తరగతిలో ఉండగా ఆఫీసులో పిలుస్తున్నారని వచ్చి చెప్పాడు అటెండర్. పాఠం వింటున్న అన్బరసన్‌కు ఎందుకు రమ్మంటున్నారో అర్థంకాలేదు. పక్కనున్న ఫ్రెండ్ తిరుమాల్‌ను ఒకసారి చూసి అటెండర్ వెనకే వెళ్లాడు. ఆఫీసులోని కుర్చీలో ఆదుర్దాగా కూర్చున్నాడు. సీలింగ్‌ఫ్యాన్ శబ్దంకూడా భయం గొలుపుతున్నట్టుగా ఉంది. కొన్ని నిమిషాల తర్వాత అక్కడున్న అధికారి అతణ్ణి పిలవగానే ఆయన ఎదుటకు వెళ్లి నిలబడ్డాడు. అతని కాళ్లు సన్నగా వణుకుతున్నాయి. ఆ అధికారి అతణ్ణి చూసీ చూడనట్టుగా అడిగాడు: ‘‘నువ్వేనా అన్బరసన్? తిరుమాల్ నీ ఫ్రెండా?’’ అన్బరసన్‌కు గొంతు పెగల్లేదు. అతనికే వినిపించనంత మెల్లగా బదులిచ్చాడు: ’’ఔను!’’ ‘‘ఏంలేదు, వాళ్ల నాన్నకు సీరియస్‌గా ఉందట. ఫోనొచ్చింది. అతణ్ణి వెంటబెట్టుకొని ఇప్పుడే బయలుదేరు. కానీ ఈ విషయం అతనికి చెప్పొద్దు.’’ అన్బరసన్ ముఖం మాడిపోయింది. అతను కాస్త ధైర్యం తెచ్చుకుని ఏం జరిగిందీ చెప్పమన్నాడు. ఆ అధికారి అన్ని విషయాలూ చెప్పాక అతని ముఖం మరింత కళా విహీనమైంది. తరగతికి వెళ్లే దారిలో అతనికి దడ ఎక్కువైంది. తిరుమాల్‌కు ఏమని చెప్పి తీసుకెళ్లాలి? గబగబ బట్టల్ని బ్యాగులోకి కుక్కుతుంటే మళ్లీ అన్బరసన్‌ను అడిగాడు తిరుమాల్: ‘‘రేయ్, మా నాన్నకు ఏమైందిరా బామ్మర్దీ? ఆయనకు ఏమంట్రా? చెప్పరా!’’పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపైనా అణచుకోవటానికి వీలుకాలేకపోయింది. తిరుమాల్‌ను పట్టుకొని భోరుమన్నాడు అన్బరసన్.‘‘ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయాడ్రా. హార్ట్ అటాక్ అంట్రా.’’స్పహతప్పి దబ్బుమని క్రిందపడ్డాడు తిరుమాల్. అన్బరసన్ అరిచిన అరుపుకు హాస్టల్ వార్డన్లు ఇద్దరు పరుగెత్తుకొచ్చారు... రైల్వేస్టేషన్‌కొచ్చేలోపు బాగా నీరసించిపోయాడు తిరుమాల్. పదేపదే ఏడుపు తన్నుకొచ్చి ఏదేదో గొణగసాగాడు. అతని శరీరం సన్నగా వణుకుతోంది. చిన్నచిన్న సమస్యలకు కూడా అతను ఎంత తీవ్రంగా స్పందిస్తాడో అన్బరసన్‌కూ తెలుసు. వాళ్ల ఊరికి వెళ్లటానికి కోవై నుండి బయలుదేరే రైలొకటి మధ్యాహ్నం ఉంది. అందులో ఎలాగో వాళ్లు కూర్చోవటానికి కాస్త చోటు సంపాదించారు. ఫోన్లో బంధువులిద్దరికి ఫోన్‌చేసి భోరుమని ఏడ్చాడు తిరుమాల్. దు:ఖాన్ని ఆపుకుంటూ మళ్లీ ఎవరెవరితోనో మాట్లాడుతూ ఏడవసాగాడు. స్థిరంగా ఒకచోట కూర్చోలేక లేచి అటుఇటు నడిచాడు. ఆ కంపార్టుమెంటులో ఉన్నవాళ్లు అతణ్ణే వింతగా చూడ్డం మొదలుపెట్టారు.
‘‘అతనితో కలిసి నువ్వూ ఏడుస్తూ ఉండిపోబాకయ్యా. అతణ్ణి జాగ్రత్తగా తీసుకెళ్లి ఊరు చేర్చు.’’ హాస్టల్ వార్డెన్లు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అన్బరసన్‌కు. వెంటనే తిరుమాల్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని ఆఫ్‌చేశాడు. టీ కొని బలవంతంగా అతనిచేత తాగించాడు. సీట్లో కూర్చోమని చెప్పి అతణ్ణే చూడసాగాడు అన్బరసన్. వాళ్ల కళ్లనూ, మనసులనూ చల్లబరిచేటట్టు చేసింది కిటికీ నుండి వీస్తున్న గాలులు. తిరుమాల్ లాగానే తన మనసుకూడా దు:ఖపూరితమైనప్పటికీ తన ఆలోచనల్ని తనలోనే దాచుకున్నాడు అన్బరసన్. అయినప్పటికీ మురుసుకుంటున్న ఆలోచనలను అతను అడ్డుకోలేకపోయాడు. తిరుమాల్ వాళ్ల నాన్నను అతను ‘గోపాల్ మామయ్య’ అనే పిలుస్తాడు. ఆయనంటే అతనికి చాలా ఇష్టం. ఆయన్ను ఎలా పిలవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘మామయ్య’ అని పిలవమని చెప్పింది కూడా ఆయనే.‘‘ఒరేయ్ అన్బు, నన్ను మామయ్య అనే పిలవరా. మీ అమ్మ శెల్వి ఉన్నదే ఆమె నాకు చెల్లెలు రా. నేను చూస్తూ పెరిగిన ఆడపిల్లరా’’గోపాల్ మామయ్య భూముల్ని తరతరాలుగా అన్బరసన్ తాత, తర్వాత అతని తండ్రి పైరు చేసేవాళ్లు. ఇరవై ఎకరాలకు పైగానే ఉంటుందని తాత చెప్పేవాడు.‘తేన్‌మ’ ను తాకుతూ ప్రవహించే ఏటి ఒడ్డున ఉండే భూములు. పైరూ పంటలతో ఎప్పుడూ పచ్చదనంతో నిండి ఉండేది. హరిజనవాడ పడమటి వీధిలో వాళ్లకొక సొంత ఇల్లు ఉన్నప్పటికీ, గోపాల్ ఇంటికి ఆనుకొని ఉన్న ఆ పొలంబావి మూలలో ఒక గుడిసె ఉండేది. దాని పక్కనే విస్తారమైన ఖాళీ స్థలం ఉండేది. అన్బరసన్ ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. అతనూ తిరుమాల్ జతగానే ఈతకొట్టటం నేర్చుకున్నారు. జతగానే ఎక్కడికైనా వెళ్లేవాళ్లు. ఊరి తిరునాళ్లలోనూ, పెండ్లి ఊరేగింపుల్లోనూ జతగానే మేళానికి ముందు ఆడేవాళ్లు. ఊరికి దగ్గరగా ఉండే అడవిలో తిరిగే పక్షుల్నీ, ఉడుతల్నీ వెతుక్కుంటూ తిరిగేవాళ్లు. కొండ పైభాగాన ఉండే జలపాతంలోకి దిగి చేపలు పట్టేవాళ్లు.అన్బరసన్ తోడుంటే తిరుమాల్ ఇంటిని కూడా మరిచిపోయేవాడు. నక్షత్రాలను, చందమామను చూస్తూ, నులక మంచంమీద పడుకొని రాత్రుల్లో అన్బరసన్‌తో కలిసి హాయిగా నిద్రలోకి జారిపోయేవాడు. ఇంటి నుండి అతణ్ణి వెతుక్కుంటూ అతని చిన్నాన్న వచ్చి పిలిచినా అతను వెళ్లేవాడు కాదు. గోపాల్ కూడా అతణ్ణి ఏమీ అనేవాడు కాదు. రైలు సేలంను దాటింది. పొమ్మిడి వరకూ వచ్చే అడవినీ, భూముల్నీ ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ల దగ్గరున్న మాటల్ని దూరంగా తరిమేసి మొండిగా వాళ్లకు తోడుగా ఉండిపోయింది దు:ఖం.
వాళ్లిద్దరూ ఊళ్లో ఉన్న బడిలోనే చదువుకున్నారు. ఊళ్లో పెద్దమనిషిగా ఉంటూ తన కొడుకును మాత్రం బయటూళ్లో చదివిస్తే ప్రజలు తప్పుగా అనుకుంటారని అలాగే వదిలేశాడు గోపాల్. వాళ్లిద్దరూ చేతిలో చెయ్యేసుకొని బడికి వెళ్లటం అప్పటినుండే మొదలైంది. తరగతిలోనూ వాళ్లిద్దరూ పక్కపక్కనే కూర్చునే వాళ్లు. బడికి వెళ్లేందుకు ఎప్పుడూ అన్బరసన్ తొందరగా తయారైపోవటం మామూలు. అతను తన ఇంటినుండి బయలుదేరి తిరుమాల్ ఇంటి అరుగుమీదకొచ్చి కూర్చుని అతనికోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. వాళ్లది పెద్ద ఇల్లు. బయటినుండి లోపలికి చూస్తే అంతా స్పష్టంగా కనిపించేది. అంత పెద్ద ఇంటిని చూస్తున్నకొద్దీ అతని కళ్లూ పెద్దవయ్యేవి. ఒకరోజు అలా చూస్తున్న అన్బరసన్‌ను లాక్కెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు తిరుమాల్. అతని తల్లి అదిరిపడి వాణ్ణి గట్టిగా అరిచింది. ఆమెను కోప్పడి, గోపాల్ అన్బరసన్‌కు ఏవో తినుబండారాల్నిచ్చి పంపించాడు.‘‘చిన్నపిల్లల్ని అలా కోపంగా అరుస్తావేం? వస్తే రానీ... వదిలెయ్!’’అన్బరసన్ వాళ్లనాన్న ఊరి తోటోడిగా ఉండటంవల్లనూ, ఆ ఊళ్లోనూ చుట్టుపక్కలా లేచే చావులకు డప్పు కొట్టటానికి అన్బరసన్‌ను కూడా తనతోపాటు తీసుకెళ్లేవాడు. మొదట్లో బాగానే అనిపించింది, తర్వాత నచ్చకుండాపోయింది. తనతోపాటు చదువుకునే వాళ్లిండ్లల్లోని చావులకూ, వాళ్ల వీధుల్లోనూ డప్పుకొట్టటం వల్ల వాళ్లు తననుచూసి ఎగతాళిగా నవ్వుకోవటాన్ని అర్థంచేసుకున్నాడు అన్బరసన్. అతను డప్పుకొట్టటానికి నిరాకరించినందుకు వాళ్లనాన్న అరుస్తున్నప్పుడల్లావాడి వయసు ఆయనకు అడ్డుగా నిలిచేది. ‘‘అన్నను పిలచకపో.’’ అనేవాడు.‘‘అన్న పెద్ద ఇస్కూలు సదువుతున్నాడురా. నీకేంటీ, నువ్వు సిన్నపిలగాడివేగా?’’‘‘నాతో చదువుకునే పిలకాయలు నన్నుచూసి ఎగతాళి చేస్తున్నారు.’’‘‘ఔను. ఈ ఇంటిని వెతుక్కుంటా వొచ్చి పుట్టినావు సూడూ. మరి ఇట్టాటివాటికంతా సిగ్గుపడతా కూసుంటే అవుతుందా రా?’’ అన్బరసన్ బడికి రాలేదంటే, అతను డప్పుకోట్టటం కోసమే వెళ్లుంటాడని తిరుమాల్ అనుకోవటం మామూలైపోయింది. మరునాడు అతణ్ణి చూడగానే తిరుమాల్ మొదట దాని గురించే అడిగేవాడు: ‘‘నిన్నఎక్కడ్రా మేళం కొట్టావు?’’ అతని నుండి ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా అన్బరసన్ మౌనం వహించేవాడు. అతని మౌనం తిరుమాల్‌కు ఏదో తెలియజేస్తున్నట్టుగా ఉండటంతో అలా అడగటం క్రమంగా తగ్గించేశాడు. వాళ్లిద్దరూ జతగానే ఇంటర్మీడియెట్‌కు వెళ్లారు. బావా బామ్మర్దులని పిలుచుకునేందుకు అలవాటుపడ్డారు. పుట్టినరోజప్పుడు ఒకరికొకరు కేక్‌లు కట్‌చేసి, తరగతిని సందడి చేశారు. ఎంత బాగా లెక్కలు చేసినప్పటికీ అన్బరసన్‌కు పూర్తి మార్కులు వెయ్యని వెంకటాచలపతి లెక్చరర్‌తో తిరుమాల్ గొడవకు దిగేవాడు. ‘‘ఒరేయ్. నువ్వూ వాడూ ఎవర్రా? బావా బామ్మర్దులని కలవరిస్తున్నారు? ఏం, పిల్లనిచ్చి పిల్లను తీసుకోబోతారా ఏంటీ?’’ అని అడిగినవాళ్లకు ఔననే బదులు చెప్పేవాడు అన్బరసన్.
అన్బరసన్, తిరుమాల్ ఒకే డిగ్రీ కాలేజీలో చదవటానికి చేరారు. హాస్టల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు జరిగిన ఫంక్షన్లో అన్బరసన్‌ను డప్పు వాయించమని అందరూ అడిగినప్పుడు అతను అదిరిపడ్డాడు.అతను నిరాకరించగానే అందరూ అతణ్ణి వింతగా చూశారు. అవమానంతో వెనక్కు తిరిగిన అన్బరసన్‌కు తిరుమాల్ నవ్వు మరింత బాధను కలిగించింది.‘‘ఏరా బామ్మర్దీ కాదంటున్నావు? ఏదో సరదా కోసమే కదరా ఇదంతా? వాయించరా’’‘‘నావల్ల కాదురా. నాకు డప్పుకొట్టటం వచ్చని వీళ్లకెందుకు చెప్పావు?’’‘‘ఇందులో తప్పేముందిరా. ఇది ఒక స్కిల్లు రా!’’‘‘ఇది స్కిల్లు అయితే, దీన్ని నువ్వెందుకు నేర్చుకోలేదు?’’ ‘సారీరా బామ్మర్దీ.’’ అన్నాడు తిరుమాల్. ఆ సంఘటనతో మొదటిసారిగా వాళ్లు కొన్నాళ్లువరకూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండిపోయారు...రైలు తిరుపత్తూరును దాగానే ఊరు వచ్చేసిందని ఏడవటం మొదలుపెట్టాడు తిరుమాల్. ఇంకా ఊరు రాలేదని చెప్పి అతణ్ణి కూర్చోబెట్టిన అన్బరసన్, ఆంబూరులో దిగగానే ఊళ్లోకి వెళ్లటానికి మోటర్‌బైక్‌లను తీసుకురమ్మని స్నేహితులకు ఫోన్‌లో చెప్పాడు. ఆంబూరు రైల్వేస్టేషన్లో ఇద్దరు స్నేహితులు తమతమ బైక్‌లతో సిద్దంగా ఉన్నారు. మనిషికొక బైక్‌లో వాళ్లు కూర్చున్నారు. తిరుమాల్‌కు ఏడుపు మొదలైంది. వాళ్లు ఊళ్లోకి ప్రవేశిస్తుండగా డప్పుల శబ్దాలు భయానకంగా వినిపిస్తున్నాయి. ఇంటి ముందు బైక్‌ను ఆపేలోపే తిరుమాల్ ఏడుస్తూ లోపలికి పరుగెత్తాడు. అతని వెనకే అన్బరసన్‌కూడా వెళ్లాడు. వాళ్లిద్దరూ అద్దాలపెట్టెమీద పడి ఒకరినొకరు వాటేసుకుని భోరుమని ఏడ్చారు. తిరుమాల్ వాళ్లమ్మ కొడుకును పట్టుకొని బావురుమంది. ‘‘ఒరేయ్ తిరు. మీ నాన్న మనల్ని ఒంటరిగా వదిలి వెళ్లిపోయడ్రా... ఏమండీ, మన బిడ్డొచ్చాడు చూడండీ. లేచి వాణ్ణి రారా అని పిలవండీ.’’ పందిట్లో ఉన్న ఆడవాళ్ల శోకాలు మరింత పెద్దవయ్యాయి...ఎదురింటి అరుగుమీద కూర్చుని ఉన్నాడు తిరుమాల్. అన్బరసన్ అతని పక్కనే ఉన్నాడు.
అతని తల్లి ఏడుపు మాత్రం ఆగకుండా వినిపిస్తూనే ఉంది. ఆమెను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. తిరుమాల్‌లోని అంత కఠినమైన మౌనాన్ని అంతకు మునుపు ఎప్పుడూ చూళ్లేదు అన్బరసన్.ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన తండ్రి శవం తిరుమాల్‌ను కుదిపేస్తోంది. అతను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.తిరుమాల్ ఒక్కడే కొడుకు కావటంవల్ల మురిపెంగా పెరిగాడు. తన తండ్రి చేతిని పట్టుకుని పంటపొలాల్ని చుట్టి వస్తున్నప్పుడు అన్బరసన్ తాత అతణ్ణి ప్రేమగా ‘చిన్నయ్యా’ అనేవాడు. గోపాల్, కొడుకును ఎప్పుడూ తిట్టింది లేదు. అతణ్ణి కాలేజీ హాస్టల్లో చేర్చటానికి వెళ్లినపుడు తన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవటం ఇంకా తిరుమాల్ కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ అతనికి దు:ఖం పొంగుకురాసాగింది.తిరుమాల్ అద్దాల పెట్టె దగ్గరకు వెళ్లటానికి ప్రయత్నించినప్పుడల్లా ఊరి మగాళ్లు కొందరు అన్బరసన్‌ను పిలిచి అతణ్ణి దూరంగా తీసుకెళ్లమని చెబుతున్నారు. బంధువులతో ఒకట్రెండు మాటలే మాట్లాడిన తిరుమాల్ వచ్చినప్పటి నుండి అన్బరసన్ చేతిని పట్టుకునే తిరిగాడు. అతనే కనుక లేకపొయ్యుంటే ఈ ప్రపంచంలో తాను ఒంటరిగా మిగిలిపోయేవాణ్ణని ఆలోచించి వణికిపోయాడు. కొందరు స్నేహితులు అతణ్ణి కంట్రోల్ చెయ్యటానికి అతనిచేత మద్యం తాగించారు. ఆ రాత్రి ఎక్కడ పడుకున్నారో ఇద్దరికీ తెలియదు. ఎండ పైకొచ్చేకొద్దీ మనుషులు రావటం ఎక్కువైంది. డప్పు శబ్దమూ, టపాకాయల శబ్దమూ చెవులను గింగిరాలెత్తిస్తున్నాయి. అన్బరసన్ డప్పు వాయిస్తున్న తన పెదనాన్ననూ, అతని కొడుకునూ చూస్తూ ఉండిపోయాడు. తన తండ్రి తోటి పనిని వదిలేసినప్పటి నుండి తన చిన్నాన్నలు, పెదనాన్నలు ఆ బాధ్యతను తీసుకున్నట్టుగా అర్థంచేసుకున్నాడు.
ఆ వీధివీధంతా పూల పరిమళమూ, అగరువత్తుల వాసనతో నిండిపోయింది. పాడెను కట్టటమూ, గుంతను తవ్వటమూ అన్బరసన్ వాళ్లనాన్నే ముందుండి జరిపిస్తున్నట్టుగా ఉంది. సమయం గడుస్తున్నకొద్దీ అక్కడున్నవాళ్లు తొందరపెట్టసాగారు. ‘‘జరగాల్సింది చూడండయ్యా. రావుకాలానికి ముందే ఎత్తేయ్యాలి.’’గోపాల్ శరీరాన్ని అద్దాలపెట్టెలో నుండి బయటికి తీసి ఒక కట్టెమంచంమీద పడుకోబెట్టారు. నూనె, శీకాయపొడి రసం వేర్వేరు గిన్నెల్లో పెట్టారు. ‘‘దాయాదులు, ఒకింటోళ్లందరూ ప్రదక్షిణం చేసొచ్చి నూనె అంటండయ్యా, నీళ్లు పొయ్యాలి.’’ కార్యాన్ని నిర్వహిస్తున్న పెద్దాయన చెప్పగానే బంధువులు శవాన్ని ప్రదక్షిణం చెయ్యటం కోసం తయారయ్యారు. తిరుమాల్‌ను తీసుకురమ్మని ఎవరో గట్టిగా చెప్పారు. నీరసంగా ఉన్న అతణ్ణి అన్బరసన్ చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. తండ్రి శవాన్ని చూడగానే మళ్లీ దు:ఖం పొంగుకొచ్చి ఏడ్చాడు తిరుమాల్. అతనితో కలిసి అన్బరసన్ కూడా ఏడ్చాడు. ఏడుపూ, కన్నీళ్లతో కదిలి వరుసలో వాళ్లిద్దరూ శవాన్ని మూడుసార్లు చుట్టొచ్చి తలకు నూనెను అంటారు. తండ్రి ఒంటిమీద నీళ్లు పోస్తున్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు తిరుమాల్.పాడెను తీసుకొచ్చి గోపాల్ శవాన్ని దానిమీద పడుకోబెట్టారు. అప్పుడు ఆడవాళ్ల ఏడుపు శబ్దం గుండెల్ని పిండేస్తున్నట్టుగా అనిపించింది. ఊరేగింపు మొదలుకాగానే చాకలివాళ్లు పాడెకు ముందు పాత చీరలను పరుస్తూ వెళ్లారు. పాడెమీద వువ్వులూ చిల్లరా విసరబడింది. నిప్పుచట్టితో నడుస్తున్న తిరుమాల్‌ను నడిపించుకుంటూ అన్బరసన్ పాడెకు ముందు నడిచాడు. కొన్ని సమయాల్లో అతను పాడెను మోసేవాళ్లతో కలిసి భుజం మార్చుకున్నాడు.
చావు ఎత్తిన రెండు రోజులకంతా ఊళ్లో పుకార్లు లేచాయి. ఆ సాయంత్రం ఊరి పంచాయితీ జరగనున్నట్టుగా చెప్పుకున్నారు. ఊరంతా అన్బరసన్ గురించే మాట్లాడుకుంటున్నారని వాళ్లనాన్న చెప్పాడు. ‘‘ఏరా నాయనా అట్టా జేసినావ్? అతనెంత సావాసగాడైనప్పటికీ మనం ఏరే, ఆళ్లు ఏరే రా. తరతరాలుగా ఆళ్ళ నీడలో బతికే వోళ్లం మనం.’’ అంటూ యాస్టపోయాడు వాళ్ల తాత. ఊరంతా ఒక పెద్ద మృగంగా మారి అతని ముందు లేచి నిలబడింది. దాని ముఖం ఇంత భయానకంగా ఉంటుందా అనుకున్నాడు అన్బరసన్. ‘తిరుమాల్‌తో కలిసి గోపాల్‌మామయ్య శవాన్ని ప్రదక్షిణ చెయ్యటం ఎలా తప్పవుతుంది? ఇష్టంతో చేసింది ఎలా నేరమవుతుంది? ప్రేమను పంచాలని భావించే నన్నెందుకు తప్పుబడుతోంది ఈ ఊరు? గోపాల్ మామయ్య నాకు ఎంతో చేశారే?’ అని అతనిలో ఆలోచనలు సుడులు తిరగసాగాయి.‘‘ఔను. సదువుకున్న పిలగాడు దేన్నీ మనసులో దాసుకోకుండా చేసేశాడు. ఈ ఊరి పద్ధతులన్నీ వాడికెలా తెలస్తాయి? మనం కళ్లాల్లో తొక్కీ ఊడ్సీ పంపించేదేగా ఆళ్లు తింటారు. అప్పుడంతా మనమెవరమో తెలియదంటనా?’’ అమ్మ పనులు చేసుకుంటూ తనలో తాను కోపంగా అనుకుంటున్న మాటలే అన్బరసన్ మనసులోనూ కదలాడుతున్నాయి. అతను గోపాల్ మామయ్య శవాన్ని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎవరో అరిచిన అరుపు ఇప్పుడు గట్టిగా ధ్వనించింది. దాంతోపాటు అతను తిరుమాల్‌తో కలిసి వాళ్ల వీధిలో ఆడుకుంటున్నప్పుడు అతణ్ణి తరమగొట్టిన గొంతు. నాన్న, గోపాల్‌మామయ్యను ‘నాయకరావ్’ అని ఆప్యాయంగా పిలిచిన గొంతూ, తాత ఆయన్ను ‘సామీ’ అన్న గొంతూ నలు దిక్కులనుండీ అతణ్ణి చుట్టుముట్టాయి.ఆ సాయంత్రం జరగబోయే ఊరి పంచాయతీకి ఎలా వెళ్లటమా అని అన్బరసన్ కలతపడుతున్నప్పుడు తిరుమాల్ తాను కూడా అక్కడికి వస్తానని చెప్పటం అతనికెంతో ఓదార్పునిచ్చింది. ‘‘కానీరా బామ్మర్దీ, చూసుకుందాం!’’ఊరికి మధ్యలో ఉంది రచ్చబండ. అక్కడ జనం బాగానే గుమిగూడారు. పెద్దమనుషులు కొందరు రావిచెట్టు కిందున్న రాతిబండమీద కూర్చొని ఉన్నారు. ఒకపక్కన ఆదుర్దాగా నిలబడున్న అన్బరసన్‌తో కలిసి తిరుమాల్‌కూడా నిలబడున్నాడు. వాళ్లకు తోడుగా అన్బరసన్ వాళ్ల నాన్న, తాత ఉన్నారు. వాళ్లు అప్పటికే మాట్లాడుకుని ఉంటారని అన్బరసన్‌కు అనిపించింది. ఒక పెద్దమనిషి నోరు విప్పాడు: ‘‘పడుకోవటానికి చోటిస్తే చాపనే లాక్కుంటార్రా? స్నేహితుడంటే గుమ్మం దగ్గరే నిలబడాలి. మాతో కలిసి మీరూ శవాన్ని చుడితే ఏమిటర్థం? మాకు మీరు దాయాదులా? భాగస్తులా? ఆ... గోపాల్ గాంధీ అదీఇదీ అని మాట్లాడుతూ గొప్ప లక్ష్యంతో ఉండిపోయాడు.అందుకనీ అతనింటి ఉప్పు తిని అతనికే ద్రోహం చేస్త్రారా?’’
ఎవరూ మాట్లాడలేదు. అన్బరసన్ వాళ్ల నాన్న మాత్రం వినయంగా అన్నాడు: ‘‘ఏదో అమాయకుడు. తెలియకుండా చేసేశాడు!’’‘అమాయకుడని వొదిలేస్తే రేపు అందరూ ఇలాగే చేస్తారు. ఎవడికీ భయం లేకుండాపోతుంది. అందుకనీ... ఊరి పంచాయతిలో నిర్ణయించాలనుకున్నది ఇదే. ఇకమీదట మీరెవరూ మాకు డప్పు కొట్టటానికో, గుంత తవ్వటానికో, శవం ముందు శోకాలు పెట్టటానికో వద్దు. వేరే ఊరివాళ్లను పిలుచుకొచ్చి మేమే చూసుకుంటాం. దాంతోపాటు ఊరి కట్టుబాటును మీరిన మునిరత్నం ఇంటివాళ్లతో ఈ రోజుటి నుండి ఒక యేడాది వరకూ ఊళ్లో వున్న వాళ్లెవరూ సంబంధం పెట్టుకోకూడదు.’’అక్కడ గాఢమైన నిశ్శబ్దం నెలకొంది.ఊరి నిర్ణయం వినగానే అన్బరసన్ వణికిపోయాడు. తండ్రికేసి దీనంగా చూశాడతను. ఆయన ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నట్టుగా అనిపించింది. ఉన్నట్టుండి వేరొక గ్రహం మీద, భాష తెలియని, మనిషి భావాలు గ్రహించని ఒక గుంపు ముందర నిలబడున్నట్టుగా భయం కలిగింది. అతను ఏదో మాట్లాడ్డానికి నోరు తెరిచేలోపలే వాళ్ల నాన్న అతని చేతిని పట్టుకుని ఆపాడు.‘‘మీరు సెప్పిన ఆ మాటలే గొప్పవి. గోపాల్ నాయకర్ పొలంలో పనిజేశామన్న ఒక్క విషయానికే నేనూ తలవొంచుతున్నాను. అంతకుమించి ఇంకేమీ లేదు. ఊరి వాళ్లనుండి వెలి వేయ్యడాన్నంతా నేనొప్పుకోను. కాలం మారుతోంది. కాస్త మూతీ మొగమూ జూసి మాట్లాడండి. ఏదో సదువుకున్న పిలగాడు తెలియకుండా చేసేశాడు. మమ్మల్ని డప్పు వాయించొద్దన్నారు. సరే. తర్వాత బయటూళ్ల నుండి ఎందుకు మనుషుల్ని పిలచకొస్తారు. మీరే వాయించుకోండి?’’తండ్రి మాటలు ఊరి పెద్దమనుషుల్లో ఆవేశాన్ని తెప్పించాయి.‘‘ఏంట్రా మాటలు మీరుతున్నాయి? మాలాగా చదువుకుని ప్యాంటూ షర్టూ వేసుకుంటే అన్నీ మారిపోతాయా?’’ తిరుమాల్ వయస్సుండే ఒకడు ఉన్నట్టుండి పైకిలేచి అన్బరసన్‌ను తిడుతూ అతని మీదికి దూసుకెళ్లాడు. ‘‘ఏంటయ్యా వీళ్లతో ఇంకా మాలూ. వీళ్లతో అంతా మర్యాదగా మాట్లాడకూడదు. మావాణ్ణి ఒరేయ్ ఒరేయ్ అంటావ్. కలిసి తిరగతావ్? చెవుల్లో ఏం పూడుకుపోయింది?’’ దూసుకొచ్చినవాడి ముఖంలో ఒక్క గుద్దు గుద్ది పక్కకు తోసేశాడు తిరుమాల్. వాడు క్రింద పడగానేఊరి జనానుండి పెద్దగా అరుపులు వినిపించాయి. అన్బరసన్ వాళ్ల నాన్న ముందుకొచ్చి గట్టిగా అరిచాడు: ‘‘ఓ పెద్ద మనిషీ ఇదంతా ఏమీ బాగాలేదు!’’పెద్దవాళ్లల్లో ఒకళ్లిద్దరు లేచి గట్టిగా అరిచి గుంపును శాంతపరిచారు. అక్కడ మళ్లీ నిశబ్దం అలుముకుంది. దెబ్బతిన్నవాడు తిరుమాల్‌ను గుర్రుగా చూశాడు. ‘‘ఒరేయ్ తిరుమాల్. నువ్వు చిన్నవాడివి. నీకు పద్ధతులు అవీ తెలియవు. మాట్లాడకుండా ఉండు.’’తిరుమాల్ బదులుకు కోపంగా అన్నాడు. ‘‘చిన్నవాళ్లకూ పెద్దవాళ్లకూ ఒకటే న్యాయం. మా నాన్న శవాన్నేగా అన్బరసన్ ప్రదక్షిణ చేశాడు. పర్వాలేదు. ఆ విషయాన్ని పట్టుకుని ఊళ్లో సమస్యలొద్దు.వెలి వెయ్యటం అంటూ మాట్లాడితే తర్వాత నేను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది.’’తిరుమాల్ మాటల తర్వాత ఊరి జనాలు మనిషికొక మాట మాట్లాడసాగారు. గుంపులో కలకలం బయలుదేరింది. ‘‘కలిసికట్టుతనం అంటూ లేని ఇదీ ఒక ఊరా?’’ పెద్దమనుషులు కోపంగా లేచి నిలబడగానే ఊరి జనం ఒక్కొక్కళ్లుగా లేచి వెళ్లిపోవటం మొదలుపెట్టారు. తిరుమాల్ అన్బరసన్ భుజాన్ని గట్టిగా పట్టుకుని...‘‘ఏరా బామ్మర్దీ?’’అన్నాడు. అంతేనంటూ తలాడిస్తూ అన్బరసన్ తల వంచుకొని నవ్వుకున్నాడు.
తమిళ మూలం : అళగియ పెరియవన్
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ
డప్పు
Published Sun, Oct 28 2018 1:19 AM | Last Updated on Sun, Oct 28 2018 1:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment