మైక్రోస్కోప్... మడతడిపోది!
మైక్రోస్కోప్ అంటే అంత పెట్టె, దానికి తగిలించిన గొట్టం, ఆ గొట్టానికి భూతద్దాలు... ఈ పటాటోపమంతా మనకు తెలిసిందే. టెక్నాలజీ చాలా మారినా మైక్రోస్కోప్ రూపురేఖల్లో మాత్రం చాలాకాలం వరకు పెద్దగా మార్పులు రాలేదు. అయితే, ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఇంచక్కా మడతడిపోయే మైక్రోస్కోప్ మన ముందుకొచ్చింది. మీరట్ యువకుడు మనుప్రకాశ్ దీనిని రూపొందించాడు.
ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకున్న ఈ యువకుడు, కాస్త వినూత్నంగా ఆలోచించి, ఏ4 సైజు కాగితం పరిమాణంలో తేలికగా మడత పెట్టడానికి వీలయ్యే మైక్రోస్కోప్‌ను తయారు చేశాడు. కాన్పూర్‌లో చదువయ్యాక ఇతడు అమెరికా వెళ్లి, అక్కడ ఎంఐటీ నుంచి అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశాడు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌లో ప్రకాశ్ ల్యాబ్స్ పేరిట సొంత లాబొరేటరీని నిర్వహిస్తున్నాడు. కాగితంపైనే లెన్సులు, గొట్టం ఇమిడిపోయి ఉండేలా మనుప్రకాశ్ తయారు చేసిన ఈ మైక్రోస్కోప్‌ను... మడతపెట్టేసి, బ్యాగులో ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. దీని ధర కూడా కారుచౌక. కేవలం 50 సెంట్లు (మన కరెన్సీలో సుమారు రూ.30) మాత్రమే!