ఈవారం కథ | It is customary to do so until the end of the festival | Sakshi
Sakshi News home page

ఈవారం కథ

Published Sat, Jan 12 2019 10:51 PM | Last Updated on Sun, Jan 13 2019 12:11 AM

It is customary to do so until the end of the festival - Sakshi

తెల్లార్తే భోగి... ఆ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఓ ఆచారం ఉంది. భోగిమంట వేయడానికి తడికెలు, కర్రల మోపులు, చెక్కతో చేసిన కొట్లు... ఏం దొరికితే వాటిని దొంగిలించి, మంటల్లో వేస్తారు.‘‘ఎంత పోడు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడు తప్ప పట్టించుకోడు. ఈ మనిషితో ఏగలేక సస్తున్నా..’’ తాటాకులు మడెం (ముడుచుకుపోయిన తాటాకులు వెడల్పు అయ్యేందుకు అమర్చే పద్ధతి) తొక్కుతున్న యానాది ఈరన్నతో అంటుంది సుబ్బమ్మ. అవేవీ పట్టించుకోకుండా అలవాటైపోయినట్లు నులకమంచంపైన కూర్చొని చుట్ట తాగుతున్నాడు నరసయ్య. ‘‘మొన్న కురిసిన దబాటు వాన (ఒక్కసారి పెద్దగా కురిసి ఆగిపోయేది)కు ఉన్న రెండు బస్తాల వడ్లు తడిసిపొయ్యాయి. రేపు అయ్యి మరాడిస్తే నూకలవుతాయి. ఏం తింటాడో..! దండెం మీదున్న బట్టలన్నీ తడవకుండా మూటగట్టి మంచం మీద పెట్టా. ఇల్లు మడుగు కాకుండా చినుకులు పడేచోట గిన్నెలు పెడ్తే ఖాళీలేక ఈయన పంచలో ఓ మూల ముడుక్కుని కూర్చొన్నాడు’’ సుబ్బమ్మ బరిగొడ్ల కట్టుమట్ట (గేదెలు కట్టేసిన గుంజ చుట్టూ ఉండే స్థలం) చిమ్ముతూ మాట్లాతూనే ఉంది.

నరసయ్య తాగుతున్న చుట్ట చివరి కొచ్చేసరికి విసిరేసి‘‘బస్టాండులో ఉన్న షాపు దగ్గరకొచ్చెయ్యండి. డబ్బులిస్తా’’ అని ఈరన్నతో చెప్పి పైకి లేశాడు. చీపురు కట్ట వెనుక చేత్తో తట్టి, ముందుకు వెనక్కు అయిన పుల్లలను సరిచేసి, వెళ్తున్న మొగుడి వైపు ఓ చూపు చూసింది సుబ్బమ్మ. ఆ చూపు గురించి నరసయ్యకు బాగా తెలుసు, కాబట్టే వెనక్కు తిరిగి చూడకుండానే వెళ్లిపోయాడు. ఎంకటేశం, నాగన్న తాటాకు మోపులు విప్పి ఆకులు అందిస్తుంటే గుడికట్టినట్లు చాలా అందంగా ఒక్కో ఆకును విడమర్చినట్లు పేర్చుతున్నాడు ఈరన్న. పదకొండు మోపుల తాటాకును రెండు మడేలు తొక్కాడు. సుబ్బమ్మ తలా గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది. ‘‘బయట తాటాకు మోపు పన్నెండొందలు అమ్ముతుంది. ఒకప్పట్లా రెడ్లు బరవాస(ఊరకనే)గా ఇచ్చే రోజులు పొయ్యాయి. పాపం నరసన్న అయినా ఏం చేస్తాడు చెప్పు’’ అన్నాడు మజ్జిగ తాగుతూ ఈరన్న.‘‘ఏదో ఒకటి చెయ్యాలి కదా... ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని వానపడ్డప్పుడల్లా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నా ఇంట్లోకి బయటకు తేడా లేకుండా పోయింది. పిల్లోడి పుస్తకాల సంచి కూడా తడిసిపోయింది. వాడు లబోదిబో అన్నాడు.

కాస్త ఎండుగడ్డన్నా కరువు(ఇంటి పైకప్పులో గుంతలు పడిన స్థలం)ల దగ్గర ఏయించమన్నా.’’ సుబ్బులు తన బాధల గురించి చెప్తూనే ఉంది.‘‘ఇప్పుడే కదా మడెం తొక్కాం. రెండు వారాలైతే ఆకులు సదరం (హెచ్చుతగ్గులు పోవడం) అవుతాయి. సంక్రాంతి పండగనెల పెట్టబోతున్నారు. మాకు పెద్దగా పనులేం ఉండవు. ఎట్లా కప్పేందుకు యరమాల నారాయణ ఉన్నాడుకదా... రెండు దూలాల ఇల్లు. రెండు రోజులు పట్టిద్ది. చూద్దాం ఒకరోజులో...’’ అన్నాడు ఈరన్న.తాగిన గ్లాసులిచ్చి, బస్టాండుకు బయల్దేరారు.షాపులో గడ్డం చేస్తున్న నరసయ్య దగ్గరకు ఆచారి పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘నరసన్నా... ఆ వజ్జిరెడ్డిపాలెం రామయ్య, వెంకటనర్సు ఈ ఏడాది సంక్రాంతి పండగ బిందెతీర్థం మేళాం ఒప్పుకుంటున్నారు’’ అని ఆయాసం ఆపుకుంటూ చెప్పాడు. ‘‘అదెలా కుదురుద్ది! మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. వాళ్లొచ్చి దూరితే ఎలా ఒప్పుకుంటా?’’ అంటూ చేస్తున్న గడ్డం సరిగా చేశాడో లేదో కూడా పట్టించుకోకుండా ఆచారితోపాటు జాలమ్మచెట్టు (రచ్చబండ) దగ్గరకు వెళ్లాడు నరసయ్య.

అక్కడ ఊరి పెద్దలందరూ కూర్చొని ఉన్నారు. రామయ్య, వెంకటనర్సు నరసయ్యను చూసి ముఖాలు తిప్పుకున్నారు.‘‘ఒరే...! ఇదేం పాడుబుద్ధిరా మీకు..? పక్కోడి నోటికాడ కూడు తియ్యాలని చూస్తున్నారు. మీ ఊళ్లోకి మీరు పిలవంది మేం ఏ మేళానికైనా వస్తున్నామా?’’ నిలదీశాడు నరసయ్య. ‘‘అదికాదు నరసయ్య... బిందెతీర్థం అంటే పండగ నెల పెట్టినప్పటి నుంచి పండగెళ్లిందాకా... రోజూ పని. పొద్దున్నే నాలుగు గంటలకు లేవాలి. ఒకటా రెండా మూడు గుళ్లు తిరగాలి. నీకు వయసు పెరుగుతుంది కదా..’’ అన్నాడు ఊరి పెద్ద వీరయ్య.అంటే ఈ నాటకం వెనుక వీరయ్య హస్తం ఉందన్నమాట అనుకున్నాడు మనసులో నరసయ్య.‘‘ప్రతి ఏడాదిలాగే, పక్కూరి నుంచి ఒక సన్నాయిని పిలుచుకుంటా’’ చెప్పాడు నరసయ్య.‘‘అదికాదు’’ అంటూ ఆదిరెడ్డి ఏదో చెప్పబోయాడు. నరసయ్యకు కోపం నషాలానికి ఎక్కింది.‘‘సరే... మీ ఇష్టం. ఈ బిందెతీర్థం వాళ్లకే ఇవ్వండి. ఇక ఊళ్లో ఏ చావొచ్చినా, పెళ్లొచ్చినాఏ కార్యం జరిగినా అన్నింటికి వాళ్లనే పిలిపించుకోండి’’ అని భుజాన ఉన్న కండువా విదిలించి, వెళ్లడానికి రెండడుగులు వేశాడు. ఆ మాట వెనకున్న అర్థం వీరయ్యకుబోధపడింది. ‘‘నరసయ్యా... నరసయ్యా’’ అని వెనక్కు పిలిచాడు.‘‘సరే... నీ ఇష్టం. అలాగే కానివ్వు’’ అంటూ పైకి లేచాడు.

అతనితోపాటు మిగిలిన వాళ్లందరూ కదిలారు. నరసయ్య వైపు రామయ్య, వెంకటనర్సు కొరకొరగా చూశారు. అవేవీ పట్టించుకోకుండా ఆచారితో కలిసి షాపునకు బయల్దేరాడు నరసయ్య. ∙∙∙పండగ నెల పెట్టారు. రోజూ ఆచారి మూడున్నర గంటలకల్లా నరసయ్య ఇంటికొచ్చి నిద్రలేపే వాడు. నరసయ్య డోలు తీసుకొని బయటకొచ్చేవాడు. ఇద్దరూ బస్టాండు దగ్గరున్న కన్నేశ్వరస్వామి గుడికి వెళ్లేవాళ్లు. అప్పటికే సన్నాయి వాయించడం కోసం మన్నూరు నుంచి వచ్చిన నాగలింగం గుడి దగ్గర ఉండేవాడు. ఆచారి కన్నేశ్వరస్వామి గుడిలోని బావి నీళ్లతో స్నానం చేసి, తడిబట్టలతో బావి చుట్టూ తిరిగి రాగిబిందె నిండా నీళ్లు నెత్తిన పెట్టుకుని రామలింగేశ్వర స్వామి గుడికి బయల్దేరేవాడు. పూజారితో పాటు నరసయ్య డోలు, నాగలింగం సన్నాయి వాయించుకుంటూ వీధిలో వెళ్లేవాళ్లు. రామలింగేశ్వరస్వామి గుడిలో ఉన్న శివలింగాన్ని ఆ నీళ్లతో అభిషేకించి, ఆ గుడిలో ఉన్న బావిలోంచి నీళ్లు తీసుకొని మల్లికార్జునస్వామి గుడికి వెళ్లేవాళ్లు. అక్కడ ఉన్న లింగాన్ని ఆ నీళ్లతో అభిషేకించేవాడు ఆచారి. మళ్లీ అక్కడున్న బావిలోంచి నీళ్లు తీసుకుని తిరిగి కన్నేశ్వరస్వామి గుడికి వచ్చేవాళ్లు. పూజారి మల్లికార్జునస్వామి గుడి నుంచి తెచ్చిన నీళ్లతో కన్నేశ్వరస్వామిని పూజించేవాడు.

పండగనెల పెట్టింది మొదలు పూర్తయ్యేవరకు ఇలా చేయడం ఆ ఊరి ఆచారం. బిందెతీర్థం మేళాం విని ఊళ్లో ఆడవాళ్లు నిద్రలేచే వాళ్లు. ఇంటి ముందు చిమ్మి పేడకల్లాపు చల్లేవాళ్లు. అందంగా రకరకాల ముగ్గులు వేసేవాళ్లు. నెలంతా బిందెతీర్థం వల్ల ఆచారికి నూటయాభై రూపాయలు. నరసయ్యకు రెండు వందలు. దాంట్లో వంద మన్నూరు నుంచి వచ్చిన నాగలింగానికి పోతుంది. తనకు వంద మిగులుతుంది. దానికన్నా ఊరి ఆచారం, దేవుడి మేళం అన్న తృప్తి కలుగుతుంది అంటాడు నరసయ్య. అన్నింటికి మించి మా ఊరు అనే ఆలోచనే నరసయ్యకు గొప్ప‘‘ఆకులు మడెం తొక్కించి నెలరోజులు దాటింది. వాళ్లేమో పది రోజుల్లో వస్తామని చెప్పారు. ఇంతవరకు అతీగతి లేదు. భోగి కూడా వస్తుంది. భోగికి ముసురు పట్టిందంటే వారం రోజులు తగ్గదు వాన’’ పొద్దున్నే మజ్జిగ చిలుకుతూ, పొది (కత్తులు, కత్తెర్లు, ఆకురాయి వంటి మంగలి సామాను ఉండే సంచి) తీసుకుని ఊళ్లోకి వెళ్తున్న నరసయ్యతో అంది సుబ్బులు. ‘‘అలాగేలే.. కనుక్కుంటా...’’ అంటూ వెళ్లబోతున్న నరసయ్యతో... ‘‘ఈ సారి వాన వచ్చిందంటే నువ్వు నేను మూటముల్లె సర్దుకొని ఆ దేవుడి పంచల్లోకి వెళ్లాల్సిందే’’ గట్టిగా చెప్పింది. పెళ్లాం చెప్పేదానిలో కూడా నిజం ఉంది.

ఏడు కట్టలు తడపలు తెప్పించి వారం రోజులు అవుతుంది. బజారులో ఈరన్న కనిపిస్తే రమ్మని చెప్పాలి. ఎట్లా యరమాల నారాయణ ఇంటి దగ్గరే ఉంటాడు. ఎప్పుడు పిలిచినా వస్తాడు. అనుకుంటూ ఊళ్లోకి బయల్దేరాడు నరసయ్య. బుస్సు హోటల్‌ దగ్గర ఈరన్నటిఫిన్‌ తింటూ కనిపించాడు. ‘‘ఏం ఈరన్నా! ఇల్లేమన్నా కప్పేదుందా? లేదా?’’ అడిగాడు.‘‘ఈ రోజు జాలిరెడ్డి పసుపుతోటలో పనుంది. ఎల్లుండి కదా భోగి. రేపు వస్తాం. తడపలు నానేసి పెట్టు’’ అని చెప్పాడు ఈరన్న. ‘‘హమ్మయ్య..!’’ రేపటికి ముడిపడింది అనుకుంటూ సంతోషంగా టీ తాగేసి, గడ్డం చేయడానికి లింగారెడ్డి ఇంటికి బయల్దేరాడు నరసయ్య.అనుకున్నట్లుగానే ఈరన్న, ఎంకటేశం నాగన్నతోపాటు మరో ముగ్గుర్ని తీసుకొని పొద్దున్నే వచ్చాడు. నరసయ్య బిందెతీర్థం పని ముగించుకుని ఇంటిదగ్గరే ఉన్నాడు. అప్పటికే సుబ్బులు ఇంట్లో సామానంతా భద్రంగా మూటలు గట్టి మంచాలు బయటేసి వాటిపై పెట్టింది. ఈరన్న, ఎంకటేశం ఇల్లు ఎక్కి కట్లు కోసి, పాత తాటాకులు పూర్తిగా తీసేశారు. తర్వాత యరమాల నారాయణ పైకెక్కి ఎక్కడెక్కడ కట్లు వదులయ్యాయో చూసి, కొత్త తడపలతో గట్టిగా కట్టాడు. మూలవాసం (కింద చూరు నుంచి దూలం మీదుగా పై వరకు నాలుగు మూలలా ఉండే వెదురు కట్టెలు) ఒకటి పుచ్చినట్లు అనిపిస్తే కొత్తది వేసి బిర్రుగా కట్టాడు.

అందరూ కలిసి పదిగంటలకల్లా ఇంటిని కప్పుకు సిద్ధం చేశారు. నాగన్న మిగిలిన ఇద్దరూ కొన్ని తడపలను ఒకదానితో ఒకటి ముడేసి పొడుగ్గా చేశారు. పట్నార తడపల్ని (తాటి బద్దల పైతోలుతో వలిచేవి, గట్టిగా ఉంటాయి) ప్రత్యేకంగా పక్కన పెట్టారు. యరమాల నారాయణ గోసి పెట్టుకొని సూరుకట్టు బద్ద (ఒక చివర బాణంలా ఉండి రంధ్రంతో, మూరపొడుగు ఉన్న వెదురు బద్ద) తీసుకుని ఇల్లెక్కాడు. ఈరన్న తడపలు (ఆకు కోసిన తర్వాత మిగిలిన తాటి మట్టలను దొరువుల్లో నానేస్తారు. వాటిని పల్చగా చీలుస్తారు) తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. నారాయణ హెచ్చుతగ్గులు చూసుకుంటూ ఆకుల్ని ఇంటిపైన ఒకదాని తర్వాత ఒకటి కప్పుగా అమర్చుతున్నాడు. ఆకులు గాలికి ఎగరకుండా సూరుకట్టు బద్దతో ఆకుల మధ్య నుంచి లోపలకు పొడిస్తే దాని రంధ్రంలో తడప గుచ్చుతున్నాడు లోపలున్న ఈరన్న. దాన్ని పైకి లాక్కుని కప్పుకున్న కర్రలకు అనువుగా మళ్లీ సూరికట్టు బద్దతో లోపలకు గుచ్చి ఇస్తే రెండు తడప కొసల్ని వెదురు కట్టెకు, ఆకులకు కలిపి గట్టిగా ఏనుగు ముళ్లేస్తున్నాడు ఈరన్న. తాటాకుతో ఇల్లు కప్పడం అద్భుతమైన కళ. నేర్చుకుంటే వచ్చేది కాదు. బతుకులో భాగం కావాలి.

అక్షరం ముక్కరాని నారాయణ, బడి ఎలా ఉంటదో తెలియని ఈరన్నకు ఎలా అబ్బిందో (వచ్చిందో)... పదో తరగతి చదువుకుంటున్న నరసయ్య కొడుక్కు అర్థంగాక వింతగా చూస్తా ఉన్నాడు. సమయం రెండు అయింది. అందరూ పనులాపి, మళ్లీ సుబ్బులు పెట్టిన అన్నం తిన్నారు. అప్పటికి కప్పటం రెండు అరలే పూర్తయ్యాయి. ఇంకా అయిదు అరల పని  ఉంది. వెంటనే పని మొదలు పెట్టారు. సాయంత్రం ఆరు అయినా కప్పు పూర్తికాలేదు. ఆకులు మిగిలి ఉన్నాయి. తడపలూ ఉన్నాయి. పొద్దే లేదు. అసలే యరమాల నారాయణకు చూపుతగ్గి ఏడాదైంది. అందులో కప్పాల్సింది నడికొప్పు. ఆకు సరిగా పడలేదంటే, సూరులోకి జారే నీళ్లన్నీ, నట్టింట్లో పడతాయి. ‘‘నరసన్నా! కష్టం...! ఇక రేపు భోగో గీగో...! పొద్దున్నే వచ్చి, ఈ పని చేసి అప్పుడే ఇళ్లకెళ్లి భోగి నీళ్లు పోసుకుంటాం’’ అన్నాడు ఈరన్న. నారాయణ చెప్పకపోయినా అతనిది అదే మాట. సుబ్బులు కూడా ఏమీ అనలేక పోయింది. నరసయ్య కూడా ‘‘సరే..!. రేపు పొద్దున్నే రండి...’’ అన్నాడు. రేపటి కోసం మిగిలిన తాటాకులన్నీ ఏరి మోపు కట్టాడు నాగన్న. తడపలూ పక్కనే పెట్టాడు.

 కాళ్లూ చేతులు కడుక్కుని అందరూ వెళ్లిపోయారు.తెల్లార్తే భోగి... ఆ ఊళ్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఓ ఆచారం ఉంది. భోగిమంట వేయడానికి తడికెలు, కర్రల మోపులు, చెక్కతో చేసిన కొట్లు... ఏం దొరికితే వాటిని దొంగిలించి, మంటల్లో వేస్తారు. ఆ రాత్రంగా ఏవీ పోకుండా ఇళ్లల్లో వాళ్లు కాపలా కాస్తుంటారు. కొందరు గుంపుగా కలిసి వీధుల్లో తిరుగుతూ ఉంటే, ఆకతాయి కుర్రాళ్లు దొంగతనం చేయడానికి ఏం దొరుకుతాయా అని మాటువేస్తుంటారు. పైగా ఆరోజు భోగిమంటల్లో వేయడానికి ఏం దొంగిలించినా తప్పు  కాదు. సంప్రదాయం.   నరసయ్య ఇంటికప్పు సగంలో ఉందని ఊళ్లో అందరికీ తెలుసు. కానీ అతడి మంచితనం గురించి తెలిసిన  వాళ్లెవరూ ఆవైపు చూడరు. ఆ ధైర్యం నరసయ్యలో కొండంత ఉంది. కానీ ఎందుకైనా మంచిదని మంచం మోపు దగ్గరే వేసుకుని, చుట్ట తాగుతూ రాత్రంతా మేలుకున్నాడు. దొంగల గుంపు అటుగా వస్తే సరదాగా ‘‘ఏం దొరక లేదా?’’ అని పలకరించాడు. వాళ్లూ నవ్వుతూ ‘‘నరసన్న పడుకో... మీ ఇంటికి ఎందుకొస్తాం’’ అని వెళ్లిపోయారు. భోగి కదా అని ఆచారి మూడు గంటలకే వచ్చి పిలిచాడు. నరసయ్య డోలు తీసుకొని వెళ్తూ ‘‘ఇదిగో జాగ్రత్తా... ఆ తాటాకు మోపు అక్కడే ఉంది’’.

అని పెళ్లానికి చెప్పాడు. పందిట్లో పడుకుని ఉన్న సుబ్బులుకు మాగన్నుగా (కొద్దిగా) నిద్ర పట్టింది. పిల్లలు మరో మంచం మీద నిమ్మచెట్ల కింద హాయిగా నిద్ర పోతున్నారు.‘‘ఏం నరసన్నా ఇల్లు పూర్తి కాలేదా...’’ అడిగాడు ఆచారి. ‘‘లేదు ఇంకొద్దిగా ఉంది. ఈ రోజు పొద్దున్నే అయిపోతుంది’’ అన్నాడు నరసయ్య.‘‘మరి తాటాకు మోపు... అక్కడే ఉంది. భోగి కదా...’’ అన్నాడు ఆచారి.‘‘మూడు దాటింది..! ఇంకెవరు వస్తారు?’’ అని ధీమాగా అన్నాడు నరసయ్య.ఆచారి కన్నేశ్వరిస్వామి గుడిలో నీళ్లు తీసుకుని రామలింగేశ్వరస్వామి గుడికి వస్తున్నాడు. ఆచారితో పాటు నరసయ్య, నాగలింగం భోగి పండుగనే సంతోషంతో ఉత్సాహంగా మేళం వాయిస్తూ ఉన్నారు. డోలుకుడివైపున్న మూతమీద పుల్ల దుబ్‌ దుబ్‌ అని శబ్దంచేస్తుంటే, అందుకు తగ్గట్టు ఎడం వైపున్న మూతపై అతడి బొట్టెలున్న (ప్రత్యేకంగా డోలు వాయించేటప్పుడు పెట్టుకునే తొడుగులు) వేళ్లు అద్భుతంగా నాట్యం చేస్తున్నాయి. నాగలింగం సన్నాయిని తిప్పుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నట్లుగా ఊదుతున్నాడు. మంగళవాయిద్యాల చప్పుడికి లేచిన ఆడవాళ్లు, సంతోషంగా చిరునవ్వుతో వాళ్లను పలకరిస్తున్నారు. కల్లాపు చల్తున్న వాళ్లు, ముగ్గులేస్తున్న వాళ్లు, మేళం శబ్దానికి తలలు ఎత్తి చూసి ఆనందిస్తున్నారు.

మల్లికార్జునస్వామి గుడి నుంచి బిందెతీర్థం కన్నేశ్వరస్వామి గుడికి తీసుకుని వెళ్తున్నారు ముగ్గురూ. ఆచారి నెత్తిన బిందెలో ఉన్న మంచినీళ్ల తీర్థం, నాగలింగం సన్నాయి, నరసయ్య డోలు.. వేకువజామున మేలుకొలుపు పాడుతోంది ఊరికి. వీధి మధ్యలో పెద్ద భోగిమంట. అప్పుడే ఎవరో వేసినట్లున్నారు. మంటల కొసల్లోంచి తాటాకు రవ్వలు గాల్లోకి లేస్తున్నాయి. నరసయ్యకు మనసులో ఏదో చెడు తోచింది. తీరా దగ్గరకు వెళ్లారు. మిగిలిన ఇల్లు కప్పడానికి ఉంచిన తాటాకులు అవి. మంటల్లో తగలబడి పోతున్నాయి. అప్పటి వరకు కళాత్మకంగా శివుడి ఢమరుక శబ్దాలను మోగించిన నరసయ్య డోలు హఠాత్తుగా మూగపోయింది. ‘‘నరసన్నా ఇవి నీ ఇంట్లో ఆకులే...’’ అరుస్తున్నట్లు అన్నాడు ఆచారి. ముందు వెనుక ఆలోచించకుండా నెత్తిమీదున్న బిందెతీర్థం మంటపై పోశాడు. శివలింగాన్ని సైతం శుద్ధి చేసే బిందెతీర్థం ఆ మంటను మాత్రం ఆర్పలేకపోయాయి.ఊరికోసం.

దేవుడి కోసం బిందెతీర్థం మేళంకోసం గొడవపెట్టుకున్న నరసయ్య చూపు, గుండె ఆ మంటల్లాగే ఎగిసిపడుతున్నాయి. నాగలింగం సన్నాయి ఆపేసి బండరాయిలా నిలబడి చూస్తున్నాడు. మేళం ఆగిపోవడంతో అందరూ గుమిగూడారు. ఇళ్లల్లోంచి నీళ్లు తెచ్చి మంటలనైతే ఆపారు. కానీ, అప్పటికే ఆకులన్నీ బూడిదై పోయాయి.\నరసయ్యకు తెలుసు... ఎవరు ఆ పనిచేశారో...! ఎవరు చేయించారో...!?నిద్రలేచిన సుబ్బులు తాటాకుమోపు కనిపించలేదని అందర్నీ కోపంతో తిట్టిపోస్తుంది.రేపు ఊరి పెద్దమనుషులు ఆచారికి ఏ శిక్ష విధిస్తారో తెలియదు.  ఎవరో పిలిచినట్లు ఆకాశంలో మబ్బులన్నీ కురవడానికి నల్లగా ఒకచోట చేరాయి.పూర్తిగా కప్పులేని ఇల్లు మాత్రం గోపురం లేని ఆలయంలా నిలబడి చూస్తోంది.                ∙

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement