అ.. అంటే అమెరికా! ఆ.. అంటే ఆనందం!! | Lets Read: Beautiful Places In America | Sakshi
Sakshi News home page

పడమటి సంధ్యారాగం

Published Sun, Feb 23 2020 10:58 AM | Last Updated on Sun, Feb 23 2020 1:40 PM

Lets Read: Beautiful Places In America - Sakshi

సెయింట్‌ లూయీ ఆర్చ్‌వ్యూ, నిండు మిసిసిపి మహానది ఆర్చ్‌వ్యూ 

అందమైన ప్రకృతి, అహ్లాదకరమైన వాతావరణం, మనసుని కట్టిపడేసే వనాలు, సహజ తటాకాలు, విశాలమైన రహదారులు, క్రమబద్ధమైన విధానాలు.. అంతేనా! ఎన్నో దేశాల నుంచి వచ్చిన శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, నిపుణులు, తమ ప్రతిభనంతా గుమ్మరించి సృష్టించిన ‘‘మాడరన్‌ మాయబజార్‌’’ కూడా! పర్యాటకులను, విద్యార్థులను, ఉద్యోగార్థులను ఆకర్షిస్తున్న ‘అయిస్కాంతం’,  A Land of Opportunities అంటారు కూడా! ఇప్పుడు ఇంటి కోడళ్లు ఎన్‌.ఆర్‌.ఐ.లు వుండటం వల్ల, ఎక్కువగా అమెరికా సందర్శిస్తున్నారు.
మా చిన్నారి మనవడు, మనవరాళ్ల ‘ఆట–పాట’ చూసి ఆనందించడానికి గత సంవత్సరం, వేసవిలో నేను మా శ్రీవారు ‘షికాగో’కు వెళ్లాము. అక్కడ వారికి ‘వసంతకాలం’ (స్ప్రింగ్‌) ప్రకృతి సౌందర్యాలు పూరిస్తుంటే ‘లాంగ్‌ వీకెండ్‌’లో విహారయాత్రకు ‘మిస్సోరి’ రాష్ట్రంలో ఉన్న ‘సెయింట్‌ లూయీ’కు ప్లాన్‌ చేసుకున్నాం. ఆ నగరంలోనే జంధ్యాల గారి ‘పడమటి సంధ్యారాగం’ (1987) సినిమా ఎక్కువ భాగం తీశారు.

షికాగో నుంచి 500 కి.మీ. దూరంలో ‘సెయింట్‌ లూయీ’ ఉంది. మధ్యలో ‘బ్లూమింగ్‌ టన్‌’ నగరంలో మా బావగారి కొడుకును కలిసినట్టు ఉంటుందని, అక్కడ ఒక మజిలీ వేద్దామని, మేము కారులో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరాం. వరుస సెలవుల వల్ల రోడ్లపై కార్లు చీమల బార్లుగా మెల్లగా కదులుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ‘బ్లూమింగ్‌టన్‌’ చేరాం.
ఇక అన్ని హంగులున్న చిన్న నగరం ఈ ఊళ్లో విశేషం. సగం మంది మన తెలుగువాళ్లే! పార్క్‌కి వెళ్లినా, మాల్స్‌కి వెళ్లినా, తెలుగు వినిపిస్తూ ‘తెనాలి’లో ఉన్నామనిపిస్తుంది. ఎక్కువ మంది ‘స్టేట్‌ఫామ్‌ ఇన్సూరెన్స్‌’ ఉద్యోగులే! ఆరేళ్ల విరామం అనంతరం కలిశాం. కనుక రాత్రి బాగా పొద్దుపోయే వరకు ముచ్చట్లు చెప్పుకుంటూ, ఎప్పుడో నిద్రలో జారుకున్నాం. పక్కరోజు ఉదయం 11 గంటలకు 260 కి.మీ. దూరంలో ఉన్న ‘సెయింట్‌ లూయీ’కి ప్రయాణం మొదలుపెట్టాం.

ఇలా మొదలైంది..
1933 ఎల్‌.ఇ.స్మిత్‌ అనే ప్రజానాయకుడు. ‘ఇండియానా’లోని ‘జార్జిరోజర్స్‌’ జాతీయ పార్కు సందర్శించి, సెయింట్‌ లూయీకు తిరిగి వస్తూ, దూరం నుంచి ‘మిసిసిపి’ నది సౌందర్యానికి ముగ్దుడై, అక్కడ ఒక గొప్ప స్మారక చిహ్నం కడితే, ఆ ప్రాంతం పర్యాటకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఊహించాడు. నగరమేయర్‌కు వివరించగా 15.12.1933లో నగర పెద్దలను ఆహ్వానించడం, వారు ఆమోదం తెలపడం.. వెంటవెంటనే జరిగాయి. అమెరికాను పశ్చిమ ప్రాంతం దిశగా విస్తరింపజేసిన అధ్యక్షుడు ప్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. ఎన్నో భూసేకరణ బాధలు, రైల్వే వారితో వివాదాలు, కోర్టు కేసులు, ఆర్థిక సమస్యలు, దాటుకొని 1945లో ప్రాజెక్టు డిజైన్‌ కోసం, పోటి పెట్టి ఆర్కిటెక్ట్‌ల నుంచి డిజైన్‌లు ఆహ్వానించడంతో ప్రాజెక్టు ప్రారంభమైంది. ఉపాధ్యక్షుడు హ్యూబర్ట్‌ హంప్రీ 25.5.1968న ప్రారంభించారు.

అందులో ‘ఈరోసారినర్‌’ డిజైన్, అత్యుత్తమంగా ఎన్నికైంది. ఈ ప్రాజెక్టులో జాప్యాలు జరిగినా, వ్యాజ్యాలు వేసినా, 185 మిలియన్‌ డాలర్లు (అంటే 1295 కోట్ల రూపాయలు) ఖర్చుతో నిర్మించినా, ఒక అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం విశేషం. దీన్ని పశ్చిమ అమెరికా ముఖద్వారంగా వర్ణిస్తారు. అమెరికాలోని అత్యంత ప్రియమైన ఆర్కిటెక్చర్‌ నిర్మాణాలలో దీనిది 14వ స్థానం. 1995లో ‘ఓక్లహోమ్‌’ నగరంలో జరిగిన, బాంబుల దాడిని దృష్టిలో పెట్టుకుని ‘మాగ్నటో మీటర్లను’, ఎక్స్‌రే పరికరాలను, విజిటర్స్‌ సెంటర్‌లో వాడుతూ, సున్నితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆర్చి కింద పచ్చికబయళ్లలో కుడి నుంచి 2వ వారు వ్యాసకర్త పద్మావతి

ఇక మా ప్రయాణం సంగతికి వస్తే.. మధ్య మధ్య రెస్ట్‌ రూమ్స్‌ల వద్ద, గ్యాస్‌ స్టేషన్స్‌ వద్ద ఆగుతూ.. మధ్యాహ్నం ఒంటి గంటకు ‘సెంట్‌లూయీ’ దరిదాపుల్లోకి చేరాం. ఆకలి, ఆహారాన్ని గుర్తు చేసింది. ఇంటర్నెట్‌లో ‘వెజ్‌హోటల్స్‌’ కోసం వెతకగా, ‘గోకుల్‌ రెస్టారెంట్‌’ మాత్రం 3 గంటల దాకా ఉంటుందని తెలిసింది. జి.పి.ఎస్‌ ద్వారా రెస్టారెంట్‌కి 2 గంటలకు చేరాం. అది 100% గుజరాతీ శాకాహారభోజనశాల. బఫే ఖరీదు 14 డాలర్లు. అంటే 980 రూపాయలు. ఎక్కువే. అయితేనేం? వడియాలు, ఊరగాయలు, పలావు, పకోడా, హాల్వాలు, పండ్లముక్కలతో ‘వివాహభోజనంబు’లా ఉంది. పిల్లలకు మాత్రం అర టిక్కెట్టు. వాళ్లది అరకడుపే కదా!

మేము వెళ్లుతున్న దోవలో, అపార్ట్‌మెంటులన్నీ పాతవిగా ఉన్నాయి. అవి నల్లజాతీయులవి పాపం! వాళ్ల బీదరికానికి బిల్డింగులే నిలువుటద్దం! ఆ ప్రాంతం దాటగానే, అందమైన నగరం. ‘మిసిసిపి’ తీరంలో, అద్దె పార్కింగ్‌ ఏరియాలో కారు పార్క్‌ చేసి, రోడ్డుపైకి వచ్చాం. మిసిసిపీ నది నిండుగా ప్రవహిస్తోంది. 630 అడుగుల ఆర్చ్, ఆకాశాన్ని తాకుతున్నట్లు కనబడింది. హనీమూన్‌ జంటలు, టాప్‌లెస్‌ టాంగాల్లో విలాసంగా విహరిస్తున్నారు. మేము ఫ్రీ–బస్‌లో ‘ఆర్చ్‌విజిటర్స్‌ సెంటర్‌’కు 4 గంటలకు చేరి, ఆర్చ్‌పైకి వెళ్లడానికి టిక్కెట్లు తీసుకున్నాం. వెంకన్న దర్శనానికి స్లాట్స్‌ ప్రకారం ప్రవేశం ఇచ్చినట్లే, మాకు సాయంత్రం 6:15 కేటాయించారు.

2 గంటలు ఎలా గడిపాలి? ఆర్చి ‘మిసిసిపీ’ నది తీరంలో, విశాలమైన  పచ్చికబైళ్లుపై ఉంది. అందరితో పాటు, లాన్స్‌లో రిలాక్స్‌ అయ్యాము. రెస్ట్‌రూమ్స్, కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. కానీ వాన వస్తే షెల్టర్‌ మాత్రం మరిచారు. ఎండ తక్కువగా ఉన్నందున పిల్లలు చక్కగా ఆడుకున్నారు. మేము ఆర్చ్‌ కింద ఫొటోస్‌ తీసుకున్నాం. ఒక హెలికాప్టర్, పర్యాటకులతో ప్రతి 15 నిమిషాలకు ఒక్కసారి, నది మీదుగా ఆర్చిపైన నుంచి, చెక్కర్లు కొడుతుంది. 2 గంటలు ‘నచ్చిన సినిమా’ చూసినంత త్వరగా గడిచిపోయింది. 6 గంటలకు విజిటర్స్‌ సెంటర్‌లో నిలుచున్నాం. సరిగ్గా 6:15కు మా బ్యాచ్‌ని పిలిచారు. సెక్యూరిటీ చెక్‌ చేసి లోపలికి అనుమతించారు.

విజిటర్స్‌ సెంటర్‌
విజిటర్స్‌ సెంటర్, 7 వేల చదరపు అడుగుల, విశాలమైన హాలు, సరిగ్గా ఆర్చి కింద సెల్లార్‌లో ఉంది. స్టాల్స్, థియేటర్స్, మెకానికల్‌ రూమ్స్, ట్రామ్స్‌ పార్కింగ్, మ్యూజియమ్స్‌ ఉన్నాయి. పిల్లలు స్ట్రోలర్స్‌ ఒక పక్క పెట్టుకోవచ్చు. ఫొటోగ్రాపర్స్, మనం కోరుకుంటే ఫొటోలు తీస్తారు. క్యూలో నిలబడ్డాం. టిక్కెట్లు చెక్‌ చేసి పంపించారు. ఒక చోట రాగానే 8 మెట్లు ఉన్నాయి. ఒక్కో మెట్టుపైన 5 గురు నిలవాలి. సరిగ్గా ప్రతి మెట్టు వద్ద ‘ట్రామ్‌క్యాప్సుల్స్‌’ (బాక్సులా ఉంది) వచ్చి ఆగుతుంది. ఒక సారికి 80 మందిని ఆర్చ్‌పైకి చేరుస్తారు. రెండు ట్రాములు కుడి పక్క, ఎడమ పక్క తిరుగుతూ ఉంటాయి. ట్రాములు ప్రతి 10 నిమిషాలకు ఒక్కసారి వెళ్లతాయి. స్క్రీన్‌ పైన, ఆర్చి నిర్మాణ విశేషాలు డాక్యూమెంటరీ వేస్తున్నారు.

అంటే మరో 10 నిమిషాలలో ఎక్కవలసిన ట్రామ్, వస్తుందన్నమాట! మాటల్లోనే వచ్చేసింది. మెట్టుకు సమానంగా ఆగింది. గ్లాస్‌డోర్‌ దానికదే తెరుచుకుంది. మమ్మల్ని ఒకే క్యాప్సుల్స్‌లో అనుమతించారు. తలుపులు ఆటోమాటిక్‌గా మూసుకున్నాయి. లోపల 5 సీట్లు, చక్కని లైటింగ్, చల్లటి ఏసీ, చిన్న విమానంలా బాగుంది. మరో 2 నిమిషాలలో పెద్ద శబ్ధం చేస్తూ మా క్యాప్సుల్స్‌ పైకి పరుగుతీసింది. ఆనందంలో కేకలే! కేకలు!! పిల్లలు కూడా భయపడలేదు. అద్దంలో నుంచి చూస్తే.. (ఆర్చ్‌ లోపల) మెట్లు మార్గం కూడా కనబడింది. 4 నిమిషాలు ఆర్చి లోపల ప్రయాణించామంటే.. నమ్మశక్యం కాలేదు. ఇది ఓ మరుపురాని అనుభూతి! ఆర్చి లోపలే ట్రాములు తిరుగుతాయి కనుక బయట వారికి ఏమి కనబడదు.

డెక్‌పై కిటికీ నుంచి సెయింట్‌లూయీ మహానగరం

అబ్జర్‌వేషన్‌ ఏరియా
ఆర్చిపైకి చేరుకోగానే 65 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు ఉన్న డెక్‌ (ప్లాట్‌ఫామ్‌) ఉంది. 160 మంది ఒక్కసారి నిలబడి, ఒక్కోవైపు ఉన్న 16 గాజు కిటికీల నుంచి 630 అడుగులపై నుంచి ‘మిసిసిపి నది’ సౌందర్యాన్ని, ఇంకొక పక్క ‘సెంట్‌లూయీ’ నగర అందాలను తనివి తీరా చూడవచ్చు. ‘అద్భుత విహంగ వీక్షణం! 15 నిమిషాలు డెక్‌పై గడిపి, 3 నిమిషాలలో ట్రామ్స్‌లో కిందకు వచ్చేశాం. ‘పడమటి సంద్యారాగం’ సినిమాలో ‘ఈ తూర్పు ఈ పశ్చిమం’ పాటలో ఆర్చిని, సెయింట్‌ లూయీ నగరాన్ని బాగా చూపించారు.
విజిటర్స్‌ సెంటర్‌లో కాఫీలు తాగి, బయటకు వచ్చాం. ఒక్కసారి బయట నుంచి ఆర్చిని చూసి ఇంజనీర్ల ప్రతిభకు హ్యాట్సాఫ్‌ చెప్పాం. మళ్లీ చూస్తామో లేదో అని ఆర్చిని తనివితీరా చూసి కారు ఎక్కాం. మధ్యలో సబ్‌వేలో కడుపు నింపుకుని రాత్రి 10 గంటలకు బ్లూమింగ్‌ టన్‌ చేరుకున్నాం. పక్కరోజు బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, షికాగో తిరుగు ప్రయాణం అయ్యాం! – ఎ.పద్మావతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement