సృజనం: లేడీస్ కంపార్ట్‌మెంట్ | Ladies Compartment | Sakshi
Sakshi News home page

సృజనం: లేడీస్ కంపార్ట్‌మెంట్

Published Sun, Aug 11 2013 2:08 AM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

Ladies Compartment

ఒక రాత్రి ప్రయాణం కోసం, కూచోడానికి స్థలం కోసం యుద్ధం మొదలయ్యింది. రోజువారి యుద్ధంలో ప్రావీణ్యం ఉన్నవారు ఆ యుద్ధంలో గెలవటానికి తమ శక్తులన్నీ వొడ్డి పోరాడుతున్నారు. ఆ క్షణంలో అదే జీవన్మరణ పోరాటం అయ్యింది.

ఒక రాత్రి ప్రయాణం కోసం, కూచోడానికి స్థలం కోసం యుద్ధం మొదలయ్యింది. రోజువారి యుద్ధంలో ప్రావీణ్యం ఉన్నవారు ఆ యుద్ధంలో గెలవటానికి తమ శక్తులన్నీ వొడ్డి  పోరాడుతున్నారు. ఆ క్షణంలో అదే జీవన్మరణ పోరాటం అయ్యింది.
 
 ‘‘సమోసా... సమోసా... వేడి వేడి సమోసా...’’
 ‘‘మా! సమోసమా... కొనీమా...’’
 ‘‘వద్దే! తినగూడ్దు...’’
 ‘‘హు... హు... ఒక్క సమోసమా...’’
 ‘‘ఎప్పుడు జేసిండేటివో ఏమో. తింటే పొట్టలో అబ్బయితాది. డాటరమ్మ సూదేచ్చాది.’’
 ‘‘హు... హు... ఒగటేలేమా...’’
 ‘‘చెప్తే యినవేమే. చిత్రాన్నం చేసకచ్చినా కదా? అది పెడ్తా తిను. మాయమ్మవు కదూ.’’
   
 ‘‘మ్మోవ్! రొంత జరగండి.’’
 ‘‘యాటికి జరగాలా? యాడుంది ఈడ జరగేకి...’’
 ‘‘అట్లంటే ఎట్లయితాది? వొంటికి పోవాల్ల నేను.’’
 ‘‘యిప్పుడే రావాల్నా వొంటికి నీకు. యింతమందిని దాటుకొని ఎట్ల పోదామని? రొంతసేపుండు. అన్నే కూకో.’’
 ‘‘సానాసేపట్నుండి అట్నే కూకోనుండా! అరిజెంటు.’’
 ‘‘జరగండే! సూచ్చాంటే ముసిల్ది యిన్నే పోసుకునేట్టుంది.’’
   
 ‘‘పాపోనికి దిక్కు తెలీడంల్యా! ఎట్ల ఏడుచ్చాన్నాడో జూడు.’’
 ‘‘పాపోన్ది సొక్కా యిప్పేయ్ అకయా.’’
 ‘‘మనమే తట్టుకునేట్టుగా లేదు; యింగ పసిపిల్లోల్ల మాట జెప్పాల్నా!’’
 ‘‘ఇరవై మంది కూకునే సోట నూరుమంది ఉండాం. గాలి రమ్మంటే యాన్నుండి వచ్చాది.’’
   
 ‘‘మేస్త్రమ్మా... ఎన్ని తిప్పలు పెడ్తాండావ్ తల్లీ.’’
 చక్కిలాలు నమలడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తోంది మేస్త్రమ్మ.
 ‘‘ఈ ఆగసాట్ల కంటే బస్సులో పోయింటే బాగుండు కదమా.’’
 ‘‘బస్సుకయితే టికట్టు మనమే పెట్టుకోవాలని జెప్పినారు. రైలయితే మేస్త్రీవాళ్లే పెట్టుకుంటారు.’’
 ‘‘బస్సుకయితే పోడానికి ఏన్నూర్లు అయితాదంట... మనట్లాటోళ్ల స్యాత అయ్యేదేనా?’’
 ‘‘మేస్త్రీకి, మేస్త్రీ పెళ్లానికి సానా వుపాయం.’’
 ‘‘దీనెంట పదిమంది ఆడోళ్లము పోతాండాము. అందరికి టిక్కెట్టు తీసుకోంటాదాంటావా ఈ బసిలి?’’
   
 నన్ను ముట్టుకోకు నామాల కాకి అని సీటులో కూర్చున్నప్పటినుండి సెల్ ఆన్ చేసి యియర్ ఫోన్స్ పెట్టుకొని కళ్లు మూసుకొని పాటలు వింటూనే ఉంది చుడీదార్ అమ్మాయి. మీతో మాట్లాడితే నా లెవల్ ఏం కావాల అన్నట్టు మధ్యమధ్యలో కళ్లు తెరిచి విసుగ్గా పక్కనున్న వాళ్లను చూస్తోంది.
 ‘‘మా పెద్దనాయన యినపడకుంటే చెవులో మిసన్ పెట్టుకొని తిర్లాడతాండ్యా.’’
 ‘‘ఈ కాలమోళ్లు ఏందీ యినపడగూడ్దని చెవులల్లో మిసిన్లు పెట్టుకొని తిర్లాడుతాంటారు.’’
 ఒకరి భుజాలు ఒకరు చరుచుకొని పడిపడి నవ్వారు.
 చుడీదార్ అమ్మాయి మోచేతిని పొడిచింది వాళ్ల అమ్మ. సగం కళ్లు తెరిచి వాళ్లమ్మ వైపు విసుగ్గా చూసింది.
 ‘‘నీ బిడ్డా అక్కా?’’
 ‘‘అవ్.’’
 ‘‘సదువుకుంటాందా?’’
 ‘‘ఊ. బి.కామ్ కంప్యీటర్.’’
 ‘‘పెద్ద సదువే! ఏం జేచ్చాంటారు మీరు?’’
 ‘‘వీళ్ల డాడీ పెయింట్ల షాపులో పనిజేస్తాడు. నేను యిండ్లల్లో బట్టలుతకడానికి పోతాంటాను.’’
   
 వీళ్లంతా మాటలతో ఎందుకు సమయాన్ని వృథా చేసుకుంటున్నారు అని ఆశ్చర్యపోయింది పోనీటెయిల్ అమ్మాయి. నెట్వర్కింగ్ కంపెనీ యిచ్చిన ఆఫర్ను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నానో నన్ను చూసి నేర్చుకోండి అన్నట్లు సెల్లు సందేశాలను నిరంతరాయంగా పంపుతూనే ఉంది.
   
 స్టేషన్ వచ్చింది. ఒకరు దిగారు. సామాన్లతో పాటు ముగ్గురు లోనికి దూసుకొని వచ్చారు.
 కిక్కిరిసిపోయిన కంపార్ట్‌మెంట్ చూసి యిది మామూలే అన్నట్టు టాయిలెట్ పక్కన సామాన్లు పడేసి వాటిపైన సర్దుకొని కూచున్నారు.
   
 జాకిట్టులో నుండి పర్సు తీసింది. పర్సులో నుండి సెల్లు తీసింది.
 ‘‘ఎక్కినావ్ కదా.’’
 ‘‘..........’’
 ‘‘ఊ. ఊ. మాకేం పర్వాలేదులే. కూకోనే వుండాం.’’
 సెల్లును పర్సులో పెట్టుకుంది. పర్సును జాకెట్లో దాచుకుంది.
 ‘‘మీ బావకు సీటు దొరకలేదంటనే! నిలబడేకి కూడా సానా యిబ్బందిగా ఉందంట.’’
 వాకిలి దగ్గర కూచున్న ఇరవై అయిదు సంవత్సరాల యువతి పొడి కళ్లతో వాళ్లక్క వైపు ఒక్క క్షణం చూసి చూపులు తిప్పుకుంది.
 ‘‘మీ అక్కా ఆయమ్మా! మీ అమ్మేమో అనుకుంటి.’’
 తనను కాదన్నట్టు చీకట్లోకి తీక్షణంగా చూస్తోంది ఆ యువతి.
 ‘‘అదంతే ఎవ్వరితోనూ మాట్లాడదు. దయ్యమాకట్ల చూస్తాంటాది.’’
   
 ‘‘సమోసా... సమోసా... వేడి వేడి సమోసా...’’ పిల్లలున్న తల్లుల దగ్గరే తిరుగుతున్నాడు ఆ పిల్లవాడు.
 డబ్బాలో సగంపైనే ఉన్న సమోసాలను చల్లారిపోతే ఎవ్వరూ కొనరేమో అనే దిగులు ముఖంలో కనిపిస్తోంది.
 ‘ఈ ఆడోళ్ల దగ్గర డబ్బులు మాత్రం ఉండవు. ఈడ ఐదారు కంటే ఎక్కువ అమ్ముడు పోవు. ఈ డబ్బా పట్టుకొని వీళ్లను దాటుకొని ఎట్ల పోవాలబ్బా’
 ‘పదిమందిమి ఉండాము. ఈ మేస్త్రమ్మ తలా ఒకటి సమోసా కొనియ్యచ్చు కదా. సచ్చిపోతాంటాది. పైసాకు పీ తినే రకం.’
   
 చిత్రాన్నంలోని శెనక్కాయ విత్తనాలను ఏరి కూతురికి పెడ్తోంది. పుట్టింట్లో నాలుగు రోజులు ఎక్కువ ఉన్నందుకు మొగుడు కొట్టే దెబ్బలను తలుచుకొని వణికిపోతోంది. వాటిని తప్పించుకోడానికి ఏం చేయొచ్చు అని ఆలోచిస్తోంది.
   
 చెమటలు కారిపోతున్నాయి.
 ‘‘హుష్. అబ్బబ్బబ్బా...’’ ఆయాసపడిపోతోంది.
 కొంగుతో ముఖం, మెడ తుడుచుకుంది. పయిట పూర్తిగా తీసేసి జాకిట్టు గుండీలు పైనవి రెండు విప్పుకుంది. కొంగుతోనే వీపు, చంకలు తుడుచుకుంది. మెల్లిగా పయిటతోనే వూపుకుంటోంది.
 లోపల కారే చెమటలను తుడుచుకోలేక అవస్థలు పడుతోంది నల్ల బుర్ఖా.
   
 కూతురి ఒడిలో వున్న పసిపిల్లవాణ్ని తీసుకొని తన ఒళ్లో వేసుకుంది. పిల్లవాని ముఖానికి తగలకుండా తుండుగుడ్డతో మెల్లిగా వూపుతూ, కూతురికి పోసే వొడిబియ్యానికి అయ్యే ఖర్చును ఎవరి దగ్గర అప్పు చేయాలా అని ఆలోచిస్తోంది నడివయస్సులో ఉన్న కొడుకును కన్న కూతురి తల్లి.
   
 పాటలు వింటూ కాళ్లు, చేతులు ఆడిస్తూ ఉంది చుడీదార్ అమ్మాయి. అప్పుడప్పుడు ఆవులిస్తూ తూగుతోంది.
 ‘నేను లేనని చెప్పి నెల జీతం తీసుకొనింటాడో ఏమో? మేము పోయేపాటికి తాగి అంతా అయిపోజేసింటాడో ఏమో! మా ఆయన వచ్చి డబ్బులు అడిగితే యియ్యొద్దొండమా అని చెప్పాల వాళ్లకు. మర్యాద గిర్యాద అనుకుంటే అయ్యేది లేదు...’ అరచేతులతో కళ్లు రుద్దుకుంది.
   
 ‘అక్కడన్నా రోజూ పని దొరుకుతాదో లేదో? పిల్లకు ఈసారి అన్నా పెండ్లియోగం ఉందో లేదో...’ పదహారేళ్లు నిండిన కూతుర్ని చూసి ఆందోళన పడుతోంది.
 మేస్త్రమ్మ చక్కిలాలు నములుతూనే ఉంది. నాలుకకు లొంగడం లేదని గోళ్లను రంగంలో దింపింది కూచుంటే లేవలేని మేస్త్రమ్మ.
   
 ‘‘పొందాలా మీరు వొంటికి అని వస్తే బాగుండదు జూడండి. మీరు వచ్చినప్పుడల్లా లేసేకి ఈడ జాగా యాడుంది?’’
 ‘‘లోపల నీళ్లు రాడం లేదు.’’
 ‘‘లోపల నీళ్లు రాడం లేదంటా. ఎవ్వరూ ఈడకెళ్లి రావాకండి. కంపు గొడ్తాంది.’’
 ‘‘ఎవ్వర్నీ నీళ్లు తాగొద్దని చెప్పర్రి’’
 టాయిలెట్ దగ్గర కూచున్నవాళ్లందరూ కొంగులు అడ్డం పెట్టుకొని ముక్కులు మూసుకున్నారు. మిగిలినవాళ్లు కూడా ఆ కంపుకు అలవాటు పడటానికి సిద్ధం అవుతున్నారు.
   
 చీకట్లోని రహస్యాలను అంచనా వేయడానికి అన్నట్టు మరింత తీక్షణంగా చీకట్లోకి చూస్తోంది ఆ యువతి. కదిలిపోతున్న దృశ్యాలను చూస్తూ గడిచిపోయిన జీవిత దృశ్యాలను చీకట్లో చూసుకుంటోంది. పెండ్లి అయిన మూడు నెలలకే భర్త వదిలేసిన దృశ్యం. పంచాయితి... చింతచెట్టు కింద దృశ్యం. దీనికి మళ్లీ పెండ్లి జేయడం మా చ్యాత కాదు... ఏడుపు దృశ్యం. నేను జేసుకుంటాను... అక్క మొగుడు రంగ ప్రవేశం చేసిన దృశ్యం. పంతం పట్టినట్లుగా కళ్లు పత్తికాయల్లాగా చేసుకొని చీకట్లోకి చూస్తూనే ఉంది.
   
 స్టేషన్ వచ్చింది. ఇద్దరు దిగారు. ఆరుమంది ఎక్కారు. ఆరు రెండ్ల పన్నెండు మంది పిల్లలు కూడా ఎక్కారు. పన్నెండు రెండ్ల ఇరవై నాలుగు సంచులను కూడా కంపార్ట్‌మెంట్‌లోకి తోసేశారు. అంతా రెండు నిమిషాల్లో అయిపోయింది.
 
 ఒక రాత్రి ప్రయాణం కోసం, కూచోడానికి స్థలం కోసం యుద్ధం మొదలయ్యింది.
 రోజువారి యుద్ధంలో ప్రావీణ్యం ఉన్నవారు ఆ యుద్ధంలో గెలవటానికి తమ శక్తులన్నీ వొడ్డి పోరాడుతున్నారు. ఆ క్షణంలో అదే జీవన్మరణ పోరాటం అయ్యింది.
 మనుషుల అరుపుల్లో, తిట్లల్లో, పిల్లల ఏడుపుల్లో రైలు కూత, సైరన్ ముందు మోగే అలారంలాగా ఉంది. మిమ్మల్నందర్ని నగరానికి చేరవేయడమే నా లక్ష్యం అన్నట్టు గమ్యం వైపు జాగ్రత్తగా, ఏకాగ్రతతో రైలుపట్టాల మీద పరుగులు తీస్తోంది.
 -  కె.సుభాషిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement