
తపాలా: నా పెళ్లి చూపులు...
అదో మధురమైన, మరపురాని రోజు. ఆ రోజు నా పెళ్లి చూపులు. చదువుకుంటూ, హాయిగా ఎంజాయ్ చేసే నాకు, ఆ రోజు ఓ బందిఖానాలా ఉంది. ఉదయం పది గంటల నుండి నన్ను ఇంట్లోనే ఉంచారు మా అమ్మా నాన్నలు. అప్పుడు టైమ్ 12 గంటలు. అయినా పెళ్లి వారి రాక లేదు. చాలా ఆత్రుతగా ఉంది, టెన్షన్‌గా కూడా ఉంది. పెళ్లికొడుకు ఎలా ఉంటాడో అని. ఈ ఎదురుచూపు ఉందే, చాలా కష్టమైనది. నాకు అస్సలు నచ్చడం లేదు. ఎవరికోసమో నేను ఎదురుచూడటం ఏంటి? చాలా కోపంగా ఉంది, ఇంకా రావటం లేదని. ఇక ఆ తర్వాత నన్ను రెడీ చేయడం కూడా పూర్తయ్యింది. టైమ్ ఒకటిన్నర అయినా ఇంకా రాలేదు. నాకు బోర్‌గా ఉంది. కానీ కాస్త ఎంజాయ్‌మెంట్‌గానూ, కాస్త ఇష్టంగానూ, ఇంకొంచెం అయిష్టంగానూ ఉంది.
ఓ అరగంట ఎదురుచూపు తర్వాత రావలసినవారు రానే వచ్చారు. మరో అరగంట టీ, టిఫెన్ లాంటి మర్యాదలతో గడిచిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు నన్ను వారి ముందుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటుగా మరో ముగ్గురు. వారి బాబాయి, వారి చెల్లెలు, ఇంకా ఆయనగారి బావమరిది. అమాయకంగా, మరింత అందంగా నేను వెళ్లి ఆయన కుడిపక్కన కూర్చున్నాను. ఆయన కుర్చీలో, నేనేమో నేలమీద! అంతా నిశ్శబ్దం. అందరి చూపులూ నాపైనే ఉన్నాయి. ఒక్క ఆయనవి తప్ప. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఓ పది నిమిషాల తర్వాత పెళ్లిమాటలు మొదలెట్టారు అందరూ. అదే సరైన సమయమని నేను ధైర్యంగా తలెత్తి ఆయన్ని చూశాను. బహుశా ఆయనా నన్ను చూడలేదు కాబోలు!
ఇక నన్ను లోపలికి తీసుకెళ్లారు. ఏదో పందెంలో ఓడిపోయినప్పుడు కోపంగా అన్నీ విసిరిపారేస్తాం చూడండి! అలాగే నేను కూడా ఒంటిమీది చీర, నగలు తీసి వెంటనే డ్రెస్ తగిలించేశాను. ఏమో! ఆయన నాకు నచ్చలేదేమో! ఏమో! నచ్చాడా? లేదా?
ఈ ఆలోచనల్లో ఉండగానే మళ్లీ పిలుపు. పెళ్లికొడుకు నన్ను చూడలేదట. మళ్లీ రావాలని. ఏం చేయను? నాకేమో చీర కట్టు రాదాయె! అయినా అంత ఓపిక కూడా లేదు. అందుకే అలాగే వెళ్లి ఆయనకెదురుగా కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు నేను ఆయన్ని, ఆయన నన్ను సూటిగా చూసుకోగలిగాం. ‘ఆ క్షణం’ నా గుండెల్లో ‘గుడి గంటలు మోగడం’, ‘ఆకాశంలో మెరుపులు మెరవడం’, ‘నింగి నుండి పూల వర్షం కురవడం’... ఇలాంటి మ్యాజిక్‌లేవీ జరగలేదు, కానీ నాకనిపించింది, నా మనసు నాతో చెప్పింది, నా జీవిత భాగస్వామి ఈయనే అని. జీవితాంతం నాకు నీడై, నా తోడై ఉండేది ఇతడే అని!
ఇక అప్పుడే ‘ఇతడే... నేకలగన్న నా ప్రియుడు’ అంటూ ఓ సాంగ్ పాడేసుకున్నాను. అంతే! ఇక కట్ చేస్తే, మా పెళ్లి అయ్యి ఇప్పటికి ఐదేళ్లు. మాకో పాప. పేరు ‘లోహిత’. ఇలాంటి మధురక్షణాల్ని నెమరువేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
- మిసెస్ అచ్చనపల్లి సురేష్
యర్రగుంట్ల, కడప
ఆమాత్రం తెలియదా!
పదిహేనేళ్ల క్రితం ఒకసారి విజయవాడలో ఎగ్జిబిషన్‌కెళ్లి ఒక టాయ్ సెల్‌ఫోన్ కొన్నాను. మీటనొక్కితే, ‘ఐ లవ్ యూ’ అంటుందది. దాన్ని మా మనవరాలికి ఇచ్చాను. అప్పుడు దానికి ఆరేళ్లు.
గదిలోకి పోయి మాటిమాటికీ సెల్ నొక్కుతోంది.
‘‘మీ అమ్మాయి ప్రేమలో పడిందే, ఎవరో దానికి ‘ఐ లవ్ యూ’ చెపుతున్నారు’’ అన్నాను నవ్వుతూ.
దానికి నా మనవరాలు కోపంగా చూసింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. బుజ్జగించి అడిగితే చెప్పింది, ‘‘సెల్‌ఫోన్‌లోది ఆడ గొంతుట. ‘అబ్బాయి కదా అనాల్సింది’’అంది.
నా నోట మాట రాలేదు.
- ఎం.దుర్గాభవాని, నేలకొండపల్లి