిక్‌లలో రా.గో టెక్నిక్ కంటే పాపులర్ టెక్నిక్ ఒకటి ఉంది. అదే ‘బడ బడ బడా... దబ దబ దబా’ టెక్నిక్. దీనిలో భాగంగా ఇంటి మీద రాళ్లు వేస్తారు. తద్వారా ఆ ఇంటి వాళ్ల నుంచి తాజా తిట్లు తింటారు.ఆరోజుల్లో డాబా ఇండ్ల కంటే పెంకుటిళ్లు, రేకుల ఇండ్లే ఎక్కువ కదా.అర్ధరాత్రి తరువాత... బడ బడ బడా దబదబదబామని శబ్దాలు వినిపించేవి. ఇరుగింటి వాడు పొరుగింటి వాడి రేకుల ఇల్లు మీద విధిగా నాలుగు రాళ్లు వేసేవాడు. ఆ సమయంలో ఆసియా ఖండంలోనే అరుదైన తిట్లు వినిపించేవి. ఆ తిట్ల ధాటికి ఎంతోమందికి నిద్ర కరువయ్యేది. ఒకవైపు తిట్ల వర్షం... మరోవైపు పిడుగు శబ్దాల్లాంటి రాళ్ల చప్పుళ్లతో చవితి రాత్రి కాస్తా శివరాత్రి అయ్యేది!కొందరు మాత్రం ‘తిట్లఫలం’ దుండగులకు దక్కవద్దు అనే కారణంతో తమ ఇంటి మీద ఎన్ని రాళ్లు విసిరినా చిన్న తిటై్టనా తిట్టే వాళ్లు కాదు. అలాంటి వాళ్లలో లింగయ్య ఒకడు. ఆయనది రేకుల ఇల్లు. ఆయన ఇంటి మీద ఎవరైనా రాళ్లు విసిరితే...‘‘మీరు రాళ్లు కాదు...గుట్టలేసినా తిట్టను’’ అని గట్టిగా అరిచి ఇంట్లోకి వెళ్లి మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. ఇప్పుడు మీకు ఒక దొంగోడి గురించి చెబుతాను.‘శివరాత్రి రోజు దొంగతనం చేయవద్దు’ అనేది జూనియర్ దొంగలకు సీనియర్లు ఇచ్చే సీరియస్ సలహా. కానీ ‘చవితి రోజు దొంగతనం చేయవద్దు’ అంటూ ఎలాంటి రూల్ లేకపోవడంతో ఒక అప్రెంటీస్ దొంగ చవితిరోజు మా ఊళ్లో దొంగతనానికి వచ్చాడు. తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఈ దొంగ అర్ధరాత్రి దాటిన తరువాత ఒక పెంకుటిల్లు ఎక్కాడు. ఈ ఇంటి పక్కనే ఒక రేకుల ఇల్లు ఉంది. ఆ టైమ్‌లోనే ఎవడో రేకుల ఇంటి మీదికి ఒక రాయి విసిరాడు. ఆ రాయి దొంగను ‘హాయ్’ అని పలకరించి వెళ్లింది తప్ప పెద్దగా గాయపరచలేదు.
ఇక రెండోసారి దూసుకువచ్చిన పెద్ద రాయి మాత్రం దొంగ హెడ్‌ను ఆప్యాయంగా ముద్దాడింది. అంతే...‘వామ్మో!!!’ అని ఊరు నిద్రలేచేలా అరిచాడు దొంగోడు.చుట్టుపక్కల వాళ్లందరూ పరుగెత్తుకు వచ్చారు. వాడిని కిందికి దించారు.‘‘ఇల్లు ఎందుకు ఎక్కావురా?’’ అని అడిగాడు ఒకడు.‘‘దూడగడ్డి కోసం ఎక్కి ఉంటాడు’’ అన్నాడు పక్కోడు.నవ్వులే నవ్వులు!‘‘ముందు నీ పేరేమిటో చెప్పు’’ అని ఆ అమాయకపు దొంగ కళ్లలోకి భయంకరంగా చూస్తూ అడిగాడు కాస్త దిట్టంగా ఉన్నవాడు.‘‘నా పేరు...నా పేరు...’’ అని భయంభయంగా దొంగ తడబడుతుంటే వెనక నుంచి ఎవడో ‘దొంగ’ అని అరిచాడు.మళ్లీ నవ్వులే నవ్వులు!!మామూలుగానైతే పెద్ద దొంగ, చిన్న దొంగ, ఒక మోస్తరు దొంగ, తేలికపాటి దొంగ... అనే తేడా లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు దొరికితేచాలు దొంగను కుమ్మేస్తారు. ఎముకల్లో నుంచి సున్నం తీసి మరుసటి రోజు రథం ముగ్గు వేస్తారు. పండుగపూట హింస ఎందుకు అనుకున్నారో ఏమో.... దొంగోడి ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు. పైగా వాడి చేతిలో ఉండ్రాళ్ల సంచి పెట్టి మరీ ఊరు దాటించారు. ఏ దొంగకు పడుతుంది ఇంత అదృష్టం!
– యాకుబ్ పాషా
బడ బడ బడా దబ దబ దబా
Published Sun, Sep 9 2018 12:02 AM | Last Updated on Sun, Sep 9 2018 12:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment