ఎట్టకేలకు కారు కొనేశాను. థర్డ్ హ్యాండు. మొదట... డాక్టర్‌గారు ఇంటికీ, క్లినిక్‌కీ అయిదేళ్లు తిరిగి రాజుగారికి అమ్మేశారు. ఆ రాజుగారు ఇంటికి తోటకి రెండేళ్లు తిరిగి కొత్త మోజు పెరగడంతో కారు బేరం పెట్టారు.నా ఫ్రెండ్ కుమార్ దృష్టి దాని మీద పడితే అది నా వరకు చేరింది. అవకాశం వచ్చేసిందని కొనేశాను. ముద్దుగా, బొద్దుగా, నీటుగా ఉంది మారుతి 800.1988 మోడల్. వయసెక్కువేగాని మా పిల్లలు దాన్ని పాపా అని పిలిచేవారు.తొలిరోజుల్లో ఎవరు నా కారు ఎక్కుతారా అని ఎదురు చూసేవాడిని. అడిగిందే తడవు కారు ఎక్కించి ఊరంతా తిప్పేద్దామన్న ఆత్రుత నాది. మా ఆవిడ, పిల్లలు మాత్రం నా కారెక్కేవారు కాదు. వారికి నా డ్రైవింగ్ మీద నమ్మకం లేదు. అందుకని నన్ను కారు ఎక్కనిచ్చేవారు కాదు. వారు ఎక్కేవారు కూడా కాదు.ఆరోజు మా చిన్నాన్న కూతురు గృహప్రవేశం. సత్యనారాయణవ్రతం, వెంకటేశ్వర దీపారాధన కార్యక్రమాలున్నాయి. ముందురోజే మా మరదలు వచ్చింది. ఆమె కూడా ఫంక్షన్‌కు బయలుదేరింది. బయలుదేరుతున్నామనగా మా బావమరిది భార్య వచ్చింది. నేనూ వస్తానంది. మరింకేం? మా ఆవిడ, మరదలు, బావమరిది భార్య ముగ్గురూ పవర్‌ఫుల్లే. వారిని నా కారులో, నేను డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాలనే తపన నాది. మా ఆవిడకు ఇష్టం లేదుగానీ మరదలూ, బావమరిది భార్య తెగ ముచ్చట పడ్డారు నా కారులో రావడానికి.
బాబామెట్ట నుంచి జమ్మునారాయణపురం వెళ్లడానికి పది నిమిషాలు లేదా పావుగంట పడుతుంది. అందుకని పదిగంటలకు బయలుదేరాం. కారు తీసాను.బాబామెట్ట, రైతుబజారు, రింగురోడ్డు, దాసన్నపేట మీదుగా జమ్మునారాయణపురం మామూలు రూటు. బాబామెట్ట రెండు లైన్లు దాటాం. కారు 30 కి.మీ వేగంతో తోలుతున్నాను.‘‘అదంతా చుట్టూ తిరగడమెందుకు? ఇలా అడ్డంగా తోలండి’’ అంది బావమరిది భార్య.కారు దారి మళ్లింది.అడ్డదారి గతుకుల రోడ్డు. మధ్యమధ్యలో కొళాయి పైపుల కోసం రోడ్డు తవ్వేసి కప్పకుండా వదిలేసిన గోతులు. రెండు,మూడు రోజుల క్రితం వర్షం పడడం వల్ల అక్కడక్కడ నీటిగుంతలు, మధ్యలో బురద, రాళ్లు తేలిపోయి అస్తవ్యస్తంగా ఉంది. కారు ఇటు కోస్తే అటు ఊగిపోతోంది.మధ్యలో కూర్చున్న మరదలు ఇటు మా ఆవిడ మీద అటు బావమరిది భార్య మీద పడిపోతోంది.చివర ఉన్న ఇద్దరూ మరదలి మీద పడిపోతున్నారు. నాకు ఒకవైపు నవ్వు, మరొకవైపు ఏ గోతిలో దిగిపోతానోనన్న భయం. ఉయ్యాలూగుతున్నట్లుగా కారు ఊగుతోంది.‘‘ఇదేమిటి ఇలా పడిపోతున్నాం ఒకరి మీద ఒకరం’’ అంటుంది మరదలు.‘‘నువ్వే చేశావు, తిన్నగా వెళ్లేవారిని అడ్డంగా వెళ్లమన్నావ్’’ అంది ఆవిడ.‘‘నేనేం చేశాను? ఇలా అయితే వేగిరం వెళ్లొచ్చని చెప్పాను. రోడ్డు ఇలా ఉంటుందని నాకేం తెలుసు?’’ అంది బావమరిది భార్య.ఇలా ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటుండగా కారు దాసన్నపేట రింగ్‌రోడ్డు దాటి శ్రీకాకుళం రూట్లోకెళ్లింది. తారురోడ్డు మీద బాగానే వెళ్తుంది. వెనుక సీట్లో వారు స్థిమితపడ్డారు. కారు జమ్మునారాయణపురం కోళ్లఫారం దగ్గరకు వెళ్లింది. అక్కడ భరింపరాని కంపు. ఆ రోడ్డున నడిచివెళ్లడమే ఇబ్బందిగా ఉంటుంది.
కారు వేగానికి గాలి రై రై మంటుంటే కంపు మరీ భరింపరానిదిగా ఉంది.‘‘కంపు కంపు’’ అంటూ మరదలు ఒకటే సణుగుడు.కోళ్లఫారానికి కుడివైపున అయిదు సమాంతర వీధులున్నాయి. ఎటు వెళ్లాలో తెలియలేదు. మొదటి వీధిలోకి కారు తిప్పాను. పదిగజాలు వెళ్లిందో లేదో కారు ఆగిపోయింది. ఎందుకో తెలీదు. స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయిందిగానీ ముందుకు కదలడం లేదు. గేరు పడడం లేదు.మళ్లీ ప్రయత్నించాను. కారు కదిలింది. ఆపితే మళ్లీ కదులుతుందో లేదో అనే భయంతో ముందుకి వేగంగా పరుగెత్తించాను.ఒక్క వుదుటున వీధి చివరికి వెళ్లిపోయింది. మరి ముందుకి మార్గం లేదు. కటింగ్ వీలేకాదు. ఇంతదూరం రివర్స్ చేయలేము. దిక్కుతోచక ముందుకీ, వెనక్కీ, రైట్ కి, లెఫ్ట్ కి ఊగిసలాటలో మళ్లీ కారాగిపోయింది.ముగ్గురినీ దిగమన్నాను.‘‘కొంచెం సాయం చెయ్యండి’’‘‘ఏం సాయం?’’‘‘కారు కొంచెం తొయ్యండి’’‘‘సరదా తీరిపోయింది’’ అనుకుంటూ ముగ్గురు దిగి తోశారు.కారు కదిలింది. మరి ఆపకుండా అక్కడున్నవారిని అడిగి మూడో వీధిలో చివర సాయిబాబా గుడి దగ్గర ఇంటి ముందు దించి ఇక లోనికి పదండని వారిని పంపి, నేను మెకానిక్‌కి ఫోన్ చేసి, కారుని షెడ్డుకి పంపించేసి వారిని కలుసుకున్నాను. ఫంక్షన్ అయిపోయింది. విందుభోజనాలయ్యాయి.బయటికొచ్చాం. నేను ముందు వారు వెనక నడుసున్నారు.‘‘కారేది?’’ మరదలి ప్రశ్న.‘‘అక్కడెక్కడో పెట్టుంటారు’’ మా ఆవిడ జవాబు.ముందుకు నడుస్తున్నాం. కారు కనపడదు? మరదలికి ఓపిక నశించింది.‘‘కారు కనబడదు. ఇలా నడిచివెళితే నవ్వుకుంటారు’’ అంది. కారు షెడ్డుకెళ్లిందని వారికి తెలియదు.‘‘ఏమనుకుంటారు లెద్దూ’’ అంది ఆవిడ.మరదలు చిరాకు పడింది. అందరూ నడుస్తున్నారు. ఎందుకో ఎక్కడికో తెలీదు. ఇంతలో మెయిన్‌రోడ్డు చేరుకున్నాం. రోడ్డు పక్కన నిల్చున్నాం. నేను వచ్చే ఆటోలను ఆపుతున్నాను. అవి ఆగకుండా వెళ్లిపోతున్నాయి. ఇది గమనించిన మరదలు ‘‘ఆటోలెందుకు ఆపుతున్నారు?’’ అంది.‘‘కారు షెడ్‌కెళ్లింది.మెకానిక్ తీసుకెళ్లాడు’’ఇంతలో ఆటో ఆగింది. బాబామెట్ట అని చెప్పి ఆటో ఎక్కాం. ఆటోలో జోకులే జోకులు. ఆటోవాలా నాలానే అడ్డదారినే పోతున్నాడు. మళ్లీ అవేగోతులు. మళ్లీ అవే గుంతలు.ఒకరిపై ఒకరు జోగడాలు. నేను బేబీ సీట్లో కూర్చున్నా. తేలిక మనిషిని కాబట్టి మాటిమాటికి జారిపోయి మా ఆవిడ మీద పడుతున్నాను. కుదుపులకి అందరి ఒళ్లు హూనమైపోయింది. ఇంకా ఎన్నని చెప్పమంటారు ఆనాటి ఆటో కష్టాలు!
– విశ్వేశ్వరవర్మ భూపతిరాజు
కారులో వెళ్లి ఆటోలో వచ్చాం!
Published Sun, Sep 23 2018 1:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment