నా చందమామ  | Funday new story special | Sakshi
Sakshi News home page

నా చందమామ 

Published Sun, Sep 9 2018 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Funday new story special - Sakshi

ఖాళీగా ఉన్న ఆ రోడ్ల మీద డాడీతో చేతిలో చెయ్యేసి కబుర్లు చెప్తూ నడిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఆ చందమామని చూస్తే అంత అందమైనది కదా, అబ్బాయా అమ్మాయా అని ఆలోచిస్తుంటా. అబ్బాయి అయితే బాగుండు అని చిన్న ఫీల్‌. కానీ అమ్మాయిలని పోల్చుతామే చందమామతో! ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. చందమామ లోపల ఒక ముసలావిడ ఉంటుందని మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది. నిజంగా ఉంటుందా! ఉంటే ఎంత లక్కీనో కదా!ఆ ముసలావిడ ఆ చందమామని చూసి ప్రేమలో పడి, అక్కడకు వెళ్లి కూర్చుందా! ఎందుకు అతనికి అంత ఈగో! పాపం ఆమె ప్రేమని యాక్సెప్ట్‌ చెయ్యొచ్చు కదా. ఎంత దూరం నుంచి వచ్చిందో. యంగ్‌ ఏజ్‌లో వచ్చిందేమో ముసల్ది. ఏమో నాకు తెలీకుండానే వాళ్లిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారేమో! ఆమె వల్లే అతను అప్పుడప్పుడు తెగ ప్రకాశిస్తాడేమో. తన వాడితో ప్రతి అమ్మాయీ ప్రేమలో పడిపోతోందని ఆమె బుంగ మూతి పెడితే సర్ది చెప్పడానికి అందరినీ వదిలేసి దాక్కుంటున్నాడేమో అప్పుడప్పుడు. అవును! ఒకవేళ చందమామ కూడా ముసలివాడే అయితే? ఏం పర్లేదు. జెమిని గణేశనే 70 ఏళ్ల వయసులో 35 ఏళ్ల అమ్మాయిని ఫ్లైట్‌ జర్నీ అయిపోయేలోపు పడేశాడు. పైగా ఆ అమ్మాయే ప్రపోజ్‌ చేసిందంట. ప్రేమ గుడ్డిది అని ఇందుకే అంటారేమో! ప్రేమకి వయసుతో సంబంధం లేదు.
 
రాత్రిపూట ఇంత చక్కటి వెలుగినిస్తాడు నా చందమామ. ఎంత మంది మనసులు దోచుకున్నాడు. గొప్పవాడేగా మరి! ‘అవునూ! నీకేమనిపిస్తుంది చందమామని చూస్తే? తప్పకుండా జలస్‌ ఫీల్‌ అవుతావు! అబ్బాయిలందరూ అలాగే ఫీలవుతారులే. అందుకే అమ్మాయితో పోల్చేసుకొని సాటిస్‌ఫై అవుతారు. మరి అందమైన అబ్బాయిని ఎవరితో పోల్చాలని ఆలోచిస్తా. సూర్యుడు గుర్తొస్తాడు. అమ్మో! ఎప్పుడూనిప్పులు కక్కుతాడు. అతనలా ఎప్పుడూ ఎందుకు నిప్పులు కక్కుతాడో తెల్సా, అతనూ అబ్బాయేగా. సూర్యుడి మీద జలసీ’. ఒక్కోసారి అనిపిస్తుంది.... ఆ చందమామ నాతో వచ్చేయవచ్చు కదా అని. మళ్లీ ఆ వెంటనే నాకంటే ముందు ఎంతమంది ఎన్ని యుగాలనుంచి ఎదురుచూస్తున్నారో కదా అనిపిస్తుంది. కానీ ఎందుకో నేను తనని ఇప్పటికే చూశాననిపిస్తోంది. నిజం. ఆ చందమామ నా కంటబడ్డాడు. నేను చూశాను. నాకు మాత్రమే కనిపించాడు. ఎందుకంటావ్‌? మేబీ అందరికంటే నేనే అతన్ని ఎక్కువ ప్రేమిస్తున్నానేమో. నేను చందమామని చూసినరోజు చాలాసేపు ఆ నవ్వునే చూస్తూ, తనేనా కాదా అని ఆలోచిస్తూ ఉన్నా. సరిగ్గా కుదురుగా నిలబడి చూశా. తనే. తనే నేను రోజూ చూసి ఇష్టపడే చందమామ. ఏమని మాట్లాడాలి తనతో! అసలే సిగ్గుతో మురిసిపోతున్న నాకు చటుక్కున ఒక ఐడియా వచ్చింది. అది తన పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తే బాగుంటుందని. అదే తనతో నేను మాట్లాడిన మొదటిమాట. థ్యాంక్స్‌ చెప్పి వెళ్లిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి? తన పేరేంటో తెలీదు.చందమామ అని పిలిస్తే ఎలా ఉంటుంది? చుట్టూ లోకం ఏమనుకుంటుందో! వద్దు. పేరు కనుక్కొనే పిలుస్తా. అనుకున్న వెంటనే పక్కన ఉన్న కుర్రాడిని అడిగా. పేరు చెప్పాడు ఆ పిల్లాడు.  పేరు వినగానే ఏదో ఫీల్‌ లోపల. ప్రేమే అయి ఉంటుంది కచ్చితంగా. కానీ ఎందుకు అంత టెక్కు చందమామకి?  అలా వెళ్లిపోయాడు. 

తప్పులేదు. అసలే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ కదా. మరి నాకేం తక్కువ? కనీసం తిరిగి చూడలేదు. పోనీలే! సిగ్గేమో. నేను ఎలాగూ మగాడిలా బిహేవ్‌ చేశానని భయపడ్డాడు కావొచ్చు. ఈసారి తన దృష్టిలో పడి ఎలా అయినా మార్కులు కొట్టేయాలని ఆతృత నాలో రోజురోజుకీ చాలా పెరిగిపోతోంది. నన్ను ఇంతకుముందు చూసి ఉంటాడా! కచ్చితంగా చూసే ఉంటాడు. అసలే బాగా వినిపించే పేరు నాది. అలా రెండు వారాలు గడిచాయి. ఇక లాభం లేదు. నేనే మొదలెట్టాలి అనుకున్నా. మొదలుపెట్టేశా మాట్లాడటం.  అబ్బాయిలే పడిపోవాలి అమ్మాయిలని చూసి, అబ్బాయిలే ముందు మాట్లాడాలి అన్న యుగయుగాలుగా వస్తున్న ఆచారాన్ని బద్దలు కొట్టా. అసలే అక్కడ చందమామ. ఎలా పడిపోకుండా ఉంటా! గొప్పోడు కదా. తనకి ఎవరో చెప్పారంట ఒకమ్మాయి తనను ఇష్టపడుతోందని. ఆ అమ్మాయే ఇప్పుడు మాట్లాడుతోందంటే ఏమనుకున్నాడో ఏంటో. నాకేమో భయంగా ఉంది కానీ తను చాలా బాగా మాట్లాడాడు. అస్సలు ఊహించలేదు. నా చందమామతోనేనా నేను మాట్లాడింది అని గిల్లి చూసుకున్నా కూడా. రక్తమొచ్చే అంతలా గిల్లుకున్నా నమ్మకం కుదర్లేదు. మరి నేనెలా నమ్మేది? ఒక ఉపాయం తట్టింది. తనే నన్ను గిల్లితే నమ్ముతానేమో. అనుకున్నదే తడవుగా కలవాలని అడగటం మొదలుపెట్టా. ఏమనుకున్నాడో ఏమో ఒక రెండు రోజుల తర్వాత సరేనన్నాడు. నన్ను కరుణించాడనుకున్నా. ఎందుకో తెల్సా, ఆ ముసలావిడ కన్నా నేనే లక్కీ. నేను అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో ఆలోచనలో పడ్డాను. ఆ ముసలావిడ మళ్లీ మాట్లాడి నా చందమామను లాక్కొనిపోతే!?లక్కీగా ముహూర్తం పెట్టినట్టే పండగరోజు కలిశాం. ఆ రోజు తనని మళ్లీ చూసే అవకాశంలో ఉన్న ఆనందం కొన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా రాదేమో. అంతలా ప్రేమించా అతణ్ని. మా అమ్మమ్మ ట్రైనింగే ఇదంతా. ఆమె గోరుముద్దలు తినిపిస్తూ మరీ అతణ్ని చూడమనేది. ఆరుబయట పడుకున్నప్పుడు కూడా వదలడే ఈ అబ్బాయి. ఇంట్లో అందరూ కలిసి నన్ను అతని ప్రేమలోకి తోశారు.

ఆ రూపం ఇప్పుడు కళ్లముందు. ఎలా ఆపాలి సిగ్గును. పొంగి పొర్లుతోంది. పండగరోజు కదా, పైగా అమ్మాయిలు అంటేనే తెగ రెడీ అయిపోతారు. ఆ రోజేంటో మరీ మరీ బాగా రెడీ అయి మెరిసిపోయా. తనకోసం ఎదురుచూసిన ప్రతి సెకండ్లో ఎంత మురిసిపోయానో. రానే వచ్చాడు నా చందమామ. తనతో తన పక్కనే కూర్చున్నాను. ఏంటో మరి, రాజు పక్కన రాణి కూర్చున్నంతలా ఫీలయ్యా. నేను రాణి కాకపోయినా తను రాజే! అదే చిరునవ్వు. నన్ను తెగ కవ్వించేస్తోంది. బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. మళ్లీ కలుస్తాడో లేదో. తన ఇష్టాలు తెలుసుకోవాలన్న ఆత్రుత. తన జీవితంలో జరిగిందంతా ఒక్క మీటింగ్‌లో తెలుసుకోవాలనే పిచ్చి. ఇన్ని రోజులు పైన ఉండి ఆ ముసలావిడ కబుర్లు విని విని బోర్‌ కొట్టేసినట్టుంది. నా మాటలు బాగానే విన్నాడు. తెగ సంతోషమేసింది. వెళ్లిపోదామని ఎక్కడ అంటాడోనని ఒక భయం నన్ను కలచివేస్తోంది. దాన్ని నా చిరునవ్వుతో కప్పేశా. తనేం చెప్పాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా గురించి పూర్తిగా చెప్పేశా. ఎవరో అబ్బాయి చటుక్కున మా మాటల మధ్యలో దూరి, ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’’ అన్నాడు. అంతే! తన ముందు నన్నొకరు పొగిడారని ఆనందపడ్డాను. మార్కులు కొట్టేయాలిగా మరి! ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి తనతో చనువుగా మాట్లాడటం చూశా. అసూయ కలిగింది. సెకండ్లో నా చిన్ని బుర్రలో వేల ప్రశ్నలు వెలువడ్డాయి. ఆ అమ్మాయి తనకి ఎలా తెలుసు? అసలే చనువుగా మాట్లాడింది, ఏమో ఏంటో అనే ఆలోచన. ఎందుకంటే నా వాడు అని ఫిక్స్‌ అయిపోయా కదా, ఊహ తెలిసిన దగ్గర్నుంచి. అసలే నాకు మనసులో అనుకున్నది బయటకు చెప్పేవరకు నిద్రపట్టదు. అడిగేశాను. వాళ్ల పరిచయం పెద్దగా లేదని అర్థమైంది. ఊపిరి పీల్చుకున్నాను. ఎన్ని సంవత్సరాలైనా అక్కడే కూర్చుని కబుర్లు చెప్పాలనిపించింది. కానీ వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. అదేదో ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా అంట. జనాలు తెగ హుషారుగా ఉన్నారు చూడటానికి. చందమామకి కాల్‌ వచ్చింది. 

‘‘థియేటర్‌ వాడు టికెట్స్‌కి ఓకే చెప్పాడు, ఇక వెళ్లిపోవాలి’’ అన్నాడు నాతో. నన్ను కూడా తనతో తీసుకెళ్తే ఎంత బాగుండు అనుకున్నాను. కానీ అది ‘ఏ’ రేటెడ్‌ సినిమా. మామూలుగా సినిమాలో హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకుంటేనే నేను కళ్లు మూసుకుంటా. ఇక తన ఆ సినిమాకు వెళ్లాలా? ఆలోచిస్తున్నా. అప్పుడే నా కోతిమూక కూడా మెసేజ్‌ చేసింది, సినిమాకు వెళ్దాం అని. గంతులేశా తనను మళ్లీ చూడొచ్చని. పిచ్చి జనాలు చందమామను వదిలేసి ఎవర్నో చూడటానికి వెళ్తున్నారు. నేను మాత్రం తనని మరొకసారి చూడొచ్చని వెళ్దామనుకున్నా. కూర్చున్న చోటు నుండి బయటకు కదిలాం. ఆ రోజు తారీఖు 25. సరిగ్గా తనతో వేసిన అడుగులు 7. విచిత్రం 2+5=7. నా పిల్లతనానికి నవ్వొచ్చింది. నాలుగు గంటలు తనతో ఎలా గడిచాయో ఏంటో కానీ తనతో నడిచిన ఆ కొన్ని క్షణాలు నాలో ఒక నమ్మకాన్ని పెంచాయి. గబగబా వెళ్లి పొద్దున నుండి ఒంటి మీద వేసుకున్న బరువుని తీసేసి ఎప్పట్లాగే మగరాయుడిలా తయారై బయలుదేరా. సినిమా హాల్‌ లోపలికి వెళ్లగానే ఆ అబ్బాయే కనిపించాడు. నా చందమామ. అతని వెనక రెండో వరుసలో నా సీట్‌.  సినిమా స్టార్టయింది. 

హీరో బాగున్నాడు కానీ ముందు కూర్చున్న నా చందమామ నుండి స్క్రీన్‌ మీదకు నా కళ్లు పోలేదు. తన వీపుకి నా చూపులు గుచ్చుకున్నాయో లేదో తెలియదు కానీ సినిమా అయిపోయేంతవరకు నా చూపులు తన వైపే! పక్కనే ఉన్న స్నేహితులు ఏమనుకుంటారో అని ఒక్కోసారి స్క్రీన్‌ వైపు కూడా చూశాను. వాళ్లు నవ్వుతున్నప్పుడు అర్థం కాకపోయినా నేను కూడా నవ్వాను. సినిమా అయిపోయింది.అందరం వెళ్లిపోయాం. ఎంత నిరాశ కలిగిందో, రాత్రి తనని చూడలేదని. అలా బయట కూర్చొని పైకి చూశా. ఏదో ఆకారం కనిపించింది. చూస్తే చందమామ. మరి ఇక్కడ ఉన్నదెవరు? నేను చెప్పిన మాటలు నచ్చలేదేమో అందుకే ముసలావిడ దగ్గరకు మళ్లీ వెళ్లిపోయాడనే బాధ. మెసేజ్‌ చేశాను రూమ్‌కి వెళ్లి. మళ్లీ బాగా మాట్లాడాడు. నా ఆనందానికి హద్దులు లేవు ఇక. ఆరోజు మా ఇద్దరి మధ్య జరిగిన ఒక నాలుగు గంటల సంభాషణని చుట్టూ లోకం అదేదో తప్పులా చూసింది. అందువల్ల చందమామ చాలా ఎఫెక్ట్‌ అయినట్టున్నాడు. నాతో సరిగ్గా మాట్లాడటం మానేశాడు. చూడు లోకం ఎంతమంది పాపాత్ములతో నిండిపోయిందో అనుకున్నాను. అనవసరంగా చందమామ కిందకి వచ్చాడే... అనుకున్నాను. నా వల్ల తను ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి క్షణం ఇదే ఆలోచన. తనకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. అలా రోజులు గడిచాయి. ఒకరోజు చందమామను ఆపి చెప్పాను – ‘‘ఇక పైన నేను నిన్ను చూడను. మాట్లాడను’’ అని. ఏదో చెప్పాను కానీ ప్రతిరోజూ తనని తల్చుకుంటూనే బతికాను కొన్నిరోజులపాటు. ఎప్పుడు కనిపిస్తాడా అని నా కళ్లు వెతకని చోటు లేదు. 

కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు చందమామ నుండి కబురొచ్చింది. పట్టలేనంత ఆనందం. ఎందుకు నాకు మాత్రమే ఏదేదో అయిపోతోంది? తన నుండి కబురొచ్చిన ప్రతివారికీ ఇలానే అవుతుందా, నాకు మాత్రమేనా! మరి నా జవాబు కోసం అతను పరితపిస్తున్నాడా లేదా!ఏదయితే అనుకున్నానో అలాగే జరిగింది. తనేమీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు మొదలైంది మళ్లీ. తను వేరే ఏదో దేశంలో ఉన్నాడంట. నాకు మాత్రం తను మాట్లాడే మాటలకు నా పక్కనే ఉన్నట్టు ఉంది. ఎంత ముద్దు చేస్తున్నాడో నన్ను. ఆ రోజు సాయంత్రం మొదలు తెల్లవారుజామున కోడి కూసే వరకూ ముచ్చట్లే ముచ్చట్లు. ఎన్నో మాట్లాడుకున్నాం. ఈసారి ఒకర్ని ఒకరం ఎక్కువ తెలుసుకున్నాం. తనకి కూడా నేనంటే ఇష్టమని తెలిసింది. కానీ అది ప్రేమ మాత్రం కాదు. ఆ తియ్యటి చేదు మాటలు కొత్త రుచిని చూపించాయి. చందమామ ముఖం చూస్తే చాలు, అన్నం తినకున్నా కడుపు నిండిపోయేది. రాత్రి మాత్రమే కబుర్లు చెప్పేవాడు ఆ చందమామ. మరి పొద్దున చెప్పడే! సూర్యుడనే ఈ లోకానికి భయపడి దాక్కుంటున్నాడు. ఏ మచ్చలేని చందమామ అనుకున్నాను కానీ నిజం కాదని అతనే చెప్పాడు. ఆశలు నిరాశలు చేశాడు. కానీ నా ముందు తన నిజస్వరూపం చూపించాడనే ఒక విషయం నన్ను మళ్లీ తన ప్రేమలో పడేలా చేసింది. తనకి నచ్చినట్టుగా ఉండటం నాకు సంతోషాన్నిచ్చేది. ఎందుకంటే ఆ కొద్దిసేపు మాట్లాడే రాత్రుళ్లు కూడా ఎక్కడ మాట్లాడకుండా పోతాడో అని. అసలే ఎంతో మంది కాచుకు కూర్చున్నారు చందమామ కోసం! వదిలేసానో చేతికి చిక్కడు మళ్లీ. 

నాలో ఓపిక నశించింది. ఎలా అయినా తెలుసుకోవాలి తనలో కొద్దిగా అయినా నా మీద ప్రేమ ఉందా అని అనిపించింది. అది తెలుసుకునే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోయాను. చందమామ మళ్లీ మాట్లాడటం మానేశాడు. ఎన్నిరోజులు ఇలా బతకడం అనిపించింది. ఎంతోమంది చెప్పారు, చందమామకి ఇంకెవరో ఇష్టమని. స్వచ్ఛమైన ప్రేమ కదా, ఆ విషయం తెలిసినా కూడా ఏం మాట్లాడలేకపోయా. మళ్లీ నెలలు గడిచాయి. నేను చందమామని మర్చిపోయే పనిలో ఉన్నా. అలా అనుకున్నాను కానీ తనని మర్చిపోవడం ఎలా జరుగుతుంది? రోజూ అలా కనిపిస్తుంటే ఆకాశంలో! చుట్టూ ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. మరి అవేం తక్కువ తిన్నాయి? అవి కూడా బాగానే ఉన్నాయిగా. మరి నేను మాత్రమే ఎందుకు చందమామ వెంటనే పడుతున్నా అనుకుని ఈసారి నక్షత్రాలని చూద్దామనుకున్నా. కానీ వాటిని చూసే ప్రతిసారీ ఏదో తెలియని వెలితి. ఒక్క రోజు చందమామని చూడకపోతే ఊపిరి ఆడేది కాదు. ఎందుకో తెలీదు, అతడు ఏం చేసినా మౌనంగా ఉండిపోతాను. ఈసారి చందమామ నుండి వేసవి కాలంలో కబురొచ్చింది. వెన్నెలలా మారి నాకు తెలియని మత్తులో ముంచాడు. ఆ తర్వాతే తెలిసింది. నాది ప్రేమ. తనది లస్ట్‌. రెండిటి మధ్యలో చివరికి ఏది గెలుస్తుందో చూడాలి! 
- స్నేహారెడ్డి (ఢిల్లీ) 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement