మ్యాజిక్ వాల్ | Magic Wall | Sakshi
Sakshi News home page

మ్యాజిక్ వాల్

Published Sun, Jan 31 2016 2:12 AM | Last Updated on Mon, Oct 8 2018 4:31 PM

మ్యాజిక్  వాల్ - Sakshi

మ్యాజిక్ వాల్

చరిత్ర ఊహించని మార్పు తిరిగింది అనే మాట లెనన్ గోడను చూసిన వారికి, ఆ గోడ చరిత్ర చూచాయగానైనా తెలిసిన వారికి  తెలుస్తుంది. చెక్ రిపబ్లిక్ రాజధాని నగరం ప్రేగ్‌లో చార్లెస్ బ్రిడ్జి దగ్గర ఉన్న లెనన్ గోడ తొలి చరిత్ర వేరే అయినా అది తిరిగిన మలుపు, చేరిన ప్రస్థానం వేరు.  ఒకప్పుడు ఈ గోడ భావస్వేచ్ఛకు, రాజకీయ అభిప్రాయాలకు  నిలువెత్తు అద్దంలా కనిపించేది. ‘ఈ దేశంలో అన్నీ ఉన్నాయి బతుకు తప్ప’... ‘శాసనాలతో సూర్యోదయాన్ని  ఆపలేరు’  ఇలాంటి నినాదాలు కనిపించేవి.
 
 అయితే  ఇప్పుడు మాత్రం నిప్పు లాంటి నినాదాల కంటే భావుకతతో నిండిన వాక్యాలు, సెంటిమెంట్ వాక్యాలు కనిపిస్తున్నాయి. ఈ ధోరణి వల్లే లెనన్ గోడ సరికొత్త ట్రావెల్ స్పాట్‌గా మారి పర్యాటకులను ఆకర్షిస్తుంది.లెనన్ వాల్ అనేది 1980 ముందు వరకు సాధారణ గోడ. అయితే కవి, గాయకుడు జాన్ లెనన్ అభిమానులు తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఈ గోడను వాహికగా చేసుకునేవారు.  లెనన్‌కు సంబంధించి గ్రాఫీటీతో పాటు అతడి పాటల చరణాలను గోడపై రాసేవారు. 1988 నుంచి ఈ గోడ కొత్త అవతారం ఎత్తింది.
 
 ఒకప్పుడు కనిపించే లెనన్ పాట చరణాలు, గ్రాఫిటీ స్థానంలో కమ్యూనిస్ట్ వ్యతిరేక నినాదాలు కనిపించడం మొదలైంది. చెకోస్లోవియాకు అధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చెకొస్లోవియాకు చాలా కాలం పాటు కార్యదర్శిగా పని చేసిన గుస్తావ్ హుసక్‌కు వ్యతిరేకంగా రాతలు కనిపించేవి.  ఈ రాతల పుణ్యమా అని రాతకారులకు, పోలిసులకు మధ్య ఎప్పుడూ ఘర్షణ జరిగేది. ఈ రాతకారులు తమది ‘లెనినిజం’ కాదని ‘లెనోనిజం’ అని చెప్పుకునేవాళ్లు.పోలిసులు మాత్రం-
 
 ‘‘వాళ్లు మతిభ్రమించిన  వాళ్లు, పెట్టుబడి దారి వ్యవస్థకు దాసోహం అంటున్న వాళ్లు’’ అని తిట్ల వర్షం రిపించేవాళ్లు.ఇలా లెనన్ గోడ ఎప్పుడూ నిప్పుల కుంపటిలా కనిపించేది.అలాంటి గోడ కాస్త ఇప్పుడు రూపం మార్చుకుంది.రుగుబాటు నినాదాల స్థానంలో ప్రేమ, శాంతి సందేశాలు కనిపిస్తున్నాయి. శాంతి సందేశం ఇచ్చిన ప్రేమస్పదులైన మహానుభావుల చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తై, లెనన్ గోడ  ఆశీస్సులు, కోరికలు ఫలించే గోడగా సరికొత్త ప్రాచుర్యం పొందడం ఒక ఎత్తు. ఇప్పుడు వాడి వేడి మాటల కంటే చల్లని వెన్నెల లాంటి ప్రేమ వాక్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
 ‘‘జాన్ లెనన్  పాడిన ఒక పాటలో-
  ‘మ్యాజిక్ ఇన్ ది  ఎయిర్ వాజ్ మ్యాజిక్ ఇన్ ది ఎయిర్? ఐ బిలీవ్ యస్ ఐ బిలీవ్’ అనే చరణాలు వినిపిస్తాయి. నేను లెనన్ గోడ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పాట చప్పున గుర్తుకు వచ్చింది. ‘నా స్నేహితుడి ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాళ్లిద్దరు ఒక ఇంటి వాళ్లు కావాలి...అని రాశాను. ఆశ్చరకరమైన విషయం ఏమిటంటే రెండు నెలలు తిరక్కుండానే నేను రాసిన వాక్యం ఫలించింది.  ఈ గాలిలో ఏదో మ్యాజిక్ ఉంది’’ అంటున్నాడు ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ రిచర్డ్. వాస్తవం, అవాస్తవం, అతిశయాల గురించి ఎలా ఉన్నా... మనసులో మాట రాసుకోవడానికి, అది ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి లెనన్ గోడ పర్యాటక ఆకర్షణగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement