
హైదరాబాద్ అమీర్‌పేటలో ఎటు చూసినా ‘స్పోకెన్ కిలికి’ బ్యానర్లు కనిపిస్తున్నాయి. అసలు హైదరాబాద్ అని ఏమిటి... తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఇలాంటి బ్యానర్లే కనిపిస్తున్నాయి. కిలికి కోచింగ్ సెంటర్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.ఒకప్పుడు ఇంగ్లిష్ మాట్లాడటం హోదాకు సింబల్‌గా ఉండేది.ఇప్పుడు మాత్రం కిలికి భాషలో ఎంతసేపు మాట్లాడితే అంత గొప్ప!కూకట్‌పల్లిలో ఒక మధ్యతరగతి కుటుంబం.ఆ ఇంట్లో జరిగే సంభాషణ వినండి....తండ్రి:‘నిమ్దాదోసురాసురా నుమ్మీమోహినో జూ?’తెలుగు అనువాదం:‘ఏరా హోంవర్క్ ఎందుకు చేయలేదు. ఒళ్లు బలిసిందా?’కొడుకు:‘మిన పీజ్రాషూకు నే...మిన్ బహిత్త..అనువాదం:‘హోంవర్క్ చేయాల్సింది డాడీలే కదా...నన్ను దబాయిస్తావేం. వీడియోగేమ్స్ ఆడుతున్నాను. కనబడటం లేదా!’సికింద్రాబాద్‌లో ‘అఖిల భారత బద్ధకస్తుల మహాసభ’ జరుగుతుంది. ఆ సభలో అధ్యక్షుడి ఉపన్యాసం వినండి...‘క్రా చు రావీక్ నేమీన్ మహత్తి బస్ మర్ర బంత బంత నత్తురే’ అనువాదం:‘కుందేలు రోజు రన్నింగ్, జంపింగ్ చేస్తుంది.కానీ ఏంలాభం? పది సంవత్సరాలకు మించి బతకదు.తాబేలు విషయానికి వస్తే...రన్నింగ్ చేయదు. జంపింగ్ చేయదు.అయినా భేషుగ్గా వందసంవత్సరాలు బతుకుతుంది’పెళ్లి ఊరేగింపులో కిలికి భాషలో డీజే సాంగ్...‘నిమ్దా సిగ్క నిమ్ సింబ రిపోస్‌బహా కిలికి రహా కిలికిపిప్పీ ఫిలిఫ్ జివ్ల క్రోయిక్కిఉన్నో డున్నో మువ్వో జావోదంబా దంబా బూగూ కిలికినిమ్‌దేరే ఉఫ్ఫ్‌బహ సులుకుకి మారో... మారో మారో మారో మారో కిలికి’
‘‘మై డియర్ రాజా... బాహుబలి సినిమా వచ్చి చాలా కాలమే అయింది కదా. మరి ఇప్పుడు కిలికి గోల ఏంటి? ఉన్నట్టుండి ఇంగ్లిష్ భాష కనుమరుగు కావడం ఏమిటి? ఎటు చూసినా కిలికి మాట్లాడటం ఏమిటి? ఈ భాష నేర్చుకోవడానికి కోచింగ్‌సెంటర్‌లకు పరుగులు తీయడం ఏమిటి? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా జవాబు చెప్పలేకపోయావో..’’ అన్నాడు విక్రమార్కుడి భుజం మీది భేతాళుడు.‘‘ఈజీ కొచ్చన్ అడిగావు తమ్ముడూ’’ అని భేతాళుడికి థ్యాంక్స్ చెప్పి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు విక్రమార్కుడు...‘‘ఒకరోజు ట్రంపుకు బాగా బోరు కొట్టింది. వైట్‌హౌజ్‌కు వెళ్లకుండా ఓన్‌హౌజ్‌కు వెళ్లాడు.‘ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పండయ్యా...బోరు కొట్టి చస్తున్నాను’ అన్నాడు అసిస్టెంట్‌తో.‘ఆమధ్య బాహుబలి అనే ఒక సినిమా వచ్చింది సార్. మీకు బాగా నచ్చుద్దీ’’ సమాధానం ఇచ్చాడు అసిస్టెంట్.వెంటనే ఆ సినిమా డీవీడీ తెప్పించాడు ట్రంపు.ఆయనకు కాలకేయులు మాట్లాడే కిలికి భాష తెగ నచ్చేసింది.ట్రంపు తిక్కలోడు కదా...వెంటనే ఒక రూల్ పాస్ చేశాడు.అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్లు, ఇంకా రకరకాల వాళ్లకు తప్పనిసరిగా కిలికి భాష వచ్చి ఉండాలి. ఈ భాష రాకుంటే ఎంత పెద్ద మొనగాడినైనా దేశంలోకి అడుగుపెట్టనివ్వను, నా దేశం నా ఇష్టం అని ప్రకటించాడు ట్రంపు.మనవాళ్లకేమో అమెరికా భూతలస్వర్గమాయే! దీంతో ఎక్కడ తమకు అమెరికాలో ఉండే అవకాశం మిస్సవుతుందేమోనని భయపడి విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు...ఒక్కరనేమిటీ...సమస్త వర్గాలు కిలికి మీద పడ్డాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఏ వీధిలో చూసినా పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్‌లు వెలిశాయి. ట్రంపు మూడ్ మారే వరకు ఈ ట్రెండ్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది’’
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment