గబగబా అడుగులేసుకుంటూ తన గుడిసె దగ్గరకొచ్చింది లక్ష్మమ్మ. చేతిలోని గిన్నెలో ఆమె పాచిపని చేసే యాజమానురాళ్ళు ఇచ్చిన అన్నం కూరలు, వస్తూ వస్తూ కొని కొంగులో దాచిన మొక్కజొన్న పొత్తు ఉన్నాయి. బయట ఆమె ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. తల్లిని చూడగానే, ‘‘అమ్మా! ఆకలే...’’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. తల్లడిల్లిపోయింది. ఆమె తల్లిమనసు. కొంగులో ఉన్న కాల్చిన మొక్కజొన్న పొత్తును రెండుగా తుంపి చెరొక ముక్కా ఇచ్చింది. ‘‘అమ్మా! అన్నం పెట్టవే బాగా ఆకలేస్తోంది’’ అన్నారు పిల్లలు జాలిగా. గబాలున ఇద్దర్ని గుండెల్లో పొదువుకుంది ఆర్తిగా. ‘‘రండిరా పెడతాను’’ అంటూ గుడిసెలోకి దారితీసిందామె. లోపలికెళ్ళి రెండు బొచ్చెల్లో అన్నం పెట్టి కూరలేసింది. ఇద్దరు పిల్లలు ఆ చద్దన్నాన్నే ఆవురావురంటూ తిని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. పిల్లలకింత ఉడుకుడుకుగా రోజూ అన్నం కూరలు వండిపెట్టాలనుంటుంది లక్షమ్మకి. పొద్దున్నే ఆరింటికల్లా పాచిపనికెళ్ళాలి. నాలుగు గంటలకి నిద్రలేచి పొయ్యంటించి మండని కట్టెలను ఊదుకుంటూ తాను కాసిని టీనీళ్ళు పెట్టుకుతాగి వంటచేసేసరికి ఆరుదాటి పోతుంది. పనికి ఆలస్యంగా వెళితే కేకలేస్తారు ఆమె యజమానురాళ్ళు. ఆరేడిళ్ళలో అంట్లు, బట్టలు, ఇల్లు తుడవటం, వాకిలి ముగ్గేయటం, మెట్లు చిమ్మటం చేస్తుంది లక్షమ్మ. పొద్దున్నే ఆరింటికి బయలు దేరితే అందరిళ్ళల్లో పని చేసి ఇంటికొచ్చేసరికి దగ్గరదగ్గర ఒంటిగంట దాటుతుంది. దాదాపు రోజూ ఒక ఇంట్లో కాకపోతే మరో ఇంట్లో ఎవరోఒకరు అన్నం కూరలు ఆమెకు తినమని ఇస్తారు. ఆమె అక్కడ తినకుండా గిన్నెలో ఇంటికి పట్టుకొచ్చి పిల్లలకి పెట్టి మిగిలింది తను తింటుంది. పనులతో అలసిన శరీరంతో తనింటి పని చేసుకునే సరికి నాలుగౌతుంది. మళ్ళీ సాయంత్రం అంట్లు తోమడానికెళ్ళి ఇంటికొచ్చేసరికి ఏడు. ఇంత ఉడకేసి పిల్లలకు పెట్టి తాను తినేసరికి పదిదాటుతుంది. వళ్ళు హూనమై అలసిన ఆమె శరీరం ఓ కునుకు తీసి లేచేసరికి మళ్ళీ తెల్లారుతుంది.రాత్రి మిగిలిన గుప్పెడన్నాన్ని కంచాల్లో పెట్టి పిల్లలను లేపి తినమని చెప్పి పనికెళ్ళిపోతుంది.
లక్ష్మమ్మ ఇద్దరు పిల్లల్లో పెద్దపిల్ల పన్నెండేళ్ళది. సరైన పోషణ లేకపోయినా ఎదిగే వయసు కాబట్టి పిల్ల ఈడేరటానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. పిల్లాడు తొమ్మిదేళ్ళవాడు. లక్ష్మమ్మ భర్త యాదగిరి తాపీపని చేసేవాడు. పెళ్ళాం బిడ్డలని చక్కగా చూసుకునేవాడు. నాలుగేళ్ళ క్రితం ఒకరోజు పెద్ద బిల్డింగ్‌పై పనిచేస్తూ పొరపాటున జారిపోయి కిందపడి చనిపోయాడు. అప్పటి వరకూ ఇంట్లో ఉండి గుట్టు చప్పుడు కాకుండా సంసారాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మమ్మ ఇల్లు గడవటానికి, పిల్లల్ని పోషించటానికి పాచిపని చేయటం మొదలు పెట్టింది. వీధిబడిలో చదువుకుంటున్న పిల్లలకు పుస్తకాలు కొనడం కష్టమైపోతోంది ఆమెకు. ఆమెకు వచ్చే జీతం ఇంటి కిరాయి, వెచ్చాలు, పొయ్యిలోకి కట్టెలకే సరిపోక అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక పిల్లలకు ఏ జ్వరమో వస్తే మందుమాకో కొనాలంటే అప్పుచేయాల్సిందే. పిల్లలకు గుడ్డముక్క కొనాలన్నా భారమే లక్షమ్మకు. కూడబెట్టి దాచుకుందామనుకున్నా పదో పరకో తప్ప మిగలవు. దసరా సెలవులిచ్చారు పిల్లలకు. పండక్కి పిల్లలకు కొత్త బట్టలు కొనాలని ఆశ లక్ష్మమ్మకు.యజమానురాళ్ళు ఇచ్చిన పాతచీరలే తను కట్టుకుంటుంది. వాళ్ళ పిల్లల పాత బట్టలే లూజైనా బిగుతైనా ఆమె పిల్లలకు. భర్త బతికున్నప్పుడు ప్రతి దసరాకి పిల్లలకి కొత్తబట్టలు, లక్ష్మమ్మకు కొత్తచీర తెచ్చేవాడు. పండుగరోజున గారెలు, పాయసం వండమనేవాడు. లక్ష్మమ్మను, పిల్లలను గుడికి తీసుకెళ్ళి అట్నించటే సినిమాకు తీసుకెళ్ళేవాడు. భర్తతో పాటే అన్ని సంతోషాలు దూరమయ్యాయి లక్ష్మమ్మకు.ఆరోజు ఈదురు గాలితో కూడిన వాన బాగా పడుతోంది. లక్ష్మమ్మ ఆ వానలో పనికి వెళ్ళలేకపోయింది. గుడిసె పై కప్పునుండి రెండుమూడు చోట్ల నుండీ చినుకులు కారుతున్నాయి. కారేచోట సత్తు గిన్నెలు పెట్టి నిండగానే పారబోస్తోంది. పిల్లలిద్దరూ తడవని జాగాలో చాపేసుకు కూర్చున్నారు. రాత్రి ఉన్న బియ్యం కాస్తా వండేసింది. చాలీచాలని అన్నాన్నే తిన్నారు పిల్లలు. లక్ష్మమ్మ మంచినీళ్ళు తాగి పడుకుంది.పొద్దుటి నుండీ టీనీళ్ళు కూడా తాగక కడుపు నకనకలాడుతోంది లక్ష్మమ్మకు. పనికి పోయుంటే ఏ తల్లినన్నా అడిగి డబ్బులు తీసుకుని కాసిని బియ్యం కొనుక్కొచ్చేదే. ఇంట్లో ఉన్న డబ్బాలన్నీ వెతికింది. ఒక డబ్బాలో కాస్త పిండి ఉంది. రెండురోజుల కిందట ఒకమ్మ చాలా రోజులైందని, నిల్వ ఉందని, బావుంటే ఉపయోగించుకోమని లేదంటే పడేయమని ఇచ్చిన పిండి అది. అది తెచ్చి జల్లించి డబ్బాలో పోసింది.ఇంత జావ కాచుకుంటే ఓ పూటైనా గడుస్తుందని.
పొయ్యి రాజేసింది. కట్టెపుల్లలు సరిగా మండక వచ్చే పొగతో కళ్ళుమండుతున్నాయి లక్ష్మమ్మకు. పొయ్యి మీద ఓ గిన్నెతో నీళ్ళు పెట్టింది. పిల్లలు ఆకలితో ఆ చాపమీద పడి అలాగే నిద్ర పోతున్నారు. చిరిగిన దుప్పటొకటి కప్పింది. బాగా చలిగాలి కొడుతోంది. వాన తగ్గేట్టు లేదు. ప్చ్. ఎప్పుడు తగ్గుతుందో అనుకుంది. కాసేపటికి నెమ్మదిగా కట్టెలు అంటుకొని నీళ్ళు కాగాయి. మరుగుతున్న నీళ్ళలో పిండివేస్తూ గరిటెతో జారుడుగా తిప్పింది. కాస్తంత ఉప్పు వేసి కలిపి ఒకగ్లాసులో పోసుకొని ఊదుకుంటూ తాగసాగింది. వేడివేడిగా గొంతు జారుతుంటే ప్రాణం లేచొచ్చినట్లయ్యింది లక్ష్మమ్మకు. సరుకులన్నీ నిండుకున్నాయి. ఏ పూటకాపూట గడవటం కష్టంగా ఉంది. పనికిపోతే పచ్చడి మెతుకులన్నా దొరుకుతాయి. ముసురులా పట్టుకున్న వాన తగ్గేట్టు లేదు. ఆలోచిస్తూ తలుపుతీసి చూసింది. వర్షం ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టు విజృంభించి కురుస్తోంది. వీచిన చలిగాలికి కొంగు కప్పుకుంటూ లోపలికొచ్చింది లక్ష్మమ్మ. ఇంతలో పిల్ల లేచింది కడుపు నొప్పంటూ బయటకు వెళ్ళాలని. దుప్పటిని నెత్తినేసుకొని తలుపు తీసుకెళ్ళింది. లక్ష్మమ్మ పిల్లాడిని కూడా లేపి పొయ్యి మీద పిండి జావ పెట్టి కట్టెలను ఊదుతోంది. బయటకెళ్ళిన పిల్ల ఏడుస్తూ వచ్చింది. ఎందుకని అడిగితే లంగాకంటిన నెత్తురు మరకలను చూపించింది. హతాశురాలైపోయింది లక్ష్మమ్మ. ఒక్కక్షణం నోట మాట రాలేదామెకు.విషయం గ్రహించిన ఆమె హృదయం ద్రవించింది.
వెంటనే పాత బొంతొకటి పొడిగా ఉన్న చోట పరిచింది. పిల్లకు మరొక లంగా ఇచ్చి కట్టుకోమంది. తన పాత చీరను వోణీలా చింపి పిల్లకు పైటలా వేసింది. అమాయకంగా చూస్తున్న పిల్లకు ధైర్యం చెప్పింది.డబ్బాలో ఉన్న చిన్న బెల్లం ముక్కను తీసి చప్పరించమంటూ పిల్లకిచ్చింది. గ్లాసులో జావ పోసిచ్చి తాగమంది.దేవుడా! ఏమిటీ పరిస్థితి. ఇప్పుడేం చేయాలి. బయట హోరున గాలి వర్షం. ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. తను పనికెళ్తే యజమానురాళ్ళకు విషయం చెప్పి కొంత పైకం అడగొచ్చు. బియ్యం కొనుక్కోవచ్చు. కొత్తబట్టలు కొనొచ్చు. ఈడేరిన కూతురికి పాయసం చేసి పెట్టాలి. కొబ్బరి, కొత్త బెల్లం, నువ్వులు కలిపి చిమ్మిరుండలు పెట్టాలి. ఉడుకుడుకుగా వేడన్నం పాలు పోసి పెట్టాలి. భర్త బతికుంటే ఎంత సంబరంగా వేడుక జరిపించే వాడో! అసలు దేవుడు తనలాంటి వారినెందుకు ఇన్ని కష్టాలు పెడతాడో. పిల్లల కోసమే బతుకుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటోంది తను. పేదవారినసలు పుట్టించకు దేవుడా!వానతగ్గే సూచనలేవీ కనిపించటం లేదు. అంతకంతకు ఎక్కువౌతూ కురుస్తూనే ఉంది. రోడ్లు నిండి చెరువులయ్యాయి. బయటకెళ్ళే మార్గం కనిపించటం లేదు. రోడ్లమీద నీళ్ళన్నీ పల్లంగా ఉన్న లోపల గుడిసెలోపలికి వచ్చేశాయి. కూర్చోటానికి, నించోటానికి కూడా చోటు లేకుండా పోయింది. గుడిసె లోపలున్న పొయ్యిలోని కట్టెలు నీళ్ళలో తడిశాయి. చలి ఎక్కువౌతోంది.క్రమంగా చీకటి ఆవరిస్తోంది. పెద్ద తుఫాను లక్ష్మమ్మ పూరిగుడిసెని నేలమట్టం చేయడానికి వికృతంగా తన బలాన్ని చూపుతోంది.మరింత ఉదృతమయ్యాయి వాన, గాలి. బహుశా తుపాను తీరం దాటుతోందేమో.తిండి తిప్పలు సంగతి దేవుడెరుగు! బతికితే చాలు. ఈరాత్రి గడిస్తే చాలు తెల్లారితే వర్షం తగ్గుతుంది. ఎలాగోలా తను పనికి వెళుతుంది. అమ్మగార్లనడిగి ఏదో ఒకటి కచ్చితంగా తేవొచ్చు. తను ఇంకా ఓ రెండు మూడు ఇళ్ళలో పనికి ఒప్పుకోవాలి. తప్పదు. పిల్ల ఎదిగింది. ఇలా సాగుతున్నాయి లక్ష్మమ్మ ఆలోచనలు.తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది. పిచ్చితల్లి లక్ష్మమ్మ ఆశలను నెరవేర్చనంది వికృతమైన తుపాను. కుప్పగా కూలింది ఒక్కసారిగా గుడిసె. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఆ జోరు వానలో, హోరు గాలిలో ఆ పిచ్చితల్లి పిల్లల హృదయ విదారకర ఆర్తనాదాలు. గుడిసె పై కప్పు ఆకులన్నీ లేచిపోయాయి. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది.రెండు పసిప్రాణాలను బలి తీసుకున్న తుపాను లక్ష్మమ్మను మాత్రం జీవచ్ఛవంగా బతకమంటూ వదిలేసింది. తెల్లవారాక కొన ఊపిరితో ఉన్న లక్ష్మమ్మను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా వారం రోజులకు కోలుకుంది. ఆసుపత్రిలో మగతలో నా పిల్లలేరని కలవరిస్తూనే ఉందా పిచ్చితల్లి.‘‘నా పిల్ల ఈడేరింది. ఇంత పాయసం చేయాలి. చిమ్మిరుండలు పెట్టాలి. కొత్త బట్టలు కొనాలి.’’‘‘ఏదీ వాన తగ్గిందా! ఛీ పాడు వర్షం. పనికి పోనీకుండా. రండిరా అన్నం పెడతాను.’’‘‘ఇదిగోండి ఈ మొక్కజొన్న పొత్తు తినండి.’’పిచ్చి దానిలా అంటూ ఉంటుంది. ఒంటరిగా కూర్చుని శూన్యంలోకి చూస్తుంటుంది. ఎవరైనా జాలిపడి ఏదైనా ఇస్తే తింటుంది. ఆడుకోవడానికి వెళ్ళిన తన పిల్లలొస్తారని ఎప్పుడూ ఎదురుచూస్తూ కూర్చుంటుందా పిచ్చితల్లి.
హంసగీతి
పిచ్చితల్లి
Published Sun, Sep 2 2018 12:40 AM | Last Updated on Sun, Sep 2 2018 12:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment