నాయికల నాయకుడు | heroines hero ANR | Sakshi
Sakshi News home page

నాయికల నాయకుడు

Published Sun, Feb 2 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

నాయికల నాయకుడు

నాయికల నాయకుడు

 మననం

  అక్కినేని తొలి దశలో నటించిన చిత్రాలతో ‘రొమాంటిక్ హీరో’ ఇమేజ్ ఏర్పడింది. ప్రేమ, విరహం, విషాదం... అంటే ఆయన ఓ ‘రోల్ మోడల్’ అయ్యారు. తన సినీ జీవితంలో అక్కినేని సరసన 76 మంది కథానాయికలు నటించడం ఓ రికార్డు!
 
 తొలి రోజుల్లో శాంతకుమారి, లక్ష్మీ రాజ్యం, ఎస్.వరలక్ష్మి, భానుమతి, అంజలీదేవి, సావిత్రి; ఆ తర్వాత షావుకారు జానకి, జమున, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, రాజసులోచన, కాంచన, పద్మిని వంటివారు అక్కినేని సరసన  నటించారు.
 
 ‘మాయలోకం’లో ఆయన కంటే వయసులో పెద్దవారైన శాంతకుమారి, ఎమ్.వి.రాజమ్మల సరసన హీరోగా నటించారు ఏఎన్నార్. శాంతకుమారితో ప్రేమ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు కంగారుపడేవారట. అప్పుడు శాంతకుమారి అలాంటి సన్నివేశాలలో ప్రేమను పండించాలంటే... డైలాగులు ఎలా చెప్పాలో, శృంగారాన్ని ఎలా అభినయించాలో చెప్పి ఉన్న భయాన్ని పోగొట్టారు.
 
 భరణీ వారి తొలి చిత్రం ‘రత్నమాల’లో భానుమతి సరసన మొదటిసారిగా నటించారు అక్కినేని. ఆ చిత్రానికి దర్శకుడు భానుమతి భర్త రామకృష్ణ. భానుమతితో అక్కినేనికి చనువు ఏర్పడాలని - వాళ్లిద్దర్నీ కలిసి పరుగెత్తమని చెప్పి 16 మి.మీ. కెమెరాతో ఆ దృశ్యాలను తీసి చూపించేవారు. భానుమతిని ‘మేడమ్’ అని, రామకృష్ణను ‘గురువుగారూ’ అని పిలిచేవారు అక్కినేని. ‘చింతామణి’ తీయాలని సంకల్పించి, బిల్వమంగళుడి పాత్రను ధరించమని వాళ్లు కోరినప్పుడు అక్కినేని తిరస్కరించారు. ‘‘నేను చేయకపోవడం అలా ఉంచండి. చింతామణి మేడమ్‌గారు వేయదగ్గ పాత్ర కాదు. ఆ సినిమాను ‘డ్రాప్’ చేసుకోండి’’ అని కూడా సూచించారు సంస్థ పట్ల అభమానం కొద్దీ! ఆ తర్వాత భరణీ అధినేతలు ఎన్టీయార్‌తో ‘చింతామణి’ తీశారు. ఆ చిత్రం అపజయాన్ని చవిచూసింది.
 
 అక్కినేని హీరోయిన్లలో ప్రధానమైన నటీమణి అంజలీదేవి. ఒక బిడ్డ తల్లిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ‘గొల్లభామ (1947)’ తో గ్లామర్ నటిగా సంచలనాన్ని సృష్టించారు. అంతవరకూ ‘వ్యాంప్’ పాత్రలు ధరించి, ‘శ్రీలక్ష్మమ్మ కథ’లో అక్కినేని సరసన సాధ్వి పాత్రలో మెప్పించారు. ఈ జంట ఆ రోజుల్లోనే ‘పరదేశి’లో వయసు మళ్లిన దంపతుల పాత్రల్లో కనిపించడం విశేషం. ‘ఇలవేలుపు’ చిత్రంలో మొదట ప్రేమికులై, ఆ తర్వాత నాయిక (అంజలీదేవి)ను, హీరో తల్లిగా చూడవలసి రావడం అప్పట్లో ‘యాంటీ సెంటిమెంట్’ అన్నారు. కానీ అక్కినేని, అంజలీదేవి ఆ చిత్రంలో అద్భుతంగా రాణించారు.
 
 అక్కినేని నట జీవితంలో మరో ప్రధానమైన నటీమణి సావిత్రి. ‘మూగమనసులు’లోని ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాటను గోదావరి నదిపై పడవలో చిత్రీకరిస్తున్నప్పుడు, సావిత్రి పట్టుతప్పి నదిలో పడిపోయారు. పడవను పట్టుకుని వేలాడుతున్న ఆమెను సమయస్ఫూర్తితో అక్కినేని చేయి పట్టుకుని పైకి లాగుతూ ఉంటే, ఈతగాళ్లు వచ్చి ఆ ఇద్దరినీ కాపాడటం జరిగింది. సావిత్రి ఎంతోమందికి చెప్పారు   ఏయన్నార్ రక్షించిన సంగతి! ‘సావిత్రి మనిషిగా గొప్పదా? నటిగా గొప్పదా? అనేది తేల్చుకోవడం కష్టం’ అంటారు అక్కినేని.
 
 ఆ తర్వాత వచ్చిన మరోతరం నటీమణులలో లక్ష్మి, శారద, జయలలిత, వాణిశ్రీ, భారతి - అనంతరం లత, జయచిత్ర, సుజాత, మంజుల, జయసుధ, జయప్రద వంటివారు అక్కినేని సరసన ఆకర్షణీయమైన పాత్రలు పోషించారు.
 
 ప్రేక్షకులకు ‘రాంగ్ మెసేజ్’ వెళ్లకూడదనేది అక్కినేని వాదం. యద్దనపూడి సులోచనారాణి నవల ‘విజేత’ ఆధారంగా ‘విచిత్ర బంధం’ తీస్తున్నప్పుడు, హీరో కథానాయిక (వాణిశ్రీ)ను ‘రేప్’ చేసే ఘట్టాన్ని ఎంతగానో వ్యతిరేకించారు. నిర్మాత దుక్కిపాటి, దర్శకుడు ఆదుర్తి - ఆయనను అతికష్టం మీద ఒప్పించారు. చిత్రీకరణ అయిన తర్వాత ‘‘ఓస్! రేప్ అంటే ఇదేనా? ఏమో అనుకుని భయపడ్డాను’’ అని వాణిశ్రీ నవ్వారు. ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా చిత్రీకరించారు ఆదుర్తి. ప్రేమ సన్నివేశాలైనా, ఏ తరహా దృశ్యాలైనా ఆలోచింపజేసేలా, ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలనేది అక్కినేని ధోరణి. అందుకనే ఏదీ ‘మోతాదు’కు మించకుండా ఉండాలని కోరుకుంటూ, ఆ మేరకు దర్శక నిర్మాతలు శ్రద్ధ వహించేలా చూసేవారు.
 ఆ మధ్య అక్కినేని నాయికలందరూ ఒకే వేదికపై చేరి, ఆయనను సత్కరించడం విశేషానందాన్ని కలిగించిన ఘట్టం!
 - బి.కె.ఈశ్వర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement