తెలివిని పంచి... పరిశ్రమను పెంచాలి!! | Industry to increase the knowledge and distribute ... !! | Sakshi
Sakshi News home page

తెలివిని పంచి... పరిశ్రమను పెంచాలి!!

Published Sun, Feb 8 2015 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

తెలివిని పంచి... పరిశ్రమను పెంచాలి!!

తెలివిని పంచి... పరిశ్రమను పెంచాలి!!

పరిశ్రమల రంగంలో తనదైన ముద్ర వేస్తున్న మహిళ గజ్జెల శకుంతలమ్మ. దేశంలో ట్రాన్స్‌ఫార్మర్ మీటరు బాక్సుల తయారు చేస్తున్న ఏకైక మహిళ. ‘బతకడం అంటే పదిమందికి బతుకునివ్వడం’... అని నమ్మే ఈమె తన అనుభవాలను పంచుకున్నారిలా...
 
మేము మొదట్లో రిఫ్రిజిరేటర్ విడిభాగాలు తయారు చేసి ఆల్విన్ కంపెనీకి సరఫరా చేసేవాళ్లం. ఆకంపెనీ మూత పడిన తర్వాత అనేక కంపెనీలకు అనేక రకాల వస్తువులను తయారు చేస్తూ పరిశ్రమను విస్తరించాం. ఇప్పటి వరకు దాదాపు 150 రకాల వస్తువులు తయారు చేశాం. మా కుటుంబంలో తొలి మహిళా పారిశ్రామికవేత్తను నేనే. గడచిన 23 ఏళ్లుగా పరిశ్రమను నడిపిస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు మహిళలు, మగవాళ్లు అంతా ముప్ఫై మంది పనిచేస్తున్నారు. అందరికీ కచ్చితంగా హాజరుపట్టీలు నిర్వహించడం, వేతనంతో కూడిన వారాంతపు సెలవుతోపాటు శ్రామికులకు వర్తించాల్సిన చట్టాలకు లోబడి ఇండస్ట్రీని నడిపిస్తున్నాను.
 
మాయ చేయరాదు, మెప్పించాలి!


ఒకసారి తయారైన వస్తువు అది స్టూలైనా, కుర్చీ అయినా పదేళ్లు, పాతికేళ్లయినా విరగనంత పటిష్టంగా ఉండాలి. పలుచటి మెటీరియల్‌తో చేసిన ఫైబర్ కుర్చీలు, స్టూళ్ల మీద కూర్చుంటే కాళ్లు వంగిపోతుంటాయి. వాటి మన్నిక తక్కువ కావడంతో ఏడాదిలోపే విరిగి రీసైక్లింగ్‌కి వస్తాయి. రీఫిల్ అయిపోక ముందే విరిగిపోయే పెన్నులు కూడా ఇదే కోవలోకి వస్తాయి. మార్కెట్‌లో తక్కువ ధరతో దొరికే నాసిరకం వస్తువుల ధాటికి తట్టుకోలేక మేము ట్రాన్స్‌ఫార్మర్ మీటరు బాక్సుల తయారీ వంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాము.
 
ఇదో పరిశోధన!


పరిశ్రమను విజయవంతంగా నడిపించాలంటే సమాజంలో మార్పులను గమనిస్తూ ఉండాలి. ఒక కొత్త వస్తువు మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే దానికి అనుబంధ వస్తువుల అవసరం ఏర్పడుతుంది. సెల్‌ఫోన్లు వచ్చాయి... వాటిని చార్జింగ్ పెట్టడానికి ప్లగ్ పాయింట్ పక్కనున్న కిటికీనో, రీడింగ్ టేబుల్‌నో ఆసరా చేసుకోవడాన్ని చూసి వీటికో స్టాండు తయారు చేద్దామనుకున్నాను. అనుకున్నంత త్వరగా దానిని డిజైన్ చేయించకపోవడంతో నేను పని మొదలు పెట్టేసరికే మార్కెట్‌లోకి ఆ స్టాండులు వచ్చేశాయి.

ఆ తర్వాత మేము చేసినా కూడా అనుకరణ అవుతుందే కానీ రూపకల్పన అనిపించుకోదు. ఫ్రిజ్‌లో వస్తువులు పెట్టుకోవడానికి అనువుగా ఎత్తు తక్కువగా ప్లాస్టిక్ ట్రేలు చేయించాను. అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు దేవుడి బొమ్మల తయారీ మీద దృష్టి పెట్టాను. రోజ్‌వుడ్‌తో చేసిన వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజుని బట్టి లక్ష రూపాయల పై మాటే. అదే ఫైబర్‌తో చేసి రాళ్లు పొదిగి మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో అందిస్తున్నా.
 
- వాకా మంజులారెడ్డి
 ఫొటోలు: రాజేశ్‌రెడ్డి

 
రెండు చక్రాలు...

ఎవరూ చదువుని, తెలివిని వృథా చేయకూడదు. ఉమ్మడి కుటుంబాలు లేని నేటి పరిస్థితుల్లో భర్త పారిశ్రామికవేత్త అయితే భార్య కూడా పరిశ్రమ నిర్వహణలో కీలకంగా మారాలి. భార్యాభర్త రెండు చక్రాలుగా పరిశ్రమను నడిపించాలి. భర్త లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా సరే, సమయాన్ని వృథా చేస్తూ షాపింగులతో కాలం వెళ్లబుచ్చవద్దని నాకు కనిపించిన వారందరికీ చెబుతుంటాను.
 - గజ్జెల శకుంతలమ్మ, నవ్య పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకురాలు, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement